Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 36


    "మర్చిపోకూడదనేనా కోరిక! రేపట్నుంచే నేను మన పిక్చర్ కి ప్లానింగ్ మొదలు పెడతాను"
    "సరే -"
    అతను వెళ్ళిపోయాక వెంటనే కౌశల్ ఇంటికి చేరుకుందామె. సుజాత తనను చూస్తూనే ముఖం తిప్పుకుని లోపలకు వెళ్ళిపోవటం గమనించింది చంద్రిక.
    ఆమెకు ఆశ్చర్యంగా వుంది. సొమ్మొకరిది సోకొకరిది అంటే ఇదేనేమో! తన డబ్బుతో ఆమె సంసారం జరుగుతోంది. అయినా తనంటే ఉన్న గౌరవం అది!
    "ఏమిటలా వచ్చావ్?" అడిగాడు కౌశల్.
    "అదే నా సినిమా సంగతి మాట్లాడ్డాని కొచ్చాను-"
    అతనికి ఆశ్చర్యం కలిగింది.
    'మన సినిమా' అనేదల్లా ఇవాళ 'నా సినిమా' అంటోంది.
    "సురేష్ వచ్చాడిందాక! అది తను టేకప్ చేసి పూర్తి చేస్తానంటున్నాడు! సరేనన్నాను!"
    కౌశల్ కి కోపం వచ్చిందిగాని బయటపడలేదు. తనను నమ్మకపోవటం ఒకెత్తు - సురేష్ ని నమ్మటం మరో ఎత్తు -
    "నీ యిష్టం! అది నీ సినిమా మధ్యలో నాకెందుకు చెప్తున్నావ్?"
    "ఎందుకంటే నీవల్లే ఆ ప్రాజెక్ట్ అలా అయిందికాబట్టి - "తనూ కోపంగానే అంది.
    "ఆల్ రైట్! నేను ఫెయిలయాను-ఇంకొంత ఇన్ వెస్ట్ చేస్తే సినిమా పూర్తయ్యేది కదా! నువ్వెందుకు వెనుకాడావ్?"
    "ఎందుకంటే నిన్ను నమ్ముకుని ఫుట్ పాత్ మీద పడటం ఇష్టం లేక-"
    "అంటే నీ ఆస్తంతా నేను కాజేశానా?"
    "ఏం చేశావో నీ మనసుకి తెలుసు! కోటిరూపాయల పైన ఖర్చయిపోయింది! అందులో ఎంత రేసులకు పెట్టావో ఎంత సినిమాకు పెట్టావో నాకు తెలీదు."
    కౌశల్ మొఖం కోపంతో ఎర్రబడింది.
    "చంద్రికా, నీకు ముందేచెప్పాను! రేసులకు నేను వాడింది పన్నెండులక్షలు, అదంతా తిరిగి ఇచ్చేస్తాను. నీ డబ్బు ఎవరికీ అక్కర్లేదు -"
    "అలాగా! అయితే ఇవుమరి!"
    "కొద్ది రోజులు టైమ్ కావాలి నాకు"
    "జీవితమంతా నీకు టైమిస్తున్నాను" ఆమె లేచి బయటకువచ్చేసింది.
    అక్కడితో అతనికీ తనకూవున్న సంబంధం ముగిసినట్లేనని తనకు తెలుసు.
    ఇంతకాలం తను ఎక్స్ ప్లాయిట్ చేయబడింది. ఒకరు తన శరీరాన్ని కొల్లగొడితే ఇంకొకరు తన బాంక్ బాలెన్స్ ని-
    ఇంక తను సెంటిమెంట్స్ కి తావివ్వకూడదు.
    సినిమా ఫీల్డ్ చాలా చిత్రమయినది. సినిమాలన్నీ సెంట్ మెంట్ ప్రధానాంశంగా తీస్తారు. కానీ ఆ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళెవారికీ సెంటిమెంట్ ఉండదు.
    కట్ త్రోట్ ఫ్రెండ్ షిప్! కట్ త్రోట్ కాంపిటీషన్-
    ఇకనుంచీ తనూ ఆ ఫీల్డ్ కి తగ్గట్టుగానే వుంటుంది. కేవలం డబ్బు తనక్కావాలి! ఆఖరిక్షణం వరకూ అమితమయిన డబ్బులో తనుమునిగి తేలాలి! తనకు గౌరవం వుండాలంటే ముఖ్యం డబ్బేగానీ నటిగా తనకున్న ప్రతిభ కాదు.
    ఇంక తను మగాడితో సంబంధాన్ని పవిత్రంగా, శాశ్వతంగా భావించే ఆలోచనకు కూడా స్వస్తిచెప్పాలి. ఎందుకంటే అది కేవలం వన్ వే అవుతోంది. అవతలివ్యక్తి తనలాఆలోచించటం లేదు. తనను అనుభవించటం ఒక్కటే వారి ధ్యేయం లేదా తన డబ్బును అనుభవించటం.
    ఇలాంటి కుళ్ళిపోయిన సంబంధాలు తనకనవసరం.
    జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో తనకూ తెలుసు.
    ఆ నిర్ణయం తీసుకున్నాక ఆమె మనసు తేలికపడింది. కేవలం నెలరోజుల్లో తన సినిమా పూర్తవటమేకాకుండా రిలీజ్ కూడా చేశాడు సురేష్.
    రిలీజ్ కి ముందేదానిని అమ్మేయటంతో మొత్తం పెట్టుబడంతా తిరిగి వచ్చేసింది.
    సినిమా కూడా 'యావరేజ్' టాక్ రావటంతో ఆమెకు సంతృప్తి కలిగింది.
    ఆ రోజు హైద్రాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కౌశల్ గూడా హాజరయ్యాడు.
    కావాలనే తను సురేష్ పక్కన కూర్చుంది. తనూహించినట్లే అది కౌశల్ కి జెలసీ కలిగించిందని అతని మొహం చూస్తే తెలిసిపోతోంది. ఆ రోజు అతను శైలజతో కులుకుతూండగా తనుచూసినప్పుడు అతనేమాత్రం గిల్టీగా ఫీలవలేదు.
    అది మగవాడి బర్త్ రైట్ అన్నట్లు ప్రవర్తించాడు.
    తనప్పుడు ఈర్ష్య పడలేదు మరి! అతని అనందానికి తను అడ్డు పడకూడదనుకుంది. ఇప్పుడు తనూ తన ఆనందం వెతుక్కుంటోంది. తనకు అడ్డు రాగలహక్కు ఎవరికీ లేదు.
    సురేష్ కావాలనే తనను తాకుతూ కూర్చున్నాడు.
    అతనికి తనమీద ఎంత ఆరాధనా భావం ఉందో తనకు ముందునుంచే తెలుసు.
    మగాడి కళ్ళల్లో కోరికను చదివే భాష తనకు యవ్వనంతో పాటు అబ్బింది. తన అందమైన రూపానికి పన్నెండేళ్ళవయసునుంచే ఆకర్షింపబడిన వాళ్ళు ఎంతోమందిని చూసింది. ఏదొక వంకతో తన స్పర్శ కోసం తహతహ లాడేవాళ్ళు వేలమంది స్టూడెంట్స్!
    బస్ లో - జూనియర్ కాలేజ్ లో - సినిమాహాల్లో - మార్కెట్ లో గుళ్ళో -
    సురేష్ తనను సొంతం చేసుకునే అవకాశం కోసం ఎంతోకాలం నుంచి వేచివున్నాడు.
    అతను అందగాడు - బాగా డబ్బున్నవాడు తల్చుకుంటే ఎంతో మంది అందగత్తెలు అతని కౌగిట్లో వాలిపోతారు.
    కానీ అందమయిన సినిమా తారతో సెక్స్ ఎంజాయ్ చేయటం గొప్ప చాలామందికి!
    సురేష్ ఆ కేటగిరికి చెందినవాడు అందుకే తన సినిమామీద అంత రిస్క్ తీసుకుని ఫైనాన్స్ చేశాడు. ఒకవేళ తన సినిమా ప్లాప్ అయితే అతను ముఫ్ఫయ్ లక్షలుపోగొట్టుకుని ఉండేవాడు. అంత డబ్బు ఒక అమ్మాయికోసం ఎవరైనా ఎందుకు ఖర్చుచేస్తారు?
    తను మైక్ దగ్గరకెళ్ళినప్పుడు మాట్లాడింది.
    సురేష్ సయం లేకపోతే తన సినిమా రిలీజవటం కష్టమయ్యేదని చెప్పింది. ఆ మాటలో కౌశల్ మొఖంలో మరింతకోపం కనిపించింది.
    మవునంగా లేచి ప్రెస్ మీట్ లో నుంచి వెళ్ళిపోయాడు.
    తనక్కావలసిందీ అదే-
    రాత్రి తొమ్మిది గంటలకు హోటల్ రూమ్ కి తిరిగి వచ్చింది చంద్రిక.
    సురేష్ ఆమె కెదురుగ్గా కూర్చున్నాడు.
    "ఇవాళ మిమ్మల్నో కోరిక కోరదల్చుకున్నాను చంద్రికగారూ!" సంశయంగా అన్నాడు.
    "నాకు తెల్సు అదేమిటో?" నవ్వుతూ అంది.
    "ఏమిటంటారు?"
    "నా ఎదురుగ్గా డ్రింక్స్ తీసుకోబోతున్నారు"
    "అంతేకాదు! ఈ మంచి టైంలో మీరు నాకుకంపెనీ ఇవాలి"
    తనూ అతని పక్కనకూర్చుంది చంద్రిక.
    "ఓకే! మీ కోసం....మీరు నాకు చేసిన సాయంకోసం ఒప్పుకుంటున్నాను"
    "థాంక్యూ!"
    అతను బేరర్ తో డ్రింక్స్ తెప్పించాడు. అతను విస్కీలో సోడాకలపపోతూంటే చేయి అడ్డు పెట్టింది ఆమె.
    "వద్దు! నాకు 'రా' కొట్టడం అలవాటు"
    అతను ఆశ్చర్యపోయాడు.
    ఆమె మందు కొడుతుందని తెలుసు గానీ మరీ ఈ స్టేజ్ లో ఉందని తెలీదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS