25

పంచాయితీ సమితి ఎన్నికల్లో ఓడిపోయి నప్పటి నుంచీ రామయ్య గారు దిగజారి పోయారు. ఖర్చు పెట్టిన వేలు బూడిదలో పోసిన పన్నీరయింది. గౌరవంగా ఇదివరకు చెయ్యెత్తి దణ్ణం పెట్టె కొద్ది మంది కూడా ఈ సమితి ఎన్నికలైన తరువాత తప్పుకు తిరుగుతున్నారు. సురేంద్ర పరీక్షలయి , ఇంటికి వచ్చినప్పటి నుంచీ ఏ విషయం మాట్లాడినా కోపంతో ముభావంగా ఉంటున్నాడు. రామయ్య గారి జీవితంలో ఇదొక తీరని వేదన గా పరిణమించింది. సురేంద్ర పెళ్లి విషయం అయన అసలు ఆలోచించడమే లేదు. ఆడపిల్ల యితే వరలక్షమ్మ పోరయినా ఉండేది. మగపిల్ల వాడవటం నుంచి తొందర పడవలసిన అవసరం ఆయనకు లేకపోయింది. సురేంద్ర ,మనస్సు తెలిసినా, మేనరికం విషయం ఎత్తితే అయన మండి పడతానని ఆవిడ ఆ ప్రసక్తి తేవటానికి సందేహిస్తున్నది. ఇట్లా ఎవరికి వాళ్ళు ముభావంగా ఉంటున్నారు.
గుంటూరు నుంచి వచ్చినాక శ్యామసుందరి విషయం తెలీలేదు సురేంద్ర కు. ఉత్తరం వ్రాద్దామని మనస్సులో ఉన్నా, ఆ ఉత్తరం రాయుడి గారి చేతుల్లో పడితే ఏం జరుగుతుందో నని సంకోచించాడు.
ఈలోగా రాయుడు గారు హైదరాబాదు వెళ్ళినట్లు తెలిసింది. మెల్లిగా తల్లితో వెంకటపాలెం పోతున్నానని చెప్పి, తండ్రితో గుంటూరని చెప్పి వెంకట పాలెం వెళ్ళాడు సురేంద్ర.
సురేంద్ర వెళ్ళిన రోజునే హైదరాబాదు నుంచి రమేష్ ఉత్తరం వ్రాశాడు, వసుంధర ప్రసవించి నట్లూ, మగపిల్లా వాడనీ, కులసాగానే ఉన్నారనీ.
వెంకట పాలెం వెళ్ళుతుంటే అనేక విధాల ఆలోచనలు మనస్సు ను కెలక వెయ్యసాగినాయి. శ్యామసుందరి ని తను చేసుకోవడం తన తల్లికీ, శ్యామ సుందరి తల్లికి యిష్టమే. తను వెళ్లితే అత్తయ్య ఆదరణ గానే చూస్తుంది. ఎటొచ్చీ అటు రాయుడు గారు, ఇటు తన తండ్రి పంతాలకు పోతున్నారు. అన్నీ అలోచించి ఒక కార్యక్రమం నిర్ణయించుదామనే సురేంద్ర వెంకటపాలెం బయల్దేరాడు.
అనుకోకుండా, ఉత్తరమైనా వ్రాయకుండా సురేంద్ర వచ్చినందుకు సుభద్రమ్మ ఆశ్చర్య పడింది. కాని సాదరంగానే ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేసింది. ఇంక శ్యామసుందరి ఆనందానికి హద్దులు లేవు.
"మామీద అభిమాన ముంచి నువ్వయినా రాగలిగావు గాని, ఏమీ చేతగాక, ఏమీ చెయ్యలేక మీ అమ్మ, నేనూ చేతులు కాలి కూర్చున్నామయ్య. ఇంక అన్ని విషయాలూ మీరే ఆలోచించు కోవాలి. కన్న తల్లి ఆశీర్వచనాలు మీ ఉభయులకూ ఉండనే ఉన్నయ్యి." అంటూ సుభద్రమ్మ కళ్ళు వత్తుకుని వెళ్ళిపోయింది.
శ్యామసుందరి ఉప్మా, కాఫీ తెచ్చింది. "ఈ ఉప్మా, కాఫీ తీసుకో, బావా. రాకరాక మా ఇంటికి వచ్చావు. అంతే చాలు" అన్నది శ్యామ సుందరి.
"నేను వచ్చాననే చేశావా?" లేక మీరు చేసుకున్నవి తెచ్చావా?" అన్నాడు సురేంద్ర.
"నువ్వు వచ్చావని నేనే స్వయంగా చేశాను."
"కాదు మీ అమ్మ చేసింది."
"అయితే , అంత ఉప్మా, కాఫీ చెయ్యటం చేతకాని నన్ను చేసుకుని ఏం సుఖపదతావు , బావా?" నవ్వుతూ అన్నది శ్యామసుందరి.
"నిన్ను చేస్తుంటే ఆకలి కాస్తా యిట్టే ఎగిరిపోతుంది. ఇంక నాకేమీ అక్కర్లేదు."
"ఈ మాటలకేం గాని , బావా, అత్తయ్య కులాసాగా ఉన్నదా? మావయ్య ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచీ మామీద యింకా కక్షగా ఉన్నారట."
"అయినా మీదొక పార్టీ , మాదొక పార్టీ. మీకూ, మాకూ ఎట్లా పొత్తు కుదురుతుంది, శ్యామా?"
"నువ్వూ రాజకీయాల్లోకి దిగుతున్నావా? పోనీ, రాబోయే ఎన్నికల్లో మీ పార్టీ అభ్యర్ధిగా నిలబడు."
"అబ్బో! మీ నాన్నతో పోటీ చెయ్యటం మాటలా, నీతో పోటీ చేసి ఇప్పుడు గెలవలేక పోతుంటే?"
"మా నాన్నతో పోటీ చేసి గెలిస్తే నన్ను గెల్చు కున్నట్లే."
"అయితే వచ్చే ఎన్నికల వరకూ యిట్లా జపం చేస్తూ కూర్చో వలసిందే? నాతరం కాదు."
'అక్కర్లేదు . మాటలూ, చేతలూ ఉంటె మనం పోటీ లేకుండానే ఎన్నుకో బడగలం. మా నాన్న, మీ నాన్న నామినేషన్లు వెయ్యకుండా ఉంటె చాలు. అప్పుడు మీ యింటి నియోజక వర్గానికి నువ్వూ, మా యింటి నియోజక వర్గానికి నేనూ పోటీ లేని అభ్యర్ధులుగా ఎన్నుకో బడతాం. తెలిసిందా? అప్పుడు సభానాయకుడివి నువ్వు. అత్తయ్య స్పీకరు. మా అమ్మ డిప్యూటీ స్పీకరు. మీ నాన్న ఎప్పుడూ అపోజిషన్ పార్టీ మెంబరు గద! ఇంక పొతే మా నాన్న . ఆయన్నో మంత్రిగా చేస్తే సరిపోదూ?" అన్నది గంబీరంగా ముఖం పెట్టి శ్యామసుందరి.
"ఓయబ్బో! ఎమ్మెల్యే గారమ్మాయి ననిపించావు, మొత్తం మీద. నీకూ రాజకీయాలు తెలుసునే!"
"తెలుసుకోకపోతే ఎట్లా, బావా? చూడు, అమ్మలిద్దరూ మన పార్టీ. మరి పధకం ఎట్లా వేస్తావో! పంచవర్ష ప్రణాళిక మాత్రం వెయ్యకు. ఉన్న వాతావరణం నీకూ అర్ధమైందిగా?"
"ఆహా! ఇంక అటు నుంచి నరుక్కు రావాలి."
"మరి ఆలోచించు."
"నీ సత్యాగ్రహం ఎంతవరకు వచ్చింది, శ్యామా?"
"ప్రారంభించాను. తగిన ప్రచారం ఉండాలిగా?"
"అవశ్యం! మీ అమ్మనో సంపాదకీయం వ్రాయమనక పోయావా?"
"ఎంత సమయస్పూర్తిగా మాట్లాడావు, బావా! నిన్ను చూస్తె...."
"ముద్దోస్తున్నదా? సరే, దగ్గరికి రా."
"ఇది గుంటూర్లో నీ గది కాదుగా!"
"ఓహో! మీ యిల్లు కదూ! సరే."
ఇద్దరూ పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకున్నారు. ఆరోజు గడిచింది. మర్నాడే వెళ్ళిపోయాడు, సురేంద్ర.
సురేంద్ర రామన్న పాలెం వెళ్లేసరికి ఇంటి వద్ద పెద్ద గందర గోళం జరుగుతున్నది. ఇంటి చుట్టూ జనం మూగి ఉన్నారు. రామయ్య గారు అరుగు మీద కూర్చున్నాడు. ఇంతమంది జనం ఎందుకు వచ్చారో అర్ధం కాలేదు సురేంద్ర కు. సురేంద్ర ను చూడగానే అంతా అతని వైపు తిరిగారు.
"రావయ్యా, సురేంద్ర , రా. సమయానికే వచ్చావ్." అన్నాడు ఒకాయన.
"ఏమిటి గొడవంతా?' అన్నాడు సురేంద్ర వెళ్లి తండ్రి పక్కన కూర్చున్నాడు.
అంతా రామయ్య గారి వైపు చూశారు. "వినవోయ్, వాళ్ళు చెప్పేది" అన్నాడు రామయ్య గారు.
అందులో ఒకతను చెప్పసాగాడు. ఆయన్నంతా బుర్ర మీసాలాయన అంటారు.
"మీ పొట్ల ఎద్దు కట్టు కొయ్య తెంచుకుని ఊళ్ళో బజార్ల వెంట పడ్డది. డాన్ని పట్టుకోవటానికి ఎవరి తరం కాలేదు. అదట్లా పరుగెత్తు తుంటే మీ నాన్నగారు గాని, మీ పాలేరు గాని డాన్ని పట్టుకోవటానికి ప్రయత్నించ లేదు. చూస్తూ యిక్కడే నిల్చున్నారు. అదట్లా పరుగెత్తి, పరుగెత్తి నక్కా సూరయ్య ఇంటి గోడ పక్కన చేరింది. అప్పటికయినా దాన్ని పలుపు కట్టి తీసుకోవాలా? అదీ చెయ్యలా. వాడిల్లు అంతా మట్టి గోడలు . పెడ అలుకు. దాని కోపం తీర్చుకోవటానికి కొమ్ముల్తో ఆ మట్టి గోడల్నీ కుమ్మి, పొడిచి పొడిచి తూర్పు పక్క గోడా, ఉత్తరాప్పక్క గోడా సాంతం పడగొట్టింది. గోడ పడిపోవడంతోనే ఆ గోడ పక్క నున్న ఆడి సామానంతా పాడయి పోయింది . ఆడు బీదవాడు గదా. మీ ఎద్దు ఇంత చేసింది. ఆడికి పరిహారం ఇవ్వాలి గదా. నువ్వూ చదువుకున్నోడివి . ఆలోచించు చెప్పు."
"గొడ్లు తొక్కిందానికి పరిహార మేమిటోయ్? దాన్నేం నేను కావాలని విడిచి పెట్టానా? నష్ట పరిహరమూ లేదు, ఏమీ లేదు. మీ ఇష్ట మొచ్చినట్లు చేసుకోండి."అన్నాడు రామయ్య గారు కోపంతో.
"రామయ్య గారు, ఒక్కమాట సూటిగా అడుగుతున్నా. లేబరంతా కలిసికట్టుగా మన పార్టీకే ఓట్లేయ్యా లాంటారే మరి? అల్ల మీద మీకు అభిమానం లేనప్పుడు మీ మీద అల్లకేందుకు అభిమానం ఉంటుంది? ఎన్నికల ప్పుడేమో మంది బీదల పార్టీ , కార్మీకు లంతా ఏకం కండి . నడుం కట్టి మన పార్టీ కే ఒట్లివ్వండి అంటారూ? వాళ్లకి కష్టం కలిగినప్పుడు ఛా పొండి అంటారూ? అందుకనే మీ పార్టీ మీద క్రమంగా నమ్మకం పోతున్నది. ఇంక రాబోయే ఎన్నికల్లో మీ పార్టీ వాళ్ళకి అభ్యర్ధులు కూడా దొరకరు. మీ పొట్ల ఎద్దు చేసిందానికే మీకు చీమ కుట్టినట్లు లేకపోతె, ఇంక లేబరోళ్ళ పేరు బెట్టుకుని ఎన్నాళ్ళు అల్లకి గంతలు కడతారు చెప్పండి ?" అన్నాడా బుర్ర మీసాలా ఆసామి.
రామయ్య గారికి ముఖాన కత్తి వేసినా నెత్తురు చుక్క లేకపోయింది. ముఖం చిట్లించి ఊరుకున్నారు.
"ఇదుగో రామయ్య బాబూ, ఒక్క తాలే అడుగుతున్నా. నా నట్టం ఎంత ఎక్కువైనా కానీండి. ఒక్క యాభై రూపాయ లిప్పించండి . గోడలు పెట్టించు కుంటా. సామాను పొతే మానె" అన్నాడు సూరయ్య.
"ఇవ్వకపోతే ఏం చేస్తారేం? తలగొట్టి మొలేస్తారా? మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు ఎన్నికల్లో బాగానే చేశారుగా? నాకు నష్ట పరిహారం ఎవరిస్తారేం? నేను ధడిసేవాడ్ని కాదు. గొడ్డు తొక్కిందానికి నష్ట పరిహారం నేనెక్కడా చూళ్ళేదు. నయా పైసా యివ్వను. మీ యిష్ట మొచ్చినట్లు చేసుకొండోయ్" అన్నాడు రామయ్య గారు.
"ఏం, సురేంద్రయ్యా. నువ్వేమంటావ్? అలోచించి చెప్పు" అన్నాడు బుర్రమీసాలాయన.
సురేంద్ర తండ్రి వైపు చూశాడు. అయన ఏం మాట్లాడలేదు. అంతా సురేంద్ర ఏం చెబుతాడో నని ఆశగా చూడసాగారు.
"ఇంతమంది దొమ్మీగా రావడం ఎందుకు చెప్పండి? మీలో పెద్ద ఎవరో వాళ్లోక్కల్లే వస్తే పోదా? ఇంతమంది గుంపుగా రావటం మాత్రం బూర్జువా మనస్తత్వం అనిపించుకొదూ? ఇదేం మర్యాద?" అన్నాడు సురేంద్ర.
"మీ నాన్నగారి తత్వాన్ని బట్టి ఇంతమంది రావాల్సోచ్చింది. నువ్వు న్యాయం చేస్తానంటే ఎవ్వరూ రారు. ఒక్క సూరయ్య మాత్రమె వస్తాడు. నీ అభిప్రాయం ఏమిటో తేల్చు" అన్నాడు బుర్ర మీసాలాయన.
"నేను న్యాయంగానే చేస్తాను,. రేపు ఉదయమే సూరయ్య ని, ఇంకో జతగాడిని ఎవరైనా సరే పంపండి. అంతా రానక్కర్లేదు" అన్నాడు సురేంద్ర.
సరేనని అంతా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక "ఏం రా! వాళ్లకి నువ్వు మంచి వాడివీ, నేను చెడ్డ వాడినీ అన్నమాట. నీముందే నా మాటకి విలువ లేకపోతె, ఇంక వాళ్ళ ముందు నా మాటకు విలువెం ఉంటుంది? రేపు వాళ్ళని రామ్మన్నావ్. ఎంతిస్తావెం?' అన్నాడు రామయ్య గారు.
"నాన్నా, మిమ్మల్ని చిన్నతనం చెయ్యాలని కాదు. పంతాలకూ, పౌరుషాల కీ పొతే ఉన్న పేరు ప్రతిష్టలు పోయి అప్రతిష్ట పాలవుతాం. తెగేదాకా లాగితే ఏదైనా అంతే. మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు, నాకు కన్న తండ్రి . మీ మాటకు ఎదురు చెప్పకూడదు. నిజమే. కాని కళ్ళు పోయేటంత కాటుక పెట్టుకుంటే కన్న కొడుకు చూస్తూ కూర్చున్నా అదీ మంచిది కాదు" అన్నాడు సురేంద్ర.
"అంటే వాళ్ళడిగిన డబ్బిస్తే పరువు ప్రతిష్టలు నిలుస్తయ్యా? ఇవాళ యాభై అంటారు, రేపు వంద అంటారు. ఏమైనా సరే డబ్బివ్వను." అన్నాడు రామయ్య గారు.
"మీ పరువు ప్రతిష్టలు నిలబడేటందుకే నేను వాళ్ళ మాటకి సరే నన్నాను. ఈ విషయం లో నా మాట వినండి." అన్నాడు సురేంద్ర.
"సరే. ఆ విషయం అట్లా ఉంచు. నువ్వు గుంటూరు నుంచే వస్తున్నావా? వెంకట పాలెం వెళ్ళావుటగా? నిజం చెప్పు."
"అవును వెళ్లి వస్తున్నాను. మేనమామ ఇంటికి వెళ్లి రావటం తప్పు కాదుగా?"
"శ్యామసుందరి , నువ్వూ గుంటూర్లో విచ్చల విడిగా తిరుగుతున్నారటగా?"
"మీరనుకున్నంత విచ్చల విడిగా తిరగలేదు. ఒకరి హృదయాల ఒకళ్ళం అర్ధం చేసుకున్నాం. నేను శ్యామసుందరి ను పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించు కున్నాను."
"వీల్లేదు. వాళ్ళకీ, మనకీ అన్ని విషయాల్లోనూ చుక్కెదురు. రాజకీయాల్లో మీ మావయ్య ఎంతవరకూ పోయాడో నీకు తెలీదు. శ్యామసుందరి మాటే నాముందు ఎత్తవద్దు." అన్నాడు రామయ్య గారు.
"నాన్నా, మీ పార్టీ రాజకీయాలూ, ఎన్నికల తత్వాలూ బందుత్వాన్ని, మా ప్రేమనీ మార్చలేవు. రాజకీయాలు పార్టీ ప్రయోజనాలకే . పార్టీ కక్షలు రాజకీయాల్లోనే గాని మేనరికాల్లో కాదు" అంటూనే ఇంట్లోకి వెళ్ళాడు సురేంద్ర. తల్లీ అన్నీ వింటూనే గుమ్మం పక్కనే నిల్చుంది. ఆమె మనస్సు లోనే సురేంద్ర ను దీవించింది.
