ఆ తరవాత నించి ఏదో ఒక పని పెట్టుకుని కలుసుకోవడం ఎక్కువ చేశాను. నిన్ను నా కొడుకుగా చెప్పుకోవాలని, 'నాన్నా' అని పిలిపించుకోవాలని మనసు తహతహలాడిపోయేది. అది ఎటువంటి సమయంలోను సాధ్యపడదని నిశ్చయించుకున్నాను.
నాకు మొదటినుండి పిల్లలంటే మమతే నేను ఒక్కడినే అయి తోడపుట్టిన వాళ్ళెవరు లేకపోవడంవల్ల, ఇరవై ఏళ్ల వైవాహిక జీవితంలో సంతాన భాగ్యం లేకపోవడంవల్ల పిల్లలంటే ఇష్టం ఎక్కువయిందేకాని తగ్గలేదు. నాకు ఎన్నాళ్ళగానో ఒక పసిపిల్లను పెంచుకోవాలన్న కోరిక ఉండేది. కాని అందుకు నా భార్య ఇష్టపడలేదు. ఆమెకు చివరిదాకా పిల్లలు పుట్టకపోరన్న ఆశ ఉండేది. వైద్యరీత్యా అది అసంభవం అన్న విషయం నాకు తెలిసినా, ఆమెను నిరుత్సాహపరచడం ఇష్టంలేక ఊరుకునేవాణ్ణి. నాకు నలభై ఏళ్లప్పుడు ఆవిడ పోవడంతో, మళ్ళీ పెళ్ళి చేసుకోమన్న ఒత్తిడికూడా లేకపోలేదు. కాని అది మాత్రం నా మనసులోకి పొరపాటునకూడా రానివ్వలేదు. ఒకటిమాత్రం నిజం. చిన్నతనంలో సావిత్రితో చేసిన పొరపాటుమాత్రం ఎప్పుడూ మరిచిపోలేదు. సావిత్రి ఎక్కువగా అత్తవారింటిలో ఉండటం, ఎప్పుడైనా వచ్చినా రెండు మూడు రోజులుతప్ప ఉండకపోవడంతో మొత్తంమీద మళ్ళీ సావిత్రిని ఎప్పుడూ చూడలేదు.
నా ఈ కారణాలన్ని కలిసినందున నీమీద అభిమానం ఎక్కువ కాసాగింది. నిన్ను మెడిసిన్ విషయంలో బాగా ప్రోత్సహిస్తున్నానన్న విషయం తెలిసి రాజశేఖరం నన్ను హెచ్చరించాడు.
ఉద్యోగంలో అడుగుపెట్టిన రోజునుండి పరపతి, పలుకుబడి, డబ్బు, హోదా ఏవీ లెక్కచేయకుండా మనిషి అర్హతనుబట్టి, అవసరరాన్నిబట్టి వైద్యం, సహాయం చెయ్యాలన్న ఉద్దేశాలతో గడిపిన నేను నీ పరిస్థితికి హౌస్ సర్జనుకు సీటు రాదని తెలిసికూడా నా ఆదర్శాలను వెనక్కి నెట్టి, నా పరపతి అంతా ఉపయోగించి నీకు సీటు వచ్చేలా చేశాను.
నేను చేస్తున్న పని తప్పేమో అన్న అనుమానం నాకు ఎప్పుడూ ఉండేది. కాని దాన్ని బయటికి రాకుండా నోరు నొక్కింది నీమీద కలిగిన అభిమానం. నీకు నేను పనిచేసేచోట పని కలిగిస్తే నా కళ్ళఎదురుగా ఉంటావు. అదే నా ఆశయం. నీకు దగ్గిర కావాలంటే అదొక్కటే మార్గం.
తప్పు చెయ్యని మానవులుండరు. నేనూ సామాన్యమానవున్నే! నాలాగే పొరపాటు చేసిన సావిత్రి కోరిందికూడా నీ ఉన్నతినే. ద్రోహం చెయ్యడం తప్పన్న విషయం అందరికి తెలిసినదే. ఒక్కొక్కసారి ఉన్నతిని కోరడంకూడా తప్పేనేమో!....కాకపోవచ్చు. నాలా స్వార్ధంతో ఉన్నతి కోరడం తప్పు.
మీ నాన్నగారిలాటి అదృష్టవంతులు, అమృత హృదయులు భూమిమీద ఎక్కడో తప్ప ఉండరు. నిన్ను కొడుకుగా భావించిన ఆయన ఆదర్శవంతుడు. నీలాంటివాణ్ణి కొడుకుగా చెప్పుకోగలిగిన ఆయన ధన్యమూర్తి. మనిషి గొప్పవాడు కావడానికి డాక్టరో, యాక్టరో అవనక్కరలేదు. ఈ విషయం ముందుగా గ్రహించనందుకు సిగ్గుపడుతున్నాను. నీలోని ఉన్నతాశయాలు, విద్యాసంస్కారాలు మరుగుపడిపోనివ్వకు.
నేను వీలైనంత దూరంగా వెడుతున్నాను. నేను ఇంకా బ్రతికే ఉన్నాను కాబట్టి అవసరాలను వెతుక్కోవాలి. అవసరాలకోసం బ్రతికే రోజులు వచ్చాయి.
లక్ష్మీపుత్రుడివై అల్లారుముద్దుగా పెరిగిన నీకు నా ఆస్తి పనికి వస్తుందనుకోను. ఈ రోజున నీ క్షోభకు కారకున్ని నేను. చివరిసారిగా నిన్ను కోరేది ఒకటి. అనూరాధను తీసుకువచ్చెయ్యి. మీ అమ్మను ద్వేషించకు. ప్రేమాధికులను ద్వేషంలో ముంచకు. మానవత్వంతో ద్వేషం లేకుండా చెయ్యాలి. లేకుంటే ద్వేషం మానవత్వాన్ని నశింపచేస్తుంది.
అనుక్షణం నీకు దగ్గిరలో ఉండాలన్న కోరిక నాలో ఉన్నా, అది అసంభవం కనక ఒకటి అర్దిస్తున్నాను. ఇంతవరకు నీ జీవితపుదారులలో ఏ మలుపుకు నేను కారణమయినా నీమీది వాత్సల్యంతోనే! దాన్ని నువ్వీక్షణంలో అర్ధం చేసుకోలేక పోయినా మున్ముందు నీకు ఒక బిడ్డ కలిగాక నాలోని ఈ అలజడికి కారణం తెలుసుకుంటావు.
నేను ఎక్కడికి వెడుతున్నానో ఇంకా నిర్ణయం కాలేదు. ఎక్కడున్నా నా చివరిసమయంలో నీకు తెలియపరిచే ఏర్పాటు చేస్తాను. ఒక తండ్రికి కొడుకు చేతులలో జరిపించవలసినవన్ని జరపమని కోరుకుంటున్నాను. ఇది ఎన్నేళ్ళ తరవాత సంభవించినా సరే! కన్నతండ్రిగా నన్ను భావించలేకపోయినా, ఎవరూ ఎని ఒక అనాథుడని అనుకున్నా చాలు.
ఆశీర్వచనములతో,
కృష్ణమూర్తి."
ఉత్తరం పూర్తిచేసి ఆలోచనలో పడింది రాధ. 'అంత స్నేహం, బాంధవ్యం పెంపొందించుకున్న వారిమధ్య స్తబ్ధతకు ఇదా కారణం? కనీసం అన్నయ్య పెళ్ళికి రాకపోవడానికి కూడా శ్రీనివాస్ కు దూరం కావాలనా!....ఆఖరికి ఈయన మూలంగా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయారా? ఈయనలో ఈ కోపం ఎప్పటికైనా పోయేదేనా? తన్ను చిన్నప్పటినుండి ఆడించి దగ్గిరకుతీసిన కృష్ణమూర్తిగారి కొడుకు తన భర్త ఎంత విచిత్రం! తన పుట్టుకరహస్యం వెల్లడి చేసినందుకేనన్నమాట తల్లిమీద కోపం? ఎంతపని జరిగింది! తిరిగి వీళ్ళెప్పుడైనా కలుస్తారా? ఆవిడ మనస్సు ఎంత క్షోభిస్తుందో!...' మరిచిపోయింది అనూరాధ. చటుక్కున తీసి చదవసాగింది. ఆలోచిస్తూ కుర్చీకే అతుక్కుపోయింది. 'ఎంత మృదుహృదయుడు! ఒక్కసారిగా మనసుకు ఎన్ని దెబ్బలు తగిలాయి! చివరికి కృష్ణమూర్తిగారి ప్రోత్సాహానికి అసలు కారణం బయటపడితేగాని తన కాపరం కుదుటపడలేదు!'
పలు విధాలుగా, బహుముఖాలుగా అల్లుకుపోతున్న ఆలోచనలు అంతులేకుండా సాగాయి. శ్రీనివాస్ తో పరిచయం, స్నేహం, వివాహం ఒకటొకటిగా మనస్సులో మెదిలాయి. లేచి అటూ, ఇటూ తిరగసాగింది ఏమీ తోచనిదానిలా. పుస్తకంలో తల దూర్చపోతే అది ఆమెతరం కాలేదు. 'ఇంక శాశ్వతంగా తల్లికి దూరమవుతారా శ్రీనివాస్? మీరు చేస్తున్నది తప్పని గట్టిగా చెప్పాలి వారితో, కాని అందుకు తగిన సమయం రావాలి' అనుకుంటూ లేచి, పుస్తకం తిరిగి అలమారులో సర్ధబోయింది. అవీ ఇవీ సర్దుతున్న రాధకు అప్రయత్నంగా భారతం కంటపడింది. ఆ పుస్తకాన్ని చూస్తూ ఉంటే దానిమీద శ్రీనివాస్ వెలిబుచ్చిన అభిప్రాయం గుర్తుకువచ్చింది. 'ఒక గ్రంథంలో ఒక పాత్ర చేసిన పనిని సహించలేక తీవ్రంగా విమర్శించిన శ్రీనివాస్, వాస్తవంలో తన తల్లి చేసిన పనిని సమర్దించగలడా! ...క్షమించగలడా? ఏమిటిది? తను అభిమానించిన వ్యక్తికీ, తనకు ఎంత సామ్యం?' ఈ ఆలోచన మనస్సులోకి రాగానే గుండె బరువెక్కింది.
* * *

39
అనూరాధకు అబ్బాయి పుట్టాడు. ఆ రోజు పగలంతా మందకొడిగా అయిపోయిన రాధను చూచి కంగారుపడ్డాడు శ్రీనివాస్. ఆ రాత్రికి అబ్బాయి పుట్టాడన్న వార్త వినేవరకు అతని మనస్సు మనస్సులో లేకపోయింది. వడిలిన అనూ రాధను, వికసించిన పాపాయిని చూస్తూంటే మనస్సు సంతోషంతో నిండి పోయింది. తదేకంగా చూస్తున్న శ్రీనివాస్ ను చూస్తూ "మరీ ఎక్కువగా చూడకండి! మా అల్లుడికి దిష్టి తగిలేను" అని నవ్వాడు కృష్ణమోహన్.
అనూరాధకు సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి. శ్రీనివాస్ చిరునవ్వుతో "దిష్టి తగిలేటంత అందంగా లేడులా ఉంది" అన్నాడు.
"అల్లుడు, అల్లుడని చెప్పుకుంటే కాదు. అమ్మాయిని కన్నాక అనాలా మాట" అంది శ్రీలక్ష్మి.
"ఓస్ అదెంత పని! ఏదీ ఈ అనూరాధాదేవిగారు అల్లుణ్ణిస్తారో లేదో చూచుకు మరీ మన ప్రణాళిక మొదలు పెడదామని" అన్నాడు లలితవంక చిలిపిగా చూస్తూ. "చూస్తూ ఉండండి, బావగారూ. మా అల్లుడు మీలా సుకుమారుడు కాకూడదు. మాంచి ఉక్కుమనిషిని చేసేస్తాను" అన్నాడు తొట్టెలోఉన్న పిల్ల వాడి బుగ్గలు మృదువుగా తాకుతూ.
శ్రీనివాస్ ప్రమేయం లేకుండానే సావిత్రికి మనవడి ఆగమనం తెలియపరిచారు. అందుకు శ్రీనివాస్ ఏమంటాడో అని కొంచం భయపడ్డా, అతని మౌనం చూచి తేలికగా నిట్టూర్చింది అనూరాధ.
"మనం ఈ ఊరునుండి వెళ్ళిపోదాం." అభిప్రాయం వెలిబుచ్చాడు శ్రీనివాస్ ఓరోజు.
ఆమె ఆశ్చర్యంగా చూచింది. రోజురోజుకు ఈ అభిప్రాయం అతనిలో స్థిరమవుతూందని గ్రహించినా ఈరోజు ఈ విధంగా అడగటం కొంచం ఆశ్చర్యపరిచింది.
"ఏ ఊరు?"
హైదరాబాద్. ఒక స్నేహితుడి వ్యాపారంలో వాటాదారుగా చేరుతున్నాను."
ఎటువంటి సమాధానము ఇవ్వలేక మౌనంగా నిట్టూర్చింది. ఆమె వంక చూస్తూ "ఏం, మీ ఊరు విడిచిపెట్టి పోవాలంటే బెంగగా ఉందా?" అని నవ్వాడు.
"బెంగ ఎందుకు? అయినా పెళ్ళి అయ్యాక ఉన్న ఊరులో ఉండాలంటే ఎంతమందికి కుదురుతుంది?" అని ఒడిలో బాబును తొట్టెలో పడుకోపెట్టి లోపలికి వెళ్ళింది.
మెల్లిగా కుర్చీలో నించి లేచి ఊయలవైపు చూచాడు. పండులాంటి పాపాయి హాయిగా నిద్రపోతున్నాడు, ఎందుకో తనలో తను నవ్వుకుంటూ. బాబు గడ్డంకింద పొట్ట చూడగానే అప్రయత్నంగా తన గడ్డం తడుముకున్నాడు. 'ఏమిటీ పోలికలు? .... ఎలా వస్తాయో కదా! వీడు ఎవరి పోలిక? కళ్ళు పూర్తిగా అనూరాధది. కాని తన పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, తన తండ్రిపోలిక తనకు. తన బిడ్డకు తన పోలిక.' ఇలా ఆలోచించగానే మొహం కొంచం ఎర్రబారింది. 'తన తండ్రి పోలిక. ఏ తండ్రి పోలిక వచ్చింది? పెంచి పెద్ద చేసిన ఆయన ఉదారహృదయం తనకు లేదు. కని, పెంచని తండ్రిలా అసలే కాలేదు. వీడెలా తయారవుతాడో?' ఇలా సాగిపోతున్న ఆలోచనలను కట్టిపెట్టి మృదువుగా బాబు బుగ్గలు నిమిరి అవతలికి నడిచాడు.
40
బాబుకు మూడవనెల రాగానే హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. పుట్టి, పెరిగి, ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఊరు వదిలిపోవాలంటే మనస్సులో చెప్పరాని దిగులు కలిగింది అనూరాధకు. ముద్దులు మూటగడుతున్న మనవడికి దూరం కావాలంటే బాధగా ఉంది శ్రీలక్ష్మి, రాజశేఖరంగార్లకు.
బారసాల జరిగినప్పుడైనా రాని మామ్మకు చూపకుండా తీసుకువెళ్ళడం ఏదో లోటుగా అనిపించింది రాధకు. తనకు సీమంతానికి సారె పంపినప్పుడు, బాబు బారసాలకు ఒంట్లో బాగా లేదని కబురు పంపటంతో నిజంగానే ఆమెకు కులాసాగా లేదేమోనని అనుమానపడసాగింది. శ్రీనివాస్ తో ఆ విషయం ఎన్నిసార్లు కదిపినా, మౌనంగా ఊరుకోవడమో, మాట మార్చడమో చేస్తాడు.
ఉదయమే లేచి కారులో బయలుదేరారు. వెనుకసీట్లో బాబుకు పక్క సర్ది పడుకోబెట్టి తను సర్ధుకుని కూర్చుంది అనూరాధ. హైదరాబాద్ చేరే లోపల రెండురాత్రులు ఆగదలుచుకున్నారు, బాబుకు మరీ హైరానాగా ఉంటుందని.
"విజయవాడలో ఆగుతాము కదూ?" అడిగింది డ్రైవ్ చేస్తున్న శ్రీనివాస్ ని.
"ఊఁ...ఏం? ఊరు చూస్తావా?"
"అక్కడికి గుంటూరు ఎంతదూరం?"
"..........................."
"మిమ్మల్నే అడిగేది."
"ఎంతదూరమయినా మనం అక్కడికి వెళ్ళడంలేదు."
అనూరాధ కొద్ది క్షణాలు మౌనంగా ఉండి మళ్ళీ అంచిన "మీరు ఒకసారి ఓ కథ మీద ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చారో జ్ఞాపకం ఉందా?"
"ఏమో, నేను చాలా చదివాను. చాలా చర్చ చేశాను" అన్నాడు ముభావంగా.
అతని జవాబు వినేసరికి మొండితనం హెచ్చింది అనూరాధలో.
"ఫోర్స్ ఆఫ్ ది సర్కమ్ స్టెన్సెస్'ని గురించి నాకు నచ్చలేదన్నప్పుడు మీరు ఎంతో వాదించారు."
వెంటనే గుర్తుకు వచ్చింది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకో అర్ధమయింది. "నా సంగతి సరే. నీకసలే నచ్చని ఆ కథను గురించి ఈవేళ ఈ మాట లెందుకో?"
"అప్పుడు నాకు నచ్చని కారణం ఇప్పుడూ ఉంది. కాని ఆ సందర్భంలో అక్కడ నేను విమర్శించింది ఒక మగవాణ్ణి. ఇప్పుడూ అదే చేస్తున్నాను."
"స్వజాతీయాభిమానం తగ్గలేదంటావ్."
"మీరు హాస్యంగా తీసిపారెయ్యకండి. నేను తీవ్రంగా అంటున్నాను. ఆరోజు మీరన్నారు, 'బలహీనమయిన క్షణాలు జీవితంలో ఎవరికైనా దొర్లుతాయి. కాని వాటినిబట్టి కాదు మనం మనిషి విలువ చూడాల్సింది' అని. అటువంటిది మీ అమ్మ అని అయినా ఆలోచించకుండా..."
"అనూరాధా, నన్నుబాద పెట్టింది నా పుట్టుక కాదు. మరుగునపడిపోయిన వాటిని బయటికి తీసి, నన్ను నేను చిన్నపరుచుకునేలా చేసింది."
