Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 34


                                       38
    కేసు ఫైనల్ హియరింగు కు వచ్చింది. సత్యకు మతిపోతున్నది. చట్టాలూ, అంక్షలూ మనిషి శరీరాన్నే అదుపులో పెట్టగలవు కాని, మనస్సు పై ఏ విధమైన ఆధిపత్యం సహించలేవని ఆమె అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది. ఎంత ప్రయత్నించినా ఆగకుండా మాటి మాటికీ సామాన్య యువతి లాగా అశ్రువులు ప్రవాహలై పోతున్నాయి,
    'ధర్మారావు లేకుంటే ఇక ఏమిటి? ఏమిటి నీ భవిష్యత్తు ? నీ మిగిలిన జీవితం లో సుఖ శాంతులు ఉంటాయా?' అని అంతరాత్మ నిలవేసి అడుగుతున్నది.
    'కోట్లాది ప్రజల సుఖం ముందు ఒక వ్యక్తీ ఏపాటి? సముద్రంలో ఒక్క నీటి బిందు వేంత?' ధర్మదేవత కళ్ళెర్ర జేస్తున్నది.
    "స్వార్ధ పరులు దేశానికి చీడ పురుగులు. మనస్సును రాయి చేసుకో' సంస్కారం అధికార పూర్వకంగా హెచ్చరిస్తున్నది.
    "వెర్రి దానా! ఎవరి తాపత్రయం వారిది; ఎవరి బాగు వారిది. కాని, ఇంకొకరి కోసం స్వసుఖాన్ని, శాంతి ని నాశనం చేసుకుంటావా? ఈ పనికి మాలిన ఆశయాలూ, ధర్మ పన్నాలూ ఎందుకు? ఈ చిత్త క్షోభ ఎందుకు?' స్వర్ధత మానవత్వం పూరి కోల్పుతున్నది.
    "ఛీ. చూడు, పశు పక్ష్యాదు లలో కూడా ఎంత ఐకమత్యం , పరస్పర సహకారం ఉంటాయి! అది కూడా లేని ఈ ఉన్నత మానవ జన్మ లెందుకు మేడి పండ్ల లాగా?' మానవత ఈసడించింది.
    ఇన్ని విధాల చుట్టూ ముట్టిన భావాల అలల తాకిడికి తట్టుకోలేని సత్య మనస్సు పెనుగాలి లోని చిరు మొలక లాగా అల్లలాడి పోయింది.
    ఆఖరి రోజు వాదన చాలా పటిష్టంగా తయారు చేసుకోవలసిన బాధ్యత , వ్యక్తిగత మమకారను బంధం -- ఈ రెండిటి మధ్యనా నలిగి పోతున్న సత్య కర్తవ్య విమూడ అయి, కలవరం చెందసాగింది. ఎవ్వరు బతిమాలినా ఆరోజున ఆమె చేత భోజనం చేయించడం సాధ్యపడలేదు.
    "అన్నం తినకపోతే మానె. కనీసం ఇవన్నా తీసుకోండమ్మాయి గారూ" అన్నాడు కన్ణా పాలగ్లాసు బిస్కెట్ల తో ప్రవేశించి.
    పరధ్యానంగా ఉన్న సత్య మాట్లాడక పోవడంతో కన్ణా సావకాశంగా బైఠాయించి , హితబోధ ప్రారంభించాడు.
    "చూడంమాయ్!"
    ఆ అతి చనువు కు ఉలిక్కి పడింది సత్య. 'ఛ, నౌకరు కూడా నాకు నీతిబోధ చేయడమేనా? ఎంత సిగ్గు!' అనిపించింది. కాని, ఏమో అనేలోగానే కన్ణా మాట లింకా ముందుకు సాగిపోయి, ఆమెను అతి విస్మయావస్థ లో ముంచి వేశాయి.
    "నువ్వు వాదిస్తున్న కేసు విషయం లోనే కదూ, నీ బెంగ?"
    "నీ కేలా తెలుసు?" ఆశ్చర్యంతో ఎదురు ప్రశ్నించింది.
    "మంచి ప్రశ్నే." పకపకా నవ్వేశాడు కన్ణా . "ఈ రోజుల్లో ప్రపంచం సంగతులూ,  రాజకీయాలూ అన్నీ అందరికీ కావాలి. మరి ఇంతటి గొడవ రోజూ పేపర్ల లో పడుతుంటే అంతో, ఇంతో చదువుకున్న వాడిని నేను చూడాలే దంటావా?"
    విని ఊరుకుంది సత్య, నిర్లిప్త వదనంతో
    "అయితే ఆ అబ్బాయి నిజంగా చాలా మంచి వాడా, అమ్మా?"
    నిట్టూర్చింది సత్య. "నాకు తెలిసినంత వరకూ ఆ అబ్బాయీ, అతడి తండ్రీ కూడా ఎంతో మంచివాళ్ళు. అటువంటి వాళ్ళు సాధారణంగా కనిపించరు. మరి సంఘటన లు చూస్తె మరోలా ఉన్నాయి. నిజంగా ఈ కేసులో పని చేయడం నాకేమీ ఇష్టం లేదు. ఎల్లుండి ఫైనల్ అర్గ్యు మెంట్స్ . దీని నుంచి విముక్తి ఎలా దొరుకుతుందా , ఎక్కడికి పారిపోదామా అని ఆలోచిస్తున్నాను." నౌఖరు తో మాట్లాడుతున్నాననే విషయమే గుర్తింపు లేదు సత్యకు. నడి సముద్రం పాలైన వారికి గడ్డి పోచ కూడా ఘనమైన ఆధారంగా కనిపించేటట్లే  ఉంది, ప్రస్తుతం ఆమె స్థితి.
    కన్ణా నేత్రాలు జాలితో నిండిపోయాయి సత్య పట్ల. "చూడు, తల్లీ." అనునయంగా అన్నాడు. "నీ అంత పెద్ద చదువులు చదువు కున్న వాడిని కాకున్నా పెద్ద వయసూ, అనుభవం ఉన్నవాడిని. అలా చూడు, ఆ గోడ మీద బొమ్మ."
    సత్యాదేవి చూపులు కూడా కన్ణా చూపుల ననుసరించి గోడ మీదికి పరుగెట్టాయి.
    కురుక్షేత్ర రణ రంగం లో బంధు ప్రీతి వల్ల యుద్ధ విముఖుడై బాధపడుతున్నా అర్జునుడి కి ఉపదేశం చేసి కర్మోన్ముఖుడై చేయటానికి ప్రయత్నిస్తున్న సారధి శ్రీకృష్ణుని చిత్రం. భూమి లోకి కుంగి పోయిన రధ చక్రాన్ని భుజంతో పట్టి, పైకి లేప యత్నిస్తూ అర్జును ని బాణం వేయవద్దని అర్ధిస్తున్న కర్ణుడు!
    "ఆ రెండు చిత్రాలు నీవు వేసినవే కదూ?"
    "అవును."
    "మరి ఏం గ్రహించావు, అందులో? అవి కేవలం పురాణాలు, ముసలమ్మ కధలూ కాదు, తల్లీ. యుగయుగాలు మానవజాతి మనుగడ కు మార్గదర్శక మై నిలవగల  మహత్తర గాధలు."
    ఆశ్చర్యంగా , గురువు బోధ వింటున్నట్లు వినసాగింది సత్య.
    "కౌరవ పాండవు లెవరు? అన్నదమ్ముల బిడ్డలు. ఎవరి మధ్య యుద్ధం? అన్నాదమ్ములు , తాతా మనమలు, తండ్రీ కుమారులు, బావా మరుదులు, గురు శిష్యుల మధ్యనే! అందుకే అర్జునుడు కర్తవ్య మూడుడై విలపించాడు. అటువంటి సమస్యే ఇప్పుడు నీదిని. బంధుప్రీతి కాదు ప్రధానం; సత్య పాలన, ధర్మ సంస్థాపన! అటూ, ఇటూ అందరూ పోగా కడకు మిగిలారు పాండవులు. ఆత్మీయులందరూ పోయిన తీవ్ర శోకం; అందులోనే ధర్మ సంస్థాపన జరిగిందనే మహా తృప్తి! అటు కర్ణుడెం చేశాడు? అతడి ఏలిక సుయోధనుడు అధర్మ మూర్తే కావచ్చు. కాని ఒకనాడు నిండు పెరోంగం లో తన పరువు నిలిపి, శాశ్వతాను బంధాన్ని ఏర్పరిచాడు. అందుకే తన శక్తి శౌర్యాలను పూర్తిగా అతడి కొరకే వినియోగించడం తన ధర్మం గా భావించి, పాండవులు సహోదరు లేరని తెలిసి కూడా వారితో యుద్ధం చేయడానికి వెనుకాడలేదు!'
    "అంతేనా?' నీరసంగా ప్రశ్నించింది సత్య.
    "అంతే , తల్లీ. ధర్మ నిర్వహణ ముందు వ్యక్తీ గతాను బంధాలు పనికి రావు. నీ వ్యతిరేకి ధర్మారావే కాదు, నీ తండ్రే అయినా -- మాట వరసకు చెబుతున్నా ననుకో -- వెనకాడ కూడదు. నీ విధిని నిర్వర్తించడమే నీ ధర్మం, నీ కర్తవ్యమ్!"
    ఆకళింపు చేసుకుంటున్న సత్య కు మాటలు కరువై నాయి.
    తనవైపు విప్పారిత నేత్రాలతో చూస్తున్న ఆమెతో, "ధర్మచక్రం చాలా పదునైనది, అమ్మాయీ. స్వపర బేధాలు ఉండవు. జరిగేదేదో జరుగుతుంది. పైన ఆ భగవంతుడు ఉన్నాడు. మనస్పూర్తిగా నీపని నువ్వు చేసి నిశ్చింతగా ఉండు. అడుగడుగునా అలా విచారించకు" అంటూనే ఆమె ఖాళీ చేసిన పాల గ్లాసు పట్టుకుని వెళ్ళిపోయాడు కన్ణా.
    "ఒకసారి గౌతమ్ కూడా ఇలాగే అన్నాడు!" అత్యాశ్చర్యం తో సత్య స్వగతం గా అనుకున్న మాటలు పైకే వెలువడి పోయాయి.
    అప్పుడే కుమార్తె తో మాట్లాడ వచ్చిన సుయోధన్ మాట్లాడ కుండానే తల పంకిస్తూ కన్ణా ను పరిశీలనగా చూస్తూ, వెన్నంటడం ఎవరూ గమనించలేదు.
    'అవును . కన్ణా ఎంత చక్కగా బోధించాడు! నిజమే! నా కర్తవ్యాన్ని నేను మనస్పూర్తిగా నిర్వర్తించి , ఆ పైన నిశ్చింతగా పంచ భూతాలలో కలిసి పోతాను.ఈ ఒక్క ప్రాణం ఏమైనా, ప్రపంచాని కే నష్టమూ లేదు' అనుకొంటూ కోర్టు లో చెప్పవలసిన తన తుది వాదనను తయారు చేసుకోవడం లో నిమగ్నమయి పోయింది సత్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS