"నిజమే ....కాని ఆ పది రూపాయలూ ఉండద్దూ."
"మీకా భయం అక్కరలేదు. మన పంతులు చల్లగా ఉంటె పది రూపాయలు కాదు పదివేలు అలా తీసుకొచ్చి గుమ్మరిస్తాడు అన్న అరక్షణం లో.
'అందుకు సమర్దుడే లెండి. ఇప్పటికే నాకు ఓ వెయ్యి దాదాపు అప్పు ఇచ్చాడు, "మరిక నేం?' అన్నాడు మునసబు.
"కావసిస్తే ఇంకో నాలుగు వేలు తీసుకోండి. కాని మునసబు గారు చెప్పినట్లు ప్రెసిడెంటు కి పోటీ చేయడం మాత్రం మానకండి."
'ఇవాళ్ళ తీసుకుంటే ఏమైనట్టు ?... రేపు తీర్చవద్దు"
"తీర్చడం మాట తర్వాత చూద్దాం ...మీరు ప్రెసిడెంటు కి నిలబడడానికి ముందు ఒప్పుకోండి, తక్కినవి తర్వాత చూద్దాం"
"మీరు ఎందుకు అనుమానిస్తున్నారో నాకు అర్ధం కావటం లేదు , ఆ శేషయ్య తోటి పోటీ ఎలాగ అని జంకుతున్నారా?"
"జంకా............హు........? శేషయ్య తోటి పోటీ చెయ్యడానికి నాకు జంకేమిటి?"
"మరేమిటి అనుమానం? డబ్బు పెట్టుబడి పెట్టడం, కావలసిన వ్యవహారాలన్నీ చూడడం ఇదంతా మేం చేస్తాం -- మీరలా నుంచోండి . ఇప్పుడీ అవకాశం జార విడుచు కున్నామంటే మళ్ళా రాదు. ఈ సేవాసదనం ప్రారంభం అయ్యాక మనవాళ్ళు కూడా కొందరటు తిరగేసి మన పరిస్థితులను అస్తవ్యస్తం అయిన ఈ గడ్డు సమయాన్ని ఎదుర్కోవాలంటే ఇంత కంటే మార్గం లేదు, దీంతో పరిస్థితులన్నీ మారి మనం మళ్ళా ఊళ్ళో పలుకుబడి తోనూ, పరువుతోనూ తల ఎత్తుకొని తిరగొచ్చు ఏమంటారు?....... మనం ఈ దయనీయ పరిస్థితుల నుంచి బయటికి రావడం అవసరం లేదంటారా?" అన్నాడు మునసబు.
"సరే మీరు ఇంతగా చెబుతున్నప్పుడు కానియ్యండి " అన్నాడు శంకరం.
అంతే?
ఆరోజు నుంచీ, అప్పటి కింకో నాలుగైదు నెలల్లో రాబోయే పంచాయితీ ఎలక్షను ల కోసం, రహస్యంగా, లోపల్లోపల తీవ్రమైన ప్రచారాన్నీ, కృషి నీ ప్రారంభించారు మునసబూ, వాళ్ళూ-- "ప్రెసిడెంటు గా ఎవరు నుంచుంటారు ' అనేది మాత్రం ఇంకా రహస్యంగా ఉంది. తక్కిన కార్యక్రమం అంతా, ముమ్మరంగా సాగించసాగారు. విడివిడిగా ఒక్కొక్క కుల పెద్దనే రప్పించడం, ఆ కులంలో ఓట్లు ఎన్ని ఉన్నాయో లెక్ఖ వేసి ఓటుకి ఇంత ఇస్తాం అని బేరం పెట్టి కొంత సొమ్ము బజానా ఇవ్వడం , పనీ పాటా లేకుండా వీధులమ్మట తిరుగుతున్న ఓ అరడజను కుర్రకారు పిలిచి, "సేవాసదనం మోజులో పడి ప్రెసిడెంటు ని ఎన్నుకోవడం లో పొరపాటు చెయ్యొద్ద"ని ఊళ్ళో గోడల మీద రాసి, రోజుకో మారు రెండు మార్లో అట్టలు పట్టుకొని నాలుగు వీధులూ అరుస్తూ తిరగమని వియోగించిన వాళ్ళకి రోజుకి ఇంతని ఇయ్యసాగారు. ఊళ్ళో ఆడవాళ్ళకి రవికల గుడ్డలూ, పసుపూ కుంకం పొట్లాలు పంచి పెట్టారు- ఇంటింటికి , మెజారిటీ వచ్చి ఓటు హక్కు ఉన్న ప్రతి యువకుడి దగ్గరికీ , మునుష్యులని పంపించి, రప్పించి , ఆ కబురూ ఈ కబురూ చెప్పి "మా నాన్న ఎవరికి ఇచ్చినా మా ఓటు మీకే ఇస్తాం అనే హామీలని తీసుకో సాగారు. చెప్పిన మాట చెప్పకుండా, చేసిన వాగ్దానం చెయ్యకుండా ఊళ్ళో ఎన్నికల సంచలనాన్ని బాగా సృష్టించారు. గ్రామఫోను ప్లేట్లు వెయ్యడం, రంగు కాగితాల జండాలు అంటించడం, పిల్లలకి తరచూ పిప్పర మెంట్లూ, చాకలేట్లూ పంచి పెట్టడం , ఓ చిన్న శెట్టి చేత పెసరట్లూ కాఫీ అంగడి ఒకటి తెరిపించి, తాము మాట్లాడడానికి పిలిచినా వ్యక్తులందరి కి అక్కడ టిఫినూ కాఫీ ఇప్పించడం -- ఇలా రకరకాలయిన ఆకర్షణలు ఊళ్ళో సృష్టిస్తున్నారు మునసబూ పంతులూను-- ఇవన్నీ చెయ్యడానికి ఎవీటి కనిపించకుండానే పదిహేను వందలు దాటిపోయింది. ఈ పదిహేను వందల కీ, పాత బాకీ వెయ్యి కి కలసి పాతిక వందల కీ డాక్టరు చేత నోటు రాయించు కున్నాడు . నిండా మునిగిన వాడికి చలేవిటి అని శంకరం అవసరం అయినప్పుడల్లా వందా. యాభై చొప్పున చేబదులు తీసుకుంటూ ఇంట్లో కూడా ఇబ్బంది లేకుండా చూడసాగాడు. ఎలక్షన్లు చేరువలోకి వచ్చేటప్పటికి శంకరం పంతులు కి అన్ని బాపతులూ కలసి మొత్తం నాలుగు వేలూ ఇవ్వ తేలాడు. ఇంకో అయిదారు వేలుంటే నే కాని ఎలక్షను లు పూర్తీ కావు. ఇంత మొత్తం నోటు మీద ఇవ్వడానికి కుదరదనీ , పైగా తన దగ్గర అంత డబ్బు లేదనీ, ఎక్కడ నుంచో తెవాలనీ, ఆ అవతల ఆసామీ హామీ ఏడైనా ఉంటేనే కాని ఇవ్వడనీ చెప్పి మొత్తం మీద పది వేలకి డాక్టరు ఇల్లుని తనఖా రాయించు కున్నాడు పంతులు.
ప్రాక్టీసు ఎలాగా పోయింది, రాజకీయాలూ ఎలక్షను లూ అంటూ దిగింది ఎలాగా దిగాము. ఇంకా మధ్యలో వెనుకంజ వెయ్యడం ఎందుకు?.....సరే! ...ఎలా వస్తుందో చూద్దాం-- అంటూ మొండి చొరవతో నిర్లిప్తంగా ముందుకే పోవడానికి నిర్ణయించు కున్నాడు శంకరం.
మునసబు పార్టీ వాళ్ళు రెచ్చగొడుతూ ఎన్నికల ప్రచారం ఎప్పుడైతే ప్రారంభించారో పెద్ద కాపు పార్టీ వాళ్లకి కూడా వేడి అందుకుంది. వాళ్ళల్లో కూడా సంచలనం ప్రారంభం అయింది. "పోనిద్దూ ఎందుకొచ్చింది?" అంటూ శేషయ్య ఎంత చెప్పినా వినిపించుకోకుండా పదిమంది కలిసి , ప్రెసిడెంటు గా నిలబడడానికి అతన్ని ఒప్పించారు.
ఎన్నికల కై ఏనాడో తయారయి సిద్దంగా ఉన్న ఓటర్ల జాబితాల ప్రతుల్ని రెండు పార్టీల వాళ్ళూ నిత్యమూ పై నుంచి కిందకీ, కింద నుంచి పైకి పరిశీలించి ఎవరెవరికి ఎన్ని ఓట్లు వస్తాయో అంచనాలు వేసుకోసాగారు. ఊళ్ళో ఉన్న ఓటర్ల మొత్తం రెండు వేలు అవుతే కనీసం మాకు పదిహేను వందలు పడతాయంటే మాకు పదిహేను వందలు పడుతాయంటూ ఇరు పక్షాల వారూ చెప్పు కుంటున్నారు. ఊళ్ళో కొంచెం లెక్కలు వచ్చిన వాళ్ళు పదిహేను వందలూ పదిహేను వందలూ కలిసి రెండు వేలు ఆయె ఆ విచిత్రపు లెక్కల గురించి తలుచుకుని తమలో తాము ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు.
ఎన్నికలు సమీపించాయి.
రెండు పార్టీల వాళ్ళ ప్రచారాలు, ఝుం మ్మంటూ సాగుతున్నాయి. అటువేపు శేషయ్య నిలబడుతున్నాడని తెలిసిపోయింది. కాని, ఇటు ఎవరు నిలబడతారో ఇంకా ఎవరికి అంతు చికకలేదు. మునసబు నుంచోడానికి ఎలాగా వీల్లేదు కనుక పంతులో, శంకర మో నుంచుంటార ని అంతా ఊహాగానాలు ప్రారంభించారు. రాజకీయపు మేధలున్న కొందరు అతి తెలివైన వాళ్ళు "చూస్తూ ఉండండి" ఆ సమయం వచ్చేసరికి మునసబు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి అతనే నిలబడతాడు" అంటూ పందేలు వేయసాగారు.
పందేలతో, పంతాలతో ప్రచారాలతో , ప్రభోదాలతో రోజూ ఒక క్రొత్త పద్దతిలో రోజు రోజుకీ పెరిగిపోతున్న ఉద్రేకాలతో ఒకళ్ళ ని మించి ఒకళ్ళు, రహస్యంగా, బాహాటంగా , ఎత్తు పై ఎత్తుగా, కక్షలు పెంచుకుంటూ కావేశాలు తెచ్చుకుంటూ, ఒళ్ళు తెలియకుండా , అహో రాత్రులు ఎన్నికల ప్రచారంలో ఊరంతనీ ఒక మహా సంగ్రామ కురుక్షేత్రం లా మార్చేశారు రెండు పార్టీల వాళ్ళూ కలిసి.
నామినేషన్లు నడిపే రోజు వచ్చింది.
తలంటు కొని కొత్త బట్టలు కట్టుకొని నుదుటి ని కుంకుం బొట్టు పెట్టుకుని, దేవుడి ని తలచు కుని దుర్ముహూర్తం వెళ్ళాక వర్ధ్యం రాకుండా శకునం చూసుకుని శేషయ్య వెళ్లి ముందు నామినేషన్ పడేశాడు ఆఫీసరు దగ్గర. ఆ తర్వాత ఆఖరి క్షణం దాకా ఆగి శంకరం వేశాడు నామినేషను.
"నామీద శంకరమా పోటీ చేస్తుంటా?" అని శేషయ్య తెల్లబోయాడు-- నామినేషన్లు రెండు పరిశీలించి సరిగ్గానే ఉన్నాయని ప్రకటించి ఉపసంహరణ కి రెండు రోజులు టైము ఇచ్చాడు ఆఫీసరు.
"ఎవరు ఉపసంహరించు కుంటారు ఇలా ఉంటె!" జనం నవ్వుకున్నారు ఆఫీసరు అమాయకత్వానికి.
ఊళ్ళో ఎవరి నోట విన్నా ఎన్నికల కబుర్లే. ఏ గోడ మీద చూద్దాం అన్నా ఎన్నికల రాతలే ...ఇళ్ళల్లో పొలాల్లో , వీధుల్లో , రేవుల్లో , రచ్చ సావిళ్లో ఏక వాదాలూ , పందేలూ , కోపాలూ, కొట్లాట లు.....రణ గోణ ధ్వనిగా మనస్థిమితం లేకుండా మహా భయంకరంగా తయారయింది వాతావరణం.
క్షణ క్షణానికి ఉద్రేకం హెచ్చిపోతోంది ప్రజల్లో.
శివం ఎత్తినట్టుంది ఊరంతా!
ఒంటి నిండా కారం రాసుకున్నట్లు "తెయ్యి" మని అడిపోతున్నారు జనం -
వీరభద్రుడి సంబరం లాగ ఊగిపోతున్నారు అందరూ. వెఱ్రి ఎత్తినట్లు ఒళ్ళు తెలియకుండా !............
