ఎవర్నో ఒకరిని ప్రేమించాలి అని అతను గాఢంగా అనుకునే టప్పటికి సుజన కనిపించింది. రకరకాల పువ్వులను నిలువుగా నిలబెట్టి నట్లుండే ఆమెను చూడగానే అతను ప్రేమలో పడిపోయాడు.
రోజూ ఆమె కాలేజీకి వెళ్ళడానికి బయలుదేరగానే ఇతనూ తన మోటార్ బైక్ ని బయటికి తీసేశాడు. ఆమెను అతి స్పీడ్ గా క్రాస్ చేసి, హారన్ మోగించేవాడు. బస్సెక్కేవరకు బస్టాప్ ఎదురుగా వున్న టీ బంక్ లో కూర్చుని అదేపనిగా కాఫీలు, సిగరెట్లు తాగుతూ చూపులను నిలబెట్టేవాడు.
తనను ఎవరయినా గమనిస్తున్నారేమోనని పరిశీలించే ఉత్సుకత సాధారణంగా ఎవరికైనా వుంటుంది. కానీ సుజనలాంటి ఏ కొద్దిమందో అలాంటివాటిని అధిగమించి వుంటారు. అందుకే ఆమె అతని ప్రవర్తనను గమనించలేకపోయింది.
ఆమె అలా వున్నా ఇతనేమాత్రం పట్టించుకోలేదు. మామూలు కుర్రాడయితే అంతటితో ఆపేసి వుండేవాడు. కానీ చిట్టిబాబు మాత్రం అలా కాదు. ఏదయినా సరే తనకు అందేవరకు అతను పట్టు వదలడు.
కొన్నిరోజులకి హారన్ మోగించడానికి బదులు "హాయ్" అని వెనకనుంచి పిలవడం మొదలుపెట్టాడు.
అప్పటికి అర్ధమైంది సుజనకు. అతను తను ఎదురింటిలో వుండే వాడని తెలిసింది. అతను శ్రుతిమించకుండా కాస్తంత నిర్లక్ష్యంగా ప్రవర్తించేది. దీన్ని అతడు సహించలేకపోయాడు. చిన్నప్పట్నుంచి ఏది కోరుకున్నా క్షణంలో ముందుండేవి. అదే మెంటాలిటీ అతనిలో కంటిన్యూ అయింది.
ఆమె పట్టించుకోక పోవడంతో పట్టుదల మరింతగా పెరిగింది. ఆమెను ఆకర్షించడానికి రకరకాల పద్ధతుల్ని అవలంభించాడు.
ఓరోజు సాయకాలం ఆమె బస్సు దిగి ఇంటికి నడిచి వెళుతుండగా మోటార్ బైక్ ని ఆమె ముందు ఆపి, "హలో" అన్నాడు.
ఎవరన్నట్లు కళ్ళు ఎగరేసింది.
"నేను - మీ ఇంటికెదురుగా వుండే ధర్మరాజు నాయకర్ అబ్బాయిని"
"ఎప్పుడూ చూసినట్లు గుర్తులేదే"
అతను షాక్ తిన్నాడు.
"ఈ వీధిలో నన్ను తెలియనివారున్నారంటే ఆశ్చర్యంగానే వుంది"
"అమెరికాలో మైక్ టైసన్, మైకేల్ జాక్సన్ అంటే ఎవరో తెలియని వాళ్ళున్నారంటే ఎంత ఆశ్చర్యం ప్రకటిస్తారో అంత ఆశ్చర్యాన్ని ప్రకటించారే"
అతను నవ్వాడు.
"మీరు చాలా బాగా మాట్లాడతారే"
"థాంక్స్ - నన్ను వెళ్ళనివ్వండి"
"ఓకే - కానీ చిన్న రిక్వెస్ట్" అంటూ ఆగాడు.
"ఎస్ - చెప్పండి"
"ఇదిగోండి ఈ గులాబీ తీసుకోండి" ఎక్కడినుంచో ఇంద్రజాలికుడి లెవెల్లో ఓ గులాబీని పెరికాడు.
"నో - థాంక్స్" ముందుకు కదిలింది.
ఏమనుకున్నాడో ఏమోగాని బైక్ ని పక్కకి జరిపాడు.
ఆమె వెళ్లిపోయింది.
రెండోరోజు అదే విధంగా అడ్డు తగిలాడు.
ఈసారి ఆమె నవ్వలేదు. విసుగ్గా చూసింది.
"ఈ గులాబీని మీరు తీసుకోవాల్సిందే" అన్నాడు ఆమె ఫీలింగ్స్ ని ఏమీ పట్టించుకోకుండా.
"తీసుకోనని నిన్ననే చెప్పాను"
"మీరు తీసుకోవాలి"
"బెదిరిస్తున్నావా?" ఆమెకు అతనిమీద చులకన భావం ఏర్పడడం వల్లే సంబోధన ఏకవచనంలోకి మారింది.
"అభ్యర్ధన మాత్రమే"
"ఒకసారి తిరస్కరించాక, రెండోసారి చేసేది అభ్యర్దన అనిపించుకోదు"
"నేను బెదిరిస్తున్నానని అనుకుంటున్నారా?"
"నీతో నాకు మాట్లేమిటి - జరగండి"
"అయితే ఈ పువ్వు థేఉస్కొకపోతే ఇక్కడే ఇరవై గుంజీలు తీస్తాను అందరూ చూస్తూ వుండగానే"
ఆమె ఆశ్చర్యపోయింది. కానీ అది ముఖంలో కనపడనివ్వలేదు.
"దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదనుకుంటారేమో కానీ చాలా నష్టం కలుగుతుంది మీకు అందహ్రి ముందూ నడిరోడ్డులో గుంజీలు తీస్తే అందరి కళ్ళల్లోనూ మనిద్దరం పడతాం. మనిద్దరం లవర్స్ మనీ, నేనేదో తప్పు చేస్తే నువ్వు గుంజీలు శిక్ష విధించావాణీ అనుకుంటారు. పదిమందీ అలా అనుకోవడం నాకు గర్వంగా వుంటుంది. మీకు ఇన్సల్టింగ్ గా వుంటుంది"
మామూలమ్మాయి అయితే బెదిరిపోయేది. కానీ సుజన మరింత బ్రేవ్ గా తయారయింది.
"గుంజీలు కాదు - బస్కీలయినా తీసుకో" అని పక్కకు తిరిగింది.
అతను ఠక్కున మోటార్ బైక్ దిగి, గుంజీలు తియ్యడం ప్రారంభించాడు.
ఆమె ఏమీ పట్టించుకోనట్లు వెళ్లిపోయింది.
ఇంత జరిగాక కూడా అతను వదల్లేదు.
ఈసారి గులాబీకి బదులు లవ్ లెటర్ తో తయారయ్యాడు. అయితే ఈసారి రోడ్డు మీద కాకుండా కాలేజీలో తగిలాడు.
కాలేజీ వదిలాక ఆమె ఫ్రెండ్స్ తో వస్తుండగా ఎదురెళ్ళి విష్ చేశాడు.
"మీకోసమే వచ్చాను" అన్నాడు.
ఆమె డైవర్ట్ కాకుండా స్నేహితురాళ్ళతో మాట్లాడుతూనే వుంది. ఆమె ఫ్రెండ్స్ మాత్రం ఎవరితను అన్నట్లు చూస్తున్నారు.
అతను వాళ్ళ వెనక నడుస్తూ "సుజనా! సుజనా" అని పిలుస్తున్నాడు.
"ఎవరే?" స్నేహితురాళ్ళు అడిగారు కంగారుగా.
"వాడొక ఫూల్" మెల్లిగా ఇంగ్లీషులో చెప్పింది.
వాళ్ళు ఆగకపోయేసరికి అతను వడివడిగా ముందుకొచ్చి అడ్డంగా నిలబడ్డాడు.
"ఏయ్ మిస్టర్ - ఏమిటిది? ఇలా అల్లరిచేస్తే పోలీస్ కంప్లయింట్ ఇవ్వవలసి వస్తుంది" ఓ అమ్మాయి తీవ్రంగా హెచ్చరించింది.
"నిన్ను ఎవరూ జీవితంలో అల్లరి చేయరు - నీ పర్సనాలిటీ అలాంటిది. ఇంటికెళ్ళి ముఖం చూసుకో. నేనొచ్చింది - ఇదిగో ఈ ఏంజెల్ కోసం" అన్నాడు కసిగా ఆమెవైపు చూస్తూ.
ఆమెకు ఏడొపొక్కటే తక్కువ. అవమానం ముఖాన్ని ఎర్రగా మార్చేసింది.
"నీకు సంస్కారం లేనట్లుంది. ఎందుకలా అవమానించావ్?" సుజన కోపంతో ఊగిపోతూ ప్రశ్నించింది.
"మరి అదేమిటి పోలీసూ, సైన్యమూ అంటుంది"
"ఛీఛీ" ఆమె అసహ్యించుకుంది.
"నువ్వు అసహ్యించుకున్నా, కోపంతో ఓ దెబ్బ కొట్టినా నేనేమీ ఫీల్ కాను. నా ప్రేమ అంత గొప్పది. ప్రేమికుడు ఇలనాటివాటికి వెరవడు. నీమీద నాకెంత ప్రేమో ఇదిగో ఈ లెటర్ లో రాశాను. తీసుకో" అని ఓ కవర్ అందించబోయాడు.
