24
ఒకరోజున శకుంతల , "ఏం రమేష్ బాబూ , హోటలు భోజనం పడదేమో? పోనీ మాతో బాటుగా మా యింట్లోనే ఎంగిలి పడుదురూ!" అన్నది.
శకుంతల మాటలకు రమేష్ కు నవ్వు వస్తుంది. పైకి పొక్క కుండా, తనలో తనే సమాధాన పడి , "ఏం ఫరవాలేదండీ. హోటలు భోజనం నాకలవాటే." అన్నాడు . శకుంతల నవ్వింది.
"మీ అక్కయ్య వెళ్ళేటప్పుడు నాతొ చెప్పిందండీ , కాస్త మా తమ్ముడిని కనిపెట్టి ఉండమని. మరి కనిపెట్టి ఉండకపోతే ఏం బావుంటుందండి? పూరాగా వదిలేస్తే అవిడోచ్చింతరువాత ఏమయినా అనదూ?" అన్నది మళ్ళీ పమిటచెంగు నోటి కడ్డం పెట్టుకుని నవ్వుతూ.
"ఏం కనిపెట్టి ఉండమంది?" అన్నాడు రమేష్ కూడా శకుంతల వైపు చూస్తూ నవ్వు ముఖంతో.
"అన్నీ కనిపెట్టి ఉండమంది. బలే చతురుగా మాట్లాడతారే! ఎట్టాగయినా చదువు కున్నోళ్ళ కి మాట చతురుంటుంది" అన్నది శకుంతల.
రమేష్ నవ్వి ఊరుకున్నాడు.
ఆరోజు సాయంత్రమే శకుంతల భర్త సరుకులు ఖరీదు చేసుకోవటానికి బొంబాయి వెళ్ళాడు. వారం రోజుల వరకూ రాడు.
ఆరోజు రాత్రి రమేష్ ఆఫీసు నుంచి వస్తూనే హోటల్ లో భోజనం చేసి ఇంటికి వచ్చేశాడు. నవలల పోటీ కి అతను ప్రారంభించిన నవల ఇంకా పూర్తి కాలేదు.తీరికగా సిగరెట్టు వెలిగించి నవల వ్రాయటం లో నిమగ్నుడయాడు.
రాత్రి పది దాటింది. రమేష్ ధ్యాసంతా నవలలోని సన్నివేశాల మీదనే నిమగ్నమై ఉంది. పెరటి తలుపు చప్పుడయింది. ఏ ఎలకో, పిల్లో అనుకున్నాడు. మళ్ళీ రెండు సార్లు తలుపు తట్టిన చప్పుడు. విసుక్కుంటూ వెళ్లి తలుపు తీశాడు.
గప్పున సెంటు వాసన కొట్టింది. తన కనులను తనే నమ్మలేక పోయాడు. శకుంతల ఇంట్లోకి వస్తూనే తలుపు తనే గడియ పెట్టింది. తల్లోని సన్న జాజులు రమేష్ ను చూసి నవ్వినాయి. తెల్లని చీర, తెల్ల సిల్కు రవిక, నోట్లో తాంబూలం తో ఎరుపెక్కిన పెదవులు, దేవకన్యలా రమేష్ ముందు నిల్చుంది శకుంతల.
"ఇంత రాత్రి వేళ ఎందు కొచ్చావ్ శకుంతలా?' అన్నాడు. పుట్టుక లోనే అందాన్ని పుణికి పుచ్చుకున్న శకుంతల ఇంకా ఎంతో అందంగా ఉంది.
"రమేషయ్యా, ఇంత రాత్తిరి వేళ, ఇట్లా ఎండుకోచ్చానో యింకా తెలీలేదా?' శకుంతల నవ్వుతూ అతని చెయ్యి పట్టుకుంది. మెల్లిగా గది వైపు దారి తీసింది. ఆమె వెంట మంత్ర ముగ్దుడిలా వెళ్ళాడు రమేష్. పక్క మీద కూర్చుని రమేష్ ను కావిలించు కుంది. రమేష్ గుండెలు గతుక్కు మన్నాయి.
"శకుంతలా! ఇంత ధైర్యం చేస్తావను కోలేదు ."
"అవును రమేషయ్యా! నా జన్మ లో యిదే ధైర్యం చెయ్యటం. ఇట్లా చేస్తానని నేనూ అనుకోనైతిని. జిందగీ లో అనుకోని సంగతులు అనేకం."
అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళ కద్దు కుంది శకుంతల. రెండు వేడి కన్నీటి బొట్లు అతని అరచేతులకు అంటినాయి. శకుంతల మనస్సులోని విషయాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శకుంతల ను తన ఒళ్లోకి లాక్కున్నాడు. తన రెండు చేతులతో ఆమె భుజాన్ని పొదివి పట్టుకుని ఆమె పెదవులు ముద్దు పెట్టుకున్నాడు.
శకుంతల నిజంగా అందాల రాశి. అపురూప సౌందర్యవతి. శకుంతల ఇట్లా తలవని తలంపుగా ఎందుకు వచ్చిందో రమేష్ కు అర్ధం కాలేదు. కళ్ళల్లో నీళ్ళు తిరిగినా బరువుగా ఉచ్చ్వాస నిశ్వాసాలు విడుస్తూ అతని కళ్ళలోకి చూస్తూన్నది శకుంతల.
జీవితంలో ప్రప్రధమంగా పరాయి స్త్రీ పొందు తనివితీరా అనుభవించాడు రమేష్.
గడియారం పన్నెండు కొట్టింది. వదలలేక వదలలేక అతని కౌగిలి లో నుంచి కూడదీసుకుని లేచింది శకుంతల.
వెళ్లి వస్తానంటూ తల ఊపింది. మెల్లిగా వెళ్ళింది శకుంతల.
జీవితంలో పర పురుష స్పర్శ అంతవరకూ ఎరుగదు శకుంతల. ఊహ సుందరులతో , కధల్లో నవలల్లో అనేక నవ యౌవనులను సృష్టించి కలుసుకున్న భావో ద్రేకంలో మునిగి తేలినా, పరస్త్రీ , అందులో అందమైన స్త్రీ పొందు ఈనాటికి అనుభవించ గలిగాడు రమేష్.
మర్నాడు రాత్రి రమేష్ తలుపు దగ్గరగానే వేసి శకుంతల కోసం ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా పది గంటలు కాగానే శకుంతల వచ్చింది. శకుంతల ను చూసి కూడా చూడనట్లుగా కళ్ళు మూసుకు పడుకున్నాడు రమేష్.
మెల్లిగా వచ్చి అతని గుండెల మీద తల పెట్టి పడుకుంది శకుంతల.
"ఇద్దరు బిడ్డల తల్లివి. నా మీద గాలి దిర్లిందెం శకుంతల నీకు? మాటలు చూస్తె బోళా మనిషి లా కనిపిస్తావ్. నీలో ఇంత కోరిక, కాంక్ష, తీరని , తీర్చుకొని అనుభవాలు ఎన్నాళ్ళ నుంచో దాగి ఉన్నాయన్న మాట!" అన్నాడు రమేష్ నవ్వి.
"రమేష్, నీతో మాట్లాడుతుంటే నాకు మనసు గిలిగింత గా ఉంది. మాటల్లో యాస పోతున్నది. అంతా నువ్వు మా ఇంట్లో కొచ్చాకనే. నే కాపరాని కొచ్చి ఎనిమిదేళ్ళయింది. ఇంతకాలం ఇంత కోరికా, ఇంత తృప్తి ఎన్నడూ రాలా. ప్రేమన్నా నాకెక్కువ తెలీదు" అన్నది శకుంతల.
ఏదో చెప్పరాని ఆవేదన కట్టలు తెంచుకుని పొంగి పొర్లుకు వచ్చింది. శకుంతల కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి.
ఆమె కనుకొలకుల్లో నీరు బుగ్గల మీది నుంచి జారి రమేష్ గుండె మీద పడ్డది. ఆమెను తనివితీరా హృదయానికి అడుముకుని, పొదివి పట్టుకుని ఆమె బుగ్గలు తుడుస్తూ , "శకుంతలా, ఎందుకా కన్నీళ్ళు? నీ మనస్సు కు కష్టం కలిగే టట్లు నేనేమయినా అన్నానా?" అన్నాడు.
"కష్టంగా మీరేం అనలేదు. నా జీవితంలో మన ఈ కలయిక మరిచిపోలేను." అన్నది శకుంతల కళ్ళు తుడుచుకుంటూ.
ఇంతలో పిల్లాడు ఎడుస్తున్నట్లు వినిపించింది.
"మళ్ళీ రేపు రాత్రి పది గంటలకు" అంటూ వదల్లేక వదల్లేక వదిలి వెళ్ళింది శకుంతల.
ఆ విధంగా మరో మూడు రోజులు గడిచినాయి. మర్నాడు శకుంతల భర్త వస్తాడు బొంబాయి నుంచి. అదే ఆఖరు రాత్రి.
"శకుంతలా, రేపట్నుంచి రావుగా?"
"రాను."
"మళ్ళీ ఎప్పుడు?"
"సమయం చిక్కినప్పుడు."
"పురుడు పోసుకుని వసుంధర వస్తే అసలు వీలుకాదుగా?"
"వసుంధర అదృష్టాన్ని తలుచుకుని సంతోషిస్తాను. వచ్చే జన్మలో నైనా మీ భార్యగా పుట్టాలని కోరుకుంటాను. మనసారా ఆ పరమాత్ముడ్ని ప్రార్ధిస్తాను."
"అయితే నన్ను మరిచి పోతావా?"
"జీవితంలో మరిచిపోను."
"నన్ను మరిచిపోక, ఇంక రానూ రాకపోతే, మనస్సులో తలుచుకుంటూ ఉండవలసిందేనా?"
"అంతే. నువ్వు వసుంధర కు ద్రోహం చెయ్యవద్దు. నేను నా భర్తకూ, పిల్లలకూ ద్రోహం చెయ్యను. ఈ వారం రోజులూ అనుభవించాం. అనుభవించటం కోసమని ఆత్మ వంచన చేసుకుని, కట్టుకున్న వాళ్ళ ద్రోహం చేసి , మనం కులికి నంత మాత్రాన, మనకు కలిగే మేలూ లేదు. ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటూ వుంటే అంతకన్న కావలసిందేముంది? మన మమకారాలు, మనలోనే ఇముడ్చు కుందాం అంతే. మన కలయిక బజార్న పడితే అంతకన్న పతనావస్థ ఇంకేముంటుంది?' అన్నది శకుంతల.
"శకుంతలా , నువ్వు సామాన్యు రాలివి కాదు. నీ నిశ్చలమైన మనస్సు కి, చెయ్యెత్తి దణ్ణం పెడుతున్నాను. నన్ను మన్నించి క్షమించు శకుంతలా" అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు. మనసారా అతని నుదురు ముద్దు పెట్టుకుని, కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది శకుంతల.
ఆ మర్నాడే శకుంతల భర్త బొంబాయి నుంచి వచ్చాడు.
