Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 35


                                     39

                   
    తనకు కేటాయించిన గదిలోకి ప్రవేశించిన కన్ణా , వెనువేనుకనే వినిపించిన రాక్షస వికటాట్టహాసం విని ఖిన్నుడయ్యాడు.
    వెంటనే కోలుకొని "ఎవరది?' అంటూ గోడ మీద చేతిలో తడుముతున్న అతడిని, "ఏం? లైటు వెయ్యమంటావా?" అని హేళన చేసిందా కంఠం. మరుక్షణం లోనే లైటు వెలిగి, ఒకరి కొకరు స్పష్టంగా కనుపించారు.
    అతడు సుయోధన్!
    "ఆహ్హహ్హ! " లోకంలోని కక్షా క్రౌర్యాలను మొత్తంగా ఒలకబోస్తూ , విషపు నవ్వు నవ్వాడు సుయోధన్. "ఏదీ, కన్ణా, నీ కుంటి కాలేది?"
    కన్ణా అటు, ఇటు చూచాడు.
    "కదిలితే ఇక్కడే కాల్చేస్తాను. ' పిస్టల్ గురి పెట్టాడు సుయోధన్.
    నిస్సహాయంగా నిలబడి పోయాడు కన్ణా.
    "విప్పు, ఆ కుంటి కాలు. "ఆజ్ఞాపించాడు సుయోధన్.
    తప్పనిసరిగా అమలు పరిచాడు కన్ణా.
    "ఇంకా ఆ గడ్డం కూడా దేనికి ?' ఒక్క గుంజు గుంజడం తో కన్ణా కృత్రిమమైన గడ్డం సుయోధన్ చేతిలోకి వచ్చేసింది.
    "గౌతమ్!" విజయ గర్వంతో వికృత హాసం చేశాడు సుయోధన్. "నిన్ను నేను కనిపెట్ట లేనను కున్నావా, గౌతమ్? ఇంకెక్కడికి పోతావు, నా పంజా నుండి? ఇక నీకు మరణం ఖాయం!"
    గౌతమ్ పళ్ళు పటపటా కొరికాడు. "దుర్మార్గుడా! నన్ను సర్వ నాశనం చేశావు. నా కుమారుని కూడా చేయాలని సంకల్పించావా? ఇంతకంటే చావే నయం కదా? ఎందుకు నీకు నామీదింత కక్ష?"
    "ఎందుకా? ఎందుకో తెలియకే అడుగుతున్నావా, గౌతమ్? నా దారికి అడ్డు వచ్చి నందుకు! తెలిసిందా?"
    "హు! నీ దారి! నీ దారీ, నీ బ్రతుకూ ! ఛీ!"
    "గౌతమ్!' హుంకరించాడు సుయోధన్. "ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు. నీ ప్రాణాలిప్పుడు నా చేతిలో ఉన్నాయి."
    "తెలుసురా, వాజమ్మా. నా ఒక్కడి ప్రాణాలే కాదు. యావత్ దేశం ప్రాణం నీ చేతి లోనే ఉంది. ఎందుకింత పాపిష్టి బతుకు? ఈ అవినీతి బతుకుతో ఇలా జీవించక పొతే వచ్చిన లోపమేమిటి? పశువుకూ, నీకూ తేడా ఏముందిరా, పరమ నీచుడా?"
    "నోర్మూయ్, తెలివి తక్కువ రాస్కెల్! బతికిన నాలుగు రోజులూ బంగారు జీవితం గడపాలి. ఎందుకీ వెధవ ధర్మాలు? ఎవరి తెలివి కొద్దీ, చాకచక్యం కొద్దీ వారు బతుకుతారు."
    "ఇంత చదువూ, ఇంత అనుభవం ఇందుకేనా సుయోధన్? నీ తల్లిని తీసికెళ్ళి ఏ శత్రువు చేతిలోనో ఉంచితే, ఎంతో, నీ కన్న కుమార్తె ను నట్టేట ముంచితే ఎంతో -- నీ మాతృదేశాన్నీ, ప్రజనూ చేజేతులా శత్రుచు కు ఒప్పగించితే అంత కాదా?"
    "ఈ బైరాగి నీతులు కట్టి పెట్టు. అంది నంత వరకూ ఆనందించాలి. అందులోనే సుఖ ముంది . తెలుసుకో."
    "ఛీ. కక్కిన కూటికి ఆశపడే చండాలుడా!"
    నిర్లక్ష్యంగా నవ్వాడు సుయోధన్. "ధర్మం, న్యాయం అని ఘోశిస్తున్నావు కదా ఇంత కాలం? ఏదీ? ఏమిటి నీ ధర్మం, న్యాయం నీ కిచ్చిన బహుమానాలు ? దీర్హ కాల కారాగార వాసం, నేరారోపణ , భార్య పుత్రుల వియోగం ! ఇంతేనా? దీనికేనా ఇంతగా వదురు తున్నావు?"
    గౌతమ్ ముఖం పాలిపోయింది. ఒక్కక్షణం ఆగి, నీరసంగా అన్నాడు. "ఔను, ఔనురా, సుయోధన్. నీలాటి ద్రోహులు ధర్మదేవత ను ఇక్కడి నుంచి పూర్తిగా తరిమేశారు కాబోలు! లేకుంటే ఇంత అధర్మ మేలా జరుగుతుంది? ధర్మదేవతే జీవించి ఉంటె తననే నమ్ముకున్న వాళ్ళను ఎందుకిలా అష్ట కష్టాల పాలు చేస్తుంది/ ధర్మదేవత నిజంగా మూగిది. నోరు లేదు, ధైర్యం లేదు!"
    సగర్వంగా , బిగ్గరగా నవ్వాడు సుయోధన్. "అందుకే నీ బుద్ది మార్చుకుని బాగుపడు."
    "అది మాత్రం జరగదు."
    "సరే. ఫలితం అనుభవిస్తావు, జాగ్రత్త! గౌతమ్, మర్యాదగా చెప్పేయి. ఆ కాగితా లెక్కడ పెట్టావు?"
    "ఏ కాగితాలు?' బింకంగా ఎదురు ప్రశ్నించాడు గౌతమ్.
    సుయోధన్ కోపంతో రెచ్చిపోయాడు . పిస్టల్ గౌతమ్ గుండెలకు మరీ దగ్గరగా తెచ్చి అనించుతూ అన్నాడు: "స్వర్గ గంగా నదిలో ఈ మధ్య ఇసక మెటల తవ్వకాలలో బయల్పడిన రికార్డు. చెప్పు, ఏంచేశావో . నువ్వు మద్రాసు లో నా ఇంట్లో ప్రవేశించి రెండు వారాల క్రితం ఆ రికార్డు ను దొంగిలించిన విషయం నాకు తెలియదను కున్నావా?"
    గౌతమ్ మాట్లాడలేదు.
    'చెప్పు!" ఉరిమాడు సుయోధన్. "ఆ జిత్తులమారి నారాయణ్ శర్మ, రాజ్యలక్ష్మీ ఎక్కడున్నారు? ఎక్కడకు పంపించావు వాళ్ళను?"
    నిర్లక్ష్యంగా చూచాడు గౌతమ్. "నీచేత చిక్కాను. నా ప్రాణాలు తీస్తావు -- నాకు తెలుసు, కాని, నేను నీకేమీ చెప్పను నాకు నీలాగా ప్రాణమూ, స్వార్ధమే ముఖ్యం కాదు. దేశం కోసం నా ప్రాణాలను తృణ ప్రాయంగా విసర్జించ గలను."
    "చెప్పవన్న మాట?"
    "చెప్పను. కాని భవిష్యత్తు చెబుతున్నాను, విను. నేను చచ్చినా, బతికినా ఇక నీ పాపం మాత్రం పండిపోయింది. బద్దలై నిజం అందరికీ తెలియగల రోజులు ఆసన్న మవుతున్నాయి."
    "ఏడిశావ్ . అంత  సులభ మను కున్నావా?" చూచుకో. నీ చేత కాదు. నీ కొడుకు చేత చెప్పిస్తాను నిజం. చూచుకో. రేపు మధ్యాహ్నం లోగా నిజం చెప్పకుంటే ముందు నీ కొడుకే చస్తాడు. జెయిలు లోనే వాడిని హత్య చేయిస్తాను. తెలుసుకో" అంటూనే సుయోధన్ జేబు నుంచి తీసీ గౌతమ్ ముక్కు దగ్గర ఏదో సీసా ఉంచడం తో అతడు వెంటనే స్పృహ తప్పి పోయాడు.
    స్పృహ తప్పిన గౌతమ్ ను కారులో పడ వేసుకుని స్టార్టు చేసుకు పోయిన సుయోధన్, కారు వెనుక భాగం మీదికి చటుక్కున ఉరికి, కారుపై సామానులు వేసుకునే టాప్ ను చేరుకొన్న మానవాకారాన్ని ఏమాత్రమూ గమనించలేదు!
రాత్రి ఒంటి గంట ప్రాంతం లో కారులో ఒంటరిగా తిరిగివచ్చిన సుయోధన్ , ఇంట్లో మిత్రా, సుమిత్రా ఇద్దరూ ఖంగారు పడుతూ తిరుగుతుండడం చూచాడు.
    "అమ్మాయి నీతో రాలేదూ? ఎక్కడి కెళ్ళారీ అపరాత్రి వేళ?" ప్రశ్నించాడు మిత్రా, అన్నను.
    సుయోధన్ గుండె జారిపోయింది. "పని ఉండి వెళ్ళాను, కాని, అమ్మాయి నాతొ రాలేదే?"    
    "ఆ!!" నిర్జీవ పడిపోయాడు మిత్రా. "ఒకవేళ ఎక్కడి కైనా వెళ్ళిందా?"
    సుమిత్ర శోకాలే మొదలెట్టింది. "చెప్పకుండా వెళ్ళే అలవాటు లేదు" అంటూ.
    అన్నదమ్ము;లిద్దరూ ఆత్రంగా ఇల్లంతా మళ్ళీ మళ్ళీ చూచి, ఆశ లేకపోయినా తోటలోకి వెళ్లారు.
    తోటలో ఫౌంటైన్ పక్కన చలన రహితంగా నేలపై పడి ఉన్న సత్యను చూడగానే అంతటి గంబీర పురుషుల కూ గుండె ఆగినంత పని అయింది.
    "శ్వాస ఉంది" అని సంతోషంగా అరిచాడు, ఆత్రంగా సమీపించిన మిత్రా.
    అనేక సపర్యల అనంతరం తెలివి వచ్చిన సత్యతో "ఏమీటే , తల్లీ ఇది? ఏమయిందేవు? చీకటి లో తిరగద్దు, పురుగూ, పుట్రా ఉంటాయని నేను మొత్తు కుంటూనే ఉంటాను. వినవు కదా?" అని, కన్నీరు నింపుకొన్నది సుమిత్ర.
    "పురుగూ పుట్రా కాదు.' మెల్లగా అన్నది సత్య. "మనింట్లో వంటకు కుదిరిన ఆ ముసలి దేవరో మోసగత్తె . మరి ఆ కన్ణా ఎటువంటి వాడో?"
    ఉలిక్కి పడ్డారు శ్రోతలు.
    "అసలేం జరిగింది?' సుయోధన్ అడిగాడు.
    తగ్గు స్వరంతో చెప్పింది సత్య. "నేను రేపు   కోర్టులో చెప్పబోయే వాదన అంతా యెట్లా ఉంటుందో చూచుకోవడానికి టేప్ రికార్డర్ మీద రికార్డు చేసుకొన్నాను."
    "అయితే?"
    "అది వేసుకొని వింటుండగా మన వంట లక్క వచ్చింది నా దగ్గరకు గబగబా. ఏమో చెప్ప వచ్చిందను కున్నాను. కాని , ఏమీ మాటల్లెకుండానే చటుక్కున నా గొంతు నొక్కేసింది. అంతే. మళ్ళీ ఇదే స్పృహ రావడం!"
    అంతా కొయ్యబారి పోయారు. ఎంత వెతికినా ఎక్కడా టేప్ రికార్డర్ కనిపించలేదు. కాని, దారి తెలియని కొత్త వాళ్ళు అక్కడ తిరిగారనడానికి నిదర్శనంగా చిన్న చిన్న పూల మొక్కలు నలిగి, విరిగి ఉన్నాయి. ప్రహరీ గోడ మీద నుండి ఎవరో పురుషుడు దూకి లోపలికి వచ్చినట్టూ, అవతలికి పోయినట్టూ స్పష్టంగా , పెద్ద పాదాల గుర్తులు ఉన్నాయి.
    ఆశ్చర్యపోతూ అందరూ కన్ణా కోసం గాలించారు. ఇల్లూ, తోటా , షెడ్లు అంతటా. ఏమీ తెలియనట్టు ఆ గాలింపు లో తానూ పాల్గొన్నాడు సుయోధన్. ఎక్కడా కన్ణా కనుక్కోలేక, "ఆ దూకింది వాడే అయ్యింటాడు. ఇది ఆ రికార్డర్ వాడి కందించి , తను మరో దారిని పోయుంటుంది" అని నిర్ధారించింది సుమిత్ర.
    "మరి, రెండు పాదాలున్నాయి. వాడి దొకటి కుంటి కాలు కదా?" సందేహం వెలిబుచ్చింది సత్య.
    "అది కుంటి కాలు కాదు. వాడు ఉండే షెడ్ లో అది విప్పేసి ఉంది చూడండి." అన్నారు అప్పుడే షెడ్ లో చూచి వచ్చిన అన్నదమ్ములు.
    "పోనీలే , అమ్మా వెధవ రికార్డరు. మరోటి కొనుక్కోవచ్చు. నువ్వు బాగున్నావు. అంతే చాలు." అని సత్య చెంపలు నిమిరింది సుమిత్ర.
    "అయ్యో! అదే ముఖ్యం . అందులో నా వాదన అంతా ఉంది" అంది సత్య.
    "సరే. ఇది ఎవరి పనో నాకు తెలుసు. "తల పంకించాడు సుయోధన్. "నువ్వెలా వాదిస్తావో తెలుసుకొని, దానిని బట్టి తన వాదన తెలుసుకొంటాడు కాబోలు , ఆ చచ్చు ముఖం అర్జున్!" ఎంత బింకంగా మాట్లాడుతున్నా సుయోధన్ ఆరాటాన్ని అందరూ గ్రహించారు. "సరే. పెద్ద పెద్ద కేసులలో ఇటువంటి తమాషాలు మామూలే. ఇప్పుడే వెళ్లి నేను చూచుకుంటా నా పని."
    "వద్దు. నాన్నా. వాళ్ళెం చేస్తారో? మీరు వెళ్ళద్దు. పోలీస్ రిపోర్టిద్దాము."
    "అవును. పోలీస్ రిపోర్టిద్దాము" అన్నారు మిత్రా.
    ఖంగారు పడ్డాడు సుయోధన్. "వద్దు, వద్దు. పోలీసు లెందుకు. లేనిపోని అల్లరి? ఇటువంటివి యుక్తి తోనే సాధించాలి. నా చేతిలో భుజంగం, రాధాయ్ -- ఎటువంటి మనుషులున్నారు!' అంటూనే అప్పటికప్పుడు కారెక్కి దూసుకు పోయాడు.
    మ్రాన్పడి పోయింది సత్య. "భుజంగం, రాదాయ్ ! మన వాళ్ళా? ఒకప్పుడు ధర్మారావు కు ఎదురు తిరిగిన వాళ్ళూ, కత్తి విసిరిన వాళ్ళూ వాళ్ళే నని కోర్టు లో అర్జున్ నిరూపించాడు. వీళ్ళు నాన్నగారికి దగ్గర వాళ్ళా? భగవాన్! ఏమిటిది? ఏమిటీ ఘోరం? ఏమిటీ సాలె గూడు?'
    మిత్రా కొలది క్షణాలు ఏమేమో యోచించాడు. ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడలేదు. తనకు తానె ఏదో నిర్ణయానికి వచ్చినట్టు తల పంకిస్తూ, ఫోన్ దగ్గరకు నడిచి, రికార్డర్ అదృశ్యం అయిన విషయం అంతా వివరంగా పోలీస్ స్టేషన్ కు తెలియ బరిచాడు.
    తెల్లవార గానే వచ్చి చూస్తామనీ, సెంట్రల్ జెయిల్ లో ఏదో గడబిడ జరిగిందనీ, అందువల్ల సిబ్బంది అంతా అక్కడ ఉన్నదనీ వినయంగా తిరుగు జవాబు వచ్చింది, పోలీస్ రైటర్ నుండి.
    టైము చూచుకున్నాడు మిత్రా. తెల్లవారు ఝాము మూడు గంటలు!
    కుతూహలం తో ప్రశ్నించాడు -- "ఏమిటి? ఏం జరిగింది?" అని.
    సాధారణంగా అటువంటివి ఎవరికీ చెప్పక పోయినా , అడుగుతున్నవాడు స్వయంగా న్యాయాధికారి, న్యాయమిత్ర కావడం వలన పోలీస్ రైటరు జవాబు చెప్పాడు. "జైలు లో ఉన్న ధర్మారావు గారి పై హత్యా ప్రయత్నం జరిగింది. మరో ఖైదీ పారిపోయాడట. ఇంకా వివరాలు తెలియవు."
    ఆశ్చర్యపోయిన మిత్రా మరేమీ ప్రశ్నించ కుండా పక్క చేరాడు. రాత్రి అంతా నిద్ర లేని అతడి మనసూ, చెదిరిపోయిన మెదడూ మరి ఆలోచనలకూ ఇచ్చగించ లేదు. బద్దలై పోతున్న హృదయానికి కొలది సేపు విశ్రాంతి ఇచ్చే టందుకు నిద్ర మాత్ర మింగి పడుకుంది సత్య.
    
                                         40
    ఆ సాయంత్రం భోజనాంతరం ఖైదీ బలరాం తిరిగి తన గదిలో కి చేరకపోవడం ఎవరూ గమనించలేదు. తీరికగా కూర్చుని , తన గదిలో నుండే బయట అందరినీ తిలకిస్తున్న ధర్మారావు ఆ విషయం కనిపెట్టాడు కాని, తానూ అతడి స్థితి లోనే ఉండి ఎవరితో , ఏమి మాట్లాడతాడు? తాను ఆ విషయం లో ఏ విధంగానూ బాధ్యుడు కాడు. 'అయితే, బలరాం కూడా పారి పోతాడా? వారి కండ్ల ఎదటే జైలు సూపరింటెండెంట్ గా పని చేసిన తానె, తిరిగి నేరస్తుడు గా వారితో పాటే బందీ అయి ఉండడం , వారి కేమయినా లోకువనూ, తన్మూలకం గా అవకాశాన్నీ కలిగించిందా?' తనలో తానే అమితంగా సిగ్గిలిపోయాడు ధర్మారావు. 'ఛీ, సత్య ఏమను కొంటున్నదో? అర్జున్ , మిత్రా ప్రభుతూలేలా భావిస్తున్నారో?' కుంచించుకు పోయిన ధర్మరావు ఆ అయోమయా లోచనలతో కాల గమనాన్నే గమనించలేదు.
    నిశ్శబ్దం లో ఎక్కడో పన్నెండు పలికింది. దూరాన నుండి ఏవో అస్పష్టంగా ధ్వనులూ, నక్కల అరుపులూ విన వస్తున్నాయి. పలు యోచనలతో , నిద్ర లేమితో బాధపడుతున్న ధర్మారావు హృదయం ఎందుకో తీవ్రంగా స్పదించ సాగింది. జ్ఞాన మెరిగిన పిమ్మట ఎన్నడూ అనుభవానికి రాని వింత భయ సందేహాలకు లోనైన మనస్సు ను అదుపులోకి తేలేక, అపూర్వమైన తన స్థితి కి తానె ఆశ్చర్య పడ సాగిన అతడికి రెండు గంటల ప్రాంతం లో , దగ్గర లో ఏవో గుసగుస లు విన వచ్చాయి.
    పరీక్షగా చూచి, జాగ్రత్తగా విన్నాడు. 'సందేహం లేదు. కటకటాల కావల ఎవరో ఇద్దరు రహస్యంగా మాట్లాడు కొంటున్నారు!' కాని ఏమిటో వివరంగా తెలియలేదు . తిరిగి కొద్దిక్షణాలు నిశ్శబ్దం! తర్వాత గది తలుపు తాళం తీస్తున్న సవ్వడి!  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS