'ఈ కంటికి కనపడని జన్మల సుఖం కోసం యీ జన్మలో సుఖాలను చంపుకోమనటం సంస్కారుల లక్షణమే అంటారా?'
సూర్యం యీ ప్రశ్నకు జవాబు చెప్పలేదు. ఆమె మౌనంగా వున్నా, యింకా ప్రశ్నిస్తున్నట్టే అనిపించింది. ఏదైనా ఒక అపేక్షతో యెందుకు చేస్తారు మీరు? ఎందులోనూ మీ హృదయం కాదు, మీ మనసెందుకు పాల్గొంటుంది? మీరు ఆచరించ కుండా ఆలోచిస్తూ కూర్చుంటా రెందుకు? మీరు గతం తాలూకూ పాత మేడలోనే నివశిస్తా రెందుకు? నవీనమైన క్రొత్త మేడలో కాలు పెట్టరేం? పాత రోత పుట్టడం లేదూ? క్రొత్తదనం అందం మీ కంటికి కనిపించ లేదూ? మారని మీలాంటి వారికి మారే మనుషుల హృదయాల వుప్పొంగు ఏం కనిపిస్తుంది? మీరు బానిసలు-- నేను బానిస కాను.
అన్ని విధాల ఒక్క ప్రశ్న తోనే అతనిలో ఆలోచనలు రేకెత్తించిన విశాల లో యెంత మార్పు వచ్చింది? ఆమె ఆనాటి అమాయకురాలు కాదు. ఆవేశంతో ఆశతో, ఆతృతతో అలనాడు అమృతం వోలికించిన అప్పుడే విడి పడ్డ పుష్పం కాదు. ఈమె గాలికీ, వానలకూ , యెండకు తట్టుకుని నిల్చిన పువ్వు యిప్పుడు. ఆకారంలో, వుద్దేశాల లోనూ, వలపు లోనూ , తలపు లోనూ -- అన్ని విధాల పెరిగిందీమే!
* * * *
యౌవనపు తోలి రోజుల్లో విశాల వెలిగించిన దివిటీ ని అర్పెయాలని తను యెంత ప్రయత్నించినా ఆరటం లేదు. అది అర్పేయాలని యెన్నెన్నో చేస్తున్నాడు. ఆమె ముందడుగు అలోచించి అసహ్యించు కోసాగాడు. ఆమె దగ్గరకు వెళ్లరాదన్న నియమాన్ని పెట్టుకుని ఒకోసారి పాటించలేక పోయినా ఆచరించటానికి ప్రయత్నిస్తున్నాడు. విశాలను మరచి పోవాలని ప్రయత్నిస్తున్నాడు. అలా అను చేసే ప్రయత్నాలకు కారణం విశాల తనది కాలేదన్నది నిస్పృహ. ఆమెను తన దానినిగా చేసుకోవటం తన ప్రస్తుత పరిస్థితుల్లో కాని పని. అదీ కాకుండా ఆమె తాళి కట్టిన భర్తతో నివసించింది. ఆమెను తాకలేదని శ్రీనివాస్ అన్నా బహుశా విశాల ప్రేమికునికి తను చెప్పి ఒప్పిస్తాడనే వుద్దేశంతో అబద్దం అడకూడదా? ఏమైనా ఆమె పై ఒక ముద్ర పడింది. అలాంటప్పుడు ఆమెను తనదానిగా చేసుకోవటం సాధ్యం కాని పని. ఈ చదువు తెచ్చిన సంస్కారం ఆమెను తనకు దూరం చేసే అవకాశాలు లేక పోలేదు. విశాల తనను తప్ప యింకోకర్ని తలుస్తుందంటే తను సహించలేడు. శ్రీనివాస్ ఆనాడు ఆమె పరిస్థితి చెప్పినప్పుడు అతని యందు సానుభూతి చూపించినా తనను తప్ప, కట్టుకున్న మగవాడిని కూడా విశాల తలచు కొనందుకు లోలోన సంతోష పడ్డాడు. ఆడదాని హృదయం అమృత భాండం. అందులో ఎల్లవేళలా యందు ఒక మగాడే కదులుతూ ఆ అమృతం సేవించి నిత్యం యౌవ్వనం లో తొణికిసలాడటం యెంత అదృష్టం! ఆ అదృష్టం చేతులారా వదలుకోవటం తనకు యిష్టం లేదు. ఎన్ని విధాల తర్జన భర్జన లు చేసుకున్నా విశాల ముఖం వారం రోజుల కొకసరైనా అగపడక పొతే వెర్రెత్తి పోతున్నాడు. తోలి నాటి వలపు, జీవధారగా తనలో పారుతూనే వుంది. ఆనాటి తలపులు చావులేని గడ్డిలా మొలిచి పోయాయ్. ఒకోసారి పచ్చదనం పోయినా మళ్లీ చిగురిస్తున్నాయ్.
ఎంతో ప్రయత్నించి రెండు వారాలు విశాల దగ్గరకు వెళ్ళలేదు. తరచు వెళ్లి మళ్లీ యిదివరలా ఆమెలో ఆశలను రేకెత్తించటం యిష్టం లేదు. ఒకసారి పగిలిన ఆమె హృదయాన్ని మళ్ళీ పగిలించటం భావ్యం కాదు యెంతో ప్రయత్నించి ఆమె యెదట పడలేదు. కానీ ప్రతి రోజూ ఆమె తలపే మనసులో తిరిగేది.
ఒకరోజు సాయంత్రం విశాల రామం ని తోడ్చుకుని సూర్యం బంగళా కు వచ్చింది. ఆమె వస్తుండగానే సూర్యం అంగట వున్న పూల తోటలో తిరుగుతూ చూసాడు. ఆమె వచ్చినందుకు కోపంతో పాటు సంతోషం కూడా పెల్లుబికింది. ఆమె మాట్లాడకుండా గేటు తలుపు తీసి కాలు పెట్టగానే ఆమె అందం సంతోషాన్నే తన మనసులో నిలిపింది. రాను రాను ఆమె అందం పెంచి ఆశలను గట్టిగా నాటుతోంది కోరికలను కొల్లలుగా సృష్టించి తీర్చుకునే వుపాయాలను కూడా యెరుక పరచేటట్లు నటిస్తోంది. అన్నిటికీ తన చేత కాని వాన్నై పోతున్నారు.
ఆమె వస్తూనే తోటంతా గాలించినట్లు కలయ జూసింది. ఒక వరుస గులాబులు విరబూసి వుంటే చప్పున వెళ్లి ఒక యెర్ర గులబినే తెంపి తలలో పెట్టుకుంది. తల త్రిప్పగా వెనుక నించి ఆమె చూడటానికి మనోహరంగా వుంది. వెనుక నించి వెళ్లి చేతులను ఆమె మెడ చుట్టూ పెట్టాలన్న ఆవేశం కలిగింది. ఐనా అలా కదలకుండా నిల్చుండి పోయాడు. కాడ పై గుత్తులుగా పూసే కమ్మని సౌరభాన్ని వెదజల్లుతున్న లిల్లీ పూలను తాకగానే ఆమెకు ప్రాణం వచ్చినట్లయింది. విశాల తన దగ్గరగానే రెండి లిల్లీ పూలను తెంపుతుంటే ఆమె అంత అందంగా అంత సువాసనగా పరమళీస్తున్నట్లు సూర్యం కనిపించింది. ఐనా కదలలేక పోయాడు. ఆమె కదులుతూ ఒకసారి అతని కళ్ళలోకి చూస్తూ "ఇంత అందమైన తోట వుందని చెప్పారు కాదు.'
'రోజూ వచ్చేదానివా ' అని అడగాలని ఆపేసాడు. ఆమె ఒక్కసారి అంతా చుట్టూ ముట్టి తిరిగి వచ్చి ఒకసారి తలనిండా నింపిన పూలను చూపిస్తూ
'క్షమించండి . మీ పూలను తెంపేసాను'
'పరవాలేదు.'
'నా చేతులలో మొక్కలను నాటి వుంటే పూలను తెంపలేక పోయేదాన్ని. మీరు ఫరవాలేదన్నా మీ కష్టం నాకు తెలుసు. మొక్కలను నాటే వాళ్ళు పూలను తెంప లేరు.'
ఈ మాటల్లో యెంతో నిజం చూసిన సూర్యం మౌనంగా ఆమె వేపు చూసాడు.
విశాల అనే మొక్క యీ వ్యక్తీత్వం రావటానికి తనే కారకుడు. ఐనా ఆ మొక్క పెరిగి వలపు పూలను పుష్పింప చేసిన్నాడు తనే వాటిని తెంపేసాడు. ఎంత సాహసం-- యెంత దుర్మార్గం తనది, ఇప్పుడు మళ్ళీ ఆమెను చదివించి పూర్తీ వ్యక్తిత్వం తో బహ్య అందమే కాక అంతర్గతమైన అందానికి మెరుగులు దిద్ది పూలను పుష్పింపచేస్తున్నాడు. ఈ పూలను తెంపడానికి సాహసించ లేక పోతున్నాడు.
రామం, వంట కుర్రాడు కలిసి బయటకు వచ్చారు. రామం చేతిలో పేక దస్తా వుంది.
'అక్కా-- రా-- ఆ పచ్చని తివాచీ మీద కూర్చొని ఆడుకుందాం.'
లాన్ లో పచ్చగడ్డి మీద కూర్చున్నారు. పేకాట లో పడ్డారు. సాయంకాలపు చల్లదనం ఆమె పెదిమల పై చిరునగవు లా వుంది. ఆహ్లాదం ఆకాశమంత విశాలంగా హృదయాన్ని చేసింది. చిరు గాలికి కదిలే ఆమె ముంగురులు అతని గుండెల్లో నాట్యం చేస్తున్నాయ్. అతని చేతిలో డైమండ్ రాణి వదలలేక వదిలాడు.
పొరుగు ఆఫీసరు పెళ్ళాం ఒక్కర్తే యిటు వేపు చూసి 'గర్ల్ ఫ్రండా?' అని అడిగింది. సూర్యం మర్యాదకు నవ్వాడు. ఆమె వయసు లోనూ శరీరంలోనూ అంత యెదిగినా యింకా పదహారేళ్ళ బాలా కుమారి అనుకుంటుంది. ఎనిమిది గజాల నైలాన్ చీర కట్టినా పైట సరిగ్గా లేదు. తిండితో పెరిగిన బొజ్జను కదుపుకుంటూ ఫెన్సింగు దగ్గర నిల్చొని.
'అచ్చా హై ' అంది.
ఆమెకు వచ్చిన అన్ని భాషల్లోనూ విశాల విషయమై ఒక్కొక్క కబురూ ఆడుతుంటే సూర్యం యింకెంత సేపో వూరుకోలేక 'మిస్టర్ హుస్సేన్ లేడా?' అని యెదురు ప్రశ్న వేసాడు.
'క్లబ్ లో ఆడుతున్నాడు.'
'నివ్వేళ్ళ లేదేం?'
'నాకేక్కడి తీరుబడి--'
'మామీద దాడి చెయ్యడాని కుందిగా!'
'నేనేం దాడి చేసాను? మిష్టర్ హుస్సేన్ లా నివ్వూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావేమోనని.....'
'హుస్సేన్ ప్రేమించి పెళ్లి చేసు కున్నాడా?'
'ఇప్పుడు యీ ఒళ్ళు పెరిగిపోయింది గానీ-- పదేళ్ళ క్రితం నన్ను నివ్వు చూసుంటే.'
సూర్యం నవ్వేశాడు. వీళ్లూ పేకాట నించి లేచి పోయారు. విశాల యింట్లోకి వెళ్ళిపోయింది. సూర్యం వేపు పొరుగామే చూసి.
'వేగం గానీ...మాకు బదిలీ యైతే నీ పెళ్లి చూడలేనుగా.'
'కాడాని కేం లేదు-- అసలు సంగతి తెలుసుకోకుండా ఆ పిల్ల ఎదరగా అలా అనటం సబబు కాదు.'
'ఏం?' అంత చక్కగా వుంది.'
'ఆమెకు యేనాడో పెళ్లయింది.'
'ఓ -- సారీ! పెళ్ళయిన పిల్లలాగే కనపడలేదు. ఐ ఏం సో సారీ ...పిల్లలు పుట్టక గానీ -- నీ వయసు లో మిస్టర్ హుస్సేన్ కు నలుగురుండేవారు.'
'నలుగురు పిళ్ళాలే-- బాబోయ్!'
'పెళ్ళాలు కాదయ్యా-- పిల్లలు'
'ఏదీ'
'పుట్టేవారు కానీ పుట్టలేదు-- నీ యింట్లో పిల్లలున్నా యెంత బావున్ను.'
'నా పిల్లలను పెంపకం యిస్తాలే.'
'నీ పిల్ల నైతే తప్పక పెంచు కుంటాను.'
'ఏం?'
'నువ్వంటే...మంచి వాడివి....చక్కని వాడివి.'
సూర్యం అసలు విషయం అర్ధంచేసుకుని నవ్వేసి 'వస్తాను' అని వెళ్ళిపోయాడు. తల్చు కుంటుంటే తనకు నవ్వు వస్తోంది. డ్రాయింగు రూములో సోఫా మీద చతికిల పడ్డాడు. ఎదురగా వున్న కిటికీ మీద మూలకు రెండు కొమ్ములతో చేసిన కొంగలు మూతులు పై కెత్తి తపము చేస్తున్నావెమోనన్న అనుమానం కలగసాగింది. నీటిలో కదిలే చేప పై పడటానికి కొంగ కాసుకు వున్నట్లే అవకాశం దొరికితే విశాలను తాకి తన హృదయం విప్పటానికి తను సిద్దంగా నున్నట్లు తట్టింది. కాదు కాదని మళ్ళీ మనసు మార్చుకో బోయాడు. నిజం కాదని నిరూపించటానికి ప్రయత్నించినా దాని స్వరూపం మారదు. కిటికీ పై యింకో ప్రక్క అలారం వాచీ లోలోన కొట్టుకుని బయటకు కనిపించే అంకెలకు అర్ధాలను సృష్టిస్తున్నట్లే వారి గుండెలు కొట్టుకుని వారి ముఖాల పై కోరికలను ప్రతిబొంబింప చేస్తున్నాయ్. ఆ అలారం వాచీ గణగణమని మ్రోగితే బావున్ననిపించింది. ఆ వాచీ బదులు తనే మ్రోగి ఆమెను మేల్కొలిపి తనను చేరేటట్లు చేస్తే?
కొద్ది క్షణాల పాటు ఒంటిగా కూర్చొని మనసను కోరికల వనం లోనికి విడిచి పెట్టేసాడు. ఆ వనం లో అంద చందాల నిచ్చే పూల చెట్ల మధ్య బస్సుని పడగెత్తే పామును చూడగానే తిరిగి పరుగెత్తి వచ్చినట్లు తన కోరికల నించి యదార్ధాన్ని తెలుసుకుని బయట పడ్డాడు. విశాల తనదేలా అవుతుంది? అది సంఘ దృష్టి లో యింకొకరి సొత్తు. ఆమెను ఆత్మ పరంగా అప్పగించటమే తన పని!
బయట దప్పులు వాగుతుంటే వెనక పెరటి కూరగాయల తోటలో నున్న వంట పుట్టితో సహా అంగటికీ వచ్చారు.
'సినీమా -- మంచి సినీమా'
'పాతది.'
'అలాంటి సినిమాలు యిప్పుడు రావటమే లేదు-- వెళ్దాం.'
'నే రాలేను. దగ్గరే -- మీరు వెళ్ళండి.'
