Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 33

   

    తిరిగి ఇంటికి వచ్చేసినా ఆయనకు ఆ ఆందోళన వదల్లేదు. అతనొచ్చి ఏమయినా చేస్తాడేమోనన్న భయం అప్పుడప్పుడూ కదిలేది. అందుకే వంశీ సంబంధం అనుకోగానే పెళ్ళికి ఠక్కున ఒప్పుకున్నాడు.
    
    పెళ్ళి పత్రికను ఎక్కడ సంపాదించాడో ఏమోగానీ చిట్టిబాబు పెళ్ళి పత్రిక మీద తన రక్తాన్ని చల్లి దానిక్రింద నోట్ రాశాడు.
    
    "ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను" అన్నది ఆ నోట్.
    
    అంత దూరంలో వుండీ తన కూతురి పెళ్ళి సంగతి గురించి తెలుసుకుని, పెళ్ళి పత్రికల మీద రక్తాన్ని చల్లి, ఆ విధంగా నోట్ రాసి ఇంటికి పోస్ట్ చేయడం చూసి సత్యనారాయణ పై ప్రాణాలు పైనే పోయాయి. శరవణన్ ను కలిసి ఆయన సహాయం కోరాడు.
    
    "వాడు ఎంతకయినా తెగించేటట్లున్నాడు పోస్టులో ఈ పెళ్ళి పత్రిక వచ్చిన విషయాన్ని నేను సుజనకి కూడా చెప్పలేదు. మీరే రక్షించాలి నా కూతురి పెళ్ళి నిర్విఘ్నంగా జరిపించే బాధ్యత మీదే"
    
    అంటూ రెండు చేతులూ పట్టుకున్నాడు.
    
    "అలానే అప్పా! వాడు ఇలాంటి పిల్లగాడనీ నాకూ తెరియప్పా - నేనే వచ్చి పెళ్ళి చేస్తాను. ఆ తిరుడువయ్యా వచ్చి ఏమైనా చేస్తే అక్కడే వాడి ఎముకల్ని వడచ్చుడిరే" అని శరవణన్ అభయము యిచ్చాడు.
    
    అలానే ఆయన పెళ్ళికి మరో కానిస్టేబుల్ తో వచ్చాడు. కానీ చిట్టిబాబు రాలేదు. పెళ్ళి జరిగిపోయింది.
    
    ఇప్పుడు యిలా టెలిగ్రాం రావడంతో చిట్టిబాబే తమని వదలకుండా ఏడిపిస్తున్నాడేమోననుకున్నాడు తన అల్లుడు ఫస్ట్ నైట్ కోసం టెలిగ్రాం నాటకం ఆడానని ఆయన ఊహించలేకపోయాడు. అందుకే చిట్టిబాబు మీద తన కోపాన్ని ప్రకటించాడు. తన అల్లుడికి అనుమానం కలిగించాడు.
    
                                                        *    *    *    *    *
    
    ఆ సాయంకాలం వర్షపు జల్లు ప్రారంభమైంది. ఆకాశంలో నల్లటి మబ్బులు గింగిరులు తిరుగుతున్నాయి. గాలి చిన్నపిల్లలా వర్షంలో తడుస్తూ కేరింతలు కొడుతున్నట్లు చిన్నగా శబ్దం చేస్తూ, చల్లగా తగులుతోంది.
    
    సుజన, మహిత ఇంటి పక్కగా వున్న వసారాలో మాట్లాడుకుంటున్నారు.
    
    మహితకు ఇరవై ఎనిమిదేళ్ళుంటాయి. చాలా సెక్సీగా వుంటుంది. ఆ సెక్సీతనం ఆమె మత్తు కళ్ళల్లో వుందో, పెద్దదైన కింది పెదవిలో వుందో, ఎత్తుగా, గుండ్రంగా వున్న ఎదలో వుందో, నడుం మడతల్లో వుందో చెప్పడం కష్టం. ఆమె చూడగానే మగవాడికి కోరికా, ఆడపిల్లలకు ఈర్ష్యా పుట్టుకొస్తాయి.
    
    "నా ఫస్ట్ నైట్ గురించి చెప్పాలా భలే అడిగావే. ఎప్పుడో ఏడేళ్ళయింది..." అంది ఆమె.
    
    సుజన నవ్వుతూ మౌనంగా వుండిపోయింది. ఆలాంటప్పుడు మాట్లాడితే ఎదుటివ్యక్తి మూడ్ చెదిరిపోతుంది. మనసు డైవర్ట్ అయిపోతుంది.
    
    "అయితే ఒకే" అంటూ ఆమె హుషారుగా చెప్పడం ప్రారంభించింది.
    
    మాది రావూరు దగ్గర ఓ పల్లెటూరు. మా నాన్న పెద్ద రైతు, పదెకరాల దాకా పొలం వుండేది. మా ఊర్లో పదెకరాల పొలం వుండేది కేవలం ఓ పదిమందికి మాత్రమే. పదెకరాల పొలం వుంటే పెద్ద భూస్వామి అన్నమాట.
    
    మేం మొత్తం ముగ్గురు అక్కచెల్లెళ్ళం. మగపిల్లలు లేరు. నేను చివరిదాన్ని. మా పెద్దక్క పేరు చంద్రిక. ఆమె వయసుకు రాగానే గూడూరులో రెవెన్యూ గుమాస్తాగా పనిచేసే చక్రధర్ తో పెళ్ళి ఫిక్స్ చేశాడు నాన్న ఇరవై అయిదువేల కట్నంతో, పది సవర్ల బంగారం పెట్టి పెళ్ళి జరిపించారు.
    
    మా అక్క అత్తగారింటికి వెళ్ళింది.
    
    ఆ సంవత్సరమూ, మరుసటి ఏడు కూడా పంటలు పండలేదు. పెళ్ళికి చేసిన అప్పు వడ్డీ తిని మరింతగా బలిసింది. అది మా కుటుంబాన్నంతా తినకముందే దాన్నుంచి విముక్తి కావాలని అయిదెకరాలు అమ్మేశాడు నాన్న. అప్పు అయితే తీరిందిగానీ పెద్ద రైతు స్టేటస్ నుండి మేం మామూలు పాటి రైతు స్థాయికి దిగిపోయాం. వున్నా పొలంలోనే అమ్మా నాన్న రాత్రింబవళ్ళు కష్టపడేవాళ్ళు. కానీ పండిన పంటలకు గిట్టుబాటు ధర వుండక ఏదో బొటాబొటిగా సంసారం గడిచేది.
    
    ఈలోగా రెండో అక్క రాధిక అరటి చెట్టులా ఎదిగింది. ఆ పిల్ల భారీ పర్సనాలిటీ కావడంవల్ల త్వరలోనే పెళ్ళి చేయాలనుకున్నారు.
    
    సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మా పక్క ఊర్లోనే సంబంధం కుదిరింది.
    
    ఆమె పెళ్ళి కావడం, ఆ తరువాత రెండేళ్ళకు అప్పులు తీర్చడానికి మిగిలిన అయిదెకరాలూ అమ్మడం జరిగిపోయాయి. మా నాన్న రెక్కలు తప్ప ఏమీ మిగలకుండా పోయింది.
    
    నాన్న రెండెద్దులు పట్టుకుని రావూరులో బండి తోలడం ప్ర్రారంభించాడు. పదెకరాల ఆసామి అయిన ఆయన కూతుర్ల పెళ్ళిళ్ళతో కూలీగా మారిపోయాడు. బస్సులోంచి, లారీలోంచి బస్తాలు దించి, బండిలో అంగళ్ళకు తోలేవాడు.
    
    బస్తాకు ఒకటో, రెండో రూపాయలు వచ్చేవి దాంతో కుటుంబం సాగేది. మా అకాపురం కూడా రావూరికి మారింది. వున్న ఊర్లో కూలీకి వెళ్ళటం ఇష్టంలేక టౌన్ కి వచ్చేశామన్న మాట.
    
    నాకు ఇరవై అయిపోయి ఇరవై ఒకటి పెట్టింది. అమ్మకి కానీ నాన్నకు గానీ నా పెళ్ళిమాట ఎత్తే ధైర్యం లేకపోయింది. ఏం వుంది కాబట్టి పెళ్ళి సంబంధం చూస్తారు?
    
    రోజులు గడుస్తున్నాయి. ఓసారి మాకు దూరపు బంధువు ఒకామె ఇంటికి వచ్చింది. రాత్రి భోజనాలయ్యాక యింటి ముందు అందరం కూర్చున్నాక ఆమె అసలు విషయం చెప్పింది.
    
    "మహితకు పెళ్ళి చేయరా ఏమిటి? పిల్ల అందంగా కుందనపు బొమ్మలా వుంది.
    
    నా ఎరికలో ఓ సంబంధం వుంది. అది మాట్లాడదామనే ముఖ్యంగా నేనిక్కడ దిగింది"
    
    "ఏ ఊరు?" అమ్మ ఆసక్తిగా అడిగింది.
    
    నాన్నయితే ఆ ఆసక్తి కూడా కనబరచలేకపోయాడు. కూతుర్ల పెళ్లిళ్లకు పదెకరాలు పోగొట్టుకున్న వ్యక్తికి ఆసక్తి ఎలా వుంటుంది?
    
    "నాగలాపురం దగ్గర పల్లెటూరు. అబ్బాయి పదవ తరగతి వరకూ చదువుకున్నాడు వ్యవసాయం చేస్తాడు. ఒక్కడే కొడుకు. తండ్రి లేడు. పెద్ద పెంకుటిల్లు వుంది"
    
    అమ్మ కళ్ళు మెరవడం ఆ మసక చీకట్లో నేను కనిపెట్టగలిగాను.
    
    "పొలం ఎంతుందేమిటి?"
    
    "పదెకరాల దాకా వుంది. నేనెప్పుడు వెళ్ళినా వడ్లో, రాగులో, సజ్జలో బొట్ల నిండా వుంటాయి. మీరు ఊఁ అంటే చెప్పండి వాళ్ళను కదిపి చూస్తాను" అంది.
    
    "అలాంటి సంబంధం వస్తే మాకూ సంతోషమే. కానీ మా పరిస్థితి ఎలా వుందో తెలుసుగదా. చిల్లిగవ్వ ఇవ్వలేం.
    
    ఏదో వున్న బంగారం పెట్టి, గుడిలోనో, సత్రంలోనే గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళి జరిపిస్తాం. అంతకంటే మేం తూగలేం-" నాన్న అప్పుడు మాట్లాడాడు.
    
    "నువ్వు! నీ స్థితి నాకు చెప్పాలా అన్నయ్యా! అదంతా నేను చూసుకుంటానులే! అమ్మాయిని చూస్తే ఎవరయినా తన్నుకుపోగలరు లక్ష్మీకళ తాండవిస్తోంది. కట్నాలూ, కానుకలూ వద్దమ్మా అమ్మాయి బావుండీ గుణవంతురాలయితే అంతే చాలు అని పిల్లాడి తల్లి పదే పదే చెప్పడంవల్లే నేను ముందుండడానికి పూలు వేసుకున్నాను. నువ్వేమి దిగులుపడవద్దు. ఆమె కల్లాకపటం లేని మనిషి మన మహితను చూడగానే ఎగిరి గంతేస్తుందనుకో"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS