Previous Page Next Page 
లోకం పోకడ పేజి 30


    "ఏం, కామాక్షమ్మా , మేనల్లుణ్ణి ఎత్తబోతున్నావ్. అప్పుడు మా వాణ్ణి మరవ్వాకు, ఆ సంతోషం లో. ఇద్దరూ ఆడుకుంటార్లే. ఎట్టాగయినా మేనల్లుడి మీద గురి పరాయమ్మ పిల్లల మీదుండదుగా! అయినా మావాడు పెద్దవాడు కాబోతుండలా? వాడే మీ వాణ్ణి ఆడిస్తాడు లే" అన్నది శకుంతల కామాక్షి తో. 'ఈ వెధవాయి ఆడించక పొతే ఆ పుట్టబోయే వాడు అడుకోలేడు కామాలు' అని మనస్సులో అనుకుంది వసుంధర.
    ఎన్నడూ మాట్లాడనిది శకుంతల ఒకరోజున రమేష్ ను పలకరించింది.
    "ఏం రమేషయ్యా, వసుంధరమ్మ గర్భిణీ గదా? అట్టా యిడిసి పెట్టి వూరుకుంటే ఎట్టా? నీరసంగా ఉంటున్నది గదా? దవాఖానా లో చూపీయండి" అన్నది. రమేష్ మనస్సులో నవ్వుకున్నాడు.
    "అట్లాగే, రెండు మూడు రోజుల్లో ఆస్పత్రికి తీసుకు వెళతాను వసుంధర ని" అన్నది.
    కామాక్షి కూడా తమ్ముణ్ణి పోరాసాగింది -- అయిదో నెల కూడా వెళ్లి పోయింది , ఇంకా ఎప్పుడు డాక్టరు కు చూపిస్తావని.
    "ఒకటో నంబరు నుంచే ఆస్పత్రులు ఎక్కితే, ఇంక దాని పనీ, నా పనీ అయినట్లే" అన్నాడు రమేష్. వసుంధర వైపు చూస్తూ.
    "నన్నేమీ ఆస్పత్రికి తీసుకు వెళ్ళక్కర్లేదు . నాకు ఒంట్లో బాగానే ఉంది. నేను ఆస్పత్రికి వెళ్ళను." అన్నది వసుంధర బెట్టుసరిగా.
    "ఈ కబుర్లకేం గాని, ఒకసారి వెళ్లి రండి. ముందే జాగ్రత్త పడటం మంచిది. పైగా ఆఫీసుకు సెలవు పెట్టమంటే ఇంకా కొన్నాళ్ళు పోనీ మంటుంది. ఉద్యోగం చెయ్యాలనే తాపత్రయం నీకన్న డానికే ఎక్కువగా ఉంది.' అన్నది కామాక్షి.
    వసుంధర మామూలుగానే ఆఫీసుకు వెళ్లి వస్తున్నది.
    పెళ్ళయిన తరువాత రామారావు అదేశాను సారంగా శారద మూడు నెలలు సెలవు పెట్టింది. తరువాత మళ్ళీ ఉద్యోగంలో చేరింది. శారద ఇప్పుడు రామారావు తో కొత్త యింటికి వెళ్ళటం నుంచి యిదివరకు మాదిరిగా వసుంధర యింటికి రావటానికి వీల్లేకుండా ఉంది. రామారావు అద్దె కున్నది సికిందరా బాదు లో. అందుచేతా ఇంక ఇద్దరూ ఆఫీసు లోనే కలుసుకోవటం. ఈ కారణం నుంచి సెలవు పెడితే యింక శారద ను చూడటానికి వీలుపడదని కూడా వసుంధర సెలవు పెట్టలేదు.
    శారద కూడా వసుంధర ను చూడకుండా ఉండలేక పోతున్నది. వయస్సులో శారద పెద్ద దయినా గృహ కృత్యాలకు సంబంధించిన విషయాలలో వసుంధర ను సంప్రదించనిది శారద ఏ పనీ చెయ్యదు.
    సంసార జీవితంలోని ఆనందానుభూతులూ, భర్త ఆదరణ లోని ఆప్యాయతా ఇప్పుడిప్పుడే శారద ఆకలింపు చేసుకుంటున్నది. భర్తతో గడిపిన ప్రతి ఒక్క రోజూ శారద కు ఎంతో తృప్తి యివ్వడమే గాక, ఏదో తెలియని ప్రపంచం లోకి లాక్కు పోతున్నట్లుగా అనిపిస్తున్నది. వసుంధర తో మాట్లాడినప్పుడల్లా శారద ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఏమిటో చెప్పుతుంది. 'వారు రాత్రి ఏదో ఎగతాళి గా నాతొ అట్లా అన్నారు. అట్లా అన్నప్పుడు నాకు చచ్చేటంత సిగ్గుగా ఉంది. సిగ్గు పడుతూనే అట్లా కాదండీ, యిట్లా అన్నాను' అంటూ చెప్పుకు పోయేది.
    వసుంధర కు ఈ కబుర్లు వినట మంటే తల నొప్పిగా ఉండేది.
    జీవితంలో ఏ విషయమైనా తెలియనంత వరకే తెలుసుకోవాలనే ఆదుర్దా. తెలుసుకున్న తరువాత ఆదుర్దా అలవాటుగా మారుతుంది కొంతమందికి. ఆ అదుర్ధాయే మరీ అదుర్ధాను కలుగ జేస్తుంది. ఇంక వారి జీవితమంతా అట్లా గడిచి పోవలసిందే.
    శారద చెప్పినవన్నీ వసుంధర విని "ఊ' కొడుతూ ఉండేది. తను చదువుకునే రోజుల్లో చిన్న పిల్లలా ఏ దిగులూ , విచారమూ లేకుండా స్కూలుకు పోతూ ఉంటె తలవని తలంపుగా రమేష్ పరిచయం కలిగింది. అప్పట్నుంచీ ఎన్నో ఉత్తరాలు , ఆడవాళ్ళ దస్తూరీ లో రమేష్ వ్రాసే ఉత్తరాలు, తన జవాబులు, 'స్త్రీ పాత్ర' నాటిక సరోజను స్టేజీ మీద పరిచయం చెయ్యటం, రమేష్ మీద మక్కువ, పెళ్లి-- యివన్నీ తలుచుకుంటూ శారద మాటలు వింటుంటే , శారద చెప్పే మాటలు చప్పగా ఉండేవి వసుంధర దృష్టి లో.
    ఒకరోజున శారద, వసుంధర సెక్రటేరియట్ బస్ స్టాప్ లో నిల్చున్నారు బస్సు కోసమని. బస్సు వచ్చింది. కాని ఎక్కలేక పోయింది వసుంధర. కళ్ళు తిరుగుతున్నాయి . కాళ్ళూ, చేతులూ స్వాధీనం తప్పినట్లు వణకసాగినాయి. మామూలు బస్సులో కూర్చో లేనంది. శారద పరిస్థితి గమనించి టాక్సీ పిలిచింది. మెల్లగా టాక్సీ లో ఎక్కించి, పడుకో బెట్టి యింటికి చేర్చింది.
    అప్పటికి రాత్రి ఏడు గంటలయింది. కామాక్షి కంగారు పడిపోతున్నది. వసుంధర యింకా రాలేదేమా అని. అంత క్రితమే రమేష్ వచ్చాడు. వసుంధర రాకపోయేసరికి రిక్షా లో ఆఫీసు వైపు వెళ్ళాడు. రమేష్ అటు వెళ్ళగానే టాక్సీ ఇటు వచ్చింది.
    జరిగిన దంతా చెప్పింది శారద. ఇద్దరూ వసుంధర ను మంచం మీద పడుకో బెట్టారు. డాక్టర్ను పిలవటానికి రమేష్ లేడు. శారద తను వెళతా నంటే వసుంధర వద్దంది. అంతలోనే రమేష్ కూడా వచ్చేశాడు.
    "మా మాటలు నీకు చెవి కెక్కలేదు , వసుంధరా. ఇప్పటి కయినా పరిస్థితులు అర్ధం చేసుకుని ఆఫీసుకు సెలవు పెట్టు. ఇప్పుడే లేడీ డాక్టరు వద్దకు పోదాం." అన్నాడు.
    తనకు మరేమీ సుస్తీ లేదనీ, ఇందాకటి కన్నా ఆయాసం తగ్గిందనీ, మర్నాడు ఉదయమే ఆస్పత్రికి వెళ్ళ వచ్చని అన్నది వసుంధర. కాస్సేపు కూర్చుని వెళ్ళింది శారద.
    ఇదంతా శకుంతల చూసింది. ఇప్పడు శకుంతల కు మరీ అలుసయి పోయింది.
    "వసుంధరమ్మా , దునియా మీద అంతా అబద్దం చెప్పే వాళ్ళేనా? దవాఖానా కి పొమ్మా అంటే పోనైతివి. శరీరం కన్న సర్కారు పని ఎక్కువా చెప్పు? ముందు దవాఖానా కి పోయి చూపించుకో. ఆపైన శలవు పడేయ్. అందుకనే ఆడోల్ల కి నౌక్రీ లు కుదరావ్. అయినా అది కాదు గాని నీకా పట్టుదల ఎందుకు చెప్పు? నీ మంచికే చెబుతాం. యినుకోపొతే అవుస్త పడుతుండ;లా నువ్వు?' అన్నది శకుంతల.
    "మొగుడు కొట్టినందుకు కాదు...' అన్న సామెత గా అయింది వసుంధర పరిస్థితి.
    మర్నాడే లేడీ డాక్టరు ఆస్పత్రికి తీసుకు వెళ్ళాడు రమేష్ వసుంధర ను. మగవాళ్ళ తో ఆ లేడీ డాక్టరు మాట్లాడదు ముందుగా అడ వాళ్ళంతా వరసగా బెంచీ మీద కూర్చోవాలి. ఒక నర్సు వచ్చి అందరో పేర్లూ వ్రాసుకుని అయిదు రూపాయలూ ఫీజు వసూలు చేసి చీట్లు ఇస్తుంది. నంబరు ప్రకారం ఒక్కొక్కళ్ళ నే కన్ సల్టింగ్ రూమ్ లోకి పోవాలి.
    వసుంధర కూడా ఒక బల్ల మీద కూర్చుంది. వచ్చిన వాళ్ళందర్నీ చూసింది వసుంధర. కొంతమంది పిల్లల తల్లులూ ఉన్నారు. ఒకావిడ నలుగురు పిల్లల్ని తీసుకుని ఈడురో గోదో మంటూ నడవలేక నడవలేక నడుస్తూ వచ్చింది. నాలుగో పిల్లాడికి ఏడాది వెళ్ళింది. ఆవిడ మళ్ళీ కడుపుతో ఉన్నది. నీరసంగా ఉంది. ఆవిడకు నాలుగు పురుళ్ళూ ఈ ఆస్పత్రి లోనే అయినవట. పదిహేను రోజుల నుంచి నలుగురు పిల్లల్ని వెంట బెట్టుకుని అప్సత్రికి వస్తున్నది. ఆస్పత్రి లో నర్సు లూ, మంత్ర సానులూ అంతా ఆవిడకు పరిచయమే. ఆవిడ రాగానే ఒక నర్సు నవ్వుతూ పలకరించింది.
    "ఏం సుభద్రమ్మ గారూ ఎట్లా ఉన్నది వంట్లో? ఆయాసం తగ్గిందా?" అన్నది.
    ఆవిడ నలుగురు పిల్లలతో సహా బల్ల మీద కూర్చుని, "కాస్త దడా, ఆయాసం తగ్గింది. ఇవాళ నరం యింజక్ష ను చేస్తానన్నారు డాక్టరు గారు. ఏమిటో మాయదారి పురుళ్ళూ, మాయదారి పిల్లలూ " అన్నది.
    "పోనీ కుటుంబ నియంత్రణ విధానం ఆచరించ మంటే మీరు కాదంటారు" అన్నది నర్సు.
    "ఆ, అంతా అదే పద్దతుల్లో ఉంటె ఈ లేడీ డాక్టర్లంతా విశ్రాంతి గా కూర్చో వలసిందే, కేసులు లేక" అన్నది ఆవిడ నవ్వి.
    ఈ మాటలకు అంతా నవ్వుకున్నారు. వసుంధర అంతా వింటూ కూర్చుంది. ఇంతమంది ఆడవాళ్ళ నూ, కడుపు తో ఉన్నవాళ్ళ నూ, పిల్లల తల్లులనూ చూస్తుంటే వసుంధర మనస్సులో ఏదో తీరని వెల్తి గా తోచింది. రెండు సంవత్సరాల క్రితం తను కుమారి వసుంధర. హైస్కూల్లో చదువుకుంటూ ఉండే విద్యార్ధిని. చదువుకునే రోజుల్లో కడుపుతో ఉన్నవాళ్ళ ను చూస్తున్నా, అక్కయ్యలు పురిటి కి వచ్చినా వసుంధర కు ఎగతాళి గా ఉండేది. ఒకసారి వాళ్ళ పెద్దక్కయ్య ను అడిగింది. 'అంత కనలేని దానివి, పిల్లల్తో వేగలేని దానివీ ఎందుకు కడుపుతో ఉన్నావే?' అని. 'పెళ్ళయి కాపరానికి వెళితే నీకూ తెలుస్తుంది.' అన్నది అక్కయ్య. వదిన గార్లను మరీ ఎగతాళి పట్టించేది. చదువుకునే రోజుల్లో తను రెండు జడలు వేసుకుని, రిబ్బన్లు కట్టుకుని లంగా కుచ్చెళ్లు ఫాషన్ గా కదులుతూ ఉంటె, జారిపోయే సిల్కు ఓణీ సరి చేసుకుంటూ , అదో గర్వంగా చూసుకుంటూ స్కూలుకు వెళ్ళేది. సినిమాల్లో నాయికా నాయకులు తోట షికార్లు చేస్తూ పాడుతుంటే ఏమిటో ఎబ్బెట్టు గా ఉండేది. అట్లాంటి తనకు ప్రేమించటమంటే , ప్రేమ లేఖలు వ్రాయట మంటే ఏమిటో తెలిసింది. కుమారి వసుంధర శ్రీమతి వసుంధర అయింది. కాపరానికి వచ్చిన కొత్తలో అదో ప్రపంచం లో ఉన్నట్లుండేది. అప్పుడు కడుపుతో ఉన్నవాళ్ళ ను చూస్తుంటే ఏదో దిగులు మనస్సులో. తనకూ ఈ రకమైన బాధలు వస్తాయి కామాలను కునేది. మనస్సులో బెరుకుగానే ఉండేది.
    అట్లాంటి తను కూడా కడుపుతో ఉన్నది. అందరితో పాటు ఆస్పత్రికి రావటమూ జరిగింది.
    ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంది వసుంధర. అంతలో నర్సు వచ్చి చెప్పింది వసుంధర మెల్లగా లేచి గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో నుంచి బయటికి వచ్చేవాళ్ల ను చూస్తుంటే అంతలోనే నవ్వు వచ్చింది , ఎందుకు వచ్చిన బాధా యిదంతా అని.
    బల్ల మీద పడుకో మంది లేడీ డాక్టరు. నాలుగయిదు నిమిషాలు వసుంధర సిగ్గు పడ్డది. బల్ల మీద ఉన్నంత సేపూ కళ్ళు మూసుకుంది వసుంధర. లేవమనగానే కళ్ళు తెరిచి లేచి బల్ల దిగి పక్క బల్ల మీద కూర్చుంది.
    "ఏం జబ్బు లేదమ్మా. అంతా బాగానే ఉంది. కొంచెం నరాల బలహీనత ఉన్నది. కనేదాకా ఇంజక్షన్లు, టానిక్కూ లు తీసుకోవాలి." అని ప్రిస్క్రిప్షన్ వ్రాసి ఇచ్చింది డాక్టర్.
    వసుంధర చీటీ తీసుకుని గదిలో నుంచి బయటికి వచ్చింది.
    "డాక్టర్ మ్మా ఏం చెప్పిందమమ్మా?' అన్నది ఒకావిడ.
    వసుంధర కు ఏం చెప్పటానికి తోచలేదు మళ్ళీ అడిగిందావిడ.
    "అందరికీ చెప్పేదే నాకూ చెప్పింది" అన్నది వసుంధర.
    అంతవరకూ బయట మగవాళ్ళ వరండాలో కూర్చున్నాడు రమేష్. వసుంధర రాగానే 'అమ్మయ్యా' అనుకుంటూ తనూ బయటికి వచ్చాడు.
    ఇద్దరూ రిక్షా ఎక్కి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళగానే కామాక్షి అడిగింది. జరిగిందంతా చెప్పింది వసుంధర.
    మరో పావు గంట గడిచాక "ఏం చెప్పిందమ్మా , వసుంధరమ్మ , డాక్టరమ్మ?' అంటూ వచ్చింది శకుంతల.
    మనస్సులో తిట్టుకుంటూ మళ్ళీ చెప్పింది వసుంధర.
    ఆ రోజు నుంచే ఆఫీసుకు సెలవు పెట్టింది, వసుంధర. తన ఈడుకు ఈ కడు పెమిటని మనస్సు లో దిగులు. ఆ రాత్రి రమేష్ తో అన్నది -- "దీని కంతకూ కారణం మీరే'-- అని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS