"అవును , పాపం!"
"ఏమిటా పాపం! మనం పుట్టి ఇంట్లో వాళ్ళనీ, వూళ్ళో వాళ్ళని ఉద్దరిస్తున్నామా? మనకి పుట్టేవాళ్ళు ఇంకా ఉద్దరిస్తారు." అన్నది వసుంధర.
"అయితే పిల్లలంటే అంత యిష్టం లేని దానివి ఎందు'క్కడుపుతో ఉన్నావ్, నాతొ చెప్పకుండా?" గంబీరంగా ముఖం పెట్టి అన్నాడు రమేష్.
"బావుంది! నేను కడుపుతో ఉంటున్నాను అని చెప్పి ఉంటారా?" అన్నది వసుంధర ముఖం చిట్లించి.
"వసూ?"
"ఏమండీ?"
"శారద కులాసాగా ఉంటున్నదా?"
"ఏం ఇప్పుడు శారద గుర్తొచ్చింది?"
"ఏం లేదు. నా జీవితంలో అనుకోని సంఘటన శారద పెళ్లి. ప్రయాస లేకుండా అయిపొయింది. అనుకుంటున్న సురేంద్ర పెళ్లి కావడం లేదు. మళ్ళీ యీవేళ పెద్ద ఉత్తరం రాశాడు వాళ్ళ నాన్న మనసునీ, మేధ నూ, పార్టీ తత్వాన్ని వర్ణిస్తూ."
"ఏమంటారు రామయ్య గారూ?"
"ససేమిరా ఈ పెళ్ళికి -- అంటే శ్యామసుందర్ని సురేంద్ర చేసుకోవటానికి ఒప్పుకోడట.
"మరి శ్యామసుందరి ఏమంటున్నది?"
"ఇద్దరూ సత్యాగ్రహం సాగించ బోతున్నారట!"
"బాగుంది. సరేగానీండి. దానిమ్మ పండు ఎందుకండీ కడుపు తో, ఉన్నవాళ్ళు తినడం?"
"చక్కగా పుల్లగా, తీయగా, వగరుగా ఉంటుంది."
"అది కాదు సెంటిమెంటల్ గా ఏమయినా విశిష్టత ఉన్నదా?"
"ఆహా ఉన్నది. నాకు తెలిసినంత వరకూ ..."
"ఏమిటది?"
"దానిమ్మ పండులో ఎన్ని గింజలు న్నాయో అంతమంది పిల్లల్ని కనమని.
"చచ్చా, బ్రతికా అంతమంది పిల్లలు! అది కాదు గాని, నిజం చెప్పండి."
దానిమ్మ పండులో ఎర్రగా కెంపు ల్లాంటి గింజలు నిగనిగలాడుతూ చక్కగా, వరసగా తీరుగా ఉంటాయి. మానవ జీవితం కూడా దానిమ్మ పండు లాంటిదే.
ధర్మం, అధర్మం, సత్యం, అసత్యం, ధనం, ధాన్యం, విద్య, ఓర్పు, క్షమా గుణం, అహంకారం, గర్వం, మంచితనం, కామ క్రోధ లోభ మోహ మద వాత్సల్యాలు , సత్వ రాజస్త మోగుణాలు , శక్తి, భక్తీ, రక్తి, ముక్తి, ఇట్లా అన్ని రకాల విషయ వాంఛలూ ఉంటయ్యి. అట్లాగే, భార్య, భర్త, తండ్రి, తల్లి, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, హితులు, స్నేహితులు, విరోధులు, ప్రేమించిన వారు, ప్రేమింప బడిన వారు ఇట్లా రకరకాల బందావ్యాలు కల వివిధ రీతుల మనుష్యులు ఉంటారు. ఇట్లాంటి విషయా వాంఛలతో, బందుత్వాలతో మానవజీవితం ఇమిడి ఉంది. ఇన్ని సంఘటిత విషయాలు ముద్దగా చేయ బడటమే మానవ జీవిత పరమావధి. ఇన్ని సంఘటనలు సంఘటిత పడితేనే మానవజీవితం వెళ్ళిపోతుంది. అట్లాంటి విభిన్న మనస్తత్వాలు కల అందరూ మానవులకు దానిమ్మ పండంటే ఎంతో ప్రీతి. ఎటువంటి మనస్తత్వం కల వారయినా దానిమ్మ పండు లోని కెంపు ల్లాంటి గింజలను చూచి మురిసిపోయి చక్కగా వలుచు కొని తింటారు. అందరి మనస్తత్వాలనూ సంఘటిత పరుచుకుని కెంపు ల్లాంటి గింజలతో సర్వేజనానురంజ కంగా ఇన్ని తరహాల మనస్తత్వాలు గల మానవుల కూ ఇష్టాన్ని కలిగిస్తూ , అందరినీ సంఘటిత పరచడమే దానిమ్మ పండు లోని విశిష్టత. దానిలో పులుపు, తీపి, వగరు, కమ్మదనం అన్నీ ఉన్నయ్యి. అన్ని రుచులూ ఉన్నయ్యి. దానిమ్మ పండు ఇంత విశిష్టతను సంతరించుకున్నది కాబట్టే, ఇన్ని తరహాల మనుష్యులకూ జీవాన్ని ప్రసాదించే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా దానిమ్మ పండునే కోరుతారు. నీకు దానిమ్మ పండంటే యిష్టం లేదా?" అన్నాడు రమేష్.
"సయించ కేం?సయిస్తయ్యి. రేపు మూడు దానిమ్మ పండ్లు పట్రండి. ఒకటి శారదకు, ఒకటి శకుంతల కు, ఒకటి నాకు. మరి మీకో?" అన్నది వసుంధర.
"నాకీ దానిమ్మ పండ్లు చాలు" అంటూ ఆమె బుగ్గలను ముద్దు పెట్టుకున్నాడు రమేష్.
* * * *
వసుంధర పురిటికి వెళ్ళిన తరువాత వారం రోజులకే కామాక్షి అత్తవారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. కామాక్షి మామగారు పోయారని. కామాక్షి భర్త పోయిన తరువాత రెండు కుటుంబాల వాళ్ళకూ ఎక్కువగా ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు. కామాక్షి కి మనోవర్తి కి ఇచ్చిన రెండెకరాల పొలం లోని అయివేజు ధాన్యం అమ్మి వాళ్ళే సంవత్సరానికి వోసారి డబ్బు పంపుతున్నారు. అంత మినహా ఉత్తరాలు లేవు. ఇప్పుడు హటాత్తుగా ఈ ఉత్తరం వచ్చేసరికి కామాక్షి ఎంతో విచార పడ్డది.
"మీ బావగారు పోయినప్పటి నుంచీ వాళ్ళకూ మనకూ సంబంధ బాంధవ్యాలూ అంతగా లేకపోయినా, నేను వారింటి కోడలినే కదా? నా ముఖాన భగవంతుడు ఈ రాత రాసినా, నన్ను ఫలాని వారి కోడలే అంటారు. పెళ్ళిళ్ళ కి వెళ్లక పోయినా మామగారి చావు కైనా పోకపోతే నలుగురి లోనూ బావుండదు. నేను వెళ్లి కర్మ కాండలన్నీ అయాక వస్తానురా" అన్నది కామాక్షి రమేష్ తో.
"నువ్వింతగా చెప్పాలా అక్కయ్యా? అవశ్యం వెళ్ళిరా. మాట కలకాలం ఉంటుంది. ఇవ్వాళే బయల్దేరు " అన్నాడు రమేష్.
"నే వచ్చేటంతవరకూ ఈ పది రోజులూ హోటల్లో నే భోజనం చెయ్యి" అన్నది కామాక్షి. తమ్ముడు భోజనానికి ఎక్కడ యిబ్బంది పడతాడో నని. కామాక్షి మనస్సు ఎంతో సున్నిత మైంది. తనకు మనస్సు కు కష్టం తోచినా సహించ లేదు. ఎదుటి వాళ్ళ మనస్సు కష్ట పడుతున్నా ఆమె ప్రాణం ఒప్పదు.
"నా భోజనం విషయం నే చూచుకుంటా గాని నువ్వు ఈ రాత్రి బండికే వెళ్ళు. నేను రైలెక్కిస్తాను" అన్నాడు.
ఆ రాత్రి బండికే కామాక్షి అత్తవారి ఊరు వెళ్ళింది.
కామాక్షి వెళ్ళిన మర్నాటి నుంచే హోటల్లో భోజనం చేస్తున్నాడు రమేష్. మూడో రోజున రామారావు భోజనానికి పిలిచాడు. మాట తీసేయ్యలేక భోజనానికి వెళ్ళాడు రమేష్.
శారద పెళ్ళయి కాపురానికి వచ్చిన తరువాత రమేష్ ఎప్పుడూ రామారావు యింటికి వెళ్ళలేదు. ఆరోజే మళ్ళీ వెళ్ళడం.
భోజనం దగ్గర రామారావు నవ్వుతూ అన్నాడు.
"రమేష్, ఇవ్వాళ నా జీవితం లోనూ, శారద జీవితం లోనూ పెద్ద పండుగ."
"ఏమిటో విశేషం?"
"ఏముంది? శారద కూడా దానిమ్మ పండు కావాలంటుంది. అదే విశేషం. "ఎంతో సంతోషంగా ఆ సంగతి చెప్పాడు రామారావు. శారద ఆ మాటలకు ఎంతో సిగ్గుతో కుంచించుకు పోయింది.
రమేష్ కూడా నవ్వుతూ ఆ భార్య భర్తలను అభినందించాడు.
ఆ రాత్రి కూడా రామారావు, రమేష్ ను భోజనానికి రమ్మన్నాడు. రమేష్ ససేమిరా రానన్నా శారద పదేపదే చెప్పడం వల్ల తప్పించుకోలేక పోయాడు.
ఆ రాత్రి కూడా భోజనాలయిన తరువాత రామారావు బలవంతం మీద ఇద్దరూ సినిమా కు వెళ్ళారు.
సినిమా చూస్తున్నాడే గాని రామారావు కు మనస్సు సరిలేదు. మధ్యలోనే వెళ్లి పోదామన్నాడు. రమేష్ కూడా సరే నన్నాడు. ఇద్దరూ హాలు బయటికి వచ్చేశారు. వెన్నెల్లో ఇద్దరూ మెల్లగా నడిచి వస్తున్నారు.
"రమేష్, ఎంతో కాలం నుంచి నీతో ఒక సంగతి చెప్పాలను కుంటున్నానోయ్."
"ఏమిటది?"
"నే చెప్పే విషయాలు నువ్వు మనస్సు లోనే ఉంచుకోవాలి. నేను మిమ్మలనందరినీ మోసగించి నందుకు నన్ను క్షమించాలి. చిన్నవాడి వయినా నిన్ను పదేపదే అర్ధిస్తున్నా" అన్నాడు రామారావు.
రమేష్ కు ఇదంతా ఏమిటో అర్ధం కావటం లేదు. ఆ మోస మేమిటో అంతకన్నా తెలియలేదు. అసలు ఇంతకూ జరిగిందేమిటో చెప్పమన్నట్టు ఆదుర్దాగా చూశాడు రమేష్.
"ఏమీ లేదు. నేను ఇంకో ఆర్నెల్ల ల్లో...." ఇంక చెప్పలేక పోయాడు రామారావు. అతని గొంతు పూడి పోయింది. మాట పెగిలి రాలేదు. రమేష్ ఎంత అడిగినా తరువాత విషయాలేం చెప్పలేదు. నడుస్తూనే దారిలో రిక్షా చేసుకుని ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చాక రమేష్ ఎంతో బ్రతిమాలుతూ అడిగాడు. కాని రామారావు చెప్పలేదు.
"ఈ రహస్యం నాతోనే అంతరించి పోనీ" అన్నాడు రామారావు. ఇంక చేసేది లేక రమేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు.
అప్పట్నుంచీ రమేష్ కు మనస్సు లో ఎందుకో దిగులుగానే ఉంది. ఏమిటో అర్ధం చేసుకోలేక పోయాడు.
కొంతమంది వ్యక్తుల మనస్తత్వాలు విభిన్న రీతుల్లో పడిపోయి ఆ వ్యక్తీ కి సుఖ సంతోషాలను కలుగ చెయ్యవు. ఎవ్వరో ఏదో చెప్పారనీ, అది అక్షరాలా జరిగి తీరుతుందని వారి మనస్సులో ఎప్పుడూ పీడిస్తూనే ఉంటుంది. వ్యక్తుల అవసరాల మీదా, గుణగుణాల మీద నమ్మకం పెట్టుకోవడం సహజమే. శాస్త్రకారులు అనేక విషయాలు చెబుతారు. అనేక రీతులుగా గణితం వేస్తారు. జరుగబోయే చెడ్డ పరిస్థితులు తప్పించు కోవడానికి చేయవలసిన విధానాలు చెబుతారు. వారి బాధ్యత అంతవరకే. కాని వినేవ్యక్తి మనస్తత్వం మీదనే ఆ చెప్పిన మంచి చెడ్డలు కూడా జరుగుతాయని కొంతమంది వ్యక్తుల విషయంలో అనుకోవచ్చు.
రాజ్జువును సర్పంగా భావించి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళూ ఉన్నారు. సర్పాన్ని రజ్జువు గానే భావించి బ్రతికి బయట పడ్డ వాళ్ళూ ఉన్నారు. అందుకనే కష్టాల కయినా, సుఖాల కయినా మనస్సు నిబ్బరాన్ని మించిన మహత్తర విషయం లేదు. కాని ఆ నిబ్బరమే నూటికి తొంబై మందికి ఉండదు. మనశ్శాంతి కి నిబ్బరం దివ్యమైన ఔషధం. నిబ్బరం లేనివాళ్ళకు శాంతి వచనాలు కూడా విష తుల్యంగా నే కనబడతాయి. అదే కొంతమంది వ్యక్తుల్లో గల మనో దౌర్భల్యం. ఆ మనో దౌర్భల్యం తోనే మానసికంగా కృశించి పోతున్నాడు రామారావు. అతని మానసిక వ్యధ ఏమిటో తెలియక మధనపడుతున్నాడు రమేష్.
