Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 34


    
    మా నాన్న అప్పటికి ఊపిరి పీల్చుకున్నాడు కట్నం లేదనగానే ఆయన ఉత్సాహంగా మాట్లాడాడు. మేం పడుకునేసరికి రాత్రి పదకొండు గంటలయింది.
    
    పదిరోజులు గడిచాయో లేదో పెళ్ళివారు దిగారు. పెళ్ళివారంటే ఎంతోమంది లేరు. పెళ్ళికొడుకూ, అతని తల్లీ, మధ్యవర్తీ వచ్చారు.
    
    పెళ్ళికొడుకుని చూడగానే నేను పులకరించిపోయాను. చాలా అందంగా వున్నాడు. ఎర్రగా, నాజూగ్గా అచ్చు సినిమా హీరోలా వున్నాడు. ఆ నూనూగు మీసాలు తీసేస్తే ఆడపిల్లలా వుంటాడనిపించింది. అంత స్మూత్ గా వున్నాడు.
    
    చదివింది పదో తరగతి అయినా ప్యాంటూ, షర్టూ టక్ చేసుకుని స్టయిల్ గా వున్నాడు.
    
    నేను ఎదురుపడ్డప్పుడంతా తల వంచుకున్నాడు. అతని బిడియము చూసి నేను చాటుగా నవ్వుకున్నాను. ఆడపిల్లలా సిగ్గుపడడం చూసి ఆనందించాను. అతన్ని ఏడిపించాలని మరీ మరీ ఎదురుపడ్డాను.
    
    వాళ్ళు వెళ్లి ఉత్తరం రాశారు.
    
    పెళ్ళికూతురు నచ్చిందనీ, ఏదో ఉన్నంతలో నగలు పెట్టి, పెళ్ళి జరిపిస్తే చాలని అబ్బాయి తల్లి ఉత్తరం రాసింది. మా వాళ్ళూ ఒప్పుకున్నట్లు ఉత్తరం రాశారు.
        
    మా పెళ్ళి రావూరులోనే సింపుల్ గా జరిగిపోయింది. దానికైనా నాన్న శ్రమ పడాల్సి వచ్చింది. పెళ్ళి అయిందంటే అయిందనిపించేశాడు.
    
    "పెళ్ళి ఇక్కడ జరిగింది కాబట్టి మిగిలిన ముద్దూ, ముచ్చటంతా మా ఊర్లో జరిపిస్తాం అన్నయ్యా" అడిగింది మా అత్తమ్మ నాన్నన్ని.
    
    మరో రెండు రోజులు పెళ్ళి వాళ్ళుంటే ఎంత కష్టమో తెలిసిన నాన్న దానికి సంతోషంతో ఒప్పుకున్నాడు. దాంతో ఆ సాయంకాలమే మేము బయల్దేరి నాగలాపురం దగ్గర్లోని పల్లెటూరుకు చేరిపోయాం.
    
    ఆ ఊరు బాగుంది. బస్ దిగి నాలుగు ఫర్లాంగులు నడిస్తే ఊరిలోకి చేరుకుంటాం. వీధంట నేను నడుస్తుంటే జనమంతా నన్ను పరిశీలించి చూశారు. ఇద్దరు ముగ్గురు అమ్మలక్కలు నాకు వినబడేటట్లే కామెంట్ చేశారు కూడా. ఆ పొగడ్తలకు నేను గర్వంగా ఫీలయ్యాను. చిన్నపిల్లలయితే గుంపులుగా నా వెనకే నడిచారు. పల్లెటూళ్ళలో కొత్త వాళ్ళొచ్చినా, ఏదయినా వాహనం వచ్చినా పిల్లలంతా గుమిగూడిపోతారు.
    
    మా భర్త ఇల్లు వీధికి చివరలో కాస్తంత దూరంలో వుంది. ఎత్తు ప్రదేశంలో ఎర్రమట్టి ముగ్గులా అందంగా వున్న ఆ ఇల్లును చూసి నా అంత అదృష్టవంతురాలు ప్రపంచంలో మరి ఎవరూ వుండరనిపించింది.
    
    వాళ్ళ ఆచారం మేరకు వసంతాలు, పూలచేళ్ళూ తతిమ్మా కార్యక్రమాలయ్యాకే శోభనం అనీ, ఇక ఆ రోజు వీలు కాదనీ, మరుసటి రోజు ఫస్ట్ నైట్ అనీ తెలిసింది.
    
    ఇక ఆ సాయంకాలమంతా నేను నా ఇల్లు అంతటినీ పరిశీలిస్తూనే వుండిపోయాను.
    
    బాగా అలసిపోవడం వల్ల భోజనాలు కాగానే అందరమూ పడుకుండి పోయాం.
    
    ఉదయం నిద్ర లేవగానే ఒక్కో ముచ్చటా ప్రారంభమయింది. నన్నూ, నా భర్తనూ ఊరేగింపుగా గుడి దగ్గరికి తీసుకెళ్ళారు. ఊరుకు తూర్పుగా శివాలయం. దాని ముందు చిన్ని గుంట అక్కడ టెంకాయ కొట్టించి, హారతి ఇప్పించారు. తిరిగి ఊరేగింపుగా ఇంటికొచ్చాం. ఊరిజనమంతా ఇళ్ళ ముందు నిలబడి కొత్తజంటను చూశారు.
    
    ఇవన్నీ ఎంత బావుంటాయో! కానీ ఇప్పుడు అలా ఊరేగింపులన్నీ జరగడం లేదు. కాలంతో పాటే ఈ ముచ్చట్లన్నీ మాయం అయ్యాయి. కొత్త ఊరిలో, కొత్త వ్యక్తి చిటికెన వేలు పట్టుకుని అందరి ముందూ నడవడం, సిగ్గుతో కాళ్ళు తడబడడం, జనం ఏమనుకుంటున్నారో వినాలన్న ఆతృతతో చెవులు రిక్కించడం, కళ్ళు ఆనందంతో టపటపా కొట్టుకోవడం, మధ్య మధ్యలో పెళ్ళికొడుకు తన చిటికెన వేలును గట్టిగా అదమడం - ఇవన్నీ అద్భుతాలు కానీ ఇప్పుడు ఇలాంటి ఆనందాలన్నిటికీ దూరమయ్యాం.
    
    పావుగంటలో పెళ్ళి అయిందనిపించేసి, పొద్దుగుంకడం తరువాయి పడక ఎక్కించేస్తున్నారు ఇప్పుడు.
    
    మేం ఇంటికి రాగానే వసంతాలు కార్యక్రమం కోసం అన్నీ రెడీ చేశారు.
    
    వీధిలో రెండు పెద్ద అండాలు పెట్టారు. వాటిట్లో నిండుగా నీళ్ళు పోసి సున్నమూ, పసుపూ కలిపారు. నీళ్లన్నీ కాషాయం రంగులోకి మారాయి.
    
    "ఏమీ సిగ్గుపడకు నీళ్లన్నీ మా అన్నయ్య మీద పోసి ఉక్కిరి బిక్కిరి చేసేయ్"
    
    "మా బావకు మరీ బిడియం. అందుకే నువ్వు యాక్టివ్ గా వుండి నీదే పైచేయి అనిపించుకో"
    
    "ఆడవాళ్ళు ఎందులోనూ తగ్గరని నువ్వు నిరూపించాలి" యిలా నలుగురయిదుగురు స్త్రీలు నన్ను వసంతాల దగ్గరికి తీసుకెళ్తూ ఆ రంగు నీళ్ళని విజ్రుంభించి పోయాలని చెప్పారు.
    
    ఓ పెద్ద పాత్ర దగ్గర నన్ను నిలబెట్టారు. ఎదురుగా మరో పాత్ర దగ్గర ఆయన వున్నారు.
    
    మొదటి ఛాన్స్ నాకే ఇప్పించారు స్త్రీలంతా కలిసి.
    
    ఒకామె నాకు వసంతం నిండిన చెంబు అందించి "కానీ" అంది చుట్టూ బంధువులూ, ఊరి జనం పూల తడికలా నిలబడ్డారు. అంతమంది ముందు ఆయన తలమీద నీళ్ళుపోయడం తగని సిగ్గనిపించింది నాకు.
    
    అందుకే కళ్ళెత్తకుండా చేతులు మాత్రమే పైకెత్తి చెంబు కుమ్మరించాను. ఆయన నాకంటే గుప్పెడు పొడుగు. అందుకే ముఖం మీద పడ్డాయి నీళ్ళు.
    
    ఇక ఆయన వంతు.
    
    తమాషా ఏమిటంటే ఆయన నాకంటే మరింత సిగ్గు పడుతున్నాడు.
    
    క్రీగంట చూస్తున్న నాకు వసంతంకన్నా ఆయన ముఖమే సిగ్గుతో మరింత ఎర్రగా అనిపించింది.
    
    ఆయన రెండడుగుల్లో నన్ను చెరి తలమీద పోశాడు. ఎక్కడెక్కడో నా రహస్య అవయవాల్లో నీళ్ళు పాకి ఆయన నీళ్ళకు బదులు వేళ్ళను జార్చి, అక్కడంతా రాస్తున్నట్లుగా గిలిగింత నన్ను ఊపింది.
    
    నేనో చెంబు, ఆయనో చెంబు పోసుకున్నాం. చివరికి వచ్చేసరికి నా చుట్టూ చేరిన స్త్రీలంతా "ఎత్తుకో మొత్తం పాత్ర కుమ్మరించు" అని అరుస్తున్నారు.
    
    ఆయన వేపు చేరిన మగవాళ్ళంతా ఆయన్నీ అలా చేయమని ఉత్సాహపరుస్తున్నారు.
    
    నేను పాత్ర నెత్తుకొని మొత్తం కుమ్మరించాను. ఆయన పూర్తిగా తడిసిపోయారు.
    
    సున్నం, పసుపూ కలిపినా నీళ్ళు కావడంతో ఆయన కళ్ళు నులుముకుంటున్నాడు.
    
    "షేమ్ రా శివ! ఆడవాళ్ళ ముందు మన మగవాళ్ళ పరువు తీశావు గదరా ఇప్పటికన్నా అందా ఎత్తుకుని కుమ్మరించు" మగాళ్ళు తొందర చేస్తున్నారు.
    
    కళ్ళంతా శుభ్రంగా తుడుచుకుని ఆయన దగ్గరికి వచ్చేసరికి స్త్రీలు నన్ను టక్కున వెనక్కి లాగారు. నీళ్లన్నీ కిందనే ఒలికిపోయాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS