Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 33


                                 40

    పైకి ఎంత గంభీరంగా ప్రవర్తించినా, ఎంతగా పనులలో తనను తాను విస్మరింప ప్రయత్నించినా మానసికాందోళన వీసమంతైనా తగ్గడం లేదు. అన్నయ్య చెప్పినదే సరైనదని ఒకసారి అనిపిస్తుంది. 'ఎవరి ఉద్దేశ్యాలు వాళ్ళవి. వాళ్ళకోసం నా కోరికలనూ, ఆశయాలనూ అణగద్రొక్కుకోవడమేమిటి?' అని ఒక్కోసారి మనస్సు ఎదురు తిరుగుతుంది. భోజనం సహించదు. నిద్రపట్టదు. ఎవరేం మాట్లాడినా విసుగ్గానే ఉంటుంది. మనస్సు ఏకాంతాన్ని కోరుకొంటుంది. కాని, ఒంటరితనం ఆలోచనల నధికం కావించగలదనే భయంతో సాధ్యమైనంతవరకు నలుగురి మధ్యనే ఉండ ప్రయత్నిస్తుంది.

                  
    అలల గలగలలలో, వేణువాదంలో, కోయిల గానంలో, మలయా సమీరంలో ఏవేవో సందేశాలు విన్పిస్తాయి. మనస్సు పరుగులిడుతుంది. హృదయం ఆక్రోశిస్తుంది. నిర్లిప్తంగా, నీరసంగా కూర్చుండిపోతుంది.
    ఒకరోజు లక్ష్మీదేవి అంది కోడలితో, "అమ్మాయి తిరిగి శాంతినికేతనం మాట ఎత్తటం లేదేమిటి?" అని.
    తేలికగా నవ్వింది పద్మ. "ఏదో సరదా పడింది మొదట. మీరూ, మామగారూ యిలా దిగులుగా వుండడం చూచాక పాపం, మరి మనస్సెలా నొప్పుతుంది? అందుకే మానేసింది."
    "కాని, అలా చిక్కిపోతోందేమిటి? అసలే ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేది కాదు. ఇపుడు మరీ ముభావంగా మారిపోయింది. నాకేమిటో దిగులుగా వుంది. దానికేం గాలీ, ధూళీ సోకలేదుకదా?"
    పద్మ కంగారు పడింది. ఆమాటకు సూటిగా సమాధానం చెప్పలేక ప్రసంగం మార్చింది. "శాంతి చాలా మారినట్లనిపిస్తోందత్తయ్యా నాకు. పెళ్ళి ప్రయత్నాలిప్పుడు చేస్తే యెలాగుంటుందంటారు?"
    "నేనూ అదే అనుకొంటున్నాను. అయినా మనమనుకొని యేం ప్రయోజనం, తల్లీ? ఆ తండ్రీ కూతుళ్ళు ఒక్కటి."
    "......."
    "అయినా మీ మామగారితో మాట్లాడి చూస్తాను."
    అంతలో శ్రీహరి అటు వచ్చాడు, చేతిలో ఉత్తరాలతో. "తమ్ముడూ, శ్యామలా వూళ్ళన్నీ తిరుగుతున్నారటమ్మా. ప్రస్తుతం ఆగ్రాలో వున్నారట" అన్నాడు. ఊకొట్టి ఊరుకొంది లక్ష్మీదేవి.
    "పద్మా, నువ్వొకసారి యిలా రా" అని పిల్చుకుపోయాడు పద్మను.
    "ఇదుగో, ఒకటి మీ నాన్నగారు వ్రాశారు."
    "ఏమని?" అడిగింది పద్మ.
    "ఏమనీ? నీకు తెలియదేమిటి? వచ్చే నెలలో పుత్రికామణిని తీసుకుపోయి మళ్ళీ నెల్లాళ్ళనాటికి అడ్డాలలో బిడ్డతో పంపు తామని......"
    "ఊఁ చాలిద్దురూ."
    కొద్దిసేపు మౌనంగా గడిచిపోయింది. "పుట్టింటికి వెళ్ళడానికి ఎగిరి గంతేస్తాననుకొన్నాను. అలా వున్నావేం?" అన్నాడు శ్రీహరి.
    ఉదాసీనంగా నవ్వింది పద్మ. "సాధారణంగా అంతేననుకోండి. తప్పనిసరి కాకపోతే అసలు వెళ్ళకేపోయేదాన్ని. ఈ పరిస్థితులలో శాంతిని విడిచి వెలదమంటే నాకు చాలా కష్టంగా వుంది."
    శ్రీహరి హృదయం ఆర్ద్రమైంది. "ఇంటి కొక్కరైనా నీలావుంటే యీ భువి దివిగా మారిపోతుంది, పద్మా."
    "నేను మీ విషయంలో అలాగనుకొంటూంటాను. నాలో ఏముంది? అంతా మీ సాహచర్య ఫలితమే" అంది పద్మ.
    దీర్ఘంగా, తృప్తిగా నిట్టూర్చాడు శ్రీహరి. "ఏమైనా మనం చాలా అదృష్టవంతులం, పద్మా. నీ సాహచర్యంలో నాకు స్వర్గం కూడా అక్కర్లేదనిపిస్తుంది. కాని, యింతటి ఆనందమూ యీ కుటుంబ విషయాలవల్ల ఒక్కోసారి కలత పడుతుంది. ఆఁ. రాజా వుత్తరం వ్రాశాడు, చూడు."
    అందుకొని చదివింది పద్మ.
    "డియర్ శ్రీహరీ,
    క్షేమం. అమ్మగారికీ, నాన్నగారికీ, అక్క గారికీ నమస్కారాలు. నేను అక్కడినుంచి వచ్చేటపుడు నీతో ఒక విషయం గురించి మాట్లాడాలని ప్రయత్నించాను. కాని ధైర్యం చాలలేదు. శాంతితో రెండుమూడు సార్లు మాట్లాడటం తటస్థించింది. చాలా విచారంగా, నిరాశగా మాట్లాడింది. కాని, వివరంగా చెప్పలేదు. ఇక శాంతినికేతనం వెళ్ళనంది. నాకేమీ అర్ధం కాలేదు. కాని, శ్రీహరీ, స్నేహితుడుగా, శ్రేయోభిలాషిగా అంతరంగిక విషయాలలో జోక్యం గలిగించుకొంటున్నాను. మన్నించాలి. బహుశః గోవిందరావుగారి విషయంలోనే మీ కుటుంబంలో అశాంతి రేగిందని భావిస్తున్నాను. శాంతి, గోవిందరావుగారిని ప్రేమించింది. నాకు చెప్పింది. వ్యక్తి ఉత్తముడైతే అతడెవరైనా ఫర్వాలేదు. 'అర్హత' అనేది పూర్తిగా వ్యక్తిత్వంపై ఆధాప్ది ఉంటుంది కాని, కుల మతాలపై కాదు, శ్రీహరీ. నాగరికత పలువిధాల వికసిస్తూన్న యీ ఆధునిక యుగంలో మనలాటి యువకులు కూడా యీ మూఢాచారాలను పాటించకూడదు. అతడిని నీవు స్వయంగా చూచి మంచివాడైతే శాంతి హృదయానికి శాంతి కూర్చమని ప్రార్దిస్తున్నాను. ఉన్నతమైన శాంతి హృదయం అయోగ్యునికి తావివ్వదని నా నమ్మకం.
    ఇంకా చాలా వ్రాయాలనుకొన్నాను. కానీ వ్రాయలేకపోయాను. నా మాటపై విలువ ఉంచుతావుకదూ? జవాబుకు ఎదురుచూస్తాను.
                                                                                     నీ,
                                                                                   రాజా."
    ఉత్తరం చదవడం పూర్తిచేసిన పద్మ హృదయంనుండి అప్రయత్నంగా. గాఢమైన నిట్టూర్పు వెలువడింది. "ఇటువంటి మనిషి యెక్కడైనా వుంటాడా? తన గురించిన బాధ లేదు. ఎంతసేపూ యితరులపైనే శ్రద్ద!"
    "ప్చ్. నాకేంతోచటం లేదు." జుత్తులోనికి చేయి పోనిచ్చి దిగులుగా అన్నాడు. "అటు శాంతిని నొప్పించలేను. ఇటు రాజాను వదులుకోలేను." వేదన ధ్వనించింది.
    "దిగులుపడి యేం లాభం? ఎలా జరగాలో అలా జరుగుతుంది." ఓదార్పు వచనాలు పలికింది పద్మ.
        
                                                      41

    "చూడు, రామన్నా. ఈ పార్సెల్ రిజిస్టర్ చేసి పంపించు పోస్టులో." పాకెట్ రామన్నచేత పంపిస్తూన్న శాంతిని, "ఏమిటమ్మా, అది?" అని అడిగాడు బలరామయ్య.
    "మనోరమ-అని చెప్పాను. నా స్నేహితురాలు. ఆ అమ్మాయికి యీ యేడో తారీఖున పెళ్ళి. కానుకగా చీరా, పుస్తకాలూ పంపిస్తున్నాను, నాన్నా."
    "......"
    వెళ్తూన్న రామన్నపైనే దృష్టి నిగిడ్చి చూస్తూన్న శాంతి తన మాటలకు సమాధానం రాకపోవడంతో ప్రక్కకు తిరిగి తండ్రిని చూచింది. అతడి ముఖంలో ఏదో అస్పష్టమైన ఆవేదన అలముకొని ఉంది.
    "ఏమిటి, నాన్నా?" అంది మెల్లగా దగ్గరకు వెళ్ళి.
    "ఇలా కూర్చో అమ్మా. నీతో ఒక సంగతి మాట్లాడాలి."
    శాంతి మాట్లాడకుండా వెళ్ళి తండ్రి ప్రక్కన కూర్చుంది.
    "చూడమ్మా." మందస్వరంతో ప్రారంభించాడు బలరామయ్య. కుమార్తె తల నిమురుతూ. "ఎప్పుడూ నేను నిన్నే విషయంలోనూ నొప్పించలేదు. నీమాట కాదనలేదు. కాని. యివ్వాళ ఆ నియమానికి వ్యక్తిరేకంగా నడుస్తున్నాను. నేను చెప్పేది నువ్వు ఓర్పుతో వినాలి."
    "చెప్పండి, నాన్నా."
    "మరేం లేదు. నేను పెద్ధవాడినై పోతున్నాను. వెనుకటి జవసత్వాలు లేవు. ఎప్పుడేమైపోతావో తెలియదు......"
    "నాన్నా!" తండ్రిమాట సగంలోనే త్రుంచేసింది శాంతి. "అలాటి మాటలంటే మాత్రం వినలేను. మీకేం ఫర్వాలేదు."
    "పిచ్చితల్లీ, నువ్వనుకోగానే సరా? అలా దేవుడనుకోవద్దూ? నా ఆరోగ్యం విషయం నాకు తెలుసు." బలరామయ్య నేత్రాలలో అశ్రువులు నిండుకొన్నాయి. అప్రయత్నంగా శాంతి కండ్లు కూడా అశ్రుపూరితాలైనాయి, శ్రీహరి చెప్పిన విల్లు విషయం గుర్తుకు వచ్చి.
    "నాకు నీ విషయమే ఎటూ పాలుపోకుండా వుంది, తల్లీ." గాద్గదికంగా అన్నాడు.
    "ఇపుడు నాకేం, నాన్నా?" బలవంతంగా అనగలిగింది.
    "మెల్లగా అంటున్నావా, అమ్మా? స్నేహితురాలికి వివాహమనేగా కాన్కలు పంపించావు? మరి ఆ శుభదినం నీ జీవితాని కెప్పుడు?"
    "......"
    "చెప్పమ్మా. మాట్లాడవేం?"
    "వివాహం అంతముఖ్యమా, నాన్నా, జీవితానికి?"
    "పిచ్సిపిల్లా!" నవ్వాడు బలరామయ్య. "మరి యేది ముఖ్యం? నేను యివ్వాళ వుంటాను. రేపువుండను. నీ జీవితానికిక ఆవలంబనయేదమ్మా? అన్నయ్యలు యెవరిదారిన వారుంటారు. ఇవ్వాళ నా అండక్రింద వున్న ప్రేమాభిమానాలు రేపు ఉండవు వాళ్ళకు నీమీద. నిన్ను బాధ్యతతో, ప్రేమతో చూచుకొనే వ్యక్తి వుండద్దా, తల్లీ?"
    మెల్లగా అంది శాంతి: "ఒకరి అవసరం లేదు, నాన్నా. నాకు నేను జీవించగలననే ధైర్యముంది నాకు."
    "అది సాధ్యంకాదు, శాంతీ. ఇది భారతదేశం. పురుషుడి అండక్రిందే స్త్రీకి గౌరవం. నామాట వినమ్మా. ఈ ముసలి దశలో నాకు వేదన కలిగించకు."    
    "మరి నిన్ను విడిచి వుండగలరా, నాన్నా?" ఆఖరి అస్త్రం ఉపయోగించాలి శాంతి.
    నవ్వాడు, బలరామయ్య. "ఉండక తప్పుతుందా, అమ్మా? కాని అప్పుడిలా బాధపడను. నీ జీవితానికి సంపూర్ణత్వం లభించిందని సంతృప్తి పడి ప్రశాంతంగా వుంటాను. కాని, అంత తేలికగా నిన్ను వదులుకోననుకో. ఎవరైనా యిక్కడే వుండగల వరునికోసం గాలిస్తాను."
    "ఇల్లరికమా?" త్రుళ్ళిపడింది.
    "కాదమ్మా. గాభరా పడకు. ఇది నీ యిల్లే. నీకే వ్రాశాను. నీ యింట్లోనే నేనుంటాను, నీకు పట్నవాసాలలో బాగుండదన్నావుగా? ఇక్కడే ప్రశాంతంగా వుందువుగాని. అటువంటి వ్యక్తినే తెస్తాను."
    "మీ యిష్టం" అంటూ లేచిపోయింది.
    "ఏదీ, యిటు చూడు. మనస్పూర్తిగా చెబుతున్నావా?"
    "మనస్పూర్తిగానే చెబుతున్నాను, నాన్నా. పెద్దలు. మీకు తెలిసినన్ని నాకు తెలియవుగా?" ప్రయత్నపూర్వకంగా ముఖంమీదికి, దరహాసం కొనితెచ్చుకుంది.
    కుమార్తె వివాహాని కంగీకరించిందన్న సంతోషాతిరెక్మలో ఉన్న ఆ వార్ధక్య హృదయం, ఆ లేత వదనాన్నావరించిన నీలినీడలను చూడలేకపోయింది.
    
                            *    *    *

    శాంతి మనస్సు భీకర రణరంగంగా మారిపోయింది. ఏవో అదృశ్య శక్తులు తన్నావరించి బలహీణంగా చేసేసి బాధపెడుతున్నట్లు భావించింది. 'ఏ పట్టింపూ లేకుండా, ఎవరి అభిప్రాయాలతోనూ, బోధనలతోనూ ప్రమేయం లేకుండా తన దారిన తాను తిరిగినన్నాళ్ళూ ఎంతో హాయిగా ఉంది. కాని, ఏదో బలహీనత ఆవరించింది. దానినే ప్రేమ అని అందమైన నామధేయంతో కీర్తిస్తారు కవులు. కాని, దాని వెనుక ఎన్ని బాధలు, ఎన్ని కన్నీటి గాధలు ఉన్నాయో, ఉంటాయో అనుభవజ్ఞులకే తెలియాలి. కుటుంబంలో అందరి కంటే చిన్నది కావడంవల్ల అందరినుండీ ప్రేమానురాగాలు పొందడమేగాని యివ్వటమెరుగని తాను, ఏ దుర్ముహూర్తాన అందర్నీ ప్రేమించటం మొదలుపెట్టిందో, ఏ వర్జ్య కాలంలో యితరులపట్ల తన బాధ్యతలు తెలుసుకొందో అప్పటినుంచే మనస్సు అశాంతికి స్థావరమైపోయింది. మౌనంగా అనుభవించడమే కాని ఈ కల్లోల సాగరంనుండి విముక్తి పొందే మార్గం లేదు.
    'రెండు ఉత్తరాలకూ జవాబు లేదని గోవిందరావు ఏమనుకుంటున్నాడో? తన నిర్ణయం నిన్న అతడెంత పరితపించిపోతాడో? అంత ప్రేమ నటించి యిలాగైపోయిందని అసహ్యించుకుంటాడు, బాధపడతాడు. రాజా, గోవిందరావు, అన్నయ్య, అమ్మ, నాన్నగారు-అందరూ ఏదో ఒక కారణంగా నాగురించి బాధపడుతున్నవాళ్ళే. ఛీ, ఎందుకొచ్చిన బ్రతుకు? ఎవర్నీ సంతుష్టి పరచనిదానను. నన్ను నేనే సంతృప్తిపరచుకోలేని అసమర్ధురాలను, పిరికిదానను.
    'ఇంత విచిత్ర తత్వమెలా పెట్టాడో నాకు భగవంతుడు! నలుగురు నడిచినదారి ఎందుకు నాకిష్టం కాదు? నాన్నగారిని యిష్టప్రకారం చేయమన్నాను. ఆయన తెచ్చే ముక్కూ ముఖం ఎరుగని ఆ అతినూతన వ్యక్తితో ఎలా జీవించను? ఏమైపోతూంది నా జీవితం? నేనేమైపోతున్నాను?'
    అశాంతితో అల్లల్లాడి పోతున్న హృదయంతో నది ఒడ్డుకు, యింట్లో విలువలేక, మెల్లగా షికారు సాగించింది.
    "చిన్నమ్మా, షికారుకా?" అన్నాడు పోస్టాఫీసునుంచి వస్తున్న రామన్న.
    "అవును. నువ్వూ రా, పనుంది. అలా నది మీద కాస్సేపు తిరగాలని ఉంది, రామన్నా. ఒక నావ మాట్లాడు."
    నిమిషంలో కుదుర్చుకొచ్చాడు రామన్న. ఆ చుట్టుపట్ల వారికి గల పలుకుబడి అటు వంటిది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS