"వాన వస్తదేమో!" అనుమానం వెలిబుచ్చాడు నావ మనిషి.
"ఫర్వాలేదు" అంటూనే శాంతి నావ ఎక్కింది. రామన్న అనుసరించాడు.
ఏటివాలున రెండు ఫర్లాంగులు వెళ్ళేసరికి ఆకాశం మేఘావృతమై పోయి బలమైన గాలి వీచసాగింది. నావ అటూ యిటూ ఒరిగిపోసాగింది. నావవాడూ, రామన్నా కంగారు పడిపోతున్నారు. వాసదేవుడికి కొబ్బరికాయ కొడతానని మ్రొక్కుకుంటున్నాడు రామన్న. శాంతి మాత్రం ఏవిధమైన ఆందోళనా లేకుండా, మహా కల్లోలంగా లేస్తున్న కెరటాలనూ, నదినీ నిశ్చలంగా చూస్తూ కూర్చుంది.
"ఎందుకు, చిన్నమ్మా, తీరికగా కూర్చోలేక యిలా బయల్దేరావ్?" నావ వాడికి తెడ్డు వేయడంలో సహాయపడుతున్న రామన్న విసుక్కున్నాడు.
అలాగే కూర్చుని నిశ్చలంగా అంది శాంతి: "ఫర్వాలేదు, రామన్నా. నీకు ఈత వచ్చుగా? పడవవాడికి ముందే వచ్చి వుంటుంది."
రామన్న అదిరిపడ్డాడు. గట్టిగా కసురుకున్నాడు. "వూరుకో. బుల్లెమ్మా. నాటలు నేర్చావ్! ఎదవ జలమ, నానేటైతే మాత్రం లెక్కేటి? నీగురించి కాదూ నా బాధ?"
శాంతి మాట్లాడలేదు. రామన్న ప్రేమవిశ్వాసాలామెకు తెలియనివి కావు.
అంతకంతకు గాలివేగం ఉధృతం కాసాగింది. మబ్బులధికమై సూర్యుణ్ణి మరుగుపరిచి చీకట్లు అలముకోసాగాయి. ఇక రామన్న ఏడ్చెయ్యటానికి సిద్దంగా ఉన్నాడు.
అంతలోనే దైవం పంపినట్టు ఒక లాంచీ అటుగా వస్తూంది. రామన్న రెండు చేతులూ ఎత్తి దైవాన్ని స్తోత్రంచేస్తూ ఆ లాంచీవాళ్ళను గట్టిగా పిలిచాడు. ఆ కేక ఆ గాలి ఉధృతంలో విన్పించిందో లేదో కాని ఆ లాంచీ బుద్దిపూర్వకంగానే అటు వచ్చింది.
"శాంతీ! రామన్నా!" ఆ లాంచీలోనుండి వస్తూన్న ఆ కేకలకు ఆశ్చర్యపోతూ చూచారు. శ్రీహరి!
అందరూ లాంచీలోకెక్కి నావను లాంచీకి కట్టేశారు. క్రమంగా చినుకులు పడసాగాయి.
శ్రీహరి అడగక ముందే చెప్పాడు రామన్న: "షికారుకని బయల్దేరితే యిలా చిక్కుకుపోయాం, బాబూ. దేవుడు పంపినట్టు వచ్చారు మీరు. అయినా నా కంగారే కాని ఈ అమ్మ కసలెక్కడైనా తొణుకూ, బెణుకూ వుంటేనా?"
శ్రీహరి చెల్లెలివంక చూచాడు. నిశ్చలంగా ఏదో లోకంలో ఉన్నట్టున్నాయా చూపులు. ఎక్కడా చలనం లేదు. పదిరోజులై భోజనం చేసినట్టుంది వాలకం. 'మళ్ళీ ఏదో జరిగింది' అనుకున్నాడు శ్రీహరి. అప్పటికే ఇతర ప్రయాణికు లందరి దృష్టి వారిపైన ఉంది. అందుచేత శ్రీహరి మౌనం దాల్చాడు.
"వానవచ్చే సూచనలు మధ్యాహ్నంనుంచీ వున్నాయికదా? అసలిటువంటి రోజున పది మీద వాహ్యాళి ఏమిటి? వర్షం వస్తే దారి సరిగా వుండదనే భయంవల్లనే నేను స్కూటర్ ఆఫీసులో వదిలేసి లాంచీమీద బయల్దేరాను" అన్నాడు మెల్లగా.
ఆ బలమైన గాలికి మేఘా లెక్కడికో చెల్లాచెదురైపోయాయి. చినుకులు కొద్దిగా పడి ఆగిపోయాయి. జగాన్నలముకొన్న చీకట్లను పారద్రోలి, తిరిగి వెలుగు ఆవరించింది.
దేవీపట్నంలో లాంచి దిగేసరికి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. "జరిగిందేమీ ఇంటి దగ్గర చెప్పక్కర్లేదు" అన్నాడు శ్రీహరి గంభీరంగా, యింటికి నడిచే దారిలో.
"నాకు తెల్దేటి, బాబూ? చెప్పను" అన్నాడు రామన్న, శాంతి మాట్లడలేదు.
వెళ్తూనే శాంతి తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఏదో విపరీతం వినవలసి వస్తుందనే భయంతో ఇంట్లో ప్రవేశించిన శ్రీహరి తల్లిదండ్రుల ఆనందాలాస్య వదనావిందాలను చూచి ఆశ్చర్యపోయాడు. ఏమీ నిర్దారించుకోలేకపోయాడు.
రాత్రి భోజనాల దగ్గర తండ్రి నోటినుండి అసలు విషయం విని నిర్ఘాంతపోయాడు. తల్లి తండ్రులతోబాటు సంతోషించలేకపోయాడు.
"శాంతి ఏదీ?" అడిగాడు మెల్లగా.
"తర్వాత చేస్తానంది" అంది తల్లి.
తర్వాత చేస్తుందో, చెయ్యదో శ్రీహరికి తెలుసు. "రామన్నా, నేను భోజనం ఆపి కూర్చున్నానని శాంతితో చెప్పు. రాకపోతే నేనే వస్తాను."
"అదేమిటీ?" ఆశ్చర్యపోయారు లక్ష్మీదేవి, బలరామయ్యా.
"తర్వాత చెప్తాను" అన్నాడు ముక్తసరిగా శ్రీహరి.
పది నిమిషాలలో శాంతి వచ్చి మౌనంగా ఒక కుర్చీలో కూర్చుంది.
"అక్కడ కాదు. ఇటు రా" అన్నాడు శ్రీహరి.
ఒక్కక్షణం చూచి తప్పనిసరిగా లేచివచ్చి అన్నప్రక్కన కూర్చుంది.
"వడ్డించమ్మా దానిక్కూడా" అని తల్లికి చెప్తూ, "మ్రొక్కుబదిగా తింటే ఒప్పుకోవే, శాంతీ. నేనున్నానన్న సంగతి గుర్తుంచుకో" అన్నాడు చెల్లెలితో.
తలవంచి భోజనాని కుపక్రమించిన శాంతి నేత్రాలనుండి జలజలా అశ్రువులు రాలడం పద్మా, శ్రీహరీ తప్ప ఎవరూ గుర్తించలేదు.
భోజనం ముగిస్తూనే తండ్రి గదిలోకి వెళ్ళాడు శ్రీహరి. బలరామయ్యకు రాత్రిభోజనం కాగానే పడుకోవటం అలవాటు. శ్రీహరి వెళ్ళి తండ్రి ప్రక్కలోనే కూర్చుని మాట్లాడసాగాడు.
42
ఉదయం తండ్రి గదికి రెండుసార్లు వెళ్ళి గుమ్మంలోనుండే తిరిగివచ్చింది శాంతి. తెల్లవారుఝాము నాలుగు గంటలకే లేచే బలరామయ్య ఇవాళ ఉదయం ఏడైనా గది బయటకు రాలేదు; తలుపు తియ్యలేదు.
తల్లి ఒకచోట నిశ్చలంగా కూర్చుని ఉంది. ఆ కండ్లలో ఏదో నైరాశ్యం, నిస్పృహ...ఎప్పటి మాదిరిగా ఆమె ఇంటి పనులు నిర్వర్తించు కోవటములేదు; నౌకర్ల చేత ఆజ్ఞాపించి చేయించుకోవటమూ లేదు. వాళ్ళే తోచినట్టు చేసుకుపోతున్నారు.
"అమ్మా!" శాంతి పలకరించబోయింది. కాని, లక్ష్మీదేవి పలుకలేదు. ముఖం ప్రక్కకు త్రిప్పుకుంది. ఏం తోచక అన్నయ్య గదిలోకి వెళ్ళింది, శాంతి.
"ఇలా రా. కూర్చో" అన్నాడు శ్రీహరి. పద్మ మెల్లగా అక్కడినుంచి వెళ్ళిపోయింది.
శాంతి ఏదో చెప్పబోయింది. "అదంతా తర్వాత. ముందీ సంగతి చెప్పు. నిన్న అలా పది మీద వెళ్ళచ్చా?"
"......"
"నేను రాకపోతే ఏమయ్యేది?"
శాంతి కళ్ళెత్తింది. ఆ నేత్రాలలో తొలినాటి నిస్పృహ, నిర్లిప్తత లేవు. గంభీర నైర్మల్యం తొణికిసలాడుతూంది. "ఆ ప్రశ్నే లేదు. నువ్వలా రావలసివుంది. అంతే. జరగవలసిందేదో జరిగింది."
నిర్ఘాంతపోయాడు శ్రీహరి. "ఏమిటే ఈ ధోరణి?"
"అవునన్నయ్యా." నిశ్చలంగా అంది శాంతి. "నువ్వు నన్ను అన్నగా వాత్సల్యంతోనే కాదు, స్నేహితుడుగా ప్రేమతో అన్నీ తెలిసి ఆదరిస్తున్నావు, సలహాలిస్తున్నావు. నీదగ్గర నాకు సిగ్గు లేదు. సంకోచం లేదు." ఒక్కక్షణం ఆగి తిరిగి మొదలెట్టింది శాంతి. "నా మనస్సు మహాఅల్లకల్లోలంగా వుంది, మధ్యాహ్నం వరకూ."
"ఇప్పుడు కాదా?" మధ్యలో అడిగాడు శ్రీహరి.
"లేదు. చెప్తాను, విను. ఆరోజు సాయంత్రం నువ్వు నాకనేకం బోధించావు-జ్ఞాపక ముందా? ఆనాటినుంచి యీనాటివరాకూ నాకు సుఖమె లేదు, ఎవ్వర్నీ కాదనలేకపోతున్నాను. ఎటూ నిర్దారించుకోలేకపోతున్నాను. మనస్సు భీకర రణరంగమై పోయింది."
ఆశ్చర్యంగా వింటున్నాడు శ్రీహరి.
"సాయంత్రం మేడమీద నిల్చుని చూస్తోంటే నదిలో అనేక నావలు కన్పించాయి. అన్నీ నిర్మలంగా సాగిపోతున్నాయి. ఆ నది నిర్మలంగా వుంది కనుక అవలా నిశ్చింతగా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్నాయి. కాని పెనుగాలి వీస్తే, తుఫాను వస్తే అవి ఏమౌతాయి? అన్పించింది. నడిఏట్లో గిరగిరా తిరుగుతున్న నావ నా మనో పథంలో కన్పించింది. అవును, తుఫాను వీస్తే అంతేగా మరి? నాస్థితి అలాగే వుందనిపించింది. అందుకే ధైర్యంగా పరీక్షకు పెట్టాను నా జీవితాన్ని!"
"శాంతీ!" ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు శ్రీహరి.
గంభీరంగా, విషాదంగా నవ్వింది శాంతి. "అవును. ఆ సమయంలో, ఆకాశంచూస్తే మేఘావృతమైవుంది. కొద్దిసేపట్లో వర్షించగలదని ఎవరైనా గ్రహించగలరు. నడేట్లో నావలా వున్నా నా జీవితాన్ని ఏం చెయ్యను? ఇందుకు మానవప్రయత్నమా?, దైవప్రయత్నమా? ఏది కావాలి? అనే విషయం తేల్చుకో దలుచుకున్నాను. రామన్నను నావ కుదర్చటానికి రమ్మంటే, వద్దన్నా వినక నాతోపాటు నావ ఎక్కాడు. కొద్దిదూరం వెళ్ళగానే నా వూహ నిజమైంది. గాలి బయల్దేరి క్రమంగా అధిక మైంది. నదిలో కెరటాలు జోరైనాయి. నావికుడికి ఏమాత్రం లొంగడంలేదు. రామన్న సహాయం చేసినా వ్యర్ధమే అయ్యింది. ఇక ములిగిపోవడం తథ్యమని పడవవాడు కూడా నిర్దారించుకున్నాడు. నేనూ అలాగే అనుకున్నాను. రామన్న సరేసరి ఏడుపు మొదలెట్టాడు. అప్పుడు మీ లాంచి వచ్చింది. అందులో నువ్వున్నావు."
"అవును. నేను లేనిదే వాళ్ళు రారు. నేను దూరంనుండే గుర్తుపట్టి లాంచిని అటు పట్టించాను. వాడు మొదట్లో ఎవరో అనుకొని మనకెందుకు గొడవ అన్నాడు."
"అదే. అర్ధరాత్రైనా రోజూ స్కూటర్ మీద వచ్చేవాడివి. యివ్వాల లాంచి ఎక్కడ మేం?"
"నిజమే, శాంతీ. దేవుడే పంపాడు."
"అనే తెలుసుకున్నాను. నా విషయంలో నేనేమీ స్వయంగా ప్రయత్నించి నిర్ధారింప దలుచుకోలేదు. దైవమే వున్నాడు."
ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో తిలకించాడు శ్రీహరి. "ఎంతటిదానవై పోయావ్, శాంతీ!" ఒక్కొక్క అక్షరమే అతిబాధగా వెలువడిందతడి అంతరంగంనుండి.
"ఏమైతేనేం? నాకిప్పుడేబాధా లేదు. చాలా నిర్మలంగా వుంది, అన్నయ్యా" అంటూ లేచింది శాంతి.
"వెళ్ళిపోకు. ఇలా రా. ఏదీ, మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి సాహసం చెయ్యనని మాట యియ్యి." శాంతి మాట్లాడలేదు.
"ఏదీ?" చెయ్యి చాచాడు శ్రీహరి. ఒక్కసారి అన్న ముఖంలోకి చూచి మౌనంగా చేతిలో చెయ్యి వేసింది శాంతి.
"అయితే నాన్నగారింకా లేవలేదేమిటి? అమ్మ అదోమాదిరిగా ఉంది. చిన్నన్నయ్య ఏమైనా వ్రాశాడా?" అంది వెళ్ళిపోతూ.
"లేదు." గంభీరంగా అన్నాడు. "నీగురించే."
ముఖం చిట్లించింది శాంతి. "ఎందుకు? తను ఇష్టప్రకారమే కానిమ్మన్నాను కదా?" అంది తిరిగి వచ్చి కూర్చుంటూ.
"అవును. కానీ, చూడమ్మా, శాంతీ. నీలో ఏ బాధా లేదనుకుంటున్నావ్. కనీసం నా తృప్తి కోసం అలా చెప్తున్నావ్. కాని బాధకుకూడ ఒక హద్దు అంటూ వుంది. ఆ హద్దుమీరి విరక్తి ఏర్పడింది నీలో. అది బాధ సమసి పోవటంగా నీవు భ్రమిస్తున్నావ్. కాని, ఈ అతి విరక్తి ఎంత ప్రమాదమో తెలుసా?"
"కాదన్నయ్యా" అంటూ అడ్డు తగలబోయింది శాంతి.
"ఉండు, శాంతీ, నన్ను మాట్లాడనీ. నిన్ను పసిదానిగానే భావించి బుద్ధులు గరపబోతున్నాం. కాని, నీకూ ఒక వయస్సు వచ్చింది. తెలివైన దానవు. పెద్దవాళ్ళం నీకోరిక తీర్చడానికి బదులు, మూఢ విశ్వాసాలతో నీలో వేదన కలిగిస్తున్నామని బాధపడుతున్నాను. నలుగురూ నడిచిన బాటను విడచి క్రొత్త బాటపై నడవడానికి భయపడతాంకాని, యేమో - అదంతకంటే మంచిదేమో ఎవరెరుగుదురు?"
ఆశ్చర్యంగా వినసాగింది శాంతి.
"అవును, శాంతీ. పైకి నీకు బుద్దులు గరపుతున్నానే కాని నా మనస్సెంత క్షోభిస్తూందో నీకు తెలియదు. నీ లేతహృదయాన్ని గాయపరచుతున్నందుకు నేను నీకంటే కుమిలిపోతున్నాను." శ్రీహరి గొంతు వణికింది.
"అన్నయ్యా!" శ్రీహరిని చుట్టేసింది శాంతి అశ్రునయనాలతో.
"అవును, శాంతీ. అన్నయ్యవే." మృదువుగా శాంతి తల నిమిరాడు శ్రీహరి. "అన్న చెల్లెలు కోర్కెను, ముద్దుముచ్చట్లను తీర్చాలికాని నాశనం చేయకూడదు. ఎవరి అండ వున్నా లేక పోయినా నా అండ నీకుంటుంది. అమ్మనూ, నాన్నగార్నీ కూడ ఒప్పించాగలననే ధైర్యముంది. ప్రపంచ మేముంటుందో అనే భయంతో ముందు వాళ్ళే భయపడే పిరికి పెద్ధమనష్యుల సంగతి వదిలెయ్యి. నువ్వు మా బిడ్డవు. మాకు లోకం కాదు; నీ సుఖశాంతులు ముఖ్యం. లోకంకోసం నిన్ను దూరం చేసుకోము."
"నిజమా, అన్నయ్యా?"
"నిజం, శాంతీ." చెల్లెలి తల సాంత్వనగా నిమురుతూ అన్నాడు, శ్రీహరి. "మన సంస్కృతి, సంప్రదాయం అంటాం కానీ ఏమిటి మన సంస్కృతి? రుక్మిణీకళ్యాణం, దమయంతీ స్వయంవరం - ఏమిటివన్నీ? క్షత్రియ కన్య రుక్మిణి యాదవుడైన శ్రీకృష్ణుని వివాహమాడింది. అందువల్ల ఆమె స్వజనమంతా నాశనమయ్యారు. ఆ చరిత్రే మనకు తల మానికమూ, ముక్తిదాయకమూ అయింది. అటువంటి గ్రంథాలను పూజిస్తూ, ఇంట్లో ఒక్కసారిగా పాత ఆచారాలను వదిలిపెట్టలేరు మరి. అదంతా నేను చూచుకుంటాగా? నువ్వు మాత్రం ఒక పని చెయ్యి. మనం వస్తున్నట్టు, మన మెందుకులే, నువ్వు వస్తున్నట్టు గోవిందరావు గారికి వ్రాయి. కలకత్తాలో ఫలానా హోటల్లో కలుసుకొమ్మని వ్రాయి. అతనితో అంతా నేను మాట్లాడతాను."
ఆనందంతో ఉర్రూతలూగుతున్న అంత రంగంతో శాంతి యిక మాట్లాడలేక పోయింది. 'గోవిందరావుగారు!' అప్పుడే కాబోయే బావగారిపై ఎంత గౌరవం!
సాయంత్రం తలుపు తీసుకుని బయటికివచ్చిన బలరామయ్య ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడ లేదు. ముఖంమాత్రం పీక్కుపోయి అస్వస్థత చేసినట్టు ఉంది. శాంతి భయపడి గది బయటకు రాలేదు. కాని వెదుక్కుంటూ ఆయనే వెళ్ళాడు.
ప్రపంచాన్నంతనూ జయించినంత సంతోషంగా ఉంది. ఇలా జరుగగలదని కలనైనా అనుకుందా? ఎంతటి అదృష్టం! గోవిందరావు పొంగిపోతాడు. ఓ! అతడూ, తనూ ఈ శాంతి వనంలో, నదీసైకతాలలో ఎంత హాయిగా గడపవచ్చు! అతడి మురళీవాదానికి శాంతివనమే పరవశమై పల్లవిస్తుంది.
"డియర్ రావ్,
ఏం వ్రాస్తావో చెప్పుకో, చూద్దాం! ఊహుఁ నీతరం కాదులే, నాకు తెలుసు. మంచి శుభవార్త పట్టుకొస్తున్నాను. 27 వ తారీఖున వస్తున్నాను. అంతవరకూ కలలుకంటూ వుండు. ఏమిటో తెలుసుకోవాలనుంది కదూ? ఊహుఁ. అంత సులభంగా చెప్పానుగా?
శాంతి."
