Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 30


    మబ్బులు పట్టి వర్షం కురుస్తూ ఉండడం వల్ల గదిలో చీకటి ఆవరించింది. లైటు వేశాడు సుందరం. ఆ లైటు కాంతిలో తడిసిన శరీరంతో, వింత అందంతో కనుపిస్తూ ఉంది శాంత. తడిసిన ఆ దుస్తులు ఆమె శరీరంలో వంపు లను బహిర్గతం చేస్తున్నాయి. వెంట్రుకలనుండి కారుతూన్న నీటి బిందువులు ముఖం పై పడి లైటు కాంతికి ముత్యాల్లా మెరుస్తున్నాయి. చలివల్ల కొద్దిగా ఒణుకుతూ ఉంది శాంత.
    'చలితో వణికిపోతున్నావు. పొడిగుడ్డలు యిప్పుడెక్కడి నుండి వస్తాయి?' అని ఒక్క క్షణం ఆలోచించి 'మా యిల్లు యిక్కడికి చాలా దగ్గర, ఎవరినైనా పంపించి తాయారు గుడ్డలు తెప్పిస్తాను.' అని బయటికి వెళ్ళి ఆస్పత్రి పనివానికి ఈ పని పురమాయించి మళ్ళీ లోపలికి వచ్చాడు సుందరం.
    అప్పటికి తల, ఒళ్ళు తుడుచుకొని  చీరెకుచ్చిళ్ళు పిండింది శాంత.
    'అతనిని ఎందుకు పంపావు సుందరం? గొడుగుంటే నేనే యింటికి వెళ్ళిపోయే దాననుగా.' ఆ పరిస్థితిలో అతని గదిలో ఒంటరిగా ఉండడం యిష్టం లేక అంది శాంత.
    'ఇంత పెద్ద వర్షంలో ఎలా వెడతావు? కొద్ది సేపట్లో తగ్గిపోవచ్చు. తగ్గిపోయాక వెడుదువుగాని' అని శాంతను ఒళ్లంతా కళ్ళుచేసుకొని చూడసాగాడు సుందరం.
    అతని చూపులు శాంతకెంతో సిగ్గును కలిగించాయి. ఆ పరిస్థితి ఏర్పడినందుకు మనసులో ఎంతగానో విచారపడ సాగింది. వర్షంలో బాగా తడిసినందువల్ల ఒంట్లో నుంచి చలి పుట్టుకు వస్తూ ఉంది. ఎంత ఆపుకుందామనుకున్నా ఆమెకు వణుకు పుట్టడం ఆగడం లేదు, ఎలాగో ఆ చలిని వోర్చుకుంటూ అక్కడున్న కుర్చీలో ముడుచుకోని కూర్చుంది. ఆమె.
    'శాంతా! ఫ్లాస్కులో కాఫీ ఉంది. కొద్దిగా తీసుకో' అని ఫ్లాస్కు మూత తీసి ఆ మూతలోకే కాఫీవంచి ఆమెకు అందించాడు.
    అలా అందించడంలో కావాలనే శాంత వ్రేళ్ళను తాకాడు. ఆ స్పర్శతో శాంతకు సికింద్రాబాదులో ప్లాజాటాకీసువద్ద జరిగిన సంఘటన అప్పటి సుందరం ప్రవర్తన రెండూ గుర్తుకు వచ్చాయి. ఇందాక చూసిన చూపులు గత సంఘటనలకు బలాన్నిచేకూర్చాయి. సుందరం తనను వాంఛిస్తున్నాడన్న విషయం ఆమెకు స్పష్టమైంది. ఇప్పటిస్పర్శ ఆమెకు విద్యుద్ఘాతంలా తగిలింది. బెదిరిపోయింది.
    ఏమీ మాట్లాడలేక మనసులో మధనపడుతూ అతనందిచ్చిన కాఫీ చప్పరిస్తూ కూర్చుంది. కాఫీత్రాగడం పూర్తిచేసేసరికి పొడిగుడ్డలు వచ్చాయి. సుందరాన్ని గది బైటికి వెళ్ళమని సంజ్ఞచేస్తూ గది తలుపులు మూసి గుడ్డలు మార్చుకోసాగింది.
    పొడిగుడ్డలు కట్టుకొని కుర్చీలో కూర్చొని మెడికల్ మాగజైనొకటి తిరగవేస్తూ కూర్చుంది. ఎవరో పేషెంటు బాధతో కేకలు వేస్తూ ఉండడంవల్ల అతనిని చూడడానికి వెళ్ళిపోయాడు సుందరం.
    ఒంటరిగా కూర్చున్న శాంత ఆలోచనల సుడిగుండంలో పరిభ్రమించ సాగింది. 'ఏమిటిది? సుందరం ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? అతను నాపై మోజు పడడంలో అర్ధంలేదు. అలా న్దుకు ప్రవర్తిస్తున్నాడు? నేనైనా అతనిని గట్టిగా మందలించలేక పోతున్నానేమిటి? ఎందుకో ఏమో నాలోని బలహీనత నన్ను వెనుకకు లాగుతూ ఉంది. ఈ విషయం బయటపడితే యింకేమైనా ఉందా? అమ్మ బాబోయ్! నాన్న నన్ను నిలువునా పాతేస్తాడు. బావ మాత్రం ఊరుకుంటాడా? ఇంతకాలం అతని సొత్తనుకున్న నాపై ఎవరిదృష్టి పడినా సహించడు. మరి.....బావకు, నాకు మధ్యగల అనుబంధం తెలిసిన సుందరం యిలా ప్రవర్తించడం ఎటువంటి విషమ పరిణామాలకు దారితీస్తుందో....? ఇప్పుడు నేనేంచేయాలి? సికింద్రాబాదులో జరిగిన ఆ హఠాత్సంఘటన తర్వాత సుందరం యొక్క రూపం నా హృదయంలో ఏ మూలనో స్థావర మేర్పరచుకొని క్రమంగా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. రామం రూపంతో నిండివుండే నా హృదయం. రెండు భాగాలై నాకు అప్పుడప్పుడు మానసికవ్యధను కలిగిస్తూ ఉంది. నాకు తెలియకుండానే నేను సుందరాన్ని గురించి ఆలోచించడం లోగా ఒకటిరెండుసార్లు జరిగింది. అలా జరిగినపుడు నాకు మనశ్శాంతి దూరమౌతూ వస్తుంది.
    'కనీసం శారద ఉన్నా బాగుండేది, ఆమె వెళ్ళిపోయి పదిహేను రోజులు దాటాయి. బావ తోడుగా వెళ్ళి ట్రైనింగు కాలేజీలో చేర్పించి వచ్చాడు: నా హృదయంలో చెలరేగుతున్న ఈ తుఫాను ఎవరికి చెప్పుకోను? హృదయభారాన్ని ఎలా తగ్గించుకోను? నాకంతా అయోమయంగా ఉంది.
    'తయారు ప్రవర్తనకు అర్ధంయేమిటి? బావకు సన్నిహితురాలు కావడానికి ప్రయత్నించడంలో ఆమె ఉద్దేశ్యమేమై ఉంటుంది? బావకూడా ఆమెపై మోజు పడుతున్నాడా? హే భగవాన్ ఏమిటీ అగ్నిపరీక్ష నాకు?'
    పైవిధంగా ఆలోచిస్తున్న ఆమెకు 'శాంతా! శాంతా!' అని పిలిచిన రామం పిలుపులు వినిపించి బాహ్యస్మృతి కలిగింది.
    శాంత ఉన్నగది లోపలికి వచ్చిన రామం 'శాంతా! నీవిక్కడున్నావా?' అతని మాటలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
    'అవును బావా.....అభిజ్ఞాన శాకుంతలం చదువుతూ తోటలో అలాగే కూర్చుండి పోయాను. అకస్మాత్తుగా వర్షం రావడంతో తడిసిపోయి యిక్కడికి వచ్చాను. సుందరం తాయారుగుడ్డలు తెప్పించి యిచ్చాడు. అవి మార్చుకొని వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాను.' రామం ముఖంలోని భావాల నర్దం చేసుకోవడానికి వ్యర్ధప్రయత్నం చేస్తూ అంది శాంత.
    'అంత పరధ్యానంగా ఉన్నావా? వర్షం తగ్గి పదినిమిషాలైంది 'ఇంకా యింటికి రాలేదేమిటబ్బా' అని మామయ్య ఆందోళన పడుతూ ఉంటే వెదుకుతూ బయలుదేరాను.' అతని ముఖంలో కొద్దిగా విసుగు ద్యోతక మైంది.
    ఆ విధంగా విసుగుపడుతూన్న రామాన్ని చూసిన శాంత మనసు చివుక్కుమంది. మౌనంగా అతనిని అనుసరిస్తూ యింటివైపు నడిచింది.

                          *    *    *

                                 13

    ఆరోజు ఆదివారం ట్రైనింగు కాలేజీకి శలవు. శారద తను యిదివరకు ఉన్న హాస్టలులోనే మళ్ళీ చేరింది. శాంతతో కలిసి ఉండడం అలవాటుపడిన శారద రెండుమూడు మాసాలు ఏదో తెలియని బాధ అనుభవించింది. ఇప్పటికీ తీరిక సమయాలలో శాంతనుగురించిన ఆలోచనలు ఆమెకు వస్తూనే ఉంటాయి.
    ట్రైనింగు కాలేజీలో చేరి ఆరుమాసాలు దాటాయి. రెండుమాసాల క్రితం ఒక్కసారి మాత్రం శ్రీపతిగారి యింటికి వెళ్ళి వచ్చింది. శ్రీపతిగారు అన్నపూర్ణమ్మగారు కనీసం వారానికొకసారైనా తమయింటికి వచ్చివెడుతూ ఉండవలసిందని ఎంతో ఆప్యాయంగా కోరారు. కాని చదువుధ్యాసలో పడిన శారద మళ్ళీ వెళ్ళలేకపోయింది. ఆరోజు శలవు కావడంవల్ల వెళ్ళాలనికోరిక కలిగి బయలుదేరింది.
    శారద శ్రీపతిగారింటికి చేరేసరికి ఉదయం పది దాటింది. హాలులో ఎవ్వరూ కనిపించలేదు. పరిచయం ఉన్నయిల్లే కాబట్టి నేరుగా శ్రీపతిగారి గదిలోపలికి వెళ్ళింది.
    'రామ్మా! వారానికి ఒక్కసారివచ్చి వెడుతూండమని చెబితే యింతకాలానికి వచ్చావా?' గుమ్మంవద్ద కనుపించిన శారదను లోనికి ఆహ్వానిస్తూ అన్నారు శ్రీపతిగారు.
    ఎంతో కష్టంమీద తలఎత్తివచ్చిన వారెవరా అని చూసి మళ్ళీ తలగడపై తల ఆనించిన అన్నపూర్ణమ్మగారు 'నీవాతల్లీ!' ఇంతకాలానికి గుర్తొచ్చామా? బాగున్నావా అమ్మా?' శారదను అడిగారు నీరసంవల్ల కంఠస్వరం వణుకుతూ ఉంది.
    'బాగానే ఉన్నాను' అని సమాధానం చెప్పి ఒక్కక్షణం ఆగదిని, శ్రీపతిగారిని, అన్నపూర్ణమ్మగారిని పరిశీలించింది శారద. మంచం ప్రక్కగా ఉన్న స్టూలుమీద ఒక చిన్నతరహా మెడికలుషాపు వెలిసింది. అన్నపూర్ణమ్మగారి ముఖంలో దైన్యం తాండవిస్తూ ఉంది. ఆమె అలా మంచంపట్టి ఎన్నిరోజులైందో ఊహించుకో లేక పోయింది శారద. శ్రీపతిగారు పీక్కుపోయి కళతప్పిన ముఖంతో ఆ మంచానికి ప్రక్కగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. శారద వెళ్ళి మంచంపై అన్నపూర్ణమ్మగారి తలాపున కూర్చొని వారి కళ్ళల్లోకి జాలిగొలిపే చూపులతో చూడసాగింది?
    'ఇలా ఉందమ్మా మా పరిస్థితి. మీ అమ్మగారు మంచమెక్కి పదిరోజులైంది. చేతనయ్యో చేతకాకో లేచి పనులు చేసుకుంటున్నంత వరకు సక్రమంగానే గడిచి పోయింది. మంచానపడిన మరుక్షణం నుండే చాలాబాధ పడుతున్నాము.' శ్రీపతిగారి
     మాటలు వారి పరిస్థితీ రెండూ శారద హృదయాన్ని కదిలించి వేశాయి.
    'బాబుగారూ! ఇంత యిబ్బందిగా ఉంటే నాకు కబురుచేయలేక పోయారా? నేనేమై పోయానను కున్నారు? ఇది మీ ఉప్పు తిని పెరిగిన శరీరం. మీ ఋణం ఎన్ని జన్మలకు మాత్రం తీర్చుకోగలను? అవసరం వచ్చినప్పుడు మీకు సేవచేసే భాగ్యానికి కూడా నోచుకోలేదా నేను. అంత పరాయి...' అంత వరకు మాట్లాడిన శారదను దుఃఖంవల్ల ఆపైన మాటలు పెగిలిరాలేదు.
    అసలే దీనావస్తలో ఉండి శారదను ఆస్థితిలో చూసిన అన్నపూర్ణమ్మగారు శ్రీపతి గారు బాధతో విలవిలలాడి పోయారు.
    'తల్లీ! కాఠిన్యంవహించి నిన్ను అనరాని మాటలన్నాము. నిర్దోషివైన నీపై ప్రభాకరం మోపిన నిందకు ఎంతో కుమిలి పోయాం. నిస్సహాయురాలైన నీకు నిలువ నీడలేకుండా చేశాం. ఇంకా ఏ ముఖం పెట్టుకొని నీ దగ్గరకు వచ్చి అడగమంటావమ్మా? అయినా నేను రావాలనే అనుకున్నాను కాని చదువుకుంటున్న ఆ అమ్మాయిని ఎందుకు యిబ్బంది పెడతారు?' అని మీ అమ్మగారే వద్దన్నది.' అన్నారు శ్రీపతిగారు.
    'ఇప్పుడువన్నీ ఎందుకండీ బాబుగారూ? రేపే ట్రైనింగు కాలేజీకి శలవు పెడతాను. అమ్మగారికి పూర్తిగా స్వస్థత చిక్కిన తర్వాతే మళ్ళీ కాలేజీకి వెడతాను.' అన్నపూర్ణమ్మ గారి ముఖంలోకి ఆప్యాయంగా చూస్తూ అంది శారద.
    'తల్లీ! నాకోసం నీవు కాలేజీకి వెళ్ళడం మానుకుంటావా? నీవుయిక్కడ ఉన్నంతకాలం నాకు ఎంతో సాయంచేశావు. నీవు వెళ్ళి పోయిన తర్వాత నిన్ను తలవని రోజంటూ లేదు.' బలహీనతవల్ల ఒక్కొక్కమాట ఎంతో ప్రయత్నంమీద అనగలిగారు అన్న పూర్ణమ్మగారు. ఆప్యాయతతో నిండిన శారద మాటలు అన్నపూర్ణమ్మగారికి అశ్రువులను తెప్పించాయి.
    తన పమిట చెంగుతో వారి కన్నీటిని తుడుస్తూ 'బాధపడకండి. నేను వచ్చానుగా ఆ భగవంతుడి దయవల్ల అన్నీ చక్కబడుతాయి. మీరు నిశ్చింతగా ఉండండి' శారద మాటలు వారిద్దరికీ ఎంతో ధైర్యాన్ని కలిగించాయి,
    
                            *    *    *

    శారద శ్రద్ధతోచేసిన పరిచర్యలతో, మనసుకు ఉల్లాసం కలిగించే కబుర్లతో అన్నపూర్ణమ్మగారు శారీరకంగా, మానసికంగా త్వరగా కోలుకున్నారు. శారదను డాక్టరుగారు కూడా ఎంతో అభినందించారు. పథ్యం పెట్టి రెండురోజులైంది. శారద శ్రీపతిగారి యింటికి వచ్చి పదిరోజులు దాటి పోయింది: అన్నపూర్ణమ్మగారు లేచి తిరుగుతూ తమ పనులు తాము చేసుకోగలుగుతున్నారు. కాని యింటి పనులు చేసుకోగల శక్తి యింకా ఏర్పడలేదు.
    ఒకరోజు సాయంత్రం సుందరరామయ్య గారు, నీరజ, శ్రీపతిగారి యింటికి వచ్చారు. వారు వారానికి రెండుమూడు సార్లు వచ్చి చూసి వెడుతూనే ఉన్నారు. ఆ కారణంగా శారదకు నీరజకు ఎంతో చనువు పెరిగింది. నీరజ 'అక్కా, అక్కా' అని శారదను ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ శ్రీపతిగారి యింట్లో ఉన్నంతసేపూ శారద వద్దనే కులాసా కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంది.
    మొట్టమొదటి రోజు సుందరరామయ్య గారిని చూసిన శారదకు ఫోటోలో తన తల్లి ప్రక్కన ఉన్న యువకుని రూపం సుర్పణకు వచ్చింది. పోలికలు చాలా వరకు కలుస్తాయి. కాని మనుష్యులను పోలిన మనుషులు ఎంతోమంది ఉంటారనుకొని సరిపెట్టుకుంది.
    నీరజ తనపై చూపుతున్న ఆప్యాయతకు శారద మనసు వెన్నలా కరిగిపోయి ఆమెను తన సహోదరిగా ప్రేమించసాగింది.
    అన్నపూర్ణమ్మగారిని పరామర్శించిన తర్వాత శారద, నీరజలిద్దరూ మేడపైన ఉన్న ప్రభాకరం గదిలోపలికి వెళ్ళారు. శారద ఆ యింటికి వచ్చిన రోజు యిల్లంతా చెత్తాచెదారంతో చూడడానికి ఎంతో అసహ్యంగా ఉంది. ఎంతమంది పనివాళ్ళు ఉన్నప్పటికీ, పని చేయించేవాళ్ళు లేకపోతే వారు చేసేపనులన్నీ అస్తవ్యస్తంగానే ఉంటాయి. ఇల్లంతా శుభ్రం చేయించి, తాళంవేసి ఉన్న ప్రభాకరం గదిని కూడా తెరిపించి బూజు, చెత్త, చెదారంతో నిండి ఉన్న ఆ గదిని శుభ్రం చేయించింది శారద.
    'అక్కా...! నీ పూర్తి వివరాలు నాకు చెప్పవూ?'    
    'ఎందుకులేమ్మా....! చెప్పి నిన్ను బాధ పెట్టడం దేనికి?'
    'లేదక్కా.....ఈ రోజు నీవు తప్పకుండా చెప్పాల్సిందే!'
    'లేదులేమ్మా...! అవసరం వచ్చినప్పుడు నేనే చెబుతాను. అంతవరకు వోపికపట్టు.' ఆ గదిలో టేబుల్ పై ఉన్న ప్రభాకరం ఫోటోను తదేకంగా చూస్తూ అంది శారద.
    పరిచయం కలిగిన వారం పదిరోజులలోనే ఒకరి మనస్తత్వాన్ని మరొకరు చక్కగా అర్ధం చేసుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS