'ఈమధ్య నీలో ఏదో మార్పు వస్తూ ఉన్నట్లు గమనిస్తూన్నాను.'
'అబ్బే! అటువంటిదేమీ లేదు.'
'లేకపోవడమేమిటి? స్పష్టంగా నీ ముఖంలో కనుపిస్తూ ఉంటేనూ?...'
'......................'
'శాంతా! ఈమధ్య రామం ప్రవర్తన...' అని ఏదో చెప్పబోయి ఆగి పోయాడు.
'ఏమిటి...? చెబుతూ ఆగిపోయావేం?'
'ఆఁ....ఏమీలేదులే!'
'కాదు. చెప్పాలి.' బలవంతం చేసింది సుందరాన్ని.
'రామం అమ్మాయిలతో ఎక్కడెక్కడో కనుపిస్తున్నాడని నలుగురూ అనుకుంటూ ఉండగా విన్నాను. ఈ మధ్య ఆస్పత్రి వైపు కూడా సరీగా రావడం లేదు'
'అలాగా!'
'అవును.'
శాంత జరిగిన సంఘటనలన్నీ ఒక్కటొక్కటే నెమరు వేసుకో సాగింది.
'ఏమిటి.....ఆలోచనలో పడినట్లున్నావు?'
'............................'
'మాట్లాడవేం శాంతా...?'
'ఏం మాట్లాడమంటావు?' అంది వేడి నిట్టూర్పులు విడుస్తూ.
'ఈ విషయం యింతకు ముందే నీదాకా వచ్చిందా...?'
'నేను కళ్ళారా చూశాను. నన్ను మోసం చేస్తున్నాడు.'
'అదేమిటి? నీ నోట వినవలసిన మాట లేనా యివి...! అటువంటి ఆలోచనలు నీకు ఎందుకు కలుగుతున్నాయి? అయినా రామం మగవాడు. వయసులో ఉన్నవాడు. అధికారం, అవకాశం అందుకు తోడుగా ఉన్నాయి.' అన్నాడు సుందరం.
'ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు సుందరం.'
ఆమె ముఖంలో విషాదరేఖలు స్పష్టంగా కనుపించసాగాయి-
తన పాచికపారే సమయం దగ్గరపడుతూ ఉందని సంతోషపడుతూ ఆ భావాలు పైకి కనపడకుండా ఎంతో నేర్పుతో 'ఆఁ ... పల్లెల్లో యిటువంటివన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి. వాటి నన్నింటినీ పట్టించుకో కూడదు.' తేలికగా తీసి పారవేశాడు సుందరం.
'ఎంత మాటన్నాడు సుందరం ...? నీకు కూడా మతి పోతూ ఉందా? ఇటువంటివి మామూలు అంటున్నావేమిటి?' చిరుకోపం ప్రదర్శిస్తూ అంది శాంత.
'మరింకే మనమంటావు శాంతా? ఊరికి మకుటంలాంటివాడే యిలా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆ విధంగా అనుకోవడంలో వింతేముంది?'
'వింతో....సంతో.... నాకు మతిపోతూ ఉంది. ఎటూ నిర్ణయించుకోలేక పిచ్చిదా న్నవుతున్నాను. మాఘమాసంలో నాకు. బావకు పెళ్ళిచేయాలని పెళ్ళిముహూర్తాల కోసం వెదికిస్తున్నాడు నాన్న. బావ ప్రవర్తన చూస్తూ ఉంటే నాకేం చేయాలో తోచడంలేదు.' నిర్లిప్తతతో అంది శాంత.
'ఇటువంటి విషయాలన్నీ చూడవలసి వస్తుందనే నేను మొట్టమొదట ఈ పల్లెటూరికి డాక్టరుగా రానన్నాడు. నీవుకూడా బలవంతం చేయడంతో నిన్ను తృప్తిపరచ డానికి వచ్చాను. లేకపోతే నే నసలే రాకపోయే వాడిని.' విషాదం నిండిన ఆమె కళ్ళల్లోకి ఆశగా చూస్తూ అన్నాడు సుందరం.
'నాకోసం రావడమేమిటి? విచిత్రంగా ఉందే." కనుగ్రుడ్లను విచిత్రంగా త్రిప్పుతూ అంది శాంత.
'నీకోసం కాకపోతే యిక్కడికి వచ్చే వాన్నే కాదు.'
'కృతజ్ఞురాలివి. నా మాటపై మీకింత గౌరవం ఉన్నదన్నసంగతి నా ఊహకు తట్టనే లేదు' అంది శాంత.
అంతలో కాంపౌండరు పిలుపు నందుకొని ఆస్పత్రివైపు నడిచాడు సుందరం. శాంత యింటికి వెళ్ళిపోయింది.
* * *
చల్లని పిల్లగాలివల్ల కలుగుతూన్న కమనీయ సంగీతానికి తోటలోని చెట్లన్నీ తల లూపుతున్నాయి. శాంత సుందరం యిద్దరూ ఆస్పత్రిముందు కుర్చీలలో కూర్చొని కబుర్లలో పడ్డారు.
'శాంతా ఎంతోకాలంగా నీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. కాని ఆ అవకాశం కలగలేదు. నీవేమీ అనుకోనంటే...' సంకోచంతో మాట పూర్తి చేయలేక పోయాడు.
'ఏమిటో ఆ విషయం?' వోరగా సుందరాన్ని చూస్తూ సిగ్గుతో ముద్దబంతి పూవులా ఐపోయి అన్నది శాంత.
'శాంతా! నాకు తెలియకుండా నీవు నా హృదయంలో నివాస మేర్పరచుకున్నావు. ఆక్షణం నుండీ నీవు ఎక్కడికీ పారిపోకుండా ఆ హృదయంచుట్టూ అబేధ్యమైన ప్రహరీ నిర్మించి అహోరాత్రాలు కావలికాయలేక సతమతమౌతున్నాను. నీవు ఊ అంటే నాజన్మ ధన్యమౌతుంది. నీవు కాదంటే జీవితాంతం నిన్నే తలుచుకుంటూ బ్రహ్మచారిగా ఉండి పోతాను. నీ సుముఖత నాకు చక్కని జీవితాన్ని సృష్టిస్తుంది. నీ విముఖత నా జీవితాన్ని సుడిగుండాలలోనికి త్రోసివేస్తుంది' శాంత చేతిని తన చేతిలోనికి తీసుకొని మృదువుగానొక్కుతూ, ఆమె చూపులలో తన చూపులు కలుపుతూ ముఖంలో లేనిదైన్యాన్ని తెచ్చి పెట్టుకుంటూ అన్నాడు సుందరం.
ఎవరైనా చూస్తున్నారేమోనని నలువైపులాబెదురుచూపులతో చూస్తూ, కళ్ళతో తన యిష్టాన్ని వ్యక్తం చేస్తూ సిగ్గుతో తలదించుకొని 'ఎవరైనా చూస్తారు' అని అతని చేతిలో నలిగి పోతున్న తనచేతిని నెమ్మదిగా విడిపించుకుంది. అతని స్పర్శలోని వెచ్చదనానికి హృదయం పొంగిపోతూ ఉండగా తన్మయత్వంతో కళ్ళుమూసుకొని కుర్చీలో వెనుకకు వాలింది.
'శాంతా! ఈ పల్లెటూర్లో నీవేం సుఖ పడతావు? మనుషుల విలువల నర్దం చేసుకోలేని ఈ మూర్కులమధ్య మన మెందుకు? మనమిద్ధరమూ వివాహం చేసుకొని సుఖ సంతోషాలలో విహరిద్దాం. అప్పుడే అన్ని జరిగిపోయినట్లు పగటి కలలు కంటూ ఏవో ఊహ లోకాలలో విహరిస్తూ అన్నాడు సుందరం.
'ఇదెలా సాధ్యపడుతుంది? ఇందుకు నాన్న ససేమిరా ఒప్పుకోడు. పైగా పెద్ద గొడవ చేస్తాడు. బావ మాత్రం ఊరుకుంటాడా?'
'అందుకు ఒక్కటే మార్గముంది శాంతా! నీవు ధైర్యం చేస్తానంటే వ్=చెబుతాను.'
'ఏమిటది....?' ఆదుర్దాతో ప్రశ్నించింది శాంత.
'ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళిపోదాం. హైదరాబాదు లో చక్కగా రిజిస్టరు మ్యారేజీ చేసుకుందాం.'
'అమ్మ బాబోయ్! ఉలికిపాటుతో అంది శాంత.
'అందుకే మొదటే చెప్పాను. ధైర్యం కావాలని.'
'సుందరం, ధైర్యం వహించడం , వహించక పోవడమనే సమస్య కాదు. ఆ విధంగా చేసి శాశ్వతంగా నాన్నకు దూరం కాలేను. నలుగురి లో 'శాంత యిలా చేసింది.' అనే చెడ్డ పేరు తెచ్చుకోలేను. ధైర్యంగా నాన్న నేదిరిస్తాను. ఆయనే మన వివాహం జరిపించేటట్లు చూస్తాను. నీవు చెప్పినట్లు చేస్తే శాశ్వతంగా మనకు ఈ ఊరితో ఋణం తీరిపోతుంది. అది నా కిష్టం లేదు' ముఖాన్ని గంబీరంగా మార్చుకుంటూ అంది శాంత.
'అదంత తేలికైన విషయంలా నాకు తోచడం లేదు.'
'ఎందుకు కాదు.....? నేను వద్దని మొండి కేత్తుతే బలవంతంగా బావకు, నాకు వివాహం జరిపిస్తాడా నాన్న? అలా ఎప్పటికి చేయలేదు. బావ కూడా చాలా అభిమానం, పౌరుషం గలవాడు. తనను మనస్పూర్తిగా కోరని స్త్రీ ని వివాహ మాడడానికి ముందుకు రాదనీ నా ఊహ.'
'అది ఊహ మాత్రమె! ఒకవేళ మన యిద్దరి మధ్య రామం పట్టుదలతో అడ్డు గా నిలుస్తే.......?'
'అప్పుడు వేరే మార్గమేదైనా ఆలోచిద్దాం. అంతేకాని పెద్దవాళ్ళ కు తెలియజేయకుండా నిన్ను వివాహమాడడం నాకే మాత్రం యిష్టం లేదు .' ఏవో ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరౌతూ అంది శాంత.
'సరే శాంతా! నీ యిష్టమే నా యిష్టం నీకు మాత్రం నేను ఎదురు చెప్పను' శాంత తనది కాబోతున్నదనే సంతోషంతో పొంగిపోతూ తన్మయుడై పోయాడు.
* * *
