అతను శబ్దం కూడా చేయకుండా కిందపడ్డాడు.
క్షణాల్లో వాళ్ళ డ్రస్ లు ఇద్దరూ తొడిగేసుకున్నారు. ఖాదీలాల్చీ, కండువాలు.....మయూరిపంచె కట్టుకట్టి ఖద్దరు టోపీ పెట్టుకుంటూంటే నూతన్ కి ఆశ్చర్యం కలిగింది.
"ఇంత ఫాస్టా?"
"జుట్టు కొంచెం వుండటం ఎంత ఉపయోగమోచూశారా?"
నూతన్ విగ్ పెట్టుకున్నాడు. పడిపోయినవాళ్ళ కళ్ళజోళ్ళు పెట్టుకునే సరికి వాళ్ళ రూపాలు మారిపోయినయ్. నోట్లకట్టలు చెరో నాలుగూ జేబుల్లో వేసుకుని బయటకు నడిచారు వాళ్ళు. గార్డులు వాళ్ళని ఆ మసక కాంతిలో చూసి మళ్ళీ పత్రికలు చదువుకోవడంలో నిమగ్నమయ్యారు. లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఆగి అక్కడున్న బార్ లోకి నడిచారు.
కిటికీ దగ్గరున్న టేబుల్ దగ్గర ఆగి అద్దంలో నుంచి బయటకు చూశారు. రోడ్ మీద నిలబడ్డపోలీసుల్లో చలనంకనిపించింది.
హడావిడిగా కొంతమంది అధికారులు జీప్ లో వచ్చి హోటల్ ఆవరణలో దిగారు. మరికొద్ది క్షణాల్లో బేరర్లు హడావుడిగా పరిగెత్తుకొచ్చారు.
"సార్! హోటల్లో బాంబ్ ఉందంట! త్వరగా బయటికెళ్ళిపోండి!"
బార్ లో ఉన్నవాళ్ళందరూ ఒక్కుమ్మడిగా బయటకుపరుగెత్తారు.
నూతన్, మయూరి కూడా వాళ్ళతో పరుగెత్తారు.
అప్పటికే రూముల్లో నుంచి జనం పెద్దగా అరుస్తూ మెట్లవేపు పరుగెడుతున్నారు. ఫైర్ అలారం, లిఫ్ట్ కోసం కొట్టేబెల్ తోనూ హోటల్ మార్మోగిపోతోంది.
ఫైరింజన్లు గంటలుకొట్టుకుంటూ వచ్చి హోటల్ ఆవరణలో ఆగాయ్.
గదుల్లో ఉన్నవాళ్ళు తమ లగేజ్ తోపాటు మెట్లుదిగి రోడ్ మీదకు పరుగెడుతున్నారు. హోటల్ సిబ్బంది అప్పటికే రోడ్ మీద కొచ్చేశారు.
ఆ జనంలో నూతన్ మయూరిని పోలీసులు పట్టించుకోనేలేదు. రోడ్ మీద కొంతదూరం నడిచి రోడ్ పక్కనే ఉన్న ఆటో ఎక్కారిద్దరూ.
"సికింద్రాబాద్ పోనీ!"
సికింద్రాబాద్ రైల్వేఫ్లాట్ ఫాం చేరుకున్నాక ఇద్దరూ రిలాక్స్ అయ్యారు.
"నేను వెయిటింగ్ రూమ్ బాత్ రూమ్ లో కెళ్ళినా డ్రస్ మార్చుకుని మళ్ళీ నా ఒరిజినల్ రూపంలో మా యింటికెళ్ళిపోతాను" అంది మయూరి.
"సారీ మయూరీ! నిన్ను డిజప్పాయింట్ చేశాను."
"ఫర్లేదు. నాకు ఆశ వుంది. ఇవాళ కాకపోతే రేపు"
"నా మెసేజ్ కోసం రోజూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ చూడండి! వీలయినంత త్వరలోనే ఇంకో స్కీమ్ ప్లాన్ చేస్తాను."
"ఓ.....కే...."
ఆమె వెళ్ళిపోయింది.
తనూ బాత్ రూమ్ లోకి నడిచి విగ్గుతీసి తల దువ్వుకున్నాడు. లాల్చీ తీసేసరికి లోపల బుష్ షర్ట్, పంచెతీసేసరికి పాంటు వుండడంతో తన డ్రస్ లోకొచ్చేశాడు.
ఆ డ్రస్ ని జాగ్రత్తగా మడిచి అందులోనే విగ్ పెట్టి కళ్ళజోడు ని బాత్ రూమ్ లోనే వదలి బయటికొచ్చేసి బస్ లో గదికి చేరుకున్నాడు.
కొత్త గది! కొత్త అడ్రస్....
కొత్త జీవితం మళ్ళీ మొదలయింది.
కొంచెం నిరుత్సాహంగా వుంది గానీ - తప్పదు!
జెవెఇథమంటే నిరుత్సాహాలను ఎదుర్కొంటూ ప్రయాణంచేయటమే!
తిరిగి కళ్ళు తెరిచేసరికి మంచం మీద కౌశల్ కౌగిట్లో ఉంది తను. హోటల్ గదిలో పైన ఫాన్ నెమ్మదిగా తిరుగుతోంది.
నైట్ బల్బ్ గుడ్డిగా వెలుగుతూనే వుంది తెల్లారిపోయినా!
అతని కౌగిలినుంచి తప్పించుకుని లేచి కూర్చోబోయిందామె. అతను కళ్ళు తెరచి ఆమెను మరింత గాఢంగా తనలో పొదుపుకున్నాడు.
"చంద్రికా!"
"ఊ!"
"నేను చెప్పిన విషయం ఆలోచించావా?"
"ఊ!"
"మరి మనం వివాహం చేసుకుందామా?"
"మీరు నన్ను మనస్ఫూర్తిగా వివాహం చేసుకోవాలనుకుంటున్నారా?"
అతను నవ్వాడు.
"లేకపోతే వివాహం ఎందుకనుకుంటున్నారు?"
"మనిద్దరం ఎలాంటివివాదాలూ లేకుండా కలసి ఉండగలమంటారా?"
"ఎందుకొస్తాయ్ వివాదాలు? మనిద్దరి గురించీ మనకు తెలుసు. అన్ని విషయాలు తెలిసే వివాహం చేసుకుంటున్నాం!"
"మరి మీ భార్య మనవివాహాన్ని హర్షిస్తుందా?"
"ఆమె సంగతి వదిలేయండి! మొదట్నుంచీ గొడవలు జరుగుతూనే వున్నాయ్. ఇంచుమించుగా ఇద్దరం విడిపోయినట్లే....."
చంద్రిక మనసులో ఆలోచనలు వేగంగా తిరుగుతున్నాయ్.
అతనిలో తనకునచ్చని అంశాలు కొన్ని వున్నా అవి వివాహానికి అడ్డువచ్చేవికావు.
తనకూ ఇలా వంటరిగా జీవితం గడపటం సమస్యగానే ఉంది. ఎవరినయినా వివాహం చేసుకుందామన్నా అదీ అంత తేలికయినవిషయంకాదు. ముందు తన అంతస్థుకి తగ్గ వ్యక్తి దొరకాలి. అలాంటి వారు భవిష్యత్తులో తనను సినిమాల్లో నటించేందుకు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ అంగీకరించినా మరెవరితో చనువుగా వున్నా అనుమానాలు, అపార్ధాలు ప్రారంభమవుతాయ్.
కౌశల్ ను చేసుకుంటే తనకు పూర్తి స్వేచ్చవుంటుంది. సహకారం ఉంటుంది. ఇద్దరూ ఒకే వృత్తిలో ఉంటే అవగాహన వుంటుంది.
"చంద్రికగారూ! మీకేమయినా అనుమానాలుంటే చెప్పండి...."
"ఏమీలేవు...." అంగీకార సూచకంగా అందామె.
చంద్రికా కౌశల్ ల వివాహం రహస్యంగా జరిగిపోయింది. అయితే వివాహమయిన మరుక్షణమే ఈ వార్త అన్ని పత్రికల్లోనూ వచ్చేసింది. కొద్దిరోజులు ఇద్దరూ కాశ్మీర్ లో గడిపితిరిగివచ్చారు.
"మనకోసం ఓ ఇల్లు కొనాలనుకుంటున్నాను....." అన్నాడతను రాగానే.
"మా ఇల్లు ఉందిగా"
"ఉహు! అది మరీదూరం!..."
"సరే! మీ ఇష్టం!"
అతను రెండుమూడు రోజుల్లో చంద్రికను ఓ ఇల్లు చూపడానికి తీసుకెళ్ళాడు. పెద్ద మేడ అది.
"ఎంత ఇది!" అడిగింది చంద్రిక.
"ఖరీదే కొంచెం ఎక్కువగా వుంది! ఇంత పెద్దఇంటికి అంత ఇవ్వడం కూడా న్యాయమే! డెబ్బయ్ లక్షలు చెప్తున్నాడు! ఇంతకూ నీకు నచ్చిందా ఇల్లు?"
"ఆ చాలా బావుంది! ఇదే తీసుకుందాం!"
"ఓకే...." అన్నాడతను.
వారం రోజులు గడిచిపోయినా అతను మళ్ళీ ఆ ఇంటి గురించి మాట్లాడకపోవడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది.
"ఏమయింది ఇంటి సంగతి?" అడిగిందామె.
"నా దగ్గర పాతిక లక్షలే ఉన్నాయ్! మన డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రావలసింది కొంత వుంది. లెక్కలు చూసి ఇమ్మన్నాను....."
