14
'శాంతమ్మ గోరు మన చిన్నయ్యగోర్ని పెళ్లాడరంట....!'
'ఇదేం యిడ్డూరం....? ఆరు పుట్టిన కాడనుండీ ఆరిద్దరూ అలుమగలని అనుకుంటుండారు గంద....!'
'మరి అమ్మాయి గోరు వోర్నీ పెడ్లాడ్తారంట?'
'ఆ డాకటేరు గోరు లేరూ? రంగయ్య తాత సిన్న కొడుకు. ఆర్ని పెళ్లాడతారట!"
"వోరు సేప్పినార్రా.......నీకు?'
"ఒకరు సేప్ప్దేదేందిరా? ఊరు ఊరంతా కోడై కూస్తుంటేనూ....!"
లక్ష్మయ్య గారి పాలేర్లు వారి దొడ్లో సామావేశమై మాట్లాడు కుంటున్నారు. దూరంగా పెద్ద పాలేరు పుల్లయ్య రావడం గమనించిన వారు గగప్ చుప్ గా కూర్చున్నారు. అంతకు ముందు ఏదో మాట్లాడుతూ ఉండి, తను రావడం గమనించి , అంతా బెల్లం కొట్టిన రాళ్ళ లాగా మూతులు ముడుచుకొని కూర్చోవడం అతనిని విస్మయాన్ని కలిగించింది.
"ఏందిరా.........? ఏదో సమాయేశం ఏర్పాటు చేసిండ్రు?' అన్నాడు పుల్లయ్య.
ఒకరి ముఖాలు మరొకరు చూసుకో సాగారు-------'
'మాట్లాడరేంరా ........?' గద్దించాడు.
"సెప్పండిరా......!' అందులో ఒకడన్నాడు.
'మనకెందుకు లెద్దూ.....పెద్దోల్లతో యవారం' నసిగాడు అసలు దీనికంతకూ మూల కారకుడైన పాలేరు.
'అసలు యిసయమెందో సెప్పి సావండేహ....!' విసుగు పడుతూ అన్నాడు పాలేరు పుల్లయ్య.
'మన శాంతమ్మ గోరు రామం బాబుగోర్ని పెల్లి సేసుకోరట గద!" మెల్లిగా గుసగుస లాడుతూ పుల్లయ్య చెవిలో చెప్పాడు ఒక పాలేరు.
'ఎదిసావ్! పెద్దోర్ని గురించిన యివరాలు మీకెందుకు రా! పోయి మీ పనులు సూసుకొండ్రి...!' గద్దించాడు బిగ్గరగా.
ఆ గద్దింపు కు ఎవరి పనులలో వారు నిమగ్నులయ్యారు----
ఈ విషయం అంతకు ముందే విన్నాడు పాలేరు పుల్లయ్య. ఆ విషయం విన్న దగ్గర నుండి అతనికీ ఏమీ పాలు పోవడం లేదు. ఈ సంగతి లక్ష్మయ్య గారితో చెప్పాలని ఆదుర్దా పడుతూ నడక వేగం హెచ్చిస్తూ ఇల్లు చేరుకున్నాడు. ఇంటికి చేరేసరికి యింటి వద్ద కూడా అదే విషయం చర్చించబడుతూ ఉంది. అతను విన్నదాన్ని, ఇక్కడ వీరు చర్చిస్తున్న విషయం బలపరిచింది. తల పంకిస్తూ మెల్లగా యింటి వసారా వైపు నడిచాడు.
అప్పుడే నిద్రలేచిన లక్ష్మయ్య గారు వరండా లో మంచం పై కూర్చుని పొగాకు కాడ ఈనే తీస్తూ చుట్టను చుడుతున్నారు. ముఖం గంబీరంగా ఉంది. వయసులో పండి, కష్ట సుఖాల అనుభవాలతో మ్రగ్గిన లక్ష్మయ్య గారంటే ఆ ఊరంతటికీ ఎంతో గౌరావము.
తను వచ్చినట్లు వారు గమనించాలని మెల్లిగా దగ్గాడు పుల్లయ్య.
కనురెప్పలను బరువుగా పై కేత్తుతూ హుందాగా పుల్లయ్య ను చూస్తూ "ఏం పుల్లయ్యా.....? ఏదో పని పెట్టుకొని వచ్చినట్లున్నావ్!'
'అవును పెదబాబుగారూ! మీతో ఏకాంతంగా ఒక యిసయం మనవి సేసుకోవాలే!'
'నాతొ మనవి చేసుకొనేదేముంది? నీకేమైనా కావాలంటే రామాన్ని అడుగు.'
'అబ్బే! ఆ యిసయం కాదు దొరా! వేరే ముఖ్య యిసయం' కంఠస్వరం తగ్గిస్తూ అన్నాడు.
'అంత ముఖ్య విషయం ఏమిటి పుల్లయ్యా/ సరే! దగ్గరగా వచ్చి చెప్పు' పుల్లయ్య ముఖం లోకి సూటిగా చూస్తూ అన్నారు లక్ష్మయ్య గారు.
పాలేరు మాట్లాడుకోవడం పుల్లయ్య రావడం; వచ్చి పాలేర్ల ను గద్దిస్తూ తన తండ్రి ఉన్న దగ్గరకు వెళ్ళడం యివన్నీ గమనించింది శాంత. పార్వతమ్మ గారు వంటింట్లో ఉన్నారు. రామం యింట్లో లేడు. మెల్లిగా లక్ష్మయ్య గారు కూర్చున్న వరండా కు వెనుకగా ఉన్న గదిలో చేరింది శాంత, విషయమేమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో.
లక్ష్మయ్య గారు కూర్చున్న మంచం దగ్గరగా వెళ్ళాడు పుల్లయ్య . అతని ముఖంలో కొట్టవచ్చినట్లు కనుపిస్తున్న ఆందోళన కు ఆశ్చర్య పోతున్నారు లక్ష్మయ్య గారు.
'ఈ యిసయం మీదాకా వచ్చిందా బాబు గారూ?'
'ఏ విషయం పుల్లయ్యా?'
'నాకు చెప్పాలంటే గుబులేత్తుండాది. ఒకేలా అది నిజం కాకపొతే ఊరు ఊరంతా గుప్పు మంటుందా? నిప్పు లేనిదే పొగరావడమంటూ జరగదు గదండీ....?'
'ఇంతకూ ఏం జరిగిందో చెప్పవేం?' గద్దించారు లక్ష్మయ్య గారు.
'ఏముంది దొరా! మన సిన్నమ్మగోరు సినబాబు గోర్ని పెళ్లాడరంట! పట్నం లో సదివి రాలా.......! ఆ డాకటేరుగోర్ని........'
'అపు......!' పుల్లయ్య మాటలు పూర్తిగా వినకుండానే అరిచారు లక్ష్మయ్య గారు.
వారి ముఖం లో ఎంతో మార్పు వచ్చింది. అగ్ని పర్వతం నుండి కుతకుత లాడే లావా పైకి ఉబికి వచ్చేటట్లు వారి గుండెల నుండి కోపం ఉవ్వెత్తున ఉబికి రావడానికి సిద్దంగా ఉంది. గంబీరంగా ఉన్నవారి ముఖం జేవురించింది. పూరిండ్ల ను అగ్ని దహించే విధంగా వారిని కోపం నిలువునా దహించి వేస్తూ ఉంది. లక్ష్మయ్య గారిని ఆ స్థితిలో చూస్తున్న పాలేరు పుల్లయ్య గడగడ వణికి పోసాగాడు.
'పుల్లయ్యా....ఎవరు చెప్పారు నీకీ సంగతి?' పిడుగు పడినప్పుడు వినిపించే మేఘ గర్జన లా ఉంది అయన స్వరం.
'బా......బు ...గా.......రూ ....ఊళ్ళో ...........అం.......తా........అను........కుంటుం.........డారు' భయంతో ఎంతగానో వణికి పోతూ విశ్వప్రయత్నం చేసి పై మాటలు అనగలిగాడు పుల్లయ్య.

'సరే......! నీ వెళ్ళు.....!'
'బ్రతుకు జీవుడా ' అని ఒక్క అంగలో అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఐదు నిమిషాలు దీర్ఘంగా ఆలోచించారు లక్ష్మయ్య గారు.
'శాంతా' అని బిగ్గరగా అరుస్తూ యింటి లోపలికి వెళ్ళారు. పుల్లయ్య వెళ్ళిపోగానే శాంత మేడ మీద గల తన గదిలోకి వెళ్ళింది. ఆ పిలుపులో కాఠిన్యానికి భయపడింది ఆమె. అలా భయపడితే తను తలచిన కార్యంనేరవేరడం కష్టమని ఊహుస్తూ లేని ధైర్యాన్ని నటిస్తూ క్రిందకు దిగింది.
'ఏమిటి నాన్నా పిలిచావ్.......?'
'నేవిన్నది నిజమేనా?' నోటికి చిక్కిన ఆహారం తప్పిపోవడంతో బుసలు కొట్టే వృద్దు సింహంలా ఒగురుస్తూ అడిగారు లక్ష్మయ్య గారు.
"ఏం విన్నావు నాన్నా....? అసలు విషయం చెప్పకుండా అలా కోపగించు కుంటున్నావెం?' ఏమి తెలియనట్లు అమాయకంగా ప్రశ్నించింది శాంత.
'ఎంత నంగనాచి లా మాట్లాడుతున్నావే! నేను నీ కన్నతండ్రిని. నీ వివాహ విషయం నాకంటే ముందు ఊరి వారందరికీ తెలిసింది. ఎంత అప్రతిష్ట! ఎంత అగౌరవం?' కోపంతో యింటి కప్పు అదిరిపోయేలా కేకలు వేయసాగారు.
ఆ కేకలకు లోపల వంట పని చేసుకుంటున్న పార్వతమ్మ గారు గాభరా పడుతూ వీరున్న చోటికి వచ్చారు.
"ఏమిటండి? అలా గావు కేకలు వేస్తున్నా రెందుకు?' విషయం తెలియక బిక్క మొహం వేసి ప్రశ్నించింది.
"ఇంకేముందే...? అంతా సర్వనాశన మై పోయింది. నేను మనసులో భయపదినంతా జరిగింది. నీ గారాబు కూతురు మన రామాన్ని పెళ్లి చేసుకోదట! వాడు లేడూ....? సుందరం......షోకీలా వెధవ! వాణ్ణి చేసుకుంటుందట! ఈ విషయం మనకన్న ముందే ఊరి వారందరికీ తెలిసింది. మన అంతస్తే క్కడ......? వారి అంతస్తేక్కడ....! అయినా బంగారం లాంటి రామాన్ని కాదని ఆవేధవ ని చేసుకుంటానని పట్టు పట్టడం ఏమైనా న్యాయంగా ఉందా? నీవే చెప్పు.' భార్య మీద విరుచుకు పడ్డారు లక్ష్మయ్య గారు.
'బాగుంది వరస. ఉరిమి, ఉరిమి మంగలం మీద పడ్డట్టు నామీద విరుచుకు పడతారేం? మధ్య నేనేం చేశానని?'
ఏం మాట్లాడాలో తోచక తల వంచుకొని నిలుచుంది శాంత. పార్వతమ్మ గారు తనకేమీ పట్టనట్లు తనపని చూసుకోవడానికి వంటింట్లో కి వెళ్లబోయారు . 'అగు ' అని బిగ్గరగా అరిచారు లక్ష్మయ్య గారు.
ఆ అరుపుకు ఉలికిపడిన పార్వతమ్మ గారి అడుగు ముందుకు పడలేదు ----
లక్ష్మయ్య గారు శాంతను కోపంగా చూస్తూ 'ఈ విషయం ఎంత వరకూ నిజమో చెప్పు' అన్నారు.
'నిజమే నాన్నా......! ధైర్యంగా సమాధానం చెప్పింది శాంత.
సన్నిపాత జ్వర రోగిలా ఆవేశంతో ఉలికిపడ్డారు లక్ష్మయ్య గారు, మందకొడి గా నడుస్తున్న గుర్రం వీపుపై కోరడాను ఝుళిపించినట్లు శాంత మాటలు లక్ష్మయ్య గారికి చురుకు కలిగించాయి.
'వీల్లేదు. నా బొంది లో ప్రాణ ముండగా అలా జరగనివ్వను. పెళ్ళంటే బొమ్మలాట కాదు, వెయ్యేళ్ళ పంట.'
'అందుకే నేను బావను చేసుకోనని సుందరాన్ని చేసుకుంటానని అంటున్నాను.'
'నోర్ముయ్! మంచి- చెడూ నిర్ణయం చేసే తాహతు , విచక్షణా జ్ఞానం నీకేక్కడుంది?'
'ఎందుకు లేదు నాన్నా? నేను యింకా పసిదాన్నా.......?'
'లేదమ్మా! నీవు పసిదాన వేందుకౌతావు? నీవు పసిదానవని అనుకుంటున్న మేము పసివాళ్ళం. పిట్ట కొంచెం కూత ఘనం లాగా ఉంది నీ తీరు. చీపురు కట్టకు పట్టు కుచ్చు కట్టినట్లుంటుంది నిన్ను ఆ సుందరం గాడికిచ్చి వివాహం జరిపిస్తే' కోపంతో రెచ్చిపోతూ అన్నారు లక్ష్మయ్య గారు.
'మీరు ఎన్నైనా అనండి. నా మనసు మార్చుకోనేది లేదు.' ఖచ్చితంగా చెప్పింది శాంత.
'ఎలా మార్చుకోవో చూస్తాను.'
శాంత మేడమీదకు, లక్ష్మయ్య గారు వసారా లోకి ఒకరిని మించిన వేగంతో మరొకరు వెళ్ళారు.
తనగదిలో కూర్చొని ఆలోచనలో పడింది శాంత. వరండా లో మంచం పై కూర్చొని శాంత పై కారాలు మిరియాలు నూరుతున్నారు లక్ష్మయ్య గారు. ఎవరికీ ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో వంట గది వైపు వెళ్ళారు పార్వతమ్మ గారు.
* * * *
పాలేరు పుల్లయ్య లక్ష్మయ్య గారి దగ్గరి నుండి రామం కోసం పంచాయితీ ఆఫీసు వైపు బయలుదేరాడు. ఆఫీసు పనులు పూర్తీ చేసిన రామం అప్పుడే లోపలి నుండి బయటికి వస్తున్నాడు.
"ఏం పుల్లయ్యా.........? ఎవరి కోసం లోపలికి వేడుతున్నావ్!" రామం యివతలికి వస్తూన్న విషయం గమనించకుండా ఆదరా బాదరా గా లోపలికి వెడుతున్న పుల్లయ్య ను ఆపుతూ అన్నాడు రామం.
'మీరా.....సినబాబుగారూ? మీ కోసమే వచ్చాను.'
'మామయ్యా పిలుచుకు రమ్మన్నాడా?'
