Previous Page Next Page 
అర్పణ పేజి 31


                                   24
    శ్రావణ మాసం . మీద -- ఆకసాన మేఘాల అందం ఎవరు చూస్తున్నారు? కింద ఒక పల్టీ కొట్టినా ఫరవాలేదనే ధీమా ఉన్నవాళ్ళే కాస్త తల పైకెత్తి ఆ మేఘ సౌందర్యాన్ని తిలకిస్తున్నారే మో!
    కాలేజీ నుంచి వేగంగా నడుస్తున్న పార్వతి తాలూకు జోడు లేని పాదాలు రెండు సార్లు మృదువుగా జారాయి. ఆ ఆలోచనల్లోనే ఆవిడ రాధాకృష్ణ గదికి తిన్నగా వెళ్ళింది.
    రాధాకృష్ణ తన గది గోడకు ఒక సుందర మైన రాధాకృష్ణుల చిత్రపటాన్ని తగిలిస్తున్నాడు, పార్వతి వెళ్ళేసరికి. అది చూచి ముగ్దురాలైంది.
    ఆమె వెళ్లినప్పుడంతా అతను ఏదో ఒక కళాత్మకమైన పని చెయ్యడమే చూచింది. ఆ చిత్రం ఎంత బాగున్నదని! తనకు చిత్ర కళాప్రవేశం లేనందుకు తిట్టుకుందేమో కూడా ఆ సమయంలో.
    రాధాకృష్ణ చూచాడమేను . "అరె! మీరెప్పుడొచ్చారు ? కూర్చోండి. కూర్చోండి! సుభద్ర గారి కోసమేనా? ప్లీడరు గారిని స్నేహితులెవరో స్టేషను కు రమ్మన్నారట. ఆవిడా వెళ్ళారు అయన వెంట. పాప మాత్రం ఇప్పుడే బడి నుంచి వచ్చి ఆడుకోవడానికి వెళ్ళింది అలా."
    "అలాగా?' అన్నది పార్వతి మైకపు గొంతుతో.
    పాప కోసం వీధి వైపు చూసిన రాధాకృష్ణ ఇటు తిరిగి ఆశ్చర్య పడ్డాడు.
    పరవశంగా చిత్రాన్ని చూస్తున్న దామె. మళ్ళీ రాధాకృష్ణ పలకరించగా మేలుకుంది.
    "ఎంత అందంగా ఉన్నదండీ, ఈ చిత్రం! ఒకనాడు కృష్ణుణ్ణి, రాదని చూసినట్లుగా చిత్రించాడీ చిత్రలేఖకుడు" అని నిట్టూర్చి , కూర్చుంటూ, "నేను మీతోనే పనుండి వచ్చాను" అన్నది.
    ఆ పనేమై ఉంటుందా?' అనుకున్నాడు రాధాకృష్ణ.
    టేబిల్ మీద చిన్న ఫోటో ఉంచుతూ నవ్వి, "ఇదిగో! మా అక్కను చూడండి!" అంది.
    రాధాకృష్ణ పెదాల మీదకు చిన్న నవ్వు వచ్చింది.
    ఫోటో ను చేతిలోకి తీసుకుంటూ, "ఈ ప్రపంచంలో ఏ మగవాడూ మీ అక్కకి తగిన వాడు కాడని పిస్తోంది. నన్నెలా ఎంచారు మీరు?" అన్నాడు.
    "ఆ మాట నిజమే! అందమనే పదానికి రూపం ఉంటె అది మా అక్కని చూసి తల వంచేసుకుంటుంది."
    "మరి నేను ఇన్నాళ్ళూ స్వేచ్చా జీవిని. ఇక ముందు మీ అక్క ణా స్వేచ్చని సమూలంగా హరించేలా ఉంది." అన్నాడు నవ్వుతూ.
    "ఇక నే వెళ్ళొస్తాను, కృష్ణ గారూ! రాజు అదేదో ఊరు.....ఆ.....కాకినాడ వెళ్ళారు. రెండు రోజులైంది." పార్వతి లేచింది.    
    "ఆగండాగండి! దీన్ని కూడా తీసుకెళ్ళండి" అన్నాడు రాధాకృష్ణ గోడ నున్న చిత్ర పటం తీస్తూ.
    "అదేమిటది? బావుందని అన్న మాత్రానికి ఎవరైనా ఇచ్చేస్తారా? మీ దాతృత్వం మెచ్చుకోదగ్గది" అంది పార్వతి , వద్దని హరిస్తూ.
    "మీ దగ్గరే ఉండనివ్వండి! ఇల్లాటి వాటిని ఇష్టపడే వాళ్ళంటేనే నా కిష్టం " రాధాక్రిష్ణ అందిస్తూ అన్నాడు.
    చివరకు తీసుకుంటూ, "సరే! ఎక్కడున్నా మీ జ్ఞాపక చిహ్నంగా ఉంచుతాను దాన్ని. మా సరస్వతి తిడితే మీకే ఇచ్చేస్తాను" అన్నది నవ్వి.
    చీకటి పడింది.
    ఇంటి మెట్లెక్కుతూ వరండా లో కూర్చొని ఉన్న శేఖరాన్ని చూసి పార్వతి గుండెలో రాయి వేసుకుంది.
    "ఇతనేప్పుడోచ్చాడు?' ఒక్కసారి రాజు ఊళ్ళో లేని సంగతి. పని మనుషులు అటువంటి వేళ ఉండరన్న సంగతి గుర్తు వచ్చి గిర్రున తిరిగాయి మెదడులో.
    "నీ కోసం పడిగాపులు పడి చస్తున్నాను! ఆ సానుభూతైనా ఉందా?" అన్నాడు శేఖరం కోపంగా చూస్తూ.
    "క్షమించు మరి! ఆలస్యమైంది. ఇంతకూ ---అడక్కూడదు గానీ -- నువ్వెందు కింత శ్రమ పడవలసి వచ్చిందో?' పార్వతి తలుపు తీసి లోపలికి నడుస్తూ అన్నది.
    "పొమ్మనగూడదు, అలా అడక్కపోతే?"
    "నువ్వలాగే అపార్ధం చేసుకుంటావు! ఉండు కాఫీ తెస్తాను." చేతిలో చిత్రాన్ని అక్కడ ఉంచి వెళ్ళబోతున్న పార్వతి చెయ్యి పట్టుకుని ఒక్కలాగు లాగి, "అక్కర్లేదు " అన్నాడు శేఖరం.
    ఆ ధాటికి అతని భుజం మీదకు తూలీ పోయింది పార్వతి.
    వెంటనే వెనక్కు తగ్గి, "నువ్వు తాగకపోతే నన్నూ వద్దంటా వేమిటి?" అంది మొహం చిట్లించి మరో గదిలోకి వెళ్ళుతూ.
    శేఖరం తియ్యగా నవ్వాడు, ఆమె కళ్ళలోకి చూసి.
    ఫ్లాస్కు లోని కాఫీ, కప్పులోకి వంపుతుంటే తొణికి కొంచెం కొంచెంగా కింద పడింది. పార్వతి తలపులో ఏదో సందేహం. మనసులో అధైర్యం. నిబ్బరంగా మాట్లాడుతున్నదే కానీ, శేఖరం ధైర్యమూ , చనువూ చూసి లోలోపల తడబడుతున్నది.
    "ఎందుకో తనలో  బలహీనత ఎక్కువౌతున్నది. ఎప్పుడో ఒకనాడు ఏదో ఒక అఘాయిత్యం జరుగుతుందన్న భ్రమ కలుగుతున్నది ఉండి ఉండి. ఈ శేఖర్ ప్రవర్తన చూస్తున్నప్పటి నుంచే ఈ అలసత్వం. తెలియని గోల కనుక అలా అనిపిస్తున్నది కానీ, పూర్వపు స్నేహంతో మాట్లాడుతూ ఉన్న వ్యక్తిని సందేహిస్తున్నది తను. ఛీ! తనలో ఉత్సాహమూ, స్వేచ్చా ఏమైపోయాయో? రాజు చేశాడు, తనను ఇలా. లేదు! తనేనా, చేసుకుంది స్వయంగా?"
    అతనికి కాఫీ ఇస్తూ . వీధి తలుపులు చేరవేసి ఉండటం గుర్తించింది.
    "నీతో మాట్లాడాలని వచ్చాను." శేఖరం సహజంగా అనగానే ఆవేగం అణిగి , స్నేహపు అభిమానం కలిగింది.
    "ఏమిటో ఆ గొప్ప విషయాలు?" అంది తన ధోరణి మార్చకుండా.
    అతను కూర్చోమన్నాడు. పార్వతి వినలేదు.
    "రాజు లాటి పిగ్తో తో ఎలా బతుకుతున్నవో ఊహించలేక పోతున్నాను." అన్నాడు శేఖరం.
    "ఏం? అందంలో రాజు నీకన్నా నయమే అనుకుంటాను" అంది నవ్వుతూ.
    "ఓస్! అందాన్ని కొరుక్కు తింటామా?" తీసిపోరేశాడు.
    "ఏమో-- నేనంత పనీ చేస్తున్నాను! అందం ఆ రకమైతే మీ సతీమణి తో అంత ఇబ్బంది లేక పోయేది నీకు. పాపం! ప్చ్!"
    "ఆ! అదొక డర్టీ క్రీచర్! రాజు లాటి మనిషి కది తగును. దానికేం గానీ -- ఈ దేవుడి దొక  మట్టి బుర్ర అనుకో!"
    "కాకపోతే నీవంటి బురద బుర్రల నెందుకు పుట్టిస్తాడు?"
    "ష్! హాస్యం చాలించి నెమ్మదిగా విను, పారూ! ఓక సంగతి చెబుతాను. నావంటి వ్యక్తికీ నీవంటి భార్య ఉంటె ఆ సంసారం ఎంత హాయిగా సాగుతుందో తలుచుకో! అదే నేను ఊహించుకొని అన్నదిస్తుంటాను ఎప్పుడూ."    
    "అవును. ణా పెళ్లి ముందు రోజుల్లో నైనా అగుపించావు కావు-- నా మనసు మారునేమో? ఏం చేస్తాం? మరిచి పో, మిత్రమా!" హస్యంగానే అన్నది.
    శేఖరం చటుక్కున చెయ్యి పట్టుకున్నాడు. పార్వతి నిలదొక్కుకుంది.
    "ఏం చేస్తా మంటా వేమిటి, పార్వతీ? కావాలంటే మరో చక్కని మార్గం ఉంది."
    "ఏమిటా మార్గం?" అంది అతని చేతిని విదిపించుకుంటూ.
    "ఆ మార్గంలో నువ్వు నాకు తోడు వచ్చావంటే నీకు స్వర్గం చూపించగలను , పారూ , నేను! ఆ విషయం లో సందేహించనక్కర్లేదు. ఈ నరక జీవితాన్ని నువ్వోప్పుకోవటం సహించలేను."
    "ఫరవాలేదు . ఈ నరకం లోనే ఉండనియ్యి. దీన్ని వదులుకొని కొన్నాళ్ళు స్వర్గాన్ని చవి చూసినా, తిరిగి నరకం లోకే పోవాలేమో! ఈ నరకాన్ని పూర్తిగా అనుభవించేస్తే అప్పుడేల్లాగూ స్వర్గానికే కదా వెళ్ళేది?"
    మెరుపులా శేఖరం లేచి నిలబడి, పార్వతి భుజాలను పట్టుకున్నాడు ఉద్రేకంగా.
    "నువ్విలా నైరశ్యంగా ,మాట్లాడినప్పుడే నీకు స్వర్గ సౌఖ్య మేమిటో చూపించా లనిపిస్తుంది, పార్వతీ! ఈ పీనుగుల కోసం మనం బెంగపెట్టు కోకూడదు. రా, ణా వెంట . పూల బాటల్లో తీసుకెళ్తాను."
    పార్వతి మౌనం వహించింది. ముఖాన్ని స్వేదం కమ్ముకోస్తున్నది. కానీ, భయాన్ని తెలియనివ్వడం లేదు.    
    "అంతెందుకు ? మీ సుభద్ర గారి సంగతి నీకు తెలుసు. వారు ఉత్తమ మార్గం అవలంభించారు. మనం అంతకన్నా ఒక మెట్టు పైకి పోగలగాలి. నీ సుఖం, ణా సుఖం లోకానికి అక్కర్లేదు. దానికి కాలక్షేపం చాలు. ఏమంటావ్, పారూ?' శేఖరం పార్వతిని కుదిపాడు.
    "రాజు మీద పగ తీర్చుకోవటానికి తనకు దొరికిన అవకాశమా , ఇది? అతనికి అవమానం కలుగుతుంది. కానీ, అత్తయ్య? ఆమె తలెత్తు కోలేదు. మామయ్య ఏమను కుంటాడో? నాన్న పరువే పోతుంది. సరోజ కు తను పూర్వపు పార్వతి కాలేదు .సరస్వతీ బావిలో దూకవచ్చు. తన ఆత్మకు? ఉహు. తనను భగవంతుడు క్షమించడు!'
    శేఖర్ ఉక్కు చేతుల్లో పార్వతి మృదువైన అరిచేతులు నలిగి పోతున్నాయి.
    "నన్ను తొందర పెట్టవద్దు, శేఖర్! నేనింకా ఆలోచించు కుంటాను." అంది బిగుసుకుపోయే కంఠం తో.
    కానీ అతడు పార్వతిని విడిచి పెట్టలేదు. పార్వతికి అప్పటి ఆ స్పర్శ కొన్ని క్షణాలు వింతగా ఉంది. ఒక్కొక్కసారి అతని చేతుల్లోని మృదుత్వం సర్ప స్పర్శ లా భయం పుట్టిస్తున్నది. కాలం క్షణాల్లో నే ఉన్నా పార్వతి కి ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. అతన్నేమీ అనలేకుండా ఉంది. మరో క్షణం ఆగితే ఎమైపోతుందో తను-- అని భయపడింది. గుండె వేగానికి పోటీగా మెదడు గిర్రున తిరిగి పోతున్నది.
    మోహపు మాటలంటూ అతను పట్టుకున్న తన చేతులు విదిలించు కొబోతున్నంత లో ఎవరో తలుపు తెరిచిన శబ్దం పెద్దగా వినిపించింది ఇద్దరికీ స్పష్టంగా.
    "రాజు! రాజే అయి ఉంటాడు! ఇక్కడ -- తను, శేఖర్ ఏకాంతంగా!' అంతే! పార్వతి ఏమైపోయిందో ఆమెకు తెలియదు. స్పృహలో  ఉన్నదో, కలలో ఉందొ!
    
                                         *    *    *    *
    సొమ్మసిల్లి సోఫాలో వాలిపోయిన పార్వతి కళ్ళు తెరిచేసరికి సుభద్ర ఉంది ఎదురుగా----- మొహం మీద నీళ్ళు చల్లి విసురుతూ , అప్పటికీ పార్వతి గుండె బరువు వదలలేదు.
    సుభద్ర ను మామూలుగా చూడలేక పోయింది. ఆమెతో మాట్లాడటానికి సాహసంగా కంఠం పెగిలి రాలేదు.
    రెండు కళ్ళూ పైకెత్తింది. ఐనా విపరీత మైన సిగ్గుతో పెదాలు కదలడం లేదు. ఈమె వచ్చి ఆదుకున్నదా? లేక తను శేఖర్ కు అనువైపోయిందా? అంతా కలత లా ఉంది.
    సుభద్ర గారు తన ముఖంలో ఏ భావాన్నీ స్పష్టంగా వ్యక్తం చెయ్యలేదు. "ఇప్పుడే స్టేషన్ నుంచి వస్తున్నాము. కాఫీ గుండ కొంచెం తీసుకెళ్దామని వచ్చా నమ్మాయ్! నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే అతనెందుకలా కంగారుగా పారిపోయాడు? ఇదేనా స్నేహ ధర్మం ?' అన్నదావిడ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS