Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 32


    ఆమె నవ్వింది.
    "ఏం నా డబ్బు ఆ మాత్రం ఉపయోగించకూడనిదా?"
    "అలాగని కాదు! నాకు చేతకానప్పుడు తప్పక తీసుకుంటాను!"
    "బావుంది! 'నీ' 'నా' అనేతేడా మీమనసులో ఎందుకేర్పడిందసలు?"
    "నాకేమీ తేడాలు లేవు"
    "అలాగయితే దీనికంత ఆలోచించాల్సిన పనేముంది?" అంటూ ఆమె చెక్కురాసి అతనికి ఇచ్చింది.
    రెండు రోజుల తరువాత ఇద్దరూ ఆ భవనంలో దిగారు. ఇంట్లోకి అవసరమయిన ఫర్నిచర్ అంతా తనే ఏర్పాటు చేసింది చంద్రిక.
    "ఇలా నువు డబ్బు మంచినీళ్ళలా ఖర్చుచేయడం నాకేం నచ్చలేదు!" చిన్నబుచ్చుకుంటూ అన్నాడతను.
    "మనకోసమే ఖర్చుచేస్తోందీ?" చిరునవ్వుతో అందామె.
    మర్నాడు ఆమెకోసం ఇద్దరువ్యక్తులు వచ్చారామె ఇంటికి. ఆమెను చూస్తూనే లేచి నిలబడి నమస్కరించారిద్దరూ.
    "మేము హైద్రాబాద్ నుంచి వచ్చామండీ! మీకు పెద్ద ఎత్తున సన్మానం ఏర్పాటు చేయాలని మా ఆర్గనైజేషన్ నిశ్చయించుకుంది. ఇందుకు మీరు అంగీకరిస్తే.....మేము ఎరేంజ్ మెంట్స్ చేసుకుంటాం-"
    చంద్రిక కొద్దిక్షణాలు ఆలోచించి "సరే" అంది అంగీకరిస్తూ "మరి దీని ఖర్చుకి డబ్బెక్కడది?"
    "ఆ సందర్భంలో ఒక సావనీర్ వేయాలనుకుంటున్నాం. ఎడ్వర్టయిజ్ మెంట్స్ మీద ఒకలక్ష కలెక్ట్ చేస్తామనుకోండి! ఇంకో లక్ష ఎలాగోలా సమకూర్చుకోవాల్సిఉంటుంది!"
    "అంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టి ఎందుకొచ్చిన సన్మానం?" వారిని నిరుత్సాహపరుస్తూ అందామె.
    "అలా అనకండి! మీకు ఏనాడో జరగాల్సిందిది. ఇప్పటికే ఆలస్యం జరిగింది....." ఒకతను అన్నాడు.
    "పోనీ మిగతా లక్షా మీరు సర్దితే- మనకి ఏ సమస్యా ఉండదు- "మరోకతను అన్నాడు చంద్రికతో.
    చంద్రికకు చిరాకేసుకొచ్చింది.
    "చూడండి! డబ్బు ఖర్చు పెట్టి సన్మానం చేయించుకోవాల్సిన అవసరం నాకులేదు. ఆ డబ్బు ఏ అనాధశరణాలయానికయినా ఇస్తే నాకు ఆనందంగా వుంటుంది. ఇక మీరు వెళ్ళవచ్చు..." అందామె.
    వాళ్ళు ఇంకేదో మాట్లాడబోయారుగాని చంద్రిక ఇంట్లోకి వెళ్ళి పోవడంతో గత్యంతరం లేక బయటకు నడిచారు.
    ఆ రోజు షూటింగ్ కెళ్ళేసరికి రాధ కనిపించిందక్కడ.
    "ఇదేమిటి ఇక్కడున్నావ్?" అడిగింది చంద్రిక.
    "మీ సినిమాలోని ఓ వేషానికి వప్పుకున్నాను...."
    "ఏ వేషమది?"
    "చాలా చిన్నది! రేప్ సీన్."
    "అదేమిటి? అలాంటి వేషాలెందుకు వప్పుకుంటున్నావ్?"
    "కేవలం రేప్ సీన్ కోసమే అయితే వేయనని ముందు తిరస్కరించానండీ! కానీ పరిస్థితులు బావుండకమళ్ళీ వప్పుకున్నాను. నేను నిలబడాలంటే నాకు ఏదోక వేషం కావాలి! ఎంత చిన్న వేషమయినా, ఎంతటి అసభ్యకరమయిన దయినా సరే అంగీకరించడానికి నిశ్చయించుకున్నాను. ఆ నిర్ణయం తీసుకోగానే నాకు అప్పటికప్పుడే ఆరు సినిమాలు వచ్చాయ్"
    ఆమెను చూస్తే జాలివేసింది చంద్రికకు. ఒక విధంగా తను అదృష్టవంతురాలనే అనుకోవాలి! ఎన్నో ఇబ్బందులు పడినా ఇలాంటి దుస్థితికి రాకుండానే తప్పించుకుంది! ఆ రాత్రి షూటింగ్ నుంచి ఇంటికి చేరుకునేసరికి బాగా ఆలస్యమయిపోయింది.
    అప్పటివరకూ ఆమెకోసం ఎదురుచూస్తూనే వున్నాడు కౌశల్.
    "నీకోసం వేచి ఉండడంనావల్ల కాదోయ్!" చిరుకోపంతో అన్నాడతను.
    "ఏం చేయమంటావో చెప్పు పోనీ!" లాలనగా అంది చంద్రిక.
    "ఇద్దరం రాత్రుళ్ళు షూటింగ్ మానేయాలి ఏ పరిస్థితిలోనూ ఎనిమిదిగంటలకల్లా ఇంటికి చేరుకునేట్లు ఉండాలి!"
    "సరే! ఇకనుంచీ అలాగె ఏర్పాటు చేసుకుందాం! అందులో సమస్యే ముంటుందీ?" అంగీకరిస్తూ అందామె.
    అతను విస్కీ రెండు గ్లాసుల్లో తెచ్చి ఆమె కొకటి అందించాడు.
    "నాకు వద్దు" అయిష్టంగానే అందామె.
    "అలా అనకూడదు! కంపెనీకోసం తాగాల్సిందే?"
    "నాకు ఇష్టం లేనిదే ఎందుకు బలవంతం చేస్తావ్?"
    "ఇష్టం లేకపోయినా నాకోసం చేయలేవూ? డాక్టరు చేదుమందిస్తే బలవంతంగా తాగవూ?" అలాగే ఇది కూడా!"
    "ప్లీజ్."
    "ఊహు! నేనువప్పుకోను!" అంటూ ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకుని బలవంతంగా గ్లాసులోని విస్కీ కొంచెంతాగించాడు. వాంతి కలిగిస్తోన్నట్లున్నా అంతా గడగడ తాగేసింది చంద్రిక.
    "గుడ్! ఇప్పుడు ఇంకొక్క గ్లాసు....."
    "నీకు దణ్ణం పెడతాను ఇంకొద్దు...."
    "నీకు తెలీదు చంద్రికా! ఇద్దరం ఉదయం నుంచీ, సాయంత్రం వరకూ కష్టపడి ఇంటికి చేరుకుంటాం! మనిద్దరికీ లభించే ఆనందం కాసేపే! పూర్తి ఆనందం లభించాలంటే ఇదొక్కటే మార్గం-"
    మరో గ్లాసు కూడా బలవంతంగా తాగేసింది చంద్రిక.
    ఆ తరువాత ఏం జరిగిందో ఆమెకు గుర్తులేదు. ఉదయం పదిగంటలకుగాని ఇద్దరకూ మెలకువరాలేదు.
    "ఎలా ఉందిప్పుడు! ఫ్రెష్ గా లేదూ?" చిరునవ్వుతో అడిగాడు కౌశల్.
    "ఊహు! రోజూలానే వుంది" చిలిపిగా అందామె.
    "అయితే నీకు డోస్ చాల్లేదన్నమాట! ఇవాళ మరికొంచెం పెంచుతానుండు"
    "వద్దొద్దు! నన్ను కూడా నీలా తయారుచేయకు....."
    "మనిద్దరి మధ్యా అభిప్రాయభేదాలూరాకూడదని అంటావుగదా! ఇద్దరం మందు కొట్టేస్తే అసలు అభిప్రాయాలే ఉండవ్..."
    అతని బలవంతంమీద ఆ రోజు కూడా రాత్రి విస్కీ తాగింది చంద్రిక. ఆ తరువాత అదివరలా విస్కీ వాంతి కలుగజేసే గుణం పోగొట్టుకున్నట్లనిపించింది. తనకూ అలవాటవుతుందేమోనన్న భయం కలిగిందామెకి.
    "నేను చెప్పానా! అలవాటయిందంటే ఇది అమృతమని?" నవ్వుతూ ఆమెతో అన్నాడు కౌశల్.
    "ఊహు! అమృతమో విషమో నాకు తెలీదుగాని రేపట్నుంచీ దీన్ని ముట్టుకోను నేను!" ఖచ్చితంగా చెప్పిందామె.
    ఆమెను ఆ రోజు నుంచీ బలవంతం చేయలేకపోయాడతను.
    "ఇదిగో నీకో న్యూస్ చెప్పాలి!" ఆరోజు అతనితో అందామె.
    "ఏమిటది?" ఆశ్చర్యంగా అడిగాడు కౌశల్.
    "మనింటికో పాపాయి రాబోతోంది!"
    అతను ఆనందంతో ఆమెను కౌగలించుకున్నాడు.
    "మగపిల్లాడిని కంటావా?"
    "ఎందుకు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS