Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 35


    విజయగర్వంతో స్త్రీలంతా నవ్వారు. మగవాళ్ళు శివాను పట్టుకుని హాస్యాలాడుతూ తిడుతున్నారు.
    
    నన్ను ఇంట్లోకి తీసుకొచ్చారు.
    
    పొడిబట్టలు కట్టుకున్నాను.
    
    నా చొరవకు స్త్రీలు నన్ను పొగుడుతూనే ఉన్నారు.
    
    మధ్యాహ్నమైంది.
    
    నన్ను, నా భర్త దగ్గర కూర్చోబెట్టి వడ్డించారు. నా పక్క స్త్రీలూ, ఆయన పక్కన మగవాళ్ళూ కూర్చున్నారు ముందుగా వడలు వేశారు.
    
    "కానీ తినమ్మా" శివ పక్కనున్న వ్యక్తి తొందర చేశాడు.
    
    "కొద్దిగా నలుపున్న వడలు తినద్దు అందులో బొగ్గులు పెట్టారు. ఎర్రగా వున్న వాటినే తిను" ణ ఆపక్కన కూర్చున్న శివా వదిన హెచ్చరించింది.
    
    నాలుగు వడల్లో రెండు అక్కడక్కడా నల్లగా వున్నాయి. మిగిలినవి ఎర్రగా వున్నాయి. వాటిని తుంచి తినడం ప్ర్రారంభించాను.
    
    ఆయన వడను తుంచి కొరికాడో లేదో కరకరమని ఏదో విరిగిన శబ్దం వచ్చింది. అందరూ గొల్లున నవ్వారు.
    
    బొగ్గు కొరికాడని వూహించాను.
    
    "జాగ్రత్తగా తినమన్నాను గదరా! ఇందులోనూ మనం ఫెయిలేనే" పక్కనున్న వ్యక్తి తలపట్టుకున్నాడు.
    
    నాకూ నవ్వాగింది కాదు.
    
    అలా హాస్యాన్నీ, వ్యంగ్య సంభాషణల్నీ, చలోక్తుల్నీ నంజుకుంటూ భోజనాలు ముగించాం.
    
    మధ్యాహ్నం అలా కునుకు తీసానో లేదో లేపేశారు.
    
    అప్పటికే తాంబూలం వేసుకున్న ఆకాశం నోరు తెరిచినట్లు సంధ్య పరుచుకుని వుంది.
    
    మనం వసంతాలు పోసుకున్నది ఇక్కడా? ఆకాశంలోనా అని ఆ ఎర్రటి కాంతిని చూస్తూ నా భర్తని అడగాలనిపించింది.
    
    స్నానంచేసి లైట్ గ్రీన్ కోటా చీర కట్టుకున్నాను.
    
    ఎందుకనో విచిత్రంగా గత రెండురోజుల నుంచి బ్రా పట్టడం లేదు.
    
    బ్రాసైజు తగ్గిందో, ఎదసైజు పెరిగిందో తెలియడం లేదు.
    
    ఏదో తంటాలు పడి బ్రా వేసుకుని జాకెట్ వేసుకున్నాను.
    
    లోకంలోకి వచ్చిన కొత్త అతిధిలా మసక చీకట్లు కమ్మేసాయి. పందిట్లో పెట్రోమాక్స్ లైట్ రెక్కలు లేకపోవడంతో ఎగరలేని పుష్పక విమానంలా వుంది. దాని షేప్ అలా ఉంది. మరి కరెంట్ పోతే స్టాండ్ లైట్ వుంటుందని దాన్ని తెచ్చారు.
    
    పెంకుటిల్లుకు ఎదురుగా ఓ చిన్న గుడిసె వుంది. వంటా కార్యక్రమమంతా అక్కడే కాబోలు వంట పాత్రలన్నీ అంగట్లో పరిచినట్లున్నాయి. మధ్యలో పెద్ద పందిరి వేసారు. అక్కడ ఓ పొడుగాటి స్టూల్ అమర్చారు. దానిమీద పూలపూల దుప్పటి పరిచారు.
    
    అటువేపు ఇటువేపు రెండు పెద్ద దిండ్లు వుంచారు. మరికాసేపట్లో పూలచెండ్ల ఘట్టం ప్రారంభమవుతుందని తెలిసింది.
    
    మధ్యలో వున్న చామంతుల చెండు పసుపు ముద్దలా వుంది.
    
    ఏడుగంటల ప్రాంతంలో నన్ను తీసుకెళ్ళి బెంచీకి ఓవైపు కూర్చోబెట్టారు. ఆయన వచ్చి మరో చివర కూర్చున్నారు. ఊర్లోని స్త్రీలంతా మా చుట్టూ నిలుచున్నారు. వాళ్ళను చూస్తుంటే మా వూరిలో దోబీ ఏట్లో ఆరబెట్టిన చీరలు గుర్తు వచ్చాయి.
    
    అక్కడక్కడ పురుషులు తెల్లటి బట్టల్లో పూలదండల మధ్యలో సంపెంగల్లా కనిపించారు.
    
    ఆయన పూలచెండును చేతిలోకి తీసుకుని నా ముందుకు విసిరాడు. నేను దాన్ని పట్టుకుని తిరిగి ఆయన మీదకు విసిరాను. ఆయన దాన్ని పట్టుకోలేకపోయారు.
    
    చుట్టూ వున్న స్త్రీలు చప్పట్లు చరిచారు మగవాళ్ళు ఆయన్నేదో అంటున్నారు.
    
    రెండోసారి ఆయన చెందు విసిరాడు. అది పట్టు తప్పింది.
    
    సూటిగా నా ఎదమీద పడి కిందకు దిగింది. మొత్తం నా ఇరవై ఏళ్ల యౌవనాన్ని ఒక్కసారిగా వేళ్ళతో మీటినట్లయింది.
    
    చుట్టూ వున్న వాళ్ళంతా మాయమైపోయి ఆయన్ను గట్టిగా కౌగిలించుకోవాలన్న కోరిక నా సిగ్గును మరింత ఎరుపు చేసింది.
    
    మరో అరగంటకు కార్యక్రమం ముగిసింది.
    
    భోజనాలయ్యాయి బలవంతంమీద తాంబూలం వేసుకున్నారు. నానోరు ఎలా పండిందంటే మందారాల మొగ్గల పొడితో నాలుకను చేసినట్లనిపించింది.
    
    తొమ్మిదిగంటలకు తెల్లటి చీరలోకి మారిపోయాను. పెంకుటింట్లో శోభనం ఏర్పాటు చేసారు. పెద్ద  నవారు మంచం మీద పరుపు వేసారు. దానిమీద మల్లెలు, చేమంతులు చల్లారు. వెలిగించిన అగరు ఒత్తులు ఇల్లంతా తెల్లటి పొగ మేఘాలను సృష్టిస్తోంది.
    
    నన్నూ, ఆయన్నీ తలుపు దగ్గర నిలబెట్టారు.
    
    "పెళ్ళికూతురా! మీ ఆయనపేరు చెబితేనే నిన్ను లోపలకు వెళ్ళనిచ్చేది" అంది ఓ యువతి.
    
    ఆయన పేరు చెప్పాలంటే చచ్చేంత సిగ్గేసింది. అందుకే నోరు పెగలలేదు.
    
    "సిగ్గుపడడానికి ముందు ముందు చాలా ఘట్టాలున్నాయి. ఇప్పుడే వద్దు" ఆమే అంది.
    
    అందరూ ఘోల్లున నవ్వారు.
    
    "చెప్పమ్మా! భర్త పేరు చెప్పడానికి భయమేమిటి?" మరో ఆమె ఉత్సాహాన్నిచ్చింది.

    ఇక తప్పదని మెల్లగా "శివరామ్" అన్నాను.
    
    "మాకు వినపడలేదోచ్చ్" వెనుకనున్న ఎవరో అరిచారు.
    
    "గట్టిగా చెప్పాల్సిందే" మళ్ళీ వెనకనున్న వాళ్ళే పట్టుబట్టారు.
    
    నోరు ఫ్రీగా తెరిచి చెప్పాను.
    
    "శివరామ్"
    
    మరి కొన్ని గొంతులు అరిచాయి 'వినపడలేదు'
    
    "పోనీలెండి ఇక పెళ్ళి కుమారుడ్ని తన భార్య పేరు చెప్పమనండి"
    
    ఆయన కాస్తంత గట్టిగానే 'మహిత' అన్నారు.
    
    "అదీ! మగవాడనిపించుకున్నావ్" మగవాళ్ళు మెచ్చుకున్నారు.
    
    "ఇప్పుడే సర్టిఫికేట్ లు ఇచ్చేయకండి. ఆ సర్టిఫికేట్ ఇవ్వవలసింది పెళ్ళికూతురు" ఎవరో అంటే స్త్రీలంతా సిగ్గుసిగ్గుగా నవ్వారు.
    
    "ముందుంది ముసళ్ళ పండగ"
    
    "ముసళ్ళ పండగ కాదు మొగలిపూల పండగ"
    
    "మా ఆడపడుచు లాంచణాలు చెల్లించుకుంటే ఇక మిమ్మల్ని గదిలోకి పంపిస్తాం. పాపం మా వదినకు చాలా తొందరగా ఉన్నట్లుంది" నా ముందున్న అమ్మాయి ఆయనవేపు తిరిగి అంది.
    
    పెళ్ళిలో వుండే బలమూ, బలహీనతా అదేననుకుంటా.
    
    పెళ్ళికి ముందు నిషిద్ధమైనవన్నీ ఇప్పుడు ఫ్రీగా మాట్లాడేసుకోవచ్చు! ఎవరూ తప్పు పట్టరు.
    
    పెళ్ళికి ముందు సెక్స్ అంటేనే వేయికాళ్ళ బూచీలా భయపెడుతుంది.
    
    మనం ఏదయినా చేస్తే ఊరంతా మనల్ని ఆడిపోసుకుంటుంది. ఆ మూడు ముళ్ళూ పడిపోతే అదే ఊరు మనల్ని మగవాడితో గడపమని గదిలోకి నెడుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS