'అక్కా...! బావ చేసిన నేరాన్ని నీవు నెత్తిన వేసుకోవడంలో ఏదో అంతరార్ధం ఉంది.'
'అంతరార్ధ మేముందమ్మా? ఈ కుటుంబానికి నేను ఎంతో ఋణపడి ఉన్నాను. వీరి పరువు ప్రతిష్టలు కాపాడడం నా కనీస ధర్మం. అందుకని అలా చేశాను.'
'కాదులే! నీ మనసును నేను అర్ధం చేసుకోలేదనుకున్నావా? నాకెప్పుడో తెలిసింది.' శారద కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ అంది నీరజ.
'ఏం తెలిసిందమ్మా?' చిరునవ్వు పెదవులపై చిందుతూ ఉండగా అంది.
'నీవు ప్రభాకరం బావను ప్రేమిస్తున్నావు. నాకు తెలియదనుకుంటున్నావా? ఈ విషయం నే నెప్పుడో గ్రహించాను' అంది నీరజ చిలిపిగా కళ్ళారుస్తూ.
'ష్...! బిగ్గరగా అనకు. పేదవారి కోరికలు పెదవిదాటి ప్రయోజనం లేదమ్మా! ఆ విషయం ఊహించుకోవడానికే భయమేస్తూ ఉంది. కాని ఏం చెయ్యను చెల్లీ...? నా మనసును సమాధాన పరచుకోలేకపోతున్నాను. ఈ ఒక్క విషయంలో నా హృదయ దౌర్భల్యం నన్ను వేధిస్తూ ఉంది ... ఈ జన్మకు యిక యింతే! కనీసం వచ్చేజన్మలో నైనా నా కోరిక నెరవేరితే ధన్యురాలను' ముఖంలో దైన్యాన్ని నింపుకుంటూ అంది శారద.
'ఇంత చిన్నవిషయానికి అంతగా బాధపడతా వేమక్కయ్యా? నీవు ఊఁ అను. మామయ్యతో ఈ విషయం ఈ రోజే మాట్లాడుతాను.' అని శారదను ప్రశ్నార్ధకంగా చూసింది.
'అంత పనిమాత్రం చేయకు. ఆ విషయం ప్రస్తావనకు వస్తే ఈ నాటితోటే నాకు ఈ యింటితో ఋణం తీరిపోతుందేమో? చూడమ్మా! నేను చినబాబుగారిని ప్రేమిస్తున్నానేగాని వారి ఉద్దేశ్యం నాకు యింత వరకు తెలియదు. పైగా నన్ను చూసి ఎంతో అసహ్యించుకొనేవారు. వారి అంగీకారమే సందిగ్ధంగా ఉన్నప్పుడు మిగతా ఆలోచనలన్నీ వృధా ఆ భగవంతుడు నామొర ఆలకించి వారిలో మార్పు తీసుకు వస్తున్నాడు. నా కదేచాలు! చదువుపై చక్కగా శ్రద్ధ వహిస్తున్నారు. క్రమంగా మారుతున్నారు. నాకదే పదివేలు. వారివారి హోదాకు తగిన అమ్మాయిని వివాహమాడి కలకాలం పిల్లా పాపలతో వారియిల్లు కళ కళ లాడాలని నా కోరిక. అది నెరవేరితే నేను ధన్యురాలనౌతాను' శారద కళ్ళు చెమర్చాయి.
'అక్కా ....! ఏమిటిది? ప్రభాకరాన్ని నీవాన్నిగాచేసే బాధ్యత నాది. నీవు నిశ్చింతగా ఉండు. ముందు బావను యింటికి రానీ....! నీ విషయంలో అతని ఉద్దేశాన్ని తెలుసుకుంటాను.' అని తను నవ్వుతూ శారదవిచారాన్ని పోగొట్టే ప్రయత్నం చేసింది.
ఆ విధంగా రాత్రి ఎనిమిదిగంటల వరకు యిద్దరూ కబుర్లతో గడిపారు. ఆ తర్వాత నీరజ తనతండ్రితో యింటికి వెళ్ళిపోయింది.
మరొక వారంరోజులు గడిచాయి. అన్నపూర్ణమ్మగారికి పూర్తి స్వస్థత చిక్కింది. ఒకరోజురాత్రి తొమ్మిదిగంటలకు అంతా భోజనాలు చేశారు. హాలులో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
'అమ్మా....! నీవువచ్చి ఆదుకోబట్టి సరిపోయింది కాని, లేకపోతే మా పరిస్థితి ఏమైపోయేదో?' ప్రేమతో నిండిన చూపులతో శారదనుచూస్తూ అన్నారు శ్రీపతి గారు.
'నేను కాకపోతే మరెవరైనా చేసేవారు, మీరిలా అంటూ ఉంటే నాకు ఎంతో సిగ్గుగా ఉంటుందండీ!'
'ఎవరు చేసినా నీకు మాపై ఉన్న ఆప్యాయత, ఆదరణ వారిలో ఎందుకుంటుందమ్మా? ఇంటిమనిషిలా చేసుకుపోతున్నావు. నీలా ఎవరైనా ఎందుకుచేస్తారు?' శారదను ఎంతో ఆప్యాయంగా చూస్తూ అన్నారు అన్నపూర్ణమ్మగారు.
'బాబుగారు! నేను వచ్చినపని పూర్తయింది. అమ్మగారికి పూర్తి ఆరోగ్యం చేకూరింది. నేనిక వెళతాను. కాలేజీలో పాఠాలు వెనుకబడితే యిబ్బందౌతుంది.' అంది శారద శ్రీపతిగారిని చూస్తూ.
'నాదొక చిన్న కోరికమ్మా!..... నెరవేరుస్తావా?' వారి కళ్ళల్లో ఆశ ప్రస్పుటించింది.
'బాబుగారూ! మీరు కోరడమేమిటి? ఆజ్ఞాపించండి. నాకు సాధ్యపడేదవుతే క్షణంలో నెరవేరుస్తాను.' ఆమె మాటలలో ఉత్సాహం పెల్లుబికింది.
'చాలా చిన్నకోరిక. నీవు తలచుకుంటే ఎంతో తేలికగా నెరవేరుతుంది. నామాట తీసివేయనంటే చెబుతాను.'
'ఎంతమాట! మీమాట తీసివేయడమా?'
'ప్రభాకరం బెనారస్ వెళ్ళిపోవడంతో యిల్లంతా చిన్నబోయింది. దానికి జబ్బు యింతగా ముదరడానికి సగం కారణం వాడిపై ఉన్న బెంగే! ఆ హాస్టలులో రూము ఖాళీచేసి మా యింట్లో ఉండి నీ ట్రైనింగు పూర్తిచేసుకోకూడదా తల్లీ?'
'కాలేజి యిక్కడికి చాలా దూరం ... మరి వెళ్ళిరావడం?'
'ఆ చింత నీ కక్కరలేదమ్మా....! రోజూ కారులో వెళ్ళివద్దువుగాని.'
,నాకు కారెందుకు బాబుగారూ? నా ముఖానికి అదొక్కటే తక్కువైంది.'
'అదేమిటమ్మా అలాగంటావు?' ముఖం చిన్నబుచ్చుకుంటూ అన్నారు.
వారి ముఖంలోకి ఒక్కక్షణం చూసిన శారద 'అలాగే...మీ యిష్టం' అంది.
* * *
శాంతా రామంల మధ్య స్పర్ధలు ఏర్పడ్డాయి. అందుకు కారణం తాయారు. ఆస్పత్రి భవన ప్రారంభోత్సవం నాడు శాంత మనసులో అంకురించిన శంకాబీజము ఆ తర్వాత జరిగిన రెండుమూడు సంఘటనలతో దినదిన ప్రవర్దమానమై మహావృక్షంగా మారి ఆమె హృదయంలో గాఢంగా తన వ్రేళ్ళు పాతుకుపోయేటట్లు చేసింది. ఆ దెబ్బకు తట్టుకోలేని ఆమె లేత హృదయం ఇదమిత్దమని తేల్చుకోలేక గగ్గోలుతో కుడితిలో పడిన ఎలుకలా కొట్టుకోసాగింది.
అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఒక్కొక్క సంఘటన జరిగిన వెంటనే సుందరం ఆ సంఘటనను బలపరుస్తూ ఉండడంవల్ల ఆమె అనుమానంతో ఏమీ తోచక పిచ్చిదై పోతూ ఉంది.
ఒకరోజు సాయంత్రం శాంత తోటకు బయలుదేరింది. తోటకు వెళ్ళేదారిలో రంగయ్య తాత పొలం ఉంది. దారిన పోయేవారికి ఆ పొలంలో జరుగుతూ ఉండే ప్రతిపనీ కనుపిస్తుంది. తాయారు మోటతో నీళ్ళు చెట్లకు పెడుతూ తదనుగుణంగా ఎడ్లను ముందుకు వెనుకకు నడిపిస్తూ ఉంది. రంగయ్య తాత కొడుకు లిద్దరూ వేరు పడ్డారు. తండ్రివాటాకు, చిన్నన్న వాటాకు వచ్చిన పొలం పనులు తనకు చేతనైనంత వరకు చూస్తూ ఉంది ఆమె.
మోట ఆపుచేసిన తాయారు లక్ష్మయ్యగారి పొలంలో పనిచేయిస్తున్న బిగ్గరగా కేకవేసి పిలిచింది. ఆ పిలుపు శాంతచెవిన పడడంతో ఆమె ఆశ్చర్య పోయింది. ఏం జరుగుతుందో చూడాలని ఒక ప్రక్కగా నిల్చొని గమనించ సాగింది.
రామం తమ పొలంనుండి రంగయ్యతాత పొలంవైపు నడిచివెడుతూ ఉండడం కనుపించింది ఆమెకు. తాయారుకూడా రామానికి ఎదురుగా నడక సాగించింది. తాయారు అకస్మాత్తుగా కేకవేసి క్రింద కూలబడి నట్లు తోచింది శాంతకు. ఆమెకు ఎదురుగా వస్తున్న రామం తన నడకవేగాన్ని హెచ్చిస్తూ తాయారువద్దకు వచ్చి తనుకూడా కూర్చున్నాడు. రెండుమూడు నిముషాల తర్వాత రామం చేతిని ఆసరాగా తీసుకొని లేచి నిలబడింది తాయారు. మాటలు మాత్రం వినిపించడంలేదు. జరుగుతున్న విషయమంతా స్పష్టంగా కనుపిస్తూ ఉంది. లేచి నిలబడిన తాయారు రామం ఆసరాతోనడుస్తూ అతని భుజంపై తన చేతివేసి, అతనిపై తన పూర్తి భారాన్ని మోపి మోటబావివైపు నడుస్తూ ఉండడం తనకళ్ళారా చూసింది శాంత. రామానికి ఎంతో దగ్గరగా హత్తుకుపోవాలని తాయారు చేస్తున్న ప్రయత్నం ఆమె గమనించింది. అదంతా చూసిన శాంత మనసు మెరమెర లాడింది. మరుక్షణంలో యిద్దరూ పెద్దగా నవ్వడంతో శాంత యిక ఆ దృశ్యాన్ని చూడలేక రామాన్ని అపార్ధం చేసుకొని తోటవైపు వేగంగా అడుగులు వేయసాగింది. ఆమె హృదయంలో తాయారుపై క్రోధా వేశాలు ముప్పిరికొన్నాయి.
లోగా జరిగిన సంఘటనలు కూడా సరీగా యిటువంటివే! హుఁ... తాయారుకు బుద్ధి లేకపోతే బావ విచక్షణా జ్ఞానం ఏమైంది? చక్కని ఆదర్శ భావాలు గల వాడు; పరోపకార బుద్దిగలవాడు అని నలుగురూ పొగుడుతూఉంటే మంచీ చెడుల తారతమ్యాన్ని కూడా గ్రహించకుండా తన యిష్టంవచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. నలుగురూ చూసి ఏమనుకుంటారోనన్న ఆలోచనైనా ఉండొద్దూ? ఇవన్నీ నా హృదయాన్ని చిత్రహింస చేస్తున్నాయి. అతనొక్కడే అలా ప్రవర్తించగలడను కుంటున్నాడో ఏమో? దీనికి రెట్టింపు చేస్తాను. నన్నుచూసి తను కూడా బాధపడేటట్లు చేయకపోతే నాపేరు శాంత కాదు. అయినా యిక మా యిద్దరికీ ఎలా పొసుగుతుంది? ఈవిధంగా రంగులు మార్చగల మొనగాడని నాకేం తెలుసు? నన్ను గాఢంగా ప్రేమిస్తూనే ఉన్నాడను కుంటున్నాను. అంతా నటన....! ఈరోజు తాయారైంది. రేపు మరొకరు! అవును......యిటు వంటివి ఇంకెన్ని జరుగుతున్నాయో? అందగాడు, గ్రామంలో పలుకుబడి హోదా కలవాడు ఈ విధంగా ఆలోచిస్తూ తోట చేరుకుంది శాంత.
పిల్లగాలులను ఆస్వాదిస్తూ ఆస్పత్రి ముందుగల ఆవరణలో కుర్చీలు వేయించి అక్కడ కూర్చొని మెడికలు మ్యాగజినొకటి తిరగవేస్తున్నాడు సుందరం. ఎదురుగా రెండుకుర్చీలు ఖాళీగా ఉన్నాయి. శాంత రావడం గమనించిన అతను ఖాళీగా ఉన్న కుర్చీ చూపిస్తూ కూర్చోవలసిందిగా ఆహ్వానించాడు.
'ఏం శాంతా...? ఈమధ్య బొత్తిగా కనుపించడం లేదేమిటి? ఐదారు మాసాలకే రోగులపై ఆస్పత్రిపై విసుగు కలిగిందా?'
'అబ్బే! అటువంటిదేమీ లేదు. నీవు కూడా నిరుత్సాహంగా కనుపిస్తూ ఉన్నావు ....ఏమిటీ కథ?' చిరునవ్వుతో అంది శాంత.
'ఆఁ....ఏముంది? రోజులు గడుస్తున్న కొద్దీ బోర్ కొడుతుంది శాంతా! నా స్నేహితులంతా హైదరాబాదులో చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా గడుపుతున్నారు. మొదట్లో నాకెంతో ఉత్సాహంగా గడిచింది కాని రానురాను విసుగ్గా ఉంది.' అని శాంత ముఖంలోకి చూడసాగాడు.
'నాకూ ఎంతో విసుగ్గా ఉంది సుందరం. పనీ పాటా లేకుండా ఊరికే తిని కూర్చో వాలంటే చికాగ్గా ఉంది.'
