"ఇందులో మిమ్మల్ని మీరు చిన్నబరుచుకోవడం దేవికి చెప్పండి? ఆవిడ కనీసం మన బాబును చూడలేదు. మనం ఊరు విడిచి వస్తూంటే మా అమ్మ ఎంత బాధపడిందో బాబును విడిచేందుకు! అలాటిది మీ అమ్మగారికి మాత్రం ఉండదూ?"
"..........................."
"చూచేవాళ్ళు నలుగురూ ఏమనుకుంటారు? ఊరిపక్కనుండి వెడుతూ చూడటానికైనా రాలేదని అనుకోరూ?"
"నేను ఇదివరకే చెప్పాను. ఒకళ్ళు ఏదో అనుకుంటారని నేను చేసే పనులు మానబోవటంలేదు. అయినా ఎవరో ఏదో అనుకుంటారని నేను లెక్కచెయ్యను."
"మీరు లెక్కచేయకుండా ఉండటానికి మిమ్మల్నా ఏమిటి అనుకునేది? కోడలు వచ్చింది, కొడుకును దూరం చేసిందంటారు. పోనీ, ఈ మాటలకేం? ఆవిడ ఆరోగ్యం బాగాలేదని విన్నాం. కనీసం అందుకయినా వెడదాం." బ్రతిమలాడింది.
"అబ్బ, అనూరాధా! నాకు తోచినట్లు నన్ను చెయ్యనీ. దయచేసి నన్ను విసిగించకు. నాకు మా అమ్మమీద ద్వేషం లేదు. అభిమానం అంతకన్నా లేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి కలిగినప్పుడు నా అంతట నేనే వెడతాను" అన్నాడు నిశ్చలంగా కారు డ్రైవ్ చేస్తూ.
ఆ మాటలు వింటూ నిట్టూర్చింది. "నిజంగా ఆమె జీవితంలో భాగం పంచుకొన్న, బాధ అనుభవించిన మీ నాన్నగారు ఆమెను క్షమించారు. ఆయనకు ఉన్న ఔదార్యం మీకు లేదు" అంది పరిగెడుతున్న చెట్టువంక చూస్తూ.
దెబ్బతిన్నట్లు చూచాడు, కందిపోయిన ముఖంతో. అదేమీ గమనించ నట్లు, ఆ మార్పే తను కోరుకున్నట్లు ఎటో చూస్తూ ఉండిపోయింది. కొద్ది క్షణాల అనంతరం, "క్షమించండి. ఇక తల్లిగా, స్త్రీగా మీకంటే ఆమెను నేనెక్కువ అర్ధం చేసుకోగలను" అంది.
41
వెన్నెలరాత్రుల అందాలు పట్టణాలలో తెలియకపోయినా, విద్యుద్దీపాల వెలుగులు తగ్గటంతో గదిలోకి పడుతూంది వెన్నెల. గాఢనిద్రలో ఉన్న అనూరాధ బాబు ఏడుపు వినిపించేసరికి ఉలిక్కిపడి లేచింది. శ్రీనివాస్ కు నిద్రాభంగం కలగకుండా పక్కన మంచంమీద ఉన్న బాబును తీసుకుని అవతల గదిలోకి వెళ్ళింది. పాలు తాగుతూనే నిద్రపోయాడు బాబు. తిరిగి పడుకోబెట్టి మంచంమీద వాలేసరికి నిద్ర తేలిపోయిందనిపించింది. పక్కమీద అటూ ఇటూ దొల్లుతూంది. మగతగా కళ్ళు మూతలుపడుతూంటే కింద ఎవరో తలుపు కొడుతున్నట్లనిపించింది. మెల్లిగా లేచి కిందికి వెళ్ళింది. వీథి తలుపు ఎవరో కొడుతున్నారు. లైటువేసి "ఎవరది?" అని అడిగింది. అవతల మనిషి చెప్పింది. విని తలుపు తెరిచి సంతకంచేసి టెలిగ్రామ్ తీసుకుంది.
ఒక్కసారి ఎందుకో గుండె జల్లుమనిపించింది. మెల్లిగా తలుపువేసి తెరిచి చూచింది. అంత వెలుగులోను ఒక్కక్షణం అక్షరాలన్ని అలుక్కుపోయినట్లనిపించింది. ఒక్కసారి గుండెనిబ్బరం చేసుకుని తిరిగి చూచింది. అది గుంటూరునుంచి వచ్చిన టెలిగ్రామ్. "అమ్మ ఆరోగ్యం సంతృప్తికరంగా లేదు. వెంటనే బయలుదేరు." అనూరాధకు కళ్ళు ఒక్కసారిగా చెమర్చాయి. మనసంతా ఏమిటో నీరసించినట్లయింది. ఆరు, ఏడు నెలలుగా ఆరోగ్యం సరిగా లేదన్న వార్త వింటున్నా, ఒక్కసారి వెళ్ళి చూడలేదు. అవసరమయినది చేయించలేదు. ఇప్పు డిదేమిటో? కంగారుగా అనుకుంటూ గబగబా పైకి వెళ్ళింది.
నిశ్శబ్దంగా ఉన్న గదిలో, చిన్న బెడ్ లాంప్ వెలుగులో హాయిగా, నిశ్చలంగా నిద్రపోతున్న శ్రీనివాస్ ముఖం చూడగానే ఈ టెలిగ్రామ్ ఎట్లా చూపించడం అని ఒక్క క్షణం భయంతో నిలబడిపోయింది. 'ఆవిడ కేదయినా జరిగితే తనని తను క్షమించుకోగలరా? ఇంత మొండితనం. మృదుహృదయం ఒకచోట ఎలా కలిశాయి? మనస్తాపాలని మరిచి హాయిగా ఉన్న ఆయన జీవితాన్ని తిరిగి గందరగోళపరచకు, భగవంతుడా! అత్తగారి ఆరోగ్యం కుదుటపడేటట్లు అనుగ్రహించు!' అని మనస్సులో అనుకుని, నమస్కరించి, చెంపలు వేసుకుంది, తలవైపున ఉన్న శ్రీనివాసుడి పటంవంక చూస్తూ.
"ఇదిగో, మిమ్మల్నే!" అంది మెల్లిగా కుదుపుతూ.

అటూ, ఇటూ తిరిగి బద్ధకంగా కళ్ళు తెరిచాడు ఏమిటన్నట్లు.
"ఒకసారి కిందికి రండి!"
"ఇప్పుడా? దేనికి?"
సమాధానం ఇవ్వకుండా కిందికి దిగింది. మౌనంగా ఒళ్ళు విరుచుకుని ఆమె ననుసరించాడు. ఇంకేం మాట్లాడాలో తెలియక, నిశ్శబ్దంగా టెలిగ్రామ్ చేతిలో పెట్టింది. ఆశ్చర్యంగా ఆమెవంక చూచి టెలిగ్రామ్ చదివాడు. కొద్ది క్షణాలు అతనినుండి ఎటువంటి మాటా రాలేదు. మసగబారిన అతని ముఖంలో కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరగడం స్పష్టంగా చూడగలిగింది.
"ఎంతసేపయింది ఇది వచ్చి?" అన్నాడు పూడుకుపోయిన కంఠాన్ని పెగుల్చుకుని.
"పది నిముషాలు అయిందేమో!"
పక్కనే ఉన్న కుర్చీలో కూలబడిపోయాడు. మనస్సులోని వివిధ భావాల సంఘర్షణ ముఖంలో ప్రస్ఫుటమవుతూంది.
ఏ మాటా లేకుండా నిశ్శబ్దంగా కూర్చున్న శ్రీనివాస్ ను చూస్తూ "గతంలో ఏం జరిగినా, ఇప్పుడు వెంటనే వెళ్ళటం మనం కనీసం చెయ్యవలసిన పని" అంది కొంచం వెనకాడుతూనే.
ఎదురుగా ఉన్న టెలిఫోను దగ్గిరికి వెళ్ళాడు జవాబియ్యకుండా. ఏదో నెంబరుకు ఫోనుచేసి గన్నవరానికి టికెట్ అడిగాడు. "ఓ అన్ని బుక్ అయ్యాయా. ఓ కె. థాంక్స్." దఢాలున మూసి దీర్ఘంగా నిట్టూర్చాడు.
గబగబా పైకి వెడుతూ "వెంటనే రెడీ అవు. కారులో వెడదాం" అని వెళ్ళాడు.
తేలికగా శ్వాస వదులుతూ గబగబా కాగితం మీద నాలుగు పంక్తులు రాసింది. టెలిగ్రాఫ్ ఆఫీసుకు ఫోనుచేసి తల్లిని, తండ్రిని గుంటూరు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చి పైకి పరిగెత్తింది.
అన్ని సిద్ధం చేసుకుని ఎంత త్వరగా బయలుదేరినా ట్రాఫిక్ తప్పించుకుని బయటపడేందుకు వీలుకాలేదు. ఎప్పుడూ నడపనంత త్వరగా కారు పోనిస్తున్న శ్రీనివాస్ ను చూస్తూ 'ఇతను తల్లిని ద్వేషించడంలేదు. ప్రేమిస్తున్నారు. ప్రేమాధికులను ద్వేషం అంటలేదు. తల్లిని ద్వేషించే మానవుడు ఉండడు' అనుకుంది మనస్సులో. తీవ్రంగా ఏదో ఆలోచిస్తూ, మౌనంగా రోడ్డుమీద దృష్టి సారించి, డ్రైవ్ చేస్తున్న శ్రీనివాస్ ను పలకరించేందుకు కూడా సాహసించలేకపోయింది.
