Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 34


    అతను ఎంతసేపటికి రాక పోయేసరికి స్టూడియోకి ఫోన్ చేసిందామె.
    "ఇవాళ అసలు షూటింగ్ జరగలేదండీ! కాన్సిలయింది...." చెప్పాడు మేనేజరు.
    "మరి కౌశల్ ఎక్కడికెళ్ళారు?"
    "హోటల్ త్రీకాజల్స్ కెళుతున్నట్లు చెప్పారెవరో...."
    "సరే....."
    వెంటనే కార్లో హోటల్ కు బయల్దేరిందామె. హోటల్ గదిలో ఫ్రెండ్స్ తో కూర్చుని తాగుతూండి ఉంటాడు అనుకుందామె.
    హోటల్ రిసెప్షనిస్ట్ రూమ్ నెంబర్ చెప్పాడామెకి. లిఫ్టులో పైకెళ్ళి రూమ్ తలుపు తట్టిందామె.
    తలుపు తెరచుకోలేదు. అయిదు నిమిషాలు కాలింగ్ బెల్ నొక్కుతూ తలుపు కొడితేగాని అతను తలుపుతీయలేదు. బయట చంద్రికను చూస్తూనే కలవరపడ్డాడతను.
    "ఏమిటిలా వచ్చావ్?" అన్నాడు అక్కడే నిలబడి.
    చంద్రిక అతనిని తప్పుకుని లోపలకు నడిచింది. అక్కడ మంచంమీద బట్టలు సర్దుకుంటూ కూర్చుని వున్న శైలజను చూడగానే విషయం అర్ధమయిపోయిందామెకి. శైలజ సినిమాల్లో క్లబ్ డాన్స్ లు చేసే యువతి.
    "నేను వెళుతున్నాను...." అనేసి త్వరత్వరగా బయటకు నడిచి కార్లో మళ్ళీ ఇంటికి చేరుకుంది.
    ఆమెకు అంతవరకూ కౌశల్ మీదున్న అభిప్రాయాలన్నీమారి పోయాయ్ ఇప్పుడు.
    కౌశల్ కి తన పరిస్థితి ఆందోళన కలిగించింది.
    తన దగ్గర 'తనది' అన్న డబ్బేమీలేదు. చంద్రికసన్మానం కోసం విజయవాడ వెళ్ళిన ఈ రెండురోజుల్లోనే చంద్రిక డబ్బు రేసులకు షుమారు రెండులక్షలు ఖర్చు చేశాడు తను. కానీ అది తనడబ్బు అంచేత ఎప్పుడూ ఆ విషయమై చింతించలేదు. రేసులాడడం మానివేయాలని నిర్ణయించుకున్నాడతను. లేకపోతే తనతోపాటు చంద్రికకూడా నష్టపోతుంది.
    రాన్రాను చంద్రికకు కూడా సినిమాలు తగ్గిపోవడంతో కౌశల్ కి ఆందోళన కలిగింది.
    "చంద్రికా! నిన్ను మళ్ళీ బూస్ట్ చేయాలంటే మరోమాంచి సినిమా ఒకటి రిలీజవాలి. అందులో అందరూ నీ నటనే ఉన్నతంగా వుందనిపొగడాలి. అప్పుడు గాని మళ్ళీ జనమంతా నీచుట్టూ తిరగరు" అన్నాడతను.
    "కానీ అలాంటి మంచిసినిమా ఎవరు తీస్తారుమరి?" నవ్వుతూ అంది చంద్రిక.
    "ఎవరేమిటి మనమే!"
    "అది సక్సెస్ అవుతుందన్న నమ్మకమేదీ?"
    "కమర్షియల్ వాల్యూస్ తో తీస్తే తప్పక సక్సెస్ అవుతుంది. నాకా నమ్మకంవుంది......"
    "ఏమో నీ ఇష్టం! ఆలోచించి ఓ నిర్ణయానికి రా!" అతనికికే వదిలేసిందామె.
    అతను ఎంతగా ఆలోచించినా సినిమా తీయాలనేకోరికే ప్రబలమయిపోతోంది రోజు రోజుకీ! ఈ సినిమాకు తనే డైరెక్టరుగా వుంటాడు. దాంతో అటు చంద్రికకూ బూస్టవ్. ఇటు తన కెరీర్ డైరెక్షన్ వేపు మారుతుంది. అయితే తన దగ్గర డబ్బేమీలేదు. అంతా చంద్రిక డబ్బే ఖర్చు చేయాల్సి వస్తుంది.
    ఆమె డబ్బు అదివరలా తీసుకోవాలంటే అయిష్టంగా వుంటోంది. కారణం ఆరోజు తననూ శైలజనూ హోటల్ గదిలో చూసినప్పటినుంచీ చంద్రిక ప్రవర్తనలో ఏదో మార్పువచ్చింది.
    "అసలు ఎంత కావాలి సినిమాతీయడానికి?" అడిగిందామె.
    "అది మనం తీయబోయే సినిమా మీద ఆధారపడి వుంటుంది. నేననుకున్న సబ్జెక్టు అయితేయాభై లక్షలతో అయిపోతుంది...."
    "అలాగయితే సమస్యేముందీ?" తేలికగా అందామె.
    ఆమెకు నిజానికి తన ఎకౌంట్ లో ఎంత డబ్బుందో తనకే తెలీదు. రెండుకోట్లకు పైన వున్నట్లు గుర్తు.
    ఆ తరువాత ఎకౌంట్ ఇద్దరూ ఆపరేట్ చేయడం మూలాన ఎంత ఖర్చయింది, ఎంత ఉన్నదీ కూడా తెలీదు. కౌశల్ పరిస్థితి కూడా అంతే! ఆమె దగ్గర ఎంత డబ్బుందీ అతనేనాడూ పట్టించుకోలేదు. సినిమా తీయాలన్న నిర్ణయం జరిగిపోయింది.
    ఆరోజు సాయంత్రమే కౌశల్ కి ఫోన్ వచ్చింది.
    "ఎవరు? అడిగాడు కౌశల్.
    "నేను- సుజాతను!"
    అతను వులిక్కిపడ్డాడు.
    "ఎక్కడినుంచి?
    "హోటల్ సుదర్శన్ నుంచి!"
    "ఎవరెవరు వచ్చారు?"
    "నేనూ పిల్లలూ!"
    "ఇప్పుడే వస్తున్నాను- రూమ్ నెంబరెంత?"
    చెప్పిందామె.
    అతను కార్లో హోటల్ కి చేరుకున్నాడు. సుజాత అతనిని ఓ పరాయి వ్యక్తిలా చూచి చూపులు మరల్చుకుంది. కౌశల్ సోఫాలో కూర్చుని పిల్లలవేపు చూశాడు. పిలవగానే పెద్దమ్మాయ్ దగ్గరకొచ్చిందిగాని, ఆరేళ్ళ రెండో పిల్ల ఏడుస్తూ వాళ్ళమ్మ దగ్గరకు పరుగెత్తింది.
    "ఎప్పుడొచ్చావ్?" అడిగాడతను.
    "గంటవుతుంది."
    "ఉత్తరమైనా రాయకుండా వచ్చావేం?"
    "రాస్తే - స్టేషన్నుంచే వెనక్కు పంపుతారేమోనని" ఆమె కోపం చూస్తే అతనికి నవ్వొచ్చింది.
    "ఎందుకు పంపుతాను?"
    "ఇప్పుడు నా అవసరమేముందిమీకు? అన్ని విధాల నన్నుమించినావిడే ఆదుకుంటోందిగా."
    "సుజాతా! మరీ అన్యాయంగా మాట్లాడకు! నీ అంతట నువ్వే పోట్లాడివెళ్ళిపోయావ్ గాని నేను నిన్నువెళ్ళిపొమ్మని చెప్పేనా?"
    "ఎందుకు చెప్తారు? మీరు చేసే పనులు మాత్రం నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తాయ్?"
    "ఇప్పుడా గొడవలన్నీ ఎందుకు! ఇంతకాలం తర్వాత కలుసుకున్నాం. సౌమ్యంగా మాట్లాడుకుంటే బావుండదూ?"
    ఆమె కన్నీరు పెట్టుకుంది హఠాత్తుగా అతను ఆమెను చూసి జాలిపడ్డాడు. తన మూలానే ఆమెకీ మనక్లేశం అన్న విషయం గుర్తుకొచ్చిందతనికి.
    అప్పుడు తనకీ రాజ్యలక్ష్మి అనే అమ్మాయికీ ఏర్పడ్డ చనువువల్ల గొడవలొచ్చాయ్. లేచి సుజాత దగ్గరకు నడిచాడతను "సుజీ! జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడెందుకు కన్నీరు?" అన్నాడు దగ్గరకు తీసుకుంటూ.
    "కన్నీరు కాకేముందండీ! నేను చచ్చిపోయాననుకునేమీరామెను వివాహం చేసుకుందీ?" దుఃఖంతో నిండిన స్వరంతో అడిగిందామె.
    "సుజీ! నేను చంద్రికను వివాహం చేసుకున్నంత మాత్రాన నీకు అన్యాయం జరుగుతుందనీ, నిన్ను మర్చిపోయాననీ కాదు. నిన్నే నాడూ నేను తక్కువగా చూడలేదు. నీ మీద నాకున్న ప్రేమాభిమానాలు అప్పటికీ ఇప్పటికీ అలానే వున్నాయి. ఏ రోజుకయినా నువు తప్పక వస్తావని నాకు తెలుసు" ఆమె అతని కౌగిట్లో వదిగిపోయింది.
    రాత్రి అందరూ కలసి అక్కడే భోజనాలు చేశారు.
    "ఇప్పుడు మేమెక్కడవుండాలో చెప్పండి" అందామె.
    "నీ ఇష్టం! నీకెక్కడ వుండాలని వుంటే అక్కడే."
    "మన కోసం వేరే ఇల్లు తీసుకోండి."
    "సరే! అలాగే తీసుకుంటాను"
    "అంతేకాదు! మీరు రోజూ నా దగ్గరే వుండాలి"
    "అలా అడగడం భావ్యంకాదు సుజాతా! నా వీలునుబట్టి ఎక్కడో చోట వుంటాను"
    "అంటే మళ్ళీ అదివరలా రోజుల తరబడికనబడకుండా వుంటారన్నమాట"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS