27
పెరట్లో అరుగు మీద నిలబడి ఉత్తరాన్ని చదువుకుంటున్నది సరస్వతి.
పెరటి పంచ లో చిన్న పిచ్చికలు గడబిడ చేస్తున్నాయి. తండ్రి అప్పుడప్పుడు దగ్గు తున్నాడు లోపల గదిలో.
పదిహేను రోజులుగా నరసింహం గారి ఒంట్లో బాగుండలేదు. రెండు రోజులై వైద్యుడు వచ్చి మందు ఇచ్చి వెళ్తున్నాడు. తనకూ ఏమాత్రం జబ్బు చేసినట్టు తోచినా సరస్వతి గురించి బెంగ పెట్టుకొంటాడాయన. మానసికంగా నీరసించి పోతున్నాడు. ఆయనకు జ్వరం వచ్చింది. లాగాయతు సరస్వతి కి నిద్ర లోపించింది. కాచుకొని ఉండడం, సేవ చెయ్యడం తోనే రోజు రోజూ గడుస్తున్నది.
పార్వతి వ్రాసిన ఉత్తరాన్ని ఆమూలాగ్రం చదివి నవ్వుకుని దాన్ని మదిచింది.
పడమటి కొండల మీద వింత తేజస్సు కనిపిస్తున్నది. మానులకు అల్లుకున్న తీవెలు వేడి గాలికి వాదిపోతున్నాయి. ఇళ్ళ వరసలకు దూరంగా చిన్నచిన్న గుట్టల్లాగా గుడిసె లగుపిస్తున్నాయి.
కొద్దిసేపా సుందర దృశ్యాన్ని చూచి తండ్రి దగ్గరకు వెళ్లి అయన దుప్పటి సరి చేసి పక్కను కూర్చుంది. తండ్రి జ్వరం ఇంకా తగ్గలేదన్న బెంగ మనసులో పీడిస్తున్నది. పట్నం నుంచి డాక్టర్ ను తీసుకు వచ్చే ప్రయత్నం కూడా చేసింది సరస్వతి. ఒకసారి వచ్చి మందిచ్చి మళ్ళీ రెండు రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళాడా డాక్టరు.
"డాక్టర్ని మళ్ళీ ఎలాగైనా తీసుకురమ్మని చౌదరి గారితో చెప్పాను , నాన్నా!" అన్నది సరస్వతి.
"డాక్టరెందు కమ్మా ఇంకా? పోయే ప్రాణం అతగాణ్ణి చూసి నిలుస్తుందా?"
"అలా అనకండి నాన్నా!" అన్నది సరస్వతి గద్గదికంగా.
"పార్వతి ఉత్తరంలో ఏం వ్రాసిందమ్మా?" అని అడిగిన తండ్రి మాటకు ఉలిక్కి పడింది. "క్షేమంగా ఉన్నదట. నన్నూ ఉత్తరం వ్రాయమంది." అని జవాబిచ్చి తండ్రి కాళ్ళు పట్టుతూ పార్వతి వ్రాసిన ఉత్తరాన్ని నెమరు వేసుకుంది.
రాధాకృష్ణ తనను పెళ్లి చేసుకుంటానన్నాడట! సవస్వతి గుండెలు రెండు క్షణాలు గబగబా కొట్టుకున్నాయి.
పైగా అతడే మొదట తన అభిప్రాయాన్ని చెప్పాడట. ఐతే ఈ కొంటె పిల్ల తన ఫోటో ఇచ్చింది! దానికి బావగారు కెమెరా కొనివ్వటమే వచ్చింది.
మొదట పార్వతి రాధాకృష్ణ ను గురించి ఉత్తరం లో వ్రాసినప్పుడే సరస్వతి కి అతని పై సదభిప్రాయం కలిగింది. అనక అడపా తడపా పార్వతి వ్రాసే ఉత్తరాల్లో అతని ప్రసక్తి తప్పకుండా ఉండి తీరుతుంటే ఆమె అనుమానించింది కూడా -- చెల్లి ఉద్దేశ్యం ఏమై ఉంటుందా? అని. ఆఖరికి ఇందులో సారాంశం తేల్చింది.
'రాధాకృష్ణ కోరినా, పార్వతి ఎంత పట్టుబట్టినా అతనితో పెళ్ళికి అంగీకరించగలదా? కానీ-- ఎంతో పుణ్యం చేసుకున్న స్త్రీ అతన్ని భర్తగా పొందగలదు' అనుకుంది సరస్వతి.
గుడ్డిగా వెలుగుతున్న ఆశాజ్యోతి శక్తి పుంజుకుంది -- ఏ ధర్మ హృదయులు ఆ జ్యోతికి ఆధారంగా తైలం పోశారో కానీ!
28
రోజులు నిస్సారంగా ఉత్సాహరహితంగా ఉన్నా గానీ కాలచక్రం అమిత వేగంగా పరుగెడుతున్నట్లు అనిపిస్తుంది పార్వతికి.
చేతిలోని పుస్తకం చదువుతున్నదల్లా ఒక క్షణం కనురెప్పలు మూసుకుంది ఆ అమ్మాయి. తర్వాత తిరిగి చదవ నారంభించింది.
కవిత రచనలు పార్వతి అంతర్యంలో నూతన భావాలను విరజిమ్ముతున్నాయి. ఆపైన శిష్ట భాషా ప్రయోగం కలిగిన ఆమె ఆధునిక ధోరణి అప్రయత్నంగానే పార్వతిని సాహిత్యభిముఖురాలుగా చేసింది.
రాధాకృష్ణ బలవంత పెట్టగా , సుభద్ర గారూ ఒకమాదిరిగా మెచ్చుకోవటం వల్ల-- జాప్యం చేసి చేసి ఒక రోజు చదవటానికి పూనుకుంది కవిత సాహిత్యాన్ని. అప్పటి నుంచి కాదనుకున్నా అప్రయత్నంగా చదువుతూ ఉంది.
'తనలో రేగే పరితాప నిర్వేదాలకు ప్రతిబింబాల్లా ఉంటాయి ఈమె రచనలు' అనుకుంది పార్వతి. తన ఆలోచన ఫలితంగా మిగిలేవి ప్రశ్నలు మాత్రమే. కవిత భావాల్లో అన్వేషణ ఉంటుంది. అదే ప్రశ్నలుగా, సమాధానాలుగా కూడా తోస్తుంది.
రాజు బయటి కేక్కడికో వెళ్ళాడు. పాప తోటలో నులివెచ్చని ఎండలో తిరిగి తిరిగి వాడిపోయి వచ్చి ఇల్లంతా కలయ తిరుగుతున్నది అట వస్తువుల కోసం.
పార్వతి కవిత వ్రాసిన కధను చదువు తున్నది. అందులో సున్నితమైన జీవిత సత్యం ఇమిడి ఉంది. సాహిత్యం ఏకాగ్రంగా చదువుతుంటే ఉత్సాహం ఇనుమడించడం సహజం.
పాప ఏవో పచ్చీ రాని పాటలు పాడుతూ ఆడుకుంటున్నది.
"వైర్ సార్" అన్న కేకతో కంగారుగా లేచింది పార్వతి. మెదడులో రైళ్ళు పరుగెత్తసాగాయి.
సంతకం చేసి తీసుకుందే గానీ , చూడడానికి గుండె అడిరిపోతున్నది. నాలుగు నెలల కిందట సరస్వతి ఒక ఉత్తరం లో నాన్నగారికి సుస్తీగా ఉందని వ్రాసింది.
నిబ్బరించుకుని తెరిచి చూసింది.
పార్వతి లోని దృడత్వమంతా ఒక్క క్షణం లో క్షీణించి పోయింది. "నాన్నా" అని గట్టిగా అరిచి తల గోడ కేసి కొట్టుకుంది. శక్తి హీనంగా అక్కడే కూలబడిపోయి ఏడ్చింది.
హటాత్తుగా జరిగిన సంఘటనకు పాప హడలిపోయింది. బిక్క మొగంతో మెల్లగా దగ్గరికి వచ్చి, కింద పడి పొర్లుతూ ఏడుస్తున్న పార్వతి ని ఏదో అడగబోయింది. అంతలో ఏమనుకుందో -- వీధిలోకి పరిగెత్తింది.
ఇంతలో లోపల పని చేసుకుంటున్న లచ్చి కూడా గాభరాగా వచ్చి, దృశ్యం చూసి విస్తుపోయింది.
పార్వతి ముఖం పూర్తిగా కందిపోయి చెక్కిళ్ళు తడిసిపోయాయి. లచ్చిని చూచి లేచి నిలబడింది. తెల్లబోయిన లచ్చి చేతిలో తాళాలు ఉంచుతూ ఇల్లు చూస్తుండమంది. మరేం అనలేదు. లచ్చి స్థాణువై నిలుచుండి పోయింది.
పార్వతి తన పెట్టె తెరిచి అందులో తన తాలుకూ బంగారపు ఉంగరాన్ని తీసుకుని లచ్చి చూస్తుండగానే తిన్నగా స్టేషన్ వైపు నడిచింది.
ఎలాటి వలా వదిలి ఒక్క దుఃఖ భారంతో నే వాయు వేగంగా నడుస్తున్న పార్వతి లో ఒక్కమాట పని చేస్తున్నది. అందుకే -- "నాన్న చనిపోయారా? నాన్న చనిపోయారా?" అని మధ్య మధ్య అనుకుంటూనే ఉంది. వ్యాకులం గా ఉంది హృదయంలో.
హటాత్తుగా , అనుకోని విధంగా జరిగే కొన్ని హృదయ విదారక సంఘటనలు నిజమని తెలుస్తున్నా అపనమ్మకాన్ని కలిగిస్తాయి.
* * * *
రెండు చోట్ల రైలేందుకో గంటల తరబడి నిలిచిపోయింది.
పార్వతి వెళ్లేసరికి నరసింహమూర్తి గారి దేహాన్ని అప్పుడే దహన సంస్కారం నిమిత్తం తీసుకు వెళ్ళిపోయారు. రాత్రి మూడు గంటల సమయంలో పోయాడాయన. పార్వతి కోసం చూసి ఇంకాస్సేపు అలాగే ఉంచితే , సరస్వతి దుఖం తో వెర్రెత్తి పోతుందని తొందరపడి తీసుకు వెళ్ళారు.
సన్నని వాన తుప్పర పడుతున్నది.
దుఖమో, ఆవేదనో-- కంట నీరు మాత్రం లేదు. సంగతి తెలియగానే చప్పున వెనక్కు తిరిగింది పార్వతి. శ్మశానం వైపుగా నడిచి పోతున్న ఆ అమ్మాయిని చూచి ఆశ్చర్య పోయారందరూ. పల్లెటూరి ఆడవాళ్ళు నలుగురూ పార్వతిని ఒడిసి పట్టుకుని ఇంటికి లాక్కు వచ్చారు.
ఘనీభవించిన కన్నీటితో పార్వతి బాధ పడుతున్నదని గ్రహించిన హృదయాలు జాలి పడ్డాయి.
వసారా లో ఆ పల్లెటూరి పెద్దలు కొందరు ఆడవాళ్ళ కు తోడుగా నిలబడి ఉన్నారు.
సరస్వతి ని చూడగానే పార్వతికి తన నెవరో ఒంటరిదాన్ని చేసినట్టనిపించింది.
కొందరు స్త్రీలు స్తంభాల్లా నిలబడి అనేక భంగిమల్లో చూస్తున్నారు. వసారా అంతా మగవాళ్ళు ఆక్రమించారు.
అంతటా మౌనం. తనను కొందరు ఆడవాళ్ళు ఒదార్చ ప్రయత్నించి ఏవో వైరాగ్యపు మాటలు అంటున్నా, అక్కడ అంతా మృత్యు గంబీర్యం అలుముకున్నట్టు తోచింది పార్వతికి.
ఆ నిశ్శబ్ధత ను ఎవరూ సడలించలేరు కొన్నాళ్ళ వరకు. తన మనోవేదన ప్రతి వస్తువు లోకి జారి, అవన్నీ దిగులుగా కనిపిస్తున్నాయి. బయట వర్షం -- అనంత దుఃఖ భాష్పాలకు ఉపమానం లా కురుస్తూ ఉంది.
పార్వతి విషాద మూర్తి లా ఉన్న సరస్వతి భుజం మీదకు వాలింది. కళ్ళతో నీళ్ళు సుళ్ళు తిరిగాయి.
సరస్వతి నవారు మంచం మీద గోడ వైపు తిరిగి పడుకొని ఉంది. చెల్లెలి కంఠం గుర్తించి కళ్ళు విప్పినా, మాట్లాడలేదు. దృష్టి గోడ మీద ఉన్నది. ఆ అమాయకురాలి చూపు ఎక్కడ సంచరిస్తున్నదో తెలుసుకోవడం కష్టం. అభిముఖంగా లేకపోవడం వల్ల ఆమె కళ్ళ లోతులు అక్కడ ఎవరికీ కనిపించడం లేదు.
సరస్వతి కాళ్ళ దగ్గర జానకమ్మ కూర్చొని ఉంది. అదృష్టవ శాత్తు ఆమె అన్నగారి రూపాన్నోకసారి చూసుకొనగలిగింది.
"మామూలు జ్వరం వచ్చి తగ్గుతూ హటాత్తుగా ముమ్మరించిందటమ్మా! వాడు పోయే వేళకి సరస్వతి ఒక్కతే ఉన్నదింట్లో." జానకమ్మ కన్నీరు తుడుచుకుంటూ పార్వతి తల నిమిరి దగ్గరికి తీసుకుంది.
అకస్మాత్తుగా పార్వతి చేతిని తన చెక్కిలి మీదికి లాక్కుని, సరస్వతి , తలను తలగడ లో దూర్చి గుండెలు పగిలిపోయేలా ఏడవ నారంభించింది.
ఆత్రుతగా వచ్చి పడిన రాజు ఇంట్లోని దృశ్యం చూసి నిశ్చేష్టుడై పోయాడు. స్నానం చేసి వచ్చిన రామనాధం గారు రాజును స్నానం చేయమని లోపలికి తీసుకు వెళ్లి ఏదో కతికించారు.
రాత్రి ఏడు గంటల వేళ. ధారాపాతంగా కురుస్తున్న వర్షాన్ని కననివ్వడం లేదు బయటి అంధకారం. పురుగుడు పిట్టల అరుపులకు కప్పలు పోటీ పడుతున్నాయి.
అటువంటి సమయాన భర్తతో , పిల్లలతో దిగింది లక్ష్మీ. వీధి వసారా లో మంచం మీద కూర్చున్న రాజు కంగారుగా లేచాడు.
లక్ష్మీ దుఃఖానికి అవధి లేదు. బయట వర్ష దారాలకు , నిరర్గళంగా కురిసే లక్ష్మీ కన్నీటి ధారలకు భేదం లేదు. వాళ్ళు కొంతదూరం విమానం లో ప్రయాణం చేసి, తర్వాత రైలెక్కి వచ్చారు.
చాలాసేపటి కి గానీ లక్ష్మీ దుఃఖం ఉపశమించ లేదు. నిద్రపట్టే పర్యంతం తనను తను నిందించుకుంటూ కుములుతూనే ఉంది లక్ష్మీ. తండ్రికి తను దూరంగా ఉండి మరిచిపోవడం వల్లనే ఆయన్ను మళ్ళీ చూడలేక పోయానని ఆమె అంతర్గత వేదన.
అందరూ ఊరట చెందేసరికి చాలా రాత్రి గడిచింది.
"ముగ్గురు బిడ్డల సంపూర్ణ ప్రేమను పొంది వెళ్ళిపోయిన నరసింహం ధన్యుడు' అనుకుంటూ మేను వాల్చారు రామనాధం గారు.
బయట వర్షం కాస్త వెలిసింది. కానీ మళ్ళీ ఉదృతంగా పడబోతున్న దనడానికి నిదర్శనంగా మబ్బులు దట్టంగా వ్యాపించి ఉన్నాయి ఆకాశమంతా.
