Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 32


    "నువ్వు మనిషివి కాదు. పశువ్వి. నాకు ఇష్టంలేదని చెప్పానుగా..ఇంకా ఎందుకు వెంటపడతావ్?"
    
    "నువ్వు ఇది తీసుకోకపోతే ఇదిగో మగ స్టూడెంట్స్ కి బూట్ పాలిష్ చేస్తా" అంటూ ఓ బూట్ పాలిష్ డబ్బాను జేబులోంచి తీశాడు.
    
    ఇక అతనితో ఆర్గ్యు మెంట్ అనవసరమనిపించి చకచకా ముందుకు నడిచింది. స్నేహితురాళ్ళు ఆమెను అనుసరించారు.
    
    గేటు దాటుతూ తిరిగి చూసిన వాళ్ళకు అతను స్టూడెంట్స్ ని పిలిచి బూట్ పాలిష్ చేయడం కనిపించింది. ఇక లాభం లేదనుకుని ఆమె ఓసారి అతను లేనప్పుడు అతనింటికి వెళ్ళింది.
    
    ఎదురింట్లోని అమ్మాయే కనుక అతని తల్లిదండ్రులిద్దరూ నవ్వుతూ ఆహ్వానించారు. వాళ్ళు సాంప్రదాయబద్దంగా, సౌమ్యంగా కనిపించారు.
    
    "ఏమిటమ్మా! ఎప్పుడూ ఇటు రానిదానివి ఈవేళ వచ్చావ్. ఏమైనా విశేషమా?" అని అడిగింది చిట్టిబాబు తల్లి శాంతాబాయి.
    
    "మీ ఇద్దరితో మాట్లాడాల్సిన పని పడింది. సార్ కూడా వున్నారా?"
    
    "ఉన్నారు"
    
    కాసేపటికి భార్యాభర్తలిద్దరూ వచ్చారు.
    
    ముగ్గురూ డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాక సుజన చెప్పింది.
    
    "మీ అబ్బాయి - అదే చిట్టిబాబు గత కొంతకాలంగా నావెంట పడుతున్నాడు. ప్రేమిస్తున్నానంటూ తెగ ఊదరగొట్టేస్తున్నాడు. కానీ నాకు అతనంటే ఇష్టంలేదు ఆ మాటే చెప్పాను. సంస్కారంగల ఏ అబ్బాయి అయినా అంతటితో ఆగిపోతాడు.
    
    కానీ మీ అబబాయి అల్లరి చేయడం ప్రారంభించాడు. నడివీధిలో గుంజీలు తీశాడు. మా కాలేజీలో మగ స్టూడెంట్స్ కి బూతు పాలిష్ చేశాడు. ఇక ఇలానే కొనసాగితే నాకూ ఇబ్బందే - మీ అబ్బాయికి ఇబ్బందే....."
    
    అన్తఃవరకూ ముఖంమీద నెత్తురుచుక్క లేకుండా వింటున్న వాళ్ళిద్దరూ కదిలారు.
    
    ముందుగా నాయర్ తేరుకున్నాడు.
    
    "వాడు ఇంతగా చెడిపోతాడనుకోలేదమ్మాయ్. ప్రేమేమిటి నాన్సెన్స్" అన్నాడు చాలా అసహ్యంగా ముఖం పెట్టి.
    
    "ప్రేమించడాన్ని ఏమీ తప్పు పట్టకండి. అది ఈ వయసులో సహజం. సహజమైంది ఎప్పుడూ బావుంటుంది. కానీ ప్రేమకు అనవసరంగా విశేషణాలు చేర్చడంవల్ల అదీ దేవుని ఉనికిలాగా అనుమానాస్పదమై పోయింది. ప్రేమంటే ఆకాశంలో విరిసిన పువ్వనీ, అమరమనీ, అజరామరమనీ, అమృతమనీ - ఇలా అవసరమైన విశేషణాలతో దానిని ఆకాశానికెత్తేశారు. విశేషణాలు చేర్చింది ఏదీ సహజంగా వుండదు. కృత్రిమంగా కనిపిస్తుంది.
    
    ఈ కవులూ, రచయితలూ, ఆధ్యాత్మిక వాదులూ అందరూ కలిసి ప్రేమని బ్రహ్మపదార్ధంగా తయారుచేశారు. అందువల్లే చివరికి అంత గొప్ప అనుభవం ఎవరికీ కలగక దానిమీదే అసహ్యం పెంచుకున్నారు. ఈ కారణంచేతనే పెద్దవాళ్ళు ప్రేమని చీఫ్ గా చూస్తారు మీరు అలానే అన్నారు.
    
    ప్రేమెప్పుడూ నాన్సెన్స్ కాదు. కానీ ఇప్పుడొచ్చిన సమస్య ఏమిటంటే మీ అబ్బాయి మీద నాకు ప్రేమ లేదన్నా వెంటపడుతున్నాడు అదీ"
    
    ఆమెవేపు వాళ్ళిద్దరూ పజిల్ గా చూశారు. ఇలాంటి అమ్మాయితో జాగ్రత్తగా మాట్లాడాలన్నది మాత్రం అర్ధమైంది.
    
    "ఇంతకీ ఏమంటావ్ అమ్మాయి?" తన కొడుకుని తీసిపారవేయడం ఆ తల్లికి కొంత కష్టంగానే వుంది.    

    "నావెంట పడవద్దని మీ అబ్బాయికి చెప్పండి దట్సాల్"
    
    సుజన లేచి వచ్చేసింది.
    
    ఆ తర్వాత ఓ వారం రోజుల వరకు ఆమెకి చిట్టిబాబు కనిపించలేదు. ఇక రాడని హాయిగా వూపిరి పీల్చుకుంది.
    
    కాని ఆమె అంచనా తప్పయింది.
    
    మరుసటిరోజు బస్టాండ్ లో సిటీబస్సు కోసం వెయిట్ చేస్తుంది. మరో రెండు నిముషాలకు తమ రూట్ బస్సు కనిపించడంతో బస్టాప్ పేవ్ మెంట్ నుంచి కిందకు దిగింది.
    
    అంతలో బస్సును క్రాస్ చేసాడు చిట్టిబాబు ఆ స్పీడ్ కి సుజన కళ్ళు తిరిగాయి.
    
    అతను ఆమెను అటువేపుగా రోడ్డు కవతలకు బైక్ ను తీసుకెళుతుండగా స్లిప్ అయింది. అతను కిందపడడం, బస్సు వచ్చి బస్టాప్ లో ఆగడం ఒకేసారి జరిగాయి.
    
    ఆమె బస్సెక్కి సీట్లో కూర్చుంది.
    
    బస్సు కదిలింది.
    
    బైక్ నుంచి పడడంతో అతని మోచేతులు రెండూ డోక్కుపోయాయి. రక్తం పైకి లేచింది. పడిపోయిన బైక్ ని అలాగే వదిలేసి చేతులైనా తుడుచుకోకుండా పరుగెత్తాడు.
    
    రోడ్ ను క్రాస్ చేసి, పేవ్ మెంట్ ఎక్కాడు. అక్కడ నిలబడి చేతులూపడం ప్రారంభించాడు. కిందపడటంతో మోచేతుల దగ్గర షర్టు చిరిగిపోయింది. అక్కడ రక్తం తేలడం కూడా ఆమె గమనించింది.
    
    ఆమె స్థానంలో మరో అమ్మాయి ఎవరయినా సరే ఈ సంఘటనకు కదిలిపోయేది. తనకోసం దెబ్బల్ని కూడా లెక్కచేయలేదనీ, పడిపోయిన మోటార్ బైక్ ని కూడా పట్టించుకోలేదనీ గర్వంగా ఫీలయ్యేది. అతను ఓ హీరోలా కనబడేవాడు.
    
    కానీ సుజన డిఫరెంట్ అతని ప్రవర్తన ఆమెకు ఎబ్బెట్టుగా అనిపించింది అసహజంగా అనిపించింది. అంత దెబ్బ తగిలినా అతను కేర్ లెస్ గా ప్రవర్తించడం వల్ల అతను ఎక్సంట్రిక్ అని నిర్ధారించుకుంది. అలాంటివాడితో మరింత జాగ్రత్తగా వుండడం మంచిదనిపించింది. అందుకే ఆ ఏరియా అయిన ఇన్స్ పెక్టర్ కి మొత్తం విషయమంతా చెప్పింది.
    
    శరవణన్ చాలా స్ట్రిక్ట్ ఎస్.ఐ. ఆలస్యం చేయకుండా అతనికి వార్నింగ్ ఇచ్చాడు. మరికొన్ని రోజుల వరకు అతను ఊరుకుండిపోయాడు. కానీ తిరిగి విజ్రుంభించాడు.
    
    ఈలోగా ఆమె మేనత్త చనిపోవడంతో తండ్రి దగ్గరికి వచ్చేసింది. యూనివర్సిటీలో జాయినయింది.
    
    కొన్ని రోజుల తర్వాత ఇల్లు ఖాళీ చేసి రావడానికి సత్యనారాయణ, సుజన వెళ్ళారు.
    
    సామాను లారీ ఎక్కించిన తర్వాత బస్టాండ్ కు బయల్దేరారు. మధ్యలో చిట్టిబాబు అడ్డుకున్నాడు. క్రౌర్యంతో బిరుసెక్కిన అతని ముఖాన్ని చూడగానే సత్యనారాయణ జడుసుకున్నాడు.
    
    అతనెవరో, ఎందుకలా అడ్డంగా నిలబడ్డాడో తెలియక కంగారు పడ్డాడు.
    
    "ఇక్కడినుంచి తప్పించుకు వెళ్ళావని అనుకుంటున్నావేమో కానీ నేను అందర్లాంటి అల్లాటప్పా వాడ్ని కాను. నిన్ను నీడలా వెంటాడతాను నీ అంతు చూస్తాను" చిట్టిబాబు తన కూతురికేసి చూస్తూ ఒక్కో మాటను తూటాల్లా పేలుస్తుంటే ఆయన బిత్తరపోయాడు. అలా ఎంత స్పీడ్ తో అన్నాడో అంతే స్పీడ్ తో వెళ్ళిపోయాడు.
    
    ఏం జరిగిందో మొత్తం వింటే తప్ప అక్కడినుంచి ఒకడుగు కూడా ముందుకు వేయలేనట్లు "ఎవడమ్మా వీడు" అని అడిగాడు.
    
    సుజన మొత్తం సంగతంతా చెప్పింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS