Previous Page


    ఇంటికి చేరి, తల్లిని చూచి డాక్టర్ని కలుసుకున్నాడు శ్రీనివాస్, ఆయన నడిగి వివరాలు తెలుసుకునేందుకు. "అయిదారు నెలలనుండి తరుచుగా నెప్పి వస్తూంది. ఓ వారంరోజులనించి మరీ భరించలేకుండా ఉన్నారు. స్టమక్ కాన్సరేమోనన్న అనుమానంతో ఎక్స్ రే తీశాం. వెంటనే ఆపరేషన్ మంచిదని నా ఉద్దేశం. మీరూ డాక్టరే! మీ కింతగా విడమర్చి చెప్పక్కరలేదనుకుంటాను" అంటూ సావిత్రికేసుకు సంబంధించిన ఛార్టు అందించాడు. ఒక్క క్షణం వెర్రిగా అతనివంక చూచి ఇవతలికి వచ్చాడు.
    క్షణక్షణానికి అతని హృదయం అసంతృప్తితో నిండిపోసాగింది. తన కర్తవ్యం తను నిర్వర్తించలేదన్న భావన ఎక్కువకాసాగింది. తల్లి పడుతున్న బాధను చూస్తూ, మానసికంగా తను కలగచేసినది తలుచుకుంటూ కుమిలిపోసాగాడు. తనంటే తనకే విసుగు పుట్టిందా క్షణంలో. తల్లికి ఆపరేషన్ జరిపేలోపల ఇంకొక పెద్దడాక్టరికి చూపించాలనిపించింది. అదేమాట ఆ రాత్రి వచ్చిన రాజశేఖరం గారితో అన్నాడు.
    "చూడు, శ్రీనివాస్, ఈ క్షణంలో నీకు చేయాలనిపించిన ప్రతీదీ చెయ్యి. ఈ రోజు నీ కర్తవ్య నిర్వహణలో లోపం ఉంటే, అది నిన్ను జీవితాంతం బాధ పెడుతుంది. తప్పకుండా ఇంకొక డాక్టర్ని కన్ సల్ట్ చెయ్యి. మనం చేస్తున్న పనిలో సంతృప్తి కలగాలి. మరొకటి చెబుతాను. ఇంకోలా భావించకు. నాకు తెలిసినంతలో కృష్ణమూర్తి చెయ్యితిరిగిన వైద్యుడు. ముఖ్యంగా సర్జరీలో ఆరితేరిన నిపుణుడు. పాత బాంధవ్యాలు, వైషమ్యాలు మరిచిపోయి, ఆయనచేత కూడా ఒక్కసారి పరీక్ష చేయించు. ఎందుకయినా మంచిది. కాని, ఒక్కటి. ఆయనమీద నమ్మకముంటేనే పిలిపించు. నమ్మకంలేని డాక్టర్ చేతివైధ్యం ఫలించదు."
    'ఆయన మంచి డాక్టరన్న నమ్మకం నాకు ఎప్పుడూ ఉంది. ఆయన ఎక్కడున్నారని పిలిపించను? ఒకవేళ పిలిపించినా, ఆరోజు గెట్ ఔట్ అని బయటికి పంపిన తను తిరిగి తల్లిని చూడమని ఎలా అడగను? ... అడిగితే మాత్రం ఆయన అంగీకరిస్తారా?' అనుకున్నాడు మనస్సులో.
    "ఆయననే పిలవాలని ఏమి లేదు. ఇంకెవరినైనా పిలిపించవచ్చు" అన్నారు అల్లుడి మొహం భావాలు చదివినట్లు.
    "ఆయన ఎక్కడుంటున్నారో తెలుసా?"అడిగాడు మ్లానవదనంతో.
    ఆ రాత్రి అనూరాధకూడా అదే చెప్పింది. "ఆయన మీద నాకు ఎంతో గురి ఉంది. దయచేసి ఒకసారి ఆయనను పిలిపించండి. కావాలనుకుంటే తరవాత దూరం కావచ్చు."
    "ఆయన కోసం కారు వెళ్ళింది. తెల్లవారేసరికి వస్తారేమో!" అన్నాడు ఆమెవంకైనా చూడకుండా.
    శ్రీనివాస్ కబురు విని తెల్లబోయారు కృష్ణమూర్తిగారు. ఆయన ఆశ్చర్యం అవధులు దాటింది. 'సావిత్రీ, నీ కొడుకుని నీకు దూరంచేసిన నన్ను నా కొడుక్కి దగ్గిర చేస్తున్నావా?' అనుకున్నారు బాధగా.
    సావిత్రిని పరీక్షించి, "నా ఉద్దేశంలో ఇప్పటికే ఆలస్యమయింది. వెంటనే సర్జరీ అవసరం" అన్నారు డాక్టర్ తో.
    ఆ పూట శ్రీనివాస్ మన స్థితి వర్ణనాతీతం. ఏదో చెయ్యాలని, ఏదో అడగాలని అతని మనస్సు అల్లల్లాడిపోయింది. తల్లి పడుకున్న గదిలోకి వెళ్ళాడు. అనూరాధ చేతిలో ఉన్న బాబును ఆడిస్తూంది సావిత్రి. బోసి నోటితో, చొంగ కారుస్తూ పచ్చగా ముద్ద బంతిపువ్వులా ముద్దు వస్తున్నాడు. శ్రీనివాస్ ను చూడగానే బాబును చేతికందించి గది బయటికి వచ్చింది అనూరాధ. తల్లి చేతిలో ఉన్న బాబును అందుకుంటూ "అమ్మా" అంటూ చేతిమీద చెయ్యి వేశాడు శ్రీనివాస్. కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి సావిత్రికి.
    "నన్ను క్షమించగలవా? అడిగేందుకుకూడా అర్హత లేదేమో!"
    "మమతతో పెంచిన పిల్లలను క్షమించలేకపోతే అది మాతృహృదయం కాదు."
    "అమ్మా" అన్నాడు. కళ్ళ వవెంబడి రెండు నీటి చుక్కలు రాలిపడ్డాయి.
    "నా ఆఖరి కోరిక కూడా తీరిపోయింది. పుత్రదండన, పురుషదండన రెండూ లేకుండా నా జీవితం గడిచిపోయింది. ఇంక బ్రతకవలసిన అవసరం లేదు. ఏనాడు చేసుకున్న పూజల ఫలితమో అభాండాల పాలవవలసిన జీవితం ఎటువంటి ఉడుకులూ లేకుండా ఆయన మూలంగా సుఖంగా గడిచింది. చివరికి నువ్వు కూడా మంచినే చూడగాలిగావు. మీచేత ప్రేమించబడకున్నా ద్వేషించేలా లేకుంటే చాలు" అంది కన్నీళ్ళతో మనమన్ని ముద్దు పెట్టుకుంటూ.
    "ఎక్కువగా మాట్లాడకమ్మా రెస్టు తీసుకో" అన్నాడు.
    మరునాడు కృష్ణమూర్తి గారుకాక మరో ఇద్దరు డాక్టర్ల పర్యవేక్షణలో, సహాయంతో ఆపరేషన్ జరిగింది.
    ఆపరేషన్ జరుగుతున్నంతసేపూ దాదాపు పిచ్చెత్తినట్లు తిరిగాడు శ్రీనివాస్. మానవ హృదయంలో ప్రేమ, ద్వేషం రెండూ సమానంగా ఉంటాయేమో! అందుకే ఇంతగా ప్రేమించిన తల్లిని ఎంతగానో ద్వేషించినా, ముందుగా స్థానం చేసుకున్న ప్రేమ జయించి ద్వేషాన్ని పారద్రోలింది. అతిచిన్న పదమయిన రెండక్షరాల ప్రేమే సర్వప్రపంచ సౌఖ్యానికి మూలం. మరో రెండక్షరాల ద్వేషం సర్వవినాశనానికి కారణం.
    మగతగా పడుకున్న తల్లిని చూచి మౌనంగా ఇవతలికి వచ్చాడు శ్రీనివాస్.
     పగలంతా ప్రయాణం చేసిన సూర్యభగవానుడు పశ్చిమానికి వాలిపోయాడు. ఎండపడిన ప్రాణాలు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నాయి. చల్లని పిల్లగాలులు మెల్లిగా వీస్తున్నాయి. ఆ సాయంత్రం దాకా సావిత్రి పరిస్థితిని పరిశీలిస్తూ హాస్పిటల్ ల్లోనే ఉండిపోయిన కృష్ణమూర్తిగారు తృప్తిగా ఇవతలకు వచ్చారు. ఆరోజున ఆయన మనస్సుకు ఏ ఆపరేషన్ చేసినా కలగని సంతృప్తి కలిగింది. మనస్సులో ఏదో నిశ్చయించుకుని శ్రీనివాస్ ఇంటివైపు వెళ్ళారు.
    వాకిట్లో చెట్లమధ్య ఒంటరిగా ఉన్న శ్రీనివాస్ ను చూడగానే ఆయన మనస్సు తెలియని విధంగా పరవశించింది. కొద్ది క్షణాలు అతనివంక చూస్తూ నిలబడిపోయి, గేటు తెరుస్తూ చప్పుడు చేశారు.
    గేటు దగ్గిర కృష్ణమూర్తిగారిని చూచి లేచి నుంచున్నాడు. ముఖంమీదకు చిరునవ్వు తెచ్చుకుంటూ "రండి" అని ఆహ్వానించాడు. కుర్చీలో కూర్చున్నాక ఇద్దరికి కొద్దిక్షణాలు మాటలు కరువయ్యాయి.
    "రేపు పొద్దున ఊరు వెడుతున్నాను. మీ అమ్మ పరిస్థితి అనుకున్న దానికంటే సంతృప్తికరంగా ఉంది" అన్నారు గొంతు సవరించుకుని.
    "విన్నాను. మీరు కొద్ది రోజులు ఇక్కడ గడపకూడదూ? కనీసం మా అమ్మ ఆరోగ్యం బాగుపడేదాకాఅయినా ఉండకూడదూ?"
    "లేదు. అక్కడా బాధ్యతలు ఉన్నాయిగా. నేనెంత తప్పించుకుందామనుకున్నా కల్పించుకున్న పనులు తప్పవు."
    "............................"
    "చివరికి ఈ రూపేణ కలుసుకోవడమయింది. సావిత్రికి నే నెన్నివిధాలుగా సంతోషాన్ని భంగంచేసినా, ఆమె అనారోగ్య కారణంగా నిన్ను చూచి సంతోషించే భాగ్యం కలగచేసింది. ఇంతవరకు సావిత్రికి నేనేరకంగానూ సాయపడలేకపోయాను. మనస్తాపాన్ని, నీనుండి ఎడబాటునుతప్ప ఎటువంటి సంతోషాన్ని కలిగించలేదు. కనీసం, ఈ రోజు, ఈ విధంగా నా వృత్తి ధర్మంతో సావిత్రికి సహాయపడ్డానన్న తృప్తే నాకు చాలు! ఈ అవకాశం కలిగించినందుకు నీకు కృతజ్ఞత చెప్పుకోవాలి."
    "మీరు పెద్దవారు. అట్లా మాట్లాడటం తగదు. మీమూలంగా మా అమ్మ ఆరోగ్యం బాగుపడుతూంది. మీకే నేను..."
    "శ్రీనివాస్, మనసుస్సుకు కలిగే భావోద్వేగాలు, సుఖసంతోషాలు తాత్కాలికమే. కాలగమనంలో అన్ని మరుస్తాము. నీతో మాట్లాడి ఇవతలికి వచ్చినరోజున నేననుభవించినది తిరిగి చెప్పలేను. కాని ఈ రోజు ఆ బాధ ఛాయామాత్రంగా కూడా లేదు. ఏదో ప్రయోజనాన్ని సాధించడంకోసం నీతో స్నేహం వాంఛించానని మాత్రం అనుకోకు. కేవలం నీకు దగ్గిర అవుదామన్న కోరికతప్ప నాకు మరో ఆశ లేదు. నా ఆశే అత్యాశగా మారి నిన్ను తరుచు చూచేందుకు కూడా వీలు లేకుండా చేసింది. కాని ఒక్కటి. నీలోని చదువు, ఆశయాలు, ఉద్దేశాలు మాత్రం ఏనాడూ వృథా పోనీకు. నిన్ను నీ విద్యనుండి ఏదైతే భయపెట్టి దూరంగా నెట్టుతూందో, అదే బహు వ్యాధుల రూపంలో మనని తరుముతూంది. ఆ వ్యాధుల నివారణకు రీసర్చిలో పాటుపడు. నీ చదువు సార్ధకం చేసుకో. ఇది నేను ఏనాడో చేయవలసిన పని. కాని నా ఆపేక్ష, ఆకాంక్ష నా కళ్ళు మూసేశాయి. నీలో ఉన్న ప్రతిభను, త్యాగగుణాన్ని తీర్చిదిద్దుకో. వెలగవలసిన దీపాన్ని ఆరిపోనీకు. వెలుగునిచ్చే కాంతిని మూసివెయ్యకు. కలవవలసిన బంధాన్ని తెంపివెయ్యకు" అన్నారు ఆవేశంగా.
    ఆయనవంక ఆశ్చర్యంగా చూసి చిరునవ్వుతో పరికించాడు. ఆ నవ్వులో ఆ ప్రశాంతవదనంలో ఎన్నో భావాలు గోచరించాయి కృష్ణమూర్తిగారికి.
    కొద్దిక్షణాలలో తమాయించుకుని "ఇంక నేను వెళ్ళాలి. విష్ యు సక్సెస్!" అన్నారు కరచాలనంకోసం చెయ్యిజాపుతూ. ఆయన చెయ్యిలో చెయ్యి కలుపుతూ ఆప్యాయంగా నొక్కాడు శ్రీనివాస్. ఆ విడదీయరాని రక్తసంబంధంతో, అపురూపమయిన ఆ ఆప్యాయతకు ఆయన ముఖంలో వేయిజ్యోతులు వెలిగాయి.
    సంధ్యాసమయంలో చేసిన దీపారాధనలో మరికొంచం నెయ్యి వేసింది అనూరాధ. కడగట్టిపోతున్న వత్తి కాంతివంతమయింది! వెలుగుతున్న దీపం వింత వెలుగుల్ని ప్రసాదిస్తూంది. మూడు వత్తులదీపం కల్యాణమూర్తి శ్రీనివాసుడి నుదుట తిరుచూర్ణపు బొట్టులా మెరిసిపోతూంది. వెలుగుతున్న దీపపుకాంతిలో వెండిపటం తళుక్కుమని మెరిసింది.

            


                                   :-సమాప్తం:-


 Previous Page

WRITERS
PUBLICATIONS