Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 35


    "ఊహు! ప్రామిస్ చేస్తున్నాను. కనీసం రోజుకోసారయినా ఇంటికొస్తాను."
    "చూశారుగా చిన్నపిల్లమిమ్మల్నసలు గుర్తించనే లేదు. చివరకు కన్న పిల్లలకే దూరమైపోతారు మీరు."
    ఆ రాత్రికి హోటల్లోనే వుండిపోయాడతను. ఉదయం నిద్రలేస్తూనే చంద్రికకు ఫోన్ చేశాడు.
    "రాత్రి ఎక్కడున్నారు?" ఆశ్చర్యంగా అడిగింది చంద్రిక.
    "నిన్న నా మిసెస్ పిల్లలతో వచ్చింది. హోటల్లోవుంటేనూ - నేనూ ఇక్కడ వుండిపోయాను".
    "ఓహో -" అర్ధమైనట్లు అందామె.
    "ఇప్పుడు అర్జంటుగా వాళ్ళకోసం ఓ ఇల్లు చూడాలి"
    "ఎందుకు? ఇక్కడే వుండవచ్చు గా! రెండో అంతస్తు అంతా ఖాళీగానే వుంటోంది."
    "నిజమేననుకో కానీ  వాళ్ళిష్ట ప్రకారమే వుండనీయడం బావుంటుందని....."
    "సరే! మరా పనేదో త్వరగాచూడు"
    "అదే! అందుకే నీకు ఫోన్ చేశాను. కారు నా దగ్గరే వుంటుందివాళ."
    "సరేలే! నేను పనివుంటే టాక్సీలో వెళతాను....." ఫోన్ పెట్టేశాడతను.
    "కారు ఆమెదా?" అడిగింది సుజాత.
    "అంతేకాదు! ఇప్పుడునేనుంటున్న ఇల్లూ! తిండీ అన్నీ ఆమె డబ్బే! ఆఖరికి నీకు పంపిన యాభైవేలుకూడా ఆమెదే!"
    సుజాత అసహ్యంగా అతనివేపు చూసింది.
    "అదేమిటి! మీ డబ్బు ఏమైంది?"
    "అప్పుడే ఖర్చయిపోయింది. ఆ సినిమా ఫ్లాప్ అయాక ఇంకడబ్బులేముంటాయ్".
    ఇంకేమీ మాట్లాడలేకపోయిందామె. తనకు తెలిసినవాళ్ళందరికీ ఫోన్ చేసి ఇంటికోసం అన్వేషణ ప్రారంభించాడతను.
    చివరకు ఓ ఇల్లు దొరికిందతనికి. అన్ని విధాలా సౌకర్యంగానే వుందది. అద్దెమాత్రం కొంచెంఎక్కువ.
    సాయంత్రానికల్లా ఆ ఇంటిలో దిగిపోయాడతను. అంతకు ముందు తనుమేడలోకి చేర్చినపాత సామానంతా తిరిగి ఆ ఇంటికి తెచ్చేశాడతను.
    చంద్రిక చిత్రనిర్మాణానికి ప్రారంభోత్సవం జరిగింది. చాలా మంది ఆర్టిస్ట్ లు ఆమె చిత్రంలో గెస్ట్ ఆర్టిస్ట్ గా కనబడడానికి ఉత్సాహం కనబరచారు.
    అందరికీ అడ్వాన్స్ లివ్వడం పూర్తయాక ఓ సారి బాలెన్స్ ఎంతుందో బాంక్ కి ఫోన్ చేసి అడిగిందామె. వాళ్ళుచెప్పిన వివరాలు వింటూనే నిర్ఘాంతపోయింది!
    కేవలం కోటి రూపాయలే మిగిలింది!
    "అదేమిటి? అంతేనా?" అంది కొద్ది క్షణాల తర్వాత.
    "అవునండీ!"
    ఆమె ఫోన్ పెట్టేసింది.
    ఆమెకు ఇంకా ఆశ్చర్యం తగ్గలేదు. మిగతా డబ్బంతా ఎలా ఖర్చయిపోయిందీ అంతుబట్టడంలేదు. ఆ రాత్రి కౌశల్ రాగానే ఈ విషయం అడిగింది చంద్రిక.
    "కొంత నేను వాడాను! మిగతాది మన ఇంట్లోకి యిద్దరం వాడాము."
    "నీకు అంత డబ్బెలా ఖర్చయింది?"
    "రేసులు....."
    ఆమెకు అనుమానం కలిగింది. రేసులకేనా లేక శైలజలాంటివారికెవరికయినా ఇచ్చాడా? ఆమెకు కోపం వచ్చినట్లుగ్రహించాడు కౌశల్.
    "సారీ చంద్రికా!" తప్పువప్పుకుంటూ అన్నాడతను.
    "నువు ఖర్చుపెట్టినందుకు కాదు. ఇప్పుడు సినిమా పూర్తి అవడానికి డబ్బు సరిపోతుందా అని...."
    "అదంతా నేను చూసుకుంటాన్లే......" ధైర్యంగా అన్నాడతను.
    ఆమె భయం కొద్దిరోజుల్లోనే నిజమైకూర్చుంది. సినిమా సగమయినా పూర్తవకుండానే డబ్బంతా ఖర్చయిపోయింది. అది పూర్తి చేయడానికి కౌశల్ చేసిన ప్రయత్నాలేమీ ఫలించడంలేదు. ఈ విషయం తెలిసి చంద్రికకు సన్నిహితులనుకున్నవాళ్ళే డబ్బు వీలయినంత వరకూ గుంజి మొఖం చాటేశారు.
    చంద్రికకు ఓ విధమైన విరక్తి కలిగింది. ఇదంతా చూస్తూంటే.
    కొద్దిరోజుల క్రితం ఎంతో సురక్షితంగా ఉన్న తన ఆర్ధిక పరిస్థితి అకస్మాత్తుగా ఇలా మారిపోవడం ఆశ్చర్యంగా వుంది.
    ఇదంతా కేవలం కౌశల్ తెలివి తక్కువతనంవల్ల జరిగిన పని. ఇప్పుడీ గండం నుంచి బయటపడడం ఎలా?
    ఆమెకేమీ అవగాహన కావడం లేదు.
    కౌశల్ ఎలాగూ సినిమా అవకాశాలకుదూరమయ్యాడు. తనకూ సినిమాలు తగ్గిపోతున్నాయ్! సినిమా అలాగే వుండిపోయింది.
    "చంద్రికా నా మూలాననువు కూడా కష్టాల్లో ఇరుక్కుపోయావ్ కదూ!" బాధగా అడిగాడు కౌశల్ చంద్రిక నవ్వి ఊరుకుంది.
    "నేను ఆ ఇల్లు ఖాళీ చేసెయ్యాలి చంద్రికా? అద్దె కట్టడం శక్తికిమించిన పని."
    "పోనీ వాళ్ళను కూడా తీసుకొచ్చి ఇక్కడేఉంచు."
    "ఊహు! ససేమిరా రానంటోంది" అశాంతిగా అన్నాడతను.
    "ఈ సినిమా విషయం నువు బలవంతం చేయకపోయి ఉంటే పరిస్థితి ఇలావుండేది కాదు" నిష్టూరంగా అందామె.
    "సారీ చంద్రికా! తొందరపడ్డమాట నిజమే, కానీ అది ఎలాగో పూర్తిచేసే బాధ్యత నాది! నువ్వేమీ ఇబ్బందిపడకుండా నేను చూసుకుంటాను."
    చంద్రిక నవ్వింది" అంది అంత తేలికయిన విషయం కాదు."
    "సరే చూస్తావుగా."
    వారం రోజులు గడచిపోయాయ్.
    ఆ సినిమా పూర్తవడానికి ఎవరయినా పెట్టుబడి పెడతారేమోనని విశ్వ ప్రయత్నం చేశాడు కౌశల్. కానీ ఎలాంటి ఉపయోగమూలేకపోయింది.
    "నమస్తే! చంద్రికగారూ!" సురేష్ లోపలికొస్తూ అన్నాడు.
    "నమస్తే - రండి" ఆదరంగా ఆహ్వానించింది.
    "మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినల్టున్నారు?" నవ్వుతూ అన్నాడు.
    "ఎంతోకాలం నుంచీ తెలిసినవారు! ఎలా మర్చిపోతాను?"
    "మరి మీ సినిమా ఆగిపోయినాకూడా ఆ విషయంలో నా సహాయం అడగటం లేదంటే- ఇంకేమనుకోవాలి?"
    చంద్రికకు ఆసక్తి కలిగింది "కానీ మీరేం చేయగలరు? ఇప్పుడంతా బయ్యర్స్ మార్కెట్ అయిపోయిందికదా?"
    "పేరు మార్పు తప్పితే వ్యాపారం అదేగా? మీ సినిమాగురించి అన్నీ తెలుస్తూనే ఉన్నాయ్. కానీ కౌశల్ గారికీ మాకూ అభిప్రాయబేధాలుండటంవల్ల వెంటనే ముందుకి రాలేకపోయాను-"
    "ప్రస్తుతం కౌశల్ కి నా సినిమాకూ ఏమీ సంబంధంలేదు. అంతా నేనే చూస్తున్నాను --" ఖండితంగా చెప్పిందామె.
    "అలా అయితే ఇంక ఆ విషయం నాకొదిలేయండి! అది నేను పూర్తి చేయిస్తాను."
    చంద్రికకు గుండెమీద బరువు దించినట్లయింది.
    సురేష్ ప్రస్తుతం చాలాసినిమాలకు ఫైనాన్స్ చేస్తున్న విషయం తనకు తెలుసు. అతనే కొన్ని ఏరియాలకు సినిమాలు కొనటంకూడా జరుగుతోంది.
    "థాంక్యూ సురేష్! మీరు చేస్తున్న సహాయం మర్చిపోలేను"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS