Previous Page Next Page 
అర్పణ పేజి 32


    ఆమెను పంపించి తలుపు వేసుకుంది. విద్యిద్దీపాల వెలుగులో కృష్ణుడి చిత్రపటం అందాలు చిందిస్తున్నది వివిధ కాంతులతో.
    టేబిల్ పైన తల అనించుకు కూర్చుంది పార్వతి. 'శేఖర్ ఇంత పశువు లాంటి వాడనుకో లేదు. అటువంటి వాడితో స్నేహం కలిగి ఉన్నందుకు సిగ్గు పడవలసిందే."
    పార్వతి తల ఎత్తింది నిర్విశేషంగా.
    చిత్రపటంలోని కృష్ణ రూపం మనోహరంగా హృదయంతర్భాగాన హత్తుకుంటున్నది. అర్ధం కాని మనః పరితాపం భగవంతుణ్ణి ప్రశ్నలు వేస్తున్నది.
    "నిస్సార జీవితాన్నిలా కొందరి కిస్తావెం, భగవాన్? నీ నవ్వు లేమిటో -- అర్ధాలు నాకు తెలియటం లేదు. నిన్ను గురించి నాకేమీ తెలియని మాట నిజమే గానీ, పన్నెండు కిలా అనవసరంగా సృష్టించావో అది చెప్పు, ముందు. నువ్వు నా కళ్ళ కగుపిస్తే నీ వెంట ఎక్కడికి రావడాని కైనా అభ్యంతరం ఉండదు నాకు. అలా సులభంగా కనిపించవుగా! రాదా లోలుడివై ఎక్కడో దాగి వున్నా నీ సృష్టి లో ఒక మనిషి నిన్ను గురించే ఆలోచిస్తున్నదని నీకు తెలిసి ఉండదా? నీకన్నీ తెలిసి ఉన్నట్లే నాకు అనుమానం. ఇదివరకు లేని ఏదో భావ బంధనం నన్ను నీ యెదటికి తెచ్చి నిలబెడుతున్నది. అనుదినం నీ ఆరాధన చేస్తున్నట్టే ఉంది. ఏనాటి కైనా ఆదరంతో నన్ను స్వీకరించే వాడిని నువ్వే ననిపిస్తున్నది, స్వామీ?"
    గోడనున్న మరో చిత్ర పటం మీది పువ్వు పార్వతి తల దగ్గర పడింది. ఈ ఆలోచనల వల్ల పార్వతి కి అవ్యక్తమైన తృప్తి కలిగింది. ఆమెలో ఆధ్యాత్మిక భావాలు చెలరేగుతున్నాయి. కొద్ది రోజులుగా. భగవానుని తలిచి నప్పుడంతా తనలో ఒక ప్రత్యేకత గోచరిస్తున్నది పార్వతికి. ఆ సుఖం అమెచేత మౌనాన్ని, నిశ్శబ్ధత ను వాంచింప చేస్తున్నది. అని లభ్యం కావడం లేదు.
    పార్వతి లేచి అల్మారా లోని బిస్కెట్లు తిని మంచినీళ్ళు తాగి పడుకుంది. ఆ రాత్రికి వండుకోవడం శ్రమ అనిపించిందా ఆమ్మాయికి.
    పడుకుందే కానీ నిద్ర రాలేదు. ఆలోచనల వాడి కత్తులు నిద్రా దేవతను బెదిరించి తరుము తున్నాయి గమ్మత్తుగా. శేఖరం సంగతి , అతని మూర్ఖత్వం మాట అలా ఉండగా -- రాధా కృష్ణ, సరస్వతి -- ఇద్దరూ పార్వతి మనః పధం లోకి వస్తున్నారు మాటిమాటికి.
    వారి జీవితాలు బాగు పడతాయి. సరస్వతి అదృష్ట వంతురాలు. మరి తన జీవితం?' అనుకుంది పార్వతి. నిద్ర కమ్ముకు రాగా పక్కకు తిరిగి పడుకున్నది పది గంటలకు.

                                 

                                  25
    లలిత లవజ్గలతా పరిశీలన
        కోమల మలయ సమీరే
    మధుకర వికర కదమ్బిత కోకిల
        కూజిత కుంజ కుటీరే
    విహరతి హరిరిహ సరస వసన్తే
        నృత్యతి బృందవనాంతే
    యువతి జనేన సమం సఖి    
        విరహి జనన్య దురన్తే!

    వీధిలో బూట్ల చప్పుడు కు, కుర్చీ ఎక్కి చిత్ర పటానికి పువ్వులు పెడుతున్న పార్వతి , వెనక్కు తిరిగి చూచి వెంటనే దిగింది కిందికి.
    గుమ్మం దగ్గరున్న వ్యక్తిని ఆమె ఎరగదు.
    "రాజు ఉన్నాడా అండీ, ఇంట్లో?' అన్నదా ఆగంతకుడు.
    "ఉన్నారు. ఈ కుర్చీలో కూర్చోండి -- పిలుస్తాను." ఆహ్వానించి గబగబా లోపలికి వెళ్ళింది పార్వతి.
    వెళ్ళుతున్న ఆ అమ్మాయిని ఆశ్చర్యంగా చూశాడు పద్మ చరణ్. అతను గుమ్మం లో అడుగు పెట్టగానే కనిపించినవి పార్వతి రెండు జడలూను.
    "రెండు జడలు , చెవులకి రింగులు, బొట్టు లేని మొహమూ, ఫాషనబుల్ చీరా.........మరి రాజు?' గొణుక్కున్నాడతను.
    ఇంతలో రాజు చిరునవ్వు నవ్వుతూ ప్రత్యక్ష మైనాడు. పద్మ చరణ్ రాజు పలకరింపులు పట్టించు కోకుండా అతడిని నఖ శిఖ పర్యంతం పరీక్ష చేయ నారంభించాడు. పూర్వపు ఉత్సాహమూ, నిండు తనమూ ఏమైనట్టో కానీ, చిక్కిపోయినట్టు అగుపించాడు రాజు పద్మ చరణ్ కళ్ళకు.
    పద్మ చరణ్ రాజు మీద అభిమానం ఏర్పరచు కున్నాడు. అతడు దేనికైనా మనసులోనే బాధ పడతాడు. అందుకే వినిపించకుండా నిట్టూర్చి రాజు వెంట అతని గదిలోకి వెళ్ళాడు.
    చాలా విషయాలు దోర్లిపోయాక , "నువ్వెందు కిటువంటి పని కోరి చేపట్టావో తెలియటం లేదు" అన్నాడు పద్మ చరణ్.
    "కొన్నాళ్ళు లెక్చరర్ చేశాను గా! ఇది కూడా చవి చూడాలని పించింది. " నవ్వేశాడు రాజు. "మళ్ళీ లెక్చరర్ కావాలేమో?' అన్నాడు.
    "ఆ ఉద్దేశ్యం ఉందా? ఐతే బతికి పోయాం!"
    "నా ఉద్దేశ్యం ఉందా? ఐతే బతికిపోయాం!"
    "నా ఉద్దేశాని కేముంది? ఉద్యోగమన్న దేదైతే నేమిటి గానీ-- ఆంధ్రాలో నాకు తెలిసిన ప్రిన్సిపాలోకాయన ఉన్నాడు. ఈ మధ్యను కాకినాడ పిలిపించి ఈ విషయమే ప్రస్తావించాడు. నన్నతడు ఏదో ప్రత్యేకంగా చూస్తాడు......నాన్నేమో బిజినెస్ పెట్టమంటున్నాడు." ఆలోచనగా అన్న రాజును చూస్తూ, "నువ్వు లెక్చరర్ గానే అందంగా ఉంటావోయ్!" అని తుది నిర్ణయం లా తేల్చేశాడు పద్మ చరణ్.
    పార్వతి కాఫీలు తెచ్చి వాళ్ళిద్దరి ఎదురుగా పెట్టి మౌనంగా వెళ్ళిపోయింది.
    "చూస్తె నువ్వు వట్టి సెన్స్ లెస్ జంటిల్ మన్ లా ఉన్నవోయ్! కవులు ఈ అమ్మాయిని చూస్తె, ఏం అందమైన స్త్రీ!-- అంటూ వర్ణనల్లో కి దిగిపోరూ? నువ్వావేళ అంత అస్యహ్యించు కుంటే ఎంత కురూపో , ఎంత పూర్వాచార పరాయణురాలో అనుకున్నాను. నువ్వేమీ అనుకోకుంటే నిజం చెబుతాను-- గత రెండేళ్ళు గా ఇల్లాటి చార్మింగ్ లేడీ కోసమే నేను వెదికి తిప్పలు పడుతున్నాను" అన్నాడు పద్మ చరణ్.
    పార్వతిని బాగా మెచ్చుకున్నాడు. రాజు కదిలేటట్టు కనిపించక తానను తనే పార్వతికి పరిచయం చేసుకుని, హాస్యం మాటలతో ఆమెను కొంతసేపు కవ్వించి వెళ్ళాడు. ఆ కాస్సేపూ పార్వతి నవ్వింది.
    రాజు ఆలోచనలో పడ్డాడు. పద్మచరణ్ ప్రసంగమే అతనిలో పని చేస్తున్నది . పైగా తను కాకినాడ నుంచి వచ్చేటప్పటికి పార్వతి ఉద్యోగాన్ని ఉద్దేశ పూర్వకంగా ఎందుకు వదులుకుందో అదీ అర్ధం కాలేదు.
    పార్వతి తనను ఎదిరించి ఒక్క మాట కూడా పైకి అనటం లేదు. ఆమె ఇష్టప్రకారం ఆమె ఉదాసీనంగా నడుచుకు పోతున్నదంతే! నిర్లక్ష్యమూ, నిర్లిప్తతా ఆమె నడత లోనే వ్యక్త మౌతున్నాయి కానీ, మాటలు పైకి రావడం లేదు.

                                  26
    పార్వతి సుభద్రను , రాధాకృష్ణ ను అరుదుగా కలుసుకొంటున్నది. ఆ అమ్మాయి వెళ్లకపోయినా వాళ్ళే వచ్చి మాట్లాడి వెళ్లి పోయేవారు. ఆ కొద్ది సమయం ఉత్సాహంగానే గడుస్తుంది. పార్వతి కి ఇంట్లోనే ఇరవై నాలుగు గంటలూ ఉండిపోవడం ఒక అలవాటుగా పరిణమించింది. ఆమెకు ఇష్టమనేది దేనిమీదయినా ఏర్పడితే దాని నుంచి ఆమెను మళ్ళించడం ఎవరి తరమూ కాదు.
    నిరాశ కారణంగా కలిగే ఆలోచనలు వైరాగ్యసంబంధ మైన భావాలను తీసుకు వస్తున్నాయి. ఏదో పట్టుదల వంటిది బాహ్యంగా ఉండిపోయినా అంతరంగికంగా పార్వతి రోజు రోజుకూ మారిపోతున్నది.
    నిరంతరం భగవంతుడి అస్తిత్వాన్ని గురించే సంఘర్షణ అంతర్యంలో ఆ భగవంతుడే కనక నిజంగా ఉంటె తనను తాను సమర్పించుకుంటా ననుకుంది.
    ఎన్ని విధాలా చూచినా, ఏ కోణం లో నుంచి తర్కించుకున్నా పార్వతి కి భగవానుడి ఉనికే కనిపించింది.
    పువ్వులలోని సౌందర్య సౌరభాలు , అవకాశం లోని చిత్ర విచిత్ర వర్ణికలు కొత్తగా కనిపించి విచిత్రమైన భావాలు రేపుతున్నాయి.
    అల్ప హృదయాల్లో ప్రజ్వలించే ఆవేదనాగ్ని తెలుసుకున్నప్పుడు , ఉన్నత మానవుల్లోని సౌహార్ద సౌజన్యాలు తెలిసినప్పుడు మనసు అంతర్గార్బితంగా ఉన్న అతీత శక్తి వైపు పోతున్నది. ఏ నూతనానుభవం కలుగుతున్నా , ఏ భావాను భూతిని పొందుతున్నా అందులో భక్తీ భావం మిళితమౌతూ ఉందామె అంతర్యంలో. ప్రాచీన ధర్మాలలోని పవిత్రత అర్ధాన్ని ఆలోచించింది పార్వతి.'
    ఆధ్యాత్మిక మైన ఆరాటం మొదలై నప్పటి నుంచి పార్వతి కి ప్రాచీనంగా వస్తున్న భక్తీ చరిత్ర యావత్తూ పెద్ద ప్రయత్నం లేకుండానే అవగతం అయింది. అయితేనేం -- ఆమెకు తనపట్ల తనకేదో అసంతృప్తి .
    "అమ్మగారూ!"
    పార్వతి తలెత్తి చూచింది. ఎదురుగా ఓ రైతు తరహ మనిషి సవినయంగా నిలబడి ఉన్నాడు.
    "ఏమిటి?" అంది పార్వతి.
    "రాజు బాబుగారు ఉన్నారా, అమ్మా?"
    "ఇంట్లో లేరు, ఏం?"
    "ఏమీ లేదమ్మా! నేనో కోడె గిత్తా , నాగలీ కొనుక్కుంటా నంటే రెండొందల దాకా సహాయం చేశారు మూడు మాసాల కిందట. అది తిరిగి ఇచ్చేస్తుండాను. ఈ సొమ్ము మీకాడనే భద్రంగా ఉంచి ఆయనొచ్చాక ఇవ్వండమ్మా! ఆయన్లాటి ధర్మబుద్ధి ఎవరికో గాని ఉండదు, తల్లీ!.." గొణుక్కుంటూ డబ్బు బల్ల మీద ఉంచి వెళ్ళిపోతున్న రైతు వైపు నుంచి శూన్యం లోకి దృష్టి మార్చి అలా కూర్చున్నది పార్వతి.
    లచ్చి ఒకసారి తను పెంచుకుంటున్న అక్క కూతురికి జబ్బుగా ఉందని చెప్పి పార్వతి దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఒక యాభై రూపాయలు సహాయం చేస్తే జీతంలో కట్టుకుంటా నన్నది. పార్వతి దగ్గర అప్పుడు ఇరవై కంటే ఎక్కువ లేవు. ఉన్నవి ఇచ్చి, తక్కిన డబ్బు రాజు నడిగి చూడమంది. అతడు ఇవ్వడనే పార్వతి ఉద్దేశం. లచ్చి ఆనందంతో అతడిచ్చిన డబ్బు తెచ్చుకోవడం చూచి ఆశ్చర్యపడింది లోలోపల. పైగా మరి ఇవ్వక్కర్లేదన్నాడని లచ్చి చెప్పింది.
    తాను ఇచ్చిందనే పంతానికి అతనూ ఇచ్చి ఉంటాడు-- అనుకుంది అప్పటికి తను.
    అదంతా గుర్తు వచ్చింది పార్వతికి. దీన్ని బట్టి చూస్తె రాజు తన పట్ల తప్ప ఇతరుల విషయంలో సౌజన్యంతో ప్రవర్తించగల డన్నమాట! 'పోనీ అందుకైనా గర్వపడవలసిందే' అనుకుంది పార్వతి తనలో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS