Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 33


    "ఇంతకుముందు ఇద్దరూ ఆడపిల్లలే ఉన్నారు!"
    "అంతా మనిష్టమేనేమిటి?" నవ్వుతూ అందామె.
    "అలాగయితే నీ పిక్చర్లన్నీ త్వరగా పూర్తి చేసుకో తరువాత కష్టమయిపోతుంది"
    "అదే అనుకుంటున్నాను. నేనుకూడా"
    కౌశల్ కి రాన్రాను చిత్రాలు తగ్గిపోసాగినయ్. రిలీజయిన తర్వాత ఒకటి రెండు చిత్రాలు కూడా ఫెయిలయిపోవడంతో అతను ఇంచుమించుగా తెరమరుగయే పరిస్థితి ఏర్పడింది.
    అన్నిటికన్నా ముఖ్యమయిన కారణం అతను తాగి షూటింగ్ కి వెళ్ళకపోవడం, లేదా ఆలస్యంగా వెళ్ళడమూనూ.
    అతని పరిస్థితి గమనించి ఆందోళన చెందింది చంద్రిక.
    "మీరు తాగుడు తగ్గించుకోవడం మంచిది. అందరూ మీ గురించే చెడుగా మాట్లాడుకుంటున్నారు..." అందోరోజు అతనితో.
    "ఇదిగో చంద్రికా! ఓ విషయం గుర్తుంచుకో! మనలో 'సామర్ధ్యం' ఉంటే ఇలాంటివెవరూ పట్టించుకోరు. మనకే విధమయిన ఆటంకమూ కాదది" అన్నాడతను ఆమెమాటలు కొట్టిపారవేస్తూ.
    ఓ రోజు సాయంత్రం అతనికోసం ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్ళతో చాలాసేపు ఘర్షణపడడం వినిపించింది చంద్రికకు.
    వాళ్ళెవరో ఎందుకు ఘర్షణ పడుతున్నారో ఆమెకే మాత్రం తెలీటంలేదు.    
    చివరకు తనే వెళ్ళి తలుపు వెనుక నుంచుని వాళ్ళ మాటలు వినడానికి ప్రయత్నించసాగింది.
    "అదంతా మాకనవసరం. వాళ్ళను తీసుకెళ్తావో లేక పూర్తిగా సంబంధం తెంచేసుకుంటావో నిర్ణయించుకో! వాళ్ళని జీవితాంతం పెట్టి పోషించాల్సిన అవసరం మా కెవరికీ లేదు" ఓ గొంతు గట్టిగా వినబడుతోంది.
    "నేను పొమ్మని ఎప్పుడూ అనలేదు. ఆమెకిష్టమయితే వచ్చి ఇక్కడే ఉండమనండి! నాకెలాంటి అభ్యంతరమూలేదు. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పేదేమీలేదు....." ఖండితంగా చెప్పాడు కౌశల్.
    "ఆమె రాదు! ఆమెకు ఎవరిపంచనో పడిఉండాల్సినఖర్మేం పట్టలేదు"
    "లేదంటే వేరేఇల్లు తీసుకుంటాను! అక్కడ ఉండమనండి"
    "నువు ఇక్కడ ఉంటే ఆమె ఒక్కర్తే దిక్కులేనట్లు పడి ఉండాలన్న మాట! అంతేనా?"
    "మీకిష్టమయితేనే! నేనేం బలవంతం చేయడంలేదు"
    "అయితే మేము ఈ వ్యవహారమంతా కోర్టు ద్వారానే తేల్చుకుంటాం!"
    "సరే! మరిక్కడికెందుకొచ్చారు!" కోపంగా అన్నాడు కౌశల్.
    "ఇదిగో - ఇలా తొందరపడితే ప్రయోజనం శూన్యం. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుందని మనం కోర్టుకెక్కితే నష్టం అందరికీనూ...." వేరొక గొంతు సర్ది చెప్పింది.
    కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది.
    "అసలు విషయాలన్నీ నువూ అమ్మాయీ కలుసుకుని మాట్లాడుకుంటే బావుంటుంది" సలహా ఇచ్చాడతను.
    "నేను కాదనలేదుగా"
    "సరే! అలాగయితే నువ్వే ఓసారి మన ఊరు వచ్చి అన్నీ పరిష్కరించుకుంటే బావుంటుంది"
    "నేనే వస్తాను! కానీ ఇప్పట్లో సాధ్యంకాదు. చంద్రిక డెలివరీ అయాక వస్తాను"
    "అలాగే! అంతవరకూ అమ్మాయికి డబ్బు పంపించు. కనీసం పదివేలయినా పంపుతేగాని గడవదు! ఇంతకాలం నుంచి పంపినా పంపకపోయినా ఎలాగోలా మేమే చూసుకున్నాం. ఇప్పుడు అందరం విడిపోయాం. ఆస్తి అంతా పంపకాలయి పోయింది. కనుక నీ ఏర్పాట్లేవో నువ్వే చూసుకోవాలి"
    "సరే! రేపే డబ్బు పంపిస్తాను".
    వాళ్ళు వెళ్ళిపోయారు.
    అతను లోపలికొస్తూనే అక్కడ నిలబడ్డ చంద్రికను చూశాడు.
    "విన్నావా గొడవంతా!" అడిగాడు చికాకుని కప్పిపుచ్చుకుంటూ.
    "కొంచెం విన్నాను!"
    "ఇది రెండేళ్ళ నుంచీ జరుగుతుందేలే!" తాపీగా అన్నాడతను.
    "అసలు మీకు గొడవెందుకొచ్చింది?"
    "దానికి కొంచెం అభిమానం ఎక్కువ"
    చంద్రిక ఇంకేమీ మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత అతను ఎవరికో ఫోన్ చేయడం వినిపించిందామెకి.
    "నేను కౌశల్ ని మాట్లాడుతున్నాను"
    ".........."
    "నమస్తే! నాకో సహాయం చెయ్యాలి నువు"
    "......"
    "వెంటనే  యాభైవేల రూపాయలు పంపు! నేను మరో వారం పదిరోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను"
    "......."
    "ఓకే సాయంత్రం లోగాపంపాలి"
    ఫోన్ పెట్టేశాడతను. అతని వెనుకే వచ్చినిలబడింది చంద్రిక. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు.
    "ఏమిటి 'స్పై' లాగా వెంటాడుతున్నావ్!" అన్నాడు నవ్వుతూ.
    "అవును మరి! నాకు తెలీకుండా మీరిన్ని అద్భుతమయిన పనులు చేస్తూంటే స్పయింగ్ చేయవద్దూ?"
    "నేనేం చేశాను?"
    "ఎవరిని యాభైవేలు అడిగారు?"
    "మా ఫ్రెండ్ ని."
    "నన్నెందుకు అడగలేదని?"
    "అంత అవసరమొస్తే తప్పక అడుగుతానన్నానుగా!"
    "అదేం కుదర్దు! నువు ఇవాళే వెళ్ళి బాంక్ లో మనిద్దరి పేరా ఎకౌంట్ ప్ర్రారంభించు. ఎవరిక్కావాలనుకుంటే వాళ్ళు డబ్బుతీసుకోవచ్చు."
    "చంద్రికా! నేను......"
    "నేను చెప్పేది విను! సాయంత్రం మీ ఫ్రెండ్ డబ్బు పంపుతే అది తిరిగి అతనికి పంపించేసెయ్ నా దగ్గరున్న డబ్బంతా ఎవరికీ? మనిద్దరికేగా"
    "కాని......"
    "ఉష్! ఇంకేమీ మాట్లాడకు" అతని నోటిని చేతితోమూసివేసిందామె. ఆ తరువాత కొద్దిరోజులకే చంద్రిక సరోజిని నర్సింగ్ హోమ్ లో ఆడపిల్లను ప్రసవించింది.
    కానీ పాప పుట్టి వెంటనే చనిపోయింది.
    హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాక ఆమెలో కొంచెం మార్పు వచ్చింది అది వరక్కంటే లావయింది.
    అదివరకు ఆమెలో వున్న గ్లామర్ కొంతవరకూ తగ్గిపోయింది. దాంతో ఆమెకు కూడా వేషాలు దొరకడం కష్టమయిపోయింది. అదివరలో రోజంతా షూటింగ్ లకు హాజరవుతూనే వుండేది. ఇప్పుడు ప్రతిరోజూ షూటింగ్ వుండడం లేదు. రెండు మూడు రోజులకోసారి. అది  కూడా కొద్దిగంటలు.
    కౌశల్ పని మరీ అధ్వాన్నంగా వుంది.
    అతనిని తీసుకోడానికి ఎవరూ ముందుకి రావడంలేదు. ఇంచు మించుగా అతని సినిమా నటుడిజీవితం పరిసమాప్తమయిందేమో అనిపిస్తోంది.
    ఆ రోజు షూటింగ్ నుంచి ఇంటికొస్తూనే కౌశల్ కోసమే ఎదుర్చూడసాగింది చంద్రిక. విజయవాడలో తనకు సన్మానం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయ్. ఆ విషయమై తను అంగీకారం తెలపాలా లేదా అనే విషయం అతనితో మాట్లాడాలనుకుందామె.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS