Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 34


    "లేదు.'
    "మరి....!'
    'మీతో ఒక ముఖ్య యిసయం మట్టాడాల....!' అటూ, యిటూ చూస్తూ అన్నాడు పుల్లయ్య.
    'రహస్యమా?'
    'అవును.'
    'పద....! తోటకు వెడదాం!"
    ఇద్దరూ తోట వైపు నడక ప్రారంభించారు. దారితో రంగయ్య తాత పొలంలో పనిచేస్తున్న తాయారు రామాన్ని చూసి పిలిచింది.
    'తొందర పని మీద వెడుతున్నాను. మళ్లీ కలుస్తాను' అని తాయారు తో చెప్పి పుల్లయ్య ను అనుసరించాడు రామం.
    ఆస్పత్రి భవనం దాటి ముందుకు సాగిపోయారు యిద్దరూ. అక్కడికి దగ్గరలో కనుపిస్తున్న గులాబీ మొక్కలను చూస్తూ రామం 'మామా! ఆ గులాబీ మొక్కలు అలా వాదిపోతున్నాయి సరీగా నీరు పెట్టడం లేదా?' ప్రశ్నించాడు.
    'పెడతానే ఉండా బాబూ! అలా ఎందుకు మాదిపోతున్నాయో?'
    'ఎన్ని రోజుల కొకసారి నీరు పెడుతున్నావ్?'
    'వారానికి రెండు సార్లు'
    'పోనీ రెండు రోజుల కొకమారు పెట్ట గూడదూ?'
    'అట్టాగే బాబూ!' అని ముఖమంతా చిన్న బుచ్చుకొని 'ఈ యిసయం మీకు తెలిసిందా?' ప్రశ్నించాడు.
    'ఏ విషయం?'
    'అయితే తెల్వదన్న మాట!'
    'అసలు ఏ విషయమో తెలుస్తేగా....? తెలుసు, తెలియదు అని చెప్పడానికి' ప్రశ్నార్ధకంగా పుల్లయ్య ను చూస్తూ అడిగాడు రామం.
    'అదేమండీ......! సిన్నమ్మ గోరు మిమ్మల్ను పెళ్ళాడరంట!'
    'ఏం....ఎవరు చెప్పారు?'
    'అంతా అనుకుంటుండారు.'
    'అంతా అనుకుంటున్నామాత్రాన నిజమౌతుందా?'
    'అదేమిటి బాబూ? నిజం కాకపొతే నోరు మాత్రం ఎందుకను కుంటారు? కొంతలో కొంతైనా సత్తెం లేకపోతాదా?'
    'పోనీ నన్ను చేసుకోకపోతే నూనె! ఎవర్ని చేసుకుంటుందో వారిని గురించి అనుకుంటున్నారా. ఊళ్ళో వారంతా?' చిరునవ్వుతో అడిగాడు రామం.
    'మీకు నవ్వులాట గా ఉందా సినబాబూ? ఆరు డాకటేరు గోరిని సేసుకుంటారని అంతా అనుకుంటూ ఉండారు.'
    'నిజమేనా మామా....?' విస్మయంతో ప్రశ్నించాడు రామం.
    'నా తల్లి తోడూ! ఈ యిసయం పెదబాబు గోరి సేయిన కూడా ఏసాను. మండిపడ్డ తండారు.'
    'ఆలాగా....! నాకేమీ తెలియదే?'
    'నీకెట్టా తెలుత్తాది బాబా.....? నీ ముందు ఈ యిసయం గురించి అనడానికి వోరికైనా ఎన్ని గుందేలుంటాయి?'
    'అవును. అందుకే మీ అందరికీ తెలిసినా నాకు తెలియలేదు' రామం ముఖంలో ఏ భావమూ కనుపించడం లేదు.
    'అదేంది సినబాబూ? ఖస్సు బుస్సు మంటారనుకున్నాను. అలా నిమ్మకు నీరెత్తి నట్లు నిబ్బరంగా ఉన్నారేంటి?' ఆశ్చర్య పోతూ అడిగాడు.
    'చూడు మామా.......! శాంత చిన్నపిల్ల కాదు బెదిరించడానికి.' అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ 'నాకు తెలియక అడుగుతున్నాను. నాలో ఏదైనా మార్పు వచ్చిందా?' రామం కళ్ళల్లో కొద్దిగా విషాదం తొణికిసలాడింది.'
    'అబ్బే....! మీలో ఏ మారువూ రాలేదే!'
    'మొన్నటి వరకూ నాతొ కులాసా కబుర్లు చెప్పిన శాంత యింత త్వరగా ఎందుకు మనసు మార్చుకుంది! నాకేం తోచడం లేదు.'
    'ఇప్పుడు మరేట్టా....?' ఆదుర్దాతో అన్నాడు.
    'పిచ్చివాడా ! ఈ విషయంలో నిజమెంతో అబద్ద మెంతో మనకు తెలియదు. ఇంకా నేను శాంతతో మాట్లాడలేదు కూడా! ఈ మాత్రానికే త్వరపడి ఆందోళన పడనక్కర లేదు. అయినా విధి నిర్ణయం ఎలా ఉంటె అలా జరుగుతుంది. ఇటువంటి విషయాలు భగవంతుని నిర్ణయాల పై జరుగుతూ ఉంటాయి. ఆవేశపడి, ఆదుర్దా పడి, చివరకు బాధపడి కూడా మనం చేయగలిగేదేమీ ఉండదు.'
    'అవతల కొంప లంటుకు పోతుంటే మీరు ఏదాంతం లో పడ్డారేమిటి సినబాబూ....!'
    'వేదాంతం కాదు పుల్లయ్యా. నిజానికి జరిగేదంటే! పీటల మీద పెళ్ళిళ్ళు ఎన్ని ఆగిపోవడం లేదు. సక్రమంగా వివాహం జరిగిన తర్వాత ఎంతమంది విడిపోవడం లేదు?' అంత ధైర్యంగా మాట్లాడుతున్నా అతని కళ్ళల్లో దైన్యం తొంగి చూస్తూనే ఉంది.
    'అవేం మాటలు సినబాబూ? శాంతమ్మ గోరు మీసోత్తు. అరిమీద వోరికి హక్కు లేదు. ఏదో సిన్నతనం. అంత మాత్రానికే మీరు బిగుసుకు పొతే ఎలాగుండీ......?'
    'లేదు పుల్లయ్యా.....! ఇది బిగుసుకుపోవడం కాదు. యదార్ధ విషయం. ఐనా నచ్చ జెప్పకుండా ఎలా ఉంటాను.'
    'మంచిది సినబాబూ .....! విల్లోత్తాసానా  పని మిగిలి పోనాది' పుల్లయ్య లేచి వెళ్లి పోయాడు.
    'ఇంత త్వరగా యింటికి వెళ్ళాలా....... వద్దా' అని ఆలోచిస్తున్నాడు రామం. 'ఇప్పుడే వెడితే ఈ విషయం లో మామయ్య  రాద్దాంతం చేస్తాడు. గొడవ జరుగుతుంది. తప్పంతా నామీదే పెడతాడు. శాంత తన మనస్సు మార్చు కుంటుందని కలలో కూడా తలచలేదు. నేనేమైనా ఫర్వాలేదు. మామయ్య ను అగపట్టడం చాలా కష్టం. ఆవేశం పెంచుకొని కేకలు వేస్తాడు, గొడవ చేస్తాడు. ఇంటి నంతటిని ఒక్క కొలిక్కి తీసుకు వస్తాడు. ఏం చేయాలో తోచడం లేదు. సరే.....! ఈ పరిస్థితి ని ఈరోజు కాకపొతేరేసైనా ఎదుర్కోవాలి. ఎంత కాలమని తప్పించుకు తిరగగలను? తప్పదు....!వెడతాను. ఎలా జరగవలసి ఉంటె అలా జరుగుతుంది' అని ఆలోచిస్తూ లేచి యింటి వైపు నడవసాగాడు.

                          *    *    *    *
    తలవంచు కొని యింటి లోపలికి వేడుతూన్న రామాన్ని వరండా లో మంచం మీద కూర్చున్న లక్ష్మయ్య గారు ఆపారు.
    లక్ష్మయగారి కళ్ళు కోపంతో బాధతో రెచ్చిన గాయం లా ఎర్రగా ఉన్నాయి. లోకంలోని విషాద మంతా ఆయనగారి ముఖం లోనే గూడు కట్టుకొని ఉందేమోనని ఆ నిముషం లో వారిని చూసిన రామానికి అనిపించింది.
    'రామం......నేను భయపడినట్లే జరిగింది.' వారి మాటలలో బాధ, కోపం ధ్వనించాయి.
    'ఏం జరిగింది మామయ్యా?' ఏమీ ఎరగనట్లు ప్రశ్నించాడు రామం.
    "ఏం జరగకూడదో అదే జరిగింది. శాంత సర్వ స్వతంత్రు రాలైంది. ఏదో ఒకనాడు ఈ పరిస్థితి వస్తుందనే డాన్ని చదివించవద్దని నేను నెత్తి, నోరు కొట్టుకున్నాను. నా మాట పెడ చెవిన పట్టావు. ఇక యిప్పుడు ఏం చేస్తావో? నీవే ఆలోచించుకో....శాంత సుందరాన్ని వివాహం చేసుకుంటుందట!'
    'ఈ మాట శాంతే అందా మామయ్యా?'   
    'అవును. శాంతే అంది' ఆ మాట వత్తి.  

                                   15
    తోటలో కూర్చుని శాంత రాకకై ఎదురు చూస్తున్నాడు రామం. అనుకోకుండా ఆకాశం వైపు. చూసిన రామానికీ ఆనాడు శాంత ధరించిన చీరే, ఆ చీరే లో ద్విగుణీకృతమైన ఆమె అందం స్పురణ కు వచ్చాయి. అతని మనసు ఆనందంతో పొంగి పొయిందొక క్షణం. మరుక్షణం లో ఆ ఆనందం మటు మాయమైంది. శాంత తనకు శాశ్వతంగా దూరమౌతుందేమోనన్న ఆలోచనతో ఎండి పోతున్న గులాబీ మొక్కలను అతి జాగ్రత్తగా పరీక్షిస్తున్నాడు. అని అలా ఎందుకు ఎండి పోతున్నాయో అతనికి అర్ధం కాలేదు. మొక్కలు పచ్చగా ఉండి అక్కడక్కడ కొమ్మలు ఎండి పోయిన చెట్లు అతనికి ఆశ్చర్యానికి కలిగించాయి. ఆ ఎండిపోయి నంత మేరకు కొమ్మను త్రుంచి చూశాడు . పురుగులు కనుపించాయి.
    అప్పుడే అటు ప్రక్కగా వస్తున్న పాలేరు పుల్లయ్య రామానికి కనుపించాడు.
    'ఇదుగో చూశానా పుల్లయ్యా! ఈ మొక్కల కొమ్మలు వాడిపోవడానికి కారణం ఈ పురుగులే! కొమ్మ మధ్య భాగాన్ని తొలిచి అందులో స్థావర మేర్పరచు కుంటున్నాయి. ఆ భాగం నుండి పై కొమ్మంతా ఎండిపోతూ ఉంది.'
    'అలాగా సినబాబూ....! చెట్లూ పచ్చగా ఉండాయి. కొమ్మలేమో ఎండి పోతుందా ఏందబ్బా.......? అని తల బద్దలు కొట్టుకుంటూ ఉండాను. ఇప్ప్యుడు ఆ కిటుకు తెలిసింది. ఇక సూడండి ఈటి భరతం పడతాను.' అని ఎండి పోయినంత వరకు కొమ్మల నన్నింటినీ తుంపుతూ ఎండ్రిన్ నీళ్ళులో కలిపి చల్లడం ప్రారంభించాడు. ఆ పనిలో పుల్లయ్య కు సాయం చేయసాగాడు రామం.
    అది సాయం సమయం. ఆకాశం నిర్మలంగా ఉంది. చల్లని గాలి నిచ్చిన గులాబీల సౌరభాన్ని దూరప్రాంతాలకు మోసుకు వెడుతూ ఉంది.
    'బావా!' అని శాంత పిలిచినట్లై  వెనుతిరిగి చూశాడు రామం.
    'నీవా శాంతా!' అని శాంత దగ్గరగా వచ్చాడు.
    ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అలా కలుసుకున్న కళ్ళు మిలమిల మెరవడం యిదివరకు ఎన్నిసార్లో జరిగింది. కాని యిప్పుడు అలా జరగలేదు. చూపులు కలవగానే తల దించుకొని మౌనంగా నిల్చుంది శాంత.
    'పద శాంతా! అలా వెళ్లి మాట్లాడుకుందాం!'
    రామాన్ని అనుసరించింది శాంత--
    ఇద్దరూ అక్కడ ఉన్న పచ్చిక పై కూర్చున్నాడు---
    'ఎందుకు బావా పిలిపించావ్........?
    'నిన్ను పిలిపించడానికి ప్రత్యెక కారణం కావాలా?'
    శాంత తన తొందర పాటు గుర్తించి తడబడింది.
    ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా కూర్చున్నారు.
    'బావా నన్ను క్షమించవూ.......?'
    'నీవేం నేరం చేశావని?'
    '............'
    'శాంతా నీవు నన్ను అపార్ధం చేసుకున్నావు. సరీగా నన్ను అర్ధం చేసుకోలేదని కూడా ధైర్యంగా చెప్పొచ్చు. నీవు చదువు కున్నదానవు!ఏ విషయాన్నైనా చక్కగా అలోచించి నిర్ణయించు కోగల శక్తి సామర్ధ్యాలున్నాయి. కాని....నాకు తెలిసినంత వరకూ నీలో ఉన్న లోపముక్కటే! ఆవేశం.......నీతో పాటు నీలోని ఆవేశం కూడా పెరుగుతూ  వచ్చింది. అదే నా బాధ. నీ నిర్ణయాలు ఎటువంటి వైనా సంతోషంగా నేను ఆమోదిస్తాను. కాని ఆ నిర్ణయాలు ఆవేశంతో నిర్ణయించు కున్నది కాకూడదు. నీపై నాకు పూర్తీ స్వాతంత్ర్యం ఉంది. ఆ మాట నీవు కూడా కాదనలేవు. మామయ్య బలవంతం గా నైనా నిన్ను నాకిచ్చి వివాహం జరిపిస్తానన్నాడు. కాని తెగెంతవరకు లాగడం నా అభిమతం కాదు. ఇంత అకస్మాత్తుగా నీవు మనసు నెందుకు మార్చుకున్నావో నాకర్ధం కావడం లేదు. మన హృదయాలు ఏనాడో ఒకటైనాయి. ఇంతకాలం తనువులు మాత్రమె వేరుగా ఉంటూ వచ్చాం. నా ఊహ తలక్రిందు లైంది. ఇటువంటి ఆకస్మిక నిర్ణయానికి కారణం....' ఇక ఆ తర్వాత మాటలు పూర్తీ చేయలేక పోయాడు రామం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS