Previous Page Next Page 
లోకం పోకడ పేజి 31


                                 22
    రామన్న పాలెం పంచాయితీ సమితి ఎన్నికలు దగ్గర పడ్డాయి. రామయ్య గారి ఆదుర్దా కు చేతలకూ, వీళ్ళ చుట్టూ, వాళ్ళ చుట్టూ తిరిగే తిరుగుళ్ళ కూ అంతు లేదు. ఊళ్ళో ఉన్న పెద్ద లందరినీ మంచి చేసుకున్నాడు. కుర్రకారు నందరినీ కూడ గట్టుకున్నాడు. తన అభ్యర్ధిత్వాన్ని బలపరచటానికి ప్రచారం నిమిత్తం వాలంటీర్ల ను ఏర్పాటు చేశాడు. సభలూ, సమావేశాలూ ఏర్పాటు చేశాడు. నాయకుల్నీ, ఉప నాయకుల్నీ , వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళను అందర్నీ పరామర్శించాడు. అందరితోనూ లేని ఆప్యాయత తెచ్చి పెట్టుకుని ఎంతో మర్యాదగా, నమ్త్రత గా మాట్లాడేవాడు.
    ఆ ఊళ్ళో నే ఉండే గురునాధం రెండో అభ్యర్ధి. అతనూ చిన్నప్పట్నుంచీ రాజకీయాల్లో తిరిగాడు. వాలంటీరు గా చేరాడు. వాలంటీర్ల కు నాయకుడయినాడు. నాయకుడయిన తరువాత వాళ్లకు అండదండ లుగా నిలబడి కర్ర పెత్తనం చేసేవాడు. కష్టపడి పని చేశాడు. కార్యకర్తగా పేరు తెచ్చుకున్నాడు. గోప్పవారూ, బీదవారూ అనే తారతమ్యం లేకుండా అందరి అభిమానం చూర గోన్నాడు. సగం జీవితం రాజకీయాల్లోనే గడిపాడు. అతని రాజకీయ జీవితం తెచ్చి పెట్టుకున్నది కాదు. కాని అదృష్ట దేవత మాత్రమే అతన్ని వరించలేదు. అసెంబ్లీ కి నిలబడే  అర్ధిక స్తోమతు లేదు. ఊళ్ళో రాజకీయాల్లో అతనికి అమితమైన అభిమానం ఉంది. కాని కలిసి రావటం లేదు.  కారణం ఆర్ధిక ఇబ్బందులు.
    గురునాధం ప్రచారం చేసుకోవటానికి డబ్బు లేనందు వల్ల అతని మీద అభిమానం కలవాళ్ళు కొంత వరకు ఆర్ధిక సహాయం చేశారు. అతని మీద అభిమానం కొద్దీ ఎవరికీ తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు.
    గురునాధానికి రాయుడు గారి అండదండలూ, తమ నియోజక వర్గం అసెంబ్లీ మెంబరయిన ముకుందరావు గారి అండదండ లు ఉన్నాయి. ముకుందరావు మీదనే రామయ్య గారు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు ఓడిపోయారు. ముకుందరావూ, రాయుడు గారూ ఒక పార్టీ కి చెందినవారు. అధికార పక్షంలో సభ్యులు. రామయ్య గారు వీరి పార్టీ కి వ్యతిరేకి. ఇప్పుడు గురునాధానికి రాయుడు గారు, ముకుందరావు అండదండలుండటం చేత రామయ్య గారికి లోపల భయం గానే ఉంది. అసెంబ్లీ మెంబరు ఎట్లాగూ కాలేదు. కనీసం సమితి అద్యక్షుడయినా అవుదామని అయన పట్టుదల.
    రాయుడు గారూ, రామయ్య గారూ బావ మరదులు కనుక రాయుడు గారు తనకు సాయం చెయ్యడేమోనని గురునాధం భయం. ఒకసారి రాయుడు గారితో ఈ ప్రసక్తి ఎత్తితే అయన ఆ సంగతి చెప్పేశారు. బంధుత్వం వేరు, రాజకీయాలు, పార్టీ తత్వాలూ వేరు; బంధుత్వానికి, రాజకీయాల కూ ముడి పెట్టను అని తేల్చి చెప్పేశాడు. అప్పటికి గాని గురునాధానికి ధైర్యం చిక్కలేదు.
    ఎన్నికల రోజు రానే వచ్చింది. రామయ్య గారు ఎంతో ఆర్భాటం చేశాడు. ఎంతో ఖర్చు పెట్టాడు. గురునాధం నిరాడంబరంగా తన అభ్యర్ధిత్వాన్ని నిలబెట్టు కున్నాడు.
    ఎన్నికల ఫలితాలు తెలిశాయి. గురునాధం రామన్న పాలెం పంచాయితీ సమితి ప్రెసిడెంటు అయ్యాడు. రామయ్య గారి ముఖాన కత్తి వేసినా నెత్తురు చుక్క లేదు. రాయుడి గారి అధ్యక్షతను గురునాధాన్ని సన్మానించటానికి రామన్న పాలెం లో సభ ఏర్పాటు చేశారు.  ముకుందరావు ఆహ్వాన  సంఘాధ్యక్షుడు. ఆ రకంగా రాయుడు గారు రామన్న పాలెం వచ్చినా, రామయ్య గారి ఇంటికి రాలేదు. అన్నగారు ఊళ్ళో కి వచ్చి కూడా తమ గడప తోక్కనందుకు వరలక్షమ్మ విచార పడ్డది.
    రాజకీయాలు అటువంటివి.
    ఆరోజు సభ కాగానే రాయుడు గారు కారులో వెంకట పాలెం వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళగానే సుభద్రమ్మ అడిగింది -- "మీ చెల్లెలు గారింటికి వెళ్ళారా?" అని.
    "నేను సమితి ఎన్నికల విషయం లో ఆ వూరు వెళ్లాను గాని చుట్టాలను చూసి రావటానికి వెళ్ళలేదు" అన్నాడు రాయుడు గారు. సుభద్రమ్మ మనస్సు గతుక్కు మన్నది. మనస్సులో వెయ్యి దేవుళ్ళ కు మొక్కుకున్నది -- 'ఈపార్టీ సిద్దాంతాలు, పట్టుదలలూ పోయి రెండు కుటుంబాల్నీ ఏకం చెయ్యాలి , స్వామీ -- అని. శ్యామసుందరి విషయం తలుచుకుంటే ఆమె కడుపు తరుక్కు పోతున్నది.
    వరలక్షమ్మ లోలోపల కుమిలి పోతున్నది. ఆమె ఏం చెప్పినా రామయ్య గారు వినరు. కట్టుకున్న భార్యతో మాట్లాడినా పార్టీ తత్వమే. కొడుకు పెళ్లి విషయం ఎత్తినా పార్టీ తత్వమే. ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్యా పార్టీ తత్వాలు పెట్టని గోడలయినాయి.
    తన రాజకీయ పరాజయానికి బావమరిది రాయుడు గారే నని బాహాటంగా అందరి తోనూ చెప్పుతున్నాడు రామయ్య గారు. కొంతమంది సానుభూతి చూపించారు. కొంతమంది మనస్సులో నవ్వుకున్నారు. కొంతమంది ఈయనకీ శాస్తి కావలసిందే అన్నారు.
    మొత్తం మీద ఈ ఎన్నికలకు మళ్లా అయిదారు వేలు వదిలింది. బంధుత్వమూ దూరంగా పోయింది.

                                   23

                    
    వసుంధర తల్లీ, తండ్రి ఏడవ మాసం రాగానే వచ్చి పసుపు, కుంకుమ యిచ్చారు. అంత ప్రయత్నమూ చేశాక వసుంధర కుర్చీలో కూర్చో నంది. కొత్త చీరే కట్టుకోనంది. కామాక్షి చెప్పినా వినలేదు. శారదా చెప్పినా వినలేదు. తల్లి చెప్పినా వినలేదు. ఈ తతంగమంతా నచ్చలేదు. చివరికి తల్లి కేకలేసి నిష్టూరంగా మాట్లాడిన తర్వాత కుర్చీలో కూర్చుంది వసుంధర. ఎంతో సిగ్గు పడుతూ తల వంచుకు కూర్చుంది.
    "ఇంతమంది కడుపుతో ఉన్నోళ్ళ ని చూశాను గాని మా వసుంధర మ్మ లాంటోళ్ళని ఎక్కడా చూడనైతిని. ఏం సిగ్గు! ఏం సిగ్గు! నీళ్ళోసుకోన్నోళ్ళు పుల్లటి పళ్ళే మయినా తింటారుగా? ఏం తినక పోయినా అనార్ పండయినా తింటారు. అదే దానిమ్మ పండు. పుల్లటి దానిమ్మ పండు కొనిచ్చాను నేను. ఒక్క గింజ కూడా తినలేదట. ఈ వసుంధరమ్మ ఎట్లా నేగ్గుతుందో ఏమో!" అన్నది శకుంతల.
    "ఏం , వసుంధరా, దానిమ్మ గింజలు తినలేదా? పులుపు సయించదా?" అన్నది శారద.
    ఎవరికీ సమాధానం చెప్పలేదు, వసుంధర. పేరంటమయి అంతా వెళ్ళాక ఇన్ని మిరపకాయలు దిష్టి తీసింది వసుంధర తల్లి.
    "ఏమిటమ్మా, ఈ పిచ్చి నమ్మకాలూ, ఆచారాలూనూ? నాకేం దిష్టి లేదు, దిబ్బాలూ లేదు. ఈ మిరపకాయల దండుగ కూడా ఎందుకు? పైగా ఇల్లంతా పోగా, కారూనూ "అన్నది వసుంధర.
    "అట్లా అనకమ్మా. నీకింకా చిన్నతనం తెలీదు. ఒకళ్లిద్దరూ పిల్లలు పుడితే అన్నీ తెలుస్తాయ్యి. అది సరే గాని దానిమ్మ పండు కూడా సయించక పొతే ఎట్లాగే? కడుపుతో ఉన్న వాళ్ళందరి కి దానిమ్మ పండంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. దానిమ్మ గింజ లల్లే రత్నాల్లాంటి పిల్లలు పుడతారట. అదీ గాక వేవిళ్ళ వాళ్ళకీ, పైత్యపు వంటి వాళ్ళకీ శరీరానికి ఎంతో మంచిది. తప్పక దానిమ్మ పండు తిను" అన్నది తల్లి.
    తల్లి మాటలకు నవ్వుకుంది వసుంధర.
    ఆరోజు రాత్రి రమేష్ అడిగాడు -- 'సూడిదలు సవ్యంగా చక్కగా చేశారా, వసూ" అని.
    "ఆహా . ఆ పేరు చెప్పి అందరి ముచ్చట్లూ తీర్చుకున్నారు. పేరంటాళ్ళంతా చక్కగా ఆ కాస్సేపూ కూర్చుని ఎల్లి మీద పిల్లెక్కిందనీ , పిల్లి మీద ఎల్లెక్కిందనీ విమర్శ చెప్పుకున్నారు. శకుంతల మాత్రం దానిమ్మ పండు తినమని చెప్పింది. మా అమ్మ కూడా సమర్ధించింది. దానిమ్మ గింజ ల్లాంటి రత్నాల్లాంటి పిల్లలు పుడతారట"అని వసుంధర నవ్వింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS