మరుపులో మెరుపులు
చెరుకూరి రమాదేవి

కలకత్తా లో చౌరంగీ రోడ్డు చాలా రద్దీగా వుంది. ట్రాఫిక్ లో యిరుక్కుని అరగంట ఆలస్యంగా ఆఫీసు చేరిన ప్రభాకర్ విసుగ్గా చేతి వాచీ వంక చూసుకున్నాడు. అప్పటికే అపాయింట్ మెంట్ కు అరగంట ఆలస్యం. అదే ఎవరయినా తనని ఆఫీస్ లో కలుస్తా నని చెప్పి యింత ఆలస్యం చేస్తే చెప్పలేని చిరాకేస్తుంది అతనికి.
నిగనిగలాడే నల్లటి టాక్సీ లోంచి దిగి బ్రీఫ్ కేస్ తీసుకుని ఆఫీసులోకి నడిచాడు. బయట వుడికి పోతున్న వాతావరణం లోంచి లోపలకు అడుగు పెట్టగానే చల్లగా వున్న ఎయిర్ కండిషన్డ్ ఆఫీస్ హాయిగా స్వాగతం పలికింది.
ప్రభాకర్ ని చూడగానే చిరునవ్వు తో సలాం పెట్టి సరాసరి లోపలకు తీసుకు వెళ్ళాడు. ఆఫీస్ బంట్రోతు.
ఎదురుగా బరువయిన కుషన్ చైర్ లో కూర్చుని కాగితాలు చూసుకుంటున్న ముఖర్జీ ప్రభాకర్ ని చూడగానే చిరునవ్వు తో లేచి చెయ్యి చాచాడు కరచాలనం కోసం.
"వెరీ సారీ ఆలస్యమయింది. మీ సిటీ ట్రాఫిక్ నన్ను కదలనివ్వలేదు."
'దట్సాల్ రైట్. రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాం." అన్నాడు ముఖర్జీ ఇంగ్లీషులో.
భారీ ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్న కొత్త వ్యాపారానికి, అవసరాలు, ఖర్చులు కలిగే లాభాలు ఎదుర్కోవలసిన సమస్యలు సవివరంగా చూపెట్టడం మొదలు పెట్టాడు ముఖర్జీ సమయాన్ని వృధా పోనివ్వని వ్యాపారస్తుడి లా!
అతను చెప్పేవాటికి తలుగిస్తూ , తోచిన సర్దు బాట్లుచేప్తూ , ఫైల్ చేతిలోకి తీసుకుని సీరియస్ గా చదివేందుకు నిమగ్నుడయ్యాడు ప్రభాకర్.
తన టేబుల్ మీద దేనికోసమో అటూ, యిటూ చూసి బెల్ నొక్కాడు విసుగ్గా. అందుకోసమే వున్నట్లు వెంటనే లోపలకు వచ్చాడు బంట్రోతు.
"మిస్ దేశ్ ముఖ్ ని ఫైల్స్ తెమ్మని చెప్పు" అన్నాడు ముఖర్జీ.
మరో అయిదు నిముషాలు తిరగకుండా చేతిలో ఫైల్స్ పట్టుకొని సుకుమారంగా లోపలకు అడుగు పెట్టింది.
గదిలోకి మరొకరు అడుగు పెట్టినట్లనిపించగానే తలఎత్తి చూచాడు ప్రభాకర్.
ఆమె చేతిలోంచి ఫైల్స్ అందుకుంటూ "మా కొత్త సెక్రటరీ మిస్ సుమా దేశ్ ముఖ్. కొత్తేమిటి లెండి నాలుగు నెలలయింది" నవ్వుతూ పరిచయం చేశాడు ముఖర్జీ ప్రభాకర్ కు.
"నమస్తే?" అంది రెండు చేతులు జోడిస్తూ.
"నమస్తే!' అన్నాడు తల పంకిస్తూ -- చేతిలో ఫైల్ ముడవకుండానే!
పక్కనే నుంచున్న ముఖర్జీ ఆమెకు చెయ్యాల్సినపని ఒకటొకటిగా చెప్పేస్తున్నాడు. ఫైల్ చదవడం లో మునిగి వున్నా, ఎందుకో ఒక్కసారి మళ్ళీ చూడాలని పించి తల ఎత్తాడు ప్రభాకర్. చూపంతా ముఖర్జీ మీద వుంచి, మెల్లిగా తలవూగిస్తోంది సుమ. జుట్టంతా పైకి ఎత్తి, ఆధునికంగా ఎత్తుగా వున్న జుట్టు, క్రింద తెల్లటి మెడ, మెళ్ళో సన్నటి గొలుసు, శరీరంలో ప్రతి వంపు కొలచి కుట్టినట్లు అతుక్కుని వున్న శార్వాణి-- మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ముఖం లో ఏదో లోపం ఎత్తి పెట్టినట్లు కనిపించింది ప్రభాకర్ కు. ఒక్కక్షణం ఆమె వంక అలాగే చూచి ఫైల్స్ లోకి తలదూర్చు కున్నాడు.
మళ్ళీ తల ఎత్తే టప్పటికి గదిలో ఆమె లేదు. ముఖర్జీ టేబుల్ ముందు కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు.
బల్ల మీద ప్రభాకర్ ఫైలు ఉంచడం చూచి "సమ్మతమేనా" అన్నాడు ముఖర్జీ. చిరునవ్వుతో తల వూగించి జేబులోంచి చెక్కు బుక్ తీసి సంతకం చేసి యిచ్చాడు. ఎగ్రిమెంట్స్ మీద సంతకం చేసి, తన కాపీ తీసుకుని కేస్ లో పెట్టుకున్నాడు ప్రభాకర్.
"మీ కిదివరకే చెప్పినట్టు యిందులో కెవలం నేను వాటా తీసుకోవడం తప్ప స్వయంగా నేను ఏమీ చూడలేను. యిప్పటికే నేను చూచుకునేందుకు వీలుగానన్ని తయారయ్యాయి." అన్నాడు.
చిరునవ్వుతో తలూగించి, "మీ నాన్నగారి అనారోగ్యం తో పూర్తి బాధ్యత మీ మీదకే వచ్చినట్లుంది. యిప్పుడేలా వున్నారు అయన?" అడిగాడు ముఖర్జీ.
"ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉంది. కాని యింక కంపెనీ వ్యవహారాల్లో జోక్యం కలిగించు కోవడం లేదు. ఆయనకు పూర్తిగా విశ్రాంతి కావాలి."
"ఓ.కే. వస్తాను. మళ్ళా కలుద్దాం" అని లేచాడు ప్రభాకర్.
"యివాళ యిక్కడ వుంటున్నారా?' అడిగాడు ముఖర్జీ కుర్చీ లోంచి తను కూడా లేస్తూ.
"లేదు, రేపు మద్రాసు లో పని వుంది. రాత్రి ప్లయ్ చేస్తున్నాను." అన్నాడు.

షేక్ హేండ్స్ యిస్తూ -- "హేవ్ ఏనైస్ ట్రిప్." అన్నాడు.
"థాంక్స్" అని బయలుదేరాడు. స్వింగీ డోర్ దగ్గరకు వచ్చి తలుపు తీయబోతుండగా అటు నుంచి తోసుకుని లోపలకు వచ్చింది సుమ తల వంచుకుని ఎదురుగా ప్రభాకర్ ని చూడకుండానే!
దాదాపు గుద్దుకునెంత పనయ్యేటప్పటికి తల ఎత్తి బాగా పొడుగ్గా వున్న ప్రభాకర్ వంక చూసింది.
"సారీ"
"ఫరవాలేదు." చిరునవ్వుతో అని ముందుకు వెళ్ళిపోయాడు.
లోపలకు వెళ్ళింది సుమ. ముఖర్జీ ఫోనులో మాట్లాడుతూ వుంటే మౌనంగా నిలబడి పోయింది. కిటికీ లోంచి బయటకు చూస్తూ, దృష్టి బయటకు సారించినా ముఖర్జీ మాటలు చెవులను చేరుతూనే వున్నాయి.
ఆ ఇవాళ కాష్ చేసి సేఫ్ లో వుంచేస్తాను. రేపు అక్కడకు పంపవచ్చు. ఒకే వుంటాను. తలా తోకా లేని సంభాషణ సగం లోనే తుంచేసి రిసీవర్ పెట్టేశాడు.
సుమ వైపు తిరిగి చిరునవ్వుతో చేతిలో వుత్తరాల్ని తీసుకుని సంతకం చేసి తిరిగి యిచ్చేస్తూ --
"సాయంత్రం నీ కార్యక్రమం ఏమిటి?" అడిగాడు కళ్ళలోకి సూటిగా చూస్తూ.
"ఏముంది? మామూలే!"
"నువ్వాగి పో, నేను డ్రాప్ చేస్తాను." అన్నాడు అప్పుడే మ్రోగుతున్న రిసీవర్ ని ఎత్తుతూ.
అయిష్టంగా మొహం పెట్టి "సరే' అన్నట్లు తల వూగించి బయటకు వెళ్ళింది.
2
"అబ్బ యింత వేడిగా వుందెం? ఇవాళ! అన్నాడు కోటు విప్పి కారు సీటు మీదకు విసిరేస్తూ ముఖర్జీ,
"యీ వూళ్ళో వుందని దెప్పుడు"అంది నవ్వుతూ సుమ.
ఎక్కడికి వెడదాం?"
"మీ యిష్టం."
"మనోరమకు ....యిష్టమేనా అన్నట్టు చూచి.
"వెడదాం కాని నన్ను త్వరగా దింపేయాలి."
"ఏమంత తొందర? రేపు సెలవే కదా!"
"మా యింటి ముసలమ్మ చంపేస్తుంది."
"మంచి గార్దియనే దొరికింది నీకు" నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు.
విపరీతంగా వున్న ట్రాఫిక్ ను తప్పించుకుంటూ అతి మెల్లగా కారు పోసాగింది. నిశ్శబ్దంగా బయటకు చూస్తున్న సుమ మనసులో రకరకాల భావాలు తరంగాల్లా లేచి పడుతున్నాయి. ముఖర్జీ అడుగుతున్నదానికల్లా పరధ్యానంగా సమాధానం చెప్తూ దృష్టి బయటకు సారించింది.
మధ్యమధ్య సుమ వంక చూస్తూ డ్రైవ్ చేస్తున్న ముఖర్జీ టక్కున బ్రేక్ మీద కాలేశాడు ముందు పోతున్న కుర్రాడిని చూసి.
అలోచనలలో కొట్టుకు పోతున్న సుమ వులిక్కిపడి ముందుకు తూలింది. సీటు మీద వేసి వున్న కోటు వచ్చి సుమ ఒళ్ళో పడింది.
కోటును తీసి మడత పెట్టి వడిలో వుంచుకుంటూ "కొంచెం ముందుకు చూసి డ్రైవ్ చేద్దురూ, మరీ హడలు కొట్టేస్తున్నారు." అంది చిరునవ్వుతో.
ఆమె మాటలకు నవ్వుతూ పెద్ద రెస్టారెంటు ముందు కారాపాడు.
"వుండు యిప్పుడే వస్తాను' అంటూ లోపలకు వెళ్ళాడు.
అతను వెళ్ళిన వైపే చూస్తూ సుదీర్ఘంగా నిట్టుర్చింది . "యితను దగ్గరయి పోతున్నాడు. తను దూరంగా పారిపోవాలి." అనుకుంది భయంగా. అప్రయత్నంగా అమెచేతులు కోటు మీదకు వెళ్ళాయి. జేబులో బరువుగా వున్న తాళం చెవులు చేతికి తగిలేటప్పటికి షాకిచ్చినట్లు చెయ్యి ఒక్కసారిగా వెనక్కి లాగేసుకుంది. కాని మాటి మాటికి మనసంతా ఆ తాళం చెవుల మీదకే పోసాగింది. దూరంగా హోటల్ ఆవరణ లో ముఖర్జీ వస్తూ కనిపించాడు. ఒక్కసారి ఉలిక్కిపడి, సద్దుకు కూర్చుంది. అంతలోనే -- అతను చేరువకు రాకమునుపే గబగబా తాళాలు తీసుకుని హేండ్ బాగ్ లో వేసుకుంది.
