'దీనికంతకీ అసలు వెనకాల ఆ డాక్టరు చేసి ఉంటాడండీ?' వీరాచారి.
"డాక్టరో , మునసబో ఎవడై తేనేం ఎవడో ఒకడు. నిక్షేపం లాంటి ఎకరన్నర పోరంబోకు ని సత్రపు కి కాకుండా చేసి ఆ తాగుబోతు వెధవలకి నివేశన స్థలాల కని పట్టా పుట్టించాడు కదా?......ఎంత గుట్టుగా చేశాడు ?......ఇవాళ వాళ్ళు పాక వేసుకోవడం మొదలెట్టే దాకా మనకి తెలియలేదు....ఇప్పుడేవిటి మనం చెయ్యడం ...........ఆటకాయిస్తే ఆ అలగా జనం దగ్గర అల్లరి పాలవుతాం అని వచ్చేశాం -- బాగానే ఉంది ఇలా ఊరుకోవడమేనా?"
"ఊరు కోవడం ఏవిటి ?....కలెక్టరు కి పిటీషన్ తగిలిద్దాం " అన్నాడు కరణం.
తగిలించవచ్చు . తగిలించడాని కేం? కాని దాని వల్ల ఎంతవరకూ పని జరుగుతుందా అన్నది ఆలోచించవలసిన విషయం -- తీరా అది వాళ్ళ కిందే ఖాయపరిస్తే మరింత నవ్వుల పాలు కామూ?" అన్నాడు శేషయ్య.
"అవును-- అది లాభం లేదు, అంతకంటే చక్కని ఉపాయం ఉంది. వాళ్ళని పూర్తిగా పాకలు కట్టుకొనిచ్చేది , రెండు మూడు రోజులూరు కుని చల్లగా ఓ అగ్గిపుల్ల గీసి పదేసేది " అన్నాడో రైతు.
"ఛ..ఛ....వెధవ పని అన్నాడు వెంటనే శేషయ్య.
చాలాసేపటి దాకా ఎవ్వరూ మాట్లాడలేదు.
"నాకో పద్దతి తోస్తోంది " అన్నాడు వీరాచారి.
అంతా వీరాచారి ముఖం కేసి చూశారు.
"ఎలాగా పాకలు కట్టడం దాకా వచ్చేసింది కనుక, మనం ఇంకా సత్రం గొడవ ఎత్తకుండా చల్లగా ఊరుకుంటే సరి. సత్రం కట్టనీయకుండా మనల్నే దో సాధించాం అనుకుంటూ సంతోషిస్తున్న, ఆ మునసబు ఆనందం ఆ డాక్టరు సంబరం కాస్త చల్లారుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా మన ప్లాను ని వాళ్ళు పాడు చేసినట్టే వాళ్ళ ప్లాను ని మనం కూడా పాడుచేయ్యవచ్చు " అన్నాడు వీరాచారి.
"అదే , ఎలాగని ?' ఓ కాలు ఎత్తి అరుగు ని ఆనించి నుంచుంటూ అడిగాడు కరణం.
శేషయ్య రెండు చేతుల్లోనూ ముఖం పెట్టుకుని కూర్చున్నాడు అరుగు మీద. "వీరాచారి ఏం చెబుతాడా ?'....అంటూ గడ్డం కింద కర్ర లేట్టుకుని నిలబడి ఉన్నారు రైతులంతా శ్రద్దగా.
"ఇప్పుడా పోరంబోకు , ఆ మాయదారి వాళ్ళ నివేశన స్థలాల కింద ఎందుకు వినియోగం చేశాడో తెలుసా?....గవర్నమెంటు పంచాయితీ యాక్టు ఒకటి ప్రవేశ బెట్టబోతుంది. దాని ప్రకారం ఓ ఏడాది లో మన ఊరికి పంచాయితీ బోర్డు వచ్చి ప్రెసిడెంట్ గిరీకి ఎలక్షనులు జరబోతాయి. దాని కోసం ఇప్పటి నుంచీ ఈ తతంగం అన్నమాట! ఇలా నివేశన స్థలాలూ అవీ ఇచ్చి ఇప్పటి నుంచీ బుజ్జగిస్తే ఆ వోట్లన్నీ తమకే వస్తాయనీ ప్లాను. కాని మనం ఆ ప్లానుని తారుమారు చెయ్యవచ్చు......."
"ఎలాగా
? అన్నాడు ఆత్రంగా శేషయ్య.
"ఆ శంకరం ఎలా చేశాడు? అలాగే! ...డబ్బు తీసుకోకుండా ఊరికే మందులిచ్చి , దీన జనోర్ధరణ కోసమే ఈ ఊళ్ళో ప్రాక్టీసు పెట్టినట్లు వాసు ప్రవర్తిస్తే సరి"
"ఇంత ఖర్చు పెట్టు చదివించింది. వీళ్ళందరి కీ ఊరికే వైద్యం చేయించడానికా?"
"నటనే కాదండీ?....అయినా ఎన్నాళ్ళూ?...ఎలక్షను లు వెళ్ళే దాకానే!"
"ఇది ఆలోచించవలసిన సంగతే నండోయ్ ?' అన్నాడు కరణం. ఊడిపోయిన పిలక ని వెలికి మేలిచుట్టి ముడి పెట్టుకుంటూ.
"సరే-- అలాగే చేస్తాం అనుకో కొన్నాళ్ళ పాటు-- కాని ఈ పాటక జనం అంతా శంకరం హాస్పిటల్ వదిలి వాసు దగ్గరికి రావద్దు?"
"ఎందుకు రారూ...? ...ఇంచక్కా వస్తారు. రాకపోతే మేం లేముటండీ....శంకరం చదివిన ఎల్.ఏమ్. సి కంటే వాసు చదివిన ఏమ్. బి. బి.యస్. గొప్పదనీ, అవసరం అయితే వాసు అపరేషన్లు కూడా చేస్తాడనీ అది శంకరం వల్ల చేత కాదనీ ....చేతికి డప్పు కట్టుకుని ఊరంతా చాటడానికి?....మీకెందుకు? ..మీరు వాసు చేత ఊళ్ళో ప్రాక్టీసు పెట్టించండి. జనాన్నంతా ఇటు తిప్పే పూచీ నాది దాంతో నివేశాన స్థలాలు కేటాయించి మనుష్యుల్ని కట్టుకోవడం ఏమిటో తేలుతుంది. మన సత్రం ప్లాను ని ఇలా చెడగొట్టినందుకు వాళ్ళ ఎలక్షను ప్లాను ని అలా పడగోడదాం."
అంతా వీరాచారి సలహా బాగుందంటే బాగుందన్నారు. దాంతో వాసు ఆ ఊళ్ళో ప్రాక్టీసు పెట్టడానికీ, అది కూడా వీలైనంత త్వరలో ఓ వారం పది రోజులలో ప్రారంభం చెయ్యడానికీ నిర్నయించేసి, ఆ తర్వాత ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు.
వాళ్ళ సంభాషణన ఆమూలాగ్రం అక్షరం పొల్లు పోకుండా విన్నాడు వాసు. నాన్న అడబోయే ఈ పల్లెటూరి రాజకీయ చదరంగం లో తనని ఒక "పావు " గా ఉపయోగించడానికి ఎంత నిర్లిప్తంగా ఓ నిర్ణయం చేసేశాడు!...నాన్న నిర్ణయాన్ని తను కాదని ఎదిరించగల శక్తి ఉంటె ఎంత బాగుండును " అనుకున్నాడు.
వాసు "సేవా సదనమ్" కి కావలసిన ఎర్పాటులన్నీ చురుకుగా సాగుతున్నాయి. ఎంతో పట్టుదలతో శేషయ్య ప్రయత్నంలో ఉన్నాడు. తన భార్య పోయేటప్పటికి ఇంత ఉన్న నలుసు భగవంతుడి కృప వల్ల ప్రయోజకుడై ఇన్నాళ్ళ కి ఓ బ్రతుకు బాట వేసుకుంటున్నాడు కదా అని తలమునకలుగా వస్తూన్న సంతృప్తి తో కూడిన సంతోషం. ఈ రకంగా మునసబు డాక్టరు వాళ్ళ అట కట్టించాలనే పట్టుదల, తన సత్రం ప్లాను అంతా వాళ్ళు తారుమారు చేశారే అనే పౌరుషం. ఇవన్నీ కలిసి అహర్నిశలూ శేషయ్య కి విశ్రాంతి లేకుండా చేసి, వాసు హాస్పిటల్ ప్రారంభోత్సవ ప్రయత్నంలో అతని ఆరోగ్యానికి కూడా మోసం వచ్చేలా చేశాయి. నీరసం గానూ, అనారోగ్యం గానూ ఉంటూన్న లెక్క చెయ్యకుండా శేషయ్య చురుకుగా పని సాగిస్తున్నాడు. సేవా సదన ప్రారంభోత్సవం ఇంక ఒకటి రెండు రోజులే ఉంది, జరుగుతున్న ప్రయత్నం దేన్నీ కాదనలేక నిస్సహయంగా చూస్తూ ఉండిపోయాడు వాసు. తన సలహా సంప్రదింపులెం లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి. ఆహ్వానాలు కూడా అందరికీ వెళ్లి పోయాయి. అందరికీ అంటే అవతల పార్టీలో ఉన్న వ్యక్తులకి కూడా. కానయితే ముఖ్యమైన ముగ్గురికీ - డాక్టర్ కీ, మునసబు కీ, పంతులు కీ మాత్రం వెళ్ళినట్లు లేదు. కావాలని అవమానం చెయ్యడం కోసమే వాళ్లకి పంపలేదు కరణం వాళ్ళూనూ.
ఇది గ్రహించాడు వాసు. తక్కిన వాళ్ళందరి కీ పంపించడం పంపించక పోవడం అంత ముఖ్యం కాదు. తోటి డాక్తర యిన శంకరాని కైనా పంపించాలి. అది కనీస ధర్మం. అసలు వృత్తి ధర్మం ప్రకారం శంకరం గారిని కలుసుకుని అయన ఆశీస్సులూ, అభినందన లూ కూడా పొందాలి. తను మెడికల్ కాలేజీ వదిలి వచ్చేటప్పుడు ప్రొఫెసర్ అదే చెప్పాడు వైద్య విద్యార్ధుల కందరికీ.
"ఈ వైద్యం అనే పవిత్రమైన వృత్తి ని వ్యాపార దృష్టి తో కాక ఉత్తమమైన సేవా దృష్టి తో సాగించండి. ఇది వ్యాపారం కాదు కనుక . ఇతర డాక్టర్ల తో పోటీపడే నీచ స్థితికి ఎప్పుడూ దిగ జారకండి. ఒకరి కొకరు సహకరించు కుంటూ, ఒకరి నొకరు సంప్రదించు కుంటూ , మానవుల ప్రాణాల్ని రక్షించే ఈ మహత్తర మైన కృషి లో డాక్టర్లు అంతా కొన్ని ఉత్తమ ఆశయాలకీ ఆదర్శాలకీ కట్టుబడి ఉండాలి. వైద్యం అనేది అనుభవం వల్ల అభివృద్ధి చెందే విజ్ఞానం కనుక అనుభవజ్ఞులైన డాక్టర్ల సలహాల నెప్పుడూ తీసుకుంటూ ఉండండి. మీరు ఏ పట్నం లో , ఏ పల్లె లో, వైద్యం ప్రారంభించినా , అంతక్రితం ఆ ప్రాంతంలో ప్రాక్టీసు చేస్తున్న అనుభవజ్ఞుడైన డాక్టరు ఆశీస్సులు , అభినందనలూ ముందుగా అందుకొనడం అత్యావశ్యకం -- వృత్తి లో మీకు పోటీపడే పోటీదారుని గా కాకుండా, చక్కని సలహా ల నిచ్చి మంచి మార్గాన్ని చూపే మిత్రునిగా చూడండి. అటువంటి వారిని ........."
ప్రొఫెసర్ చెప్పిన ఈ చివరి మాటలు విజ్ఞాన ఘంటికలులా చెవులలో నిరంతరం మారు మ్రోగుతూ వుంటే, వాసు శంకరం దగ్గరకు వెళ్ళకుండా ఉండలేక పోయాడు. నాన్నకి తెలియకుండా రహస్యంగా బయలు దేరాడు. బయలుదేరే ముందు అచ్చు అయిన ఆహ్వానం ఒకటి ఏడైనా దొరుకుతుందే మోనని ఇల్లంతా గాలించాడు. వెతగ్గా వెతగ్గా నాన్న సందువా పెట్టెలో అతి జాగ్రత్తగా దాచిన ఓ ఆహ్వాన పత్రిక కనిపించింది. ఎవరికి పంపించడం కోసమో నాన్న దీనిని జాగ్రత్తగా దాచి ఉంచాడు. ఇది పట్టి కెళ్ళి పొతే నాన్న కి కోపం వస్తుందేమో అని ఒక్క క్షణం తటపటా యించి అడిగితె తర్వాత చూసుకోవచ్చని అంతలోనే నిర్ణయించు కొని, ఆ ఆహ్వానం తీసుకుని బయలుదేరాడు వాసు.
వెళ్ళగానే మొదట గుమ్మం లో కనిపించింది మణి. ఒత్తుగా కళ్ళాపు జల్లిన ముంగిట్లో ఒంగుని ముగ్గు పెడుతోంది. గట్టిగా బిగించి వేసుకొని చివర జడ గంటలు ముడేసుకున్న వాలు జడ భుజం మీంచి వాలి ముందుకు పడుతోంది. పైట కొంగు వెనక నుంచు తీసుకుని బోడ్డులో దోపింది. కింద జీరాడ కుండా చీర కుచ్చెళ్లు కొద్దిగా పైగా మోకాళ్ళ దగ్గర మడిచి మోచేత్తో నొక్కి పెట్టి మొగ్గు పెట్టడం లో లీనమై పోయి ఉంది. అందంగా ఉన్న ఆమె పాదాల్నీ, కాలి గోళ్ళకి ఇంకా అంటీ పెట్టుకొని ఉన్న యెర్రని గోరింటాకు గుర్తుల్నీ, కట్టుకున్న సన్నని యెర్ర చీరలోంచి అస్పష్టంగా భాసిస్తున్న పచ్చని శరీర చ్చాయ తాలుకూ దట్టమైన కాంతినీ, మరీ అంత సన్నమూ లావూ కాకుండా శంఖం లా మెరుస్తున్న మెడనీ చెంపల మీదికి వాలి ముద్దు పెట్టుకుంటూన్న చెవి లోలకుల్నీ , పుష్టి గా పొడుగ్గా ఉన్న చేతుల మీద రంగు రంగుల నీడల్ని కవ్విస్తున్న గాజుల్నీ , ఓ ఆకారం అంటూ లేని ముగ్గుని అందమైన రూపాలుగా మలుస్తున్న సన్నని వెళ్ళనీ, చిత్రంగా చూస్తూ ఆ మట్టునే నిలబడి పోయాడు వాసు.
తనముందు పడిన నీడని చూసి తల ఎత్తింది మణి. ఎడం చేతిలో ముగ్గు పళ్ళెం ఉండడం వల్ల కుడి చేతి మణి కట్టుతో కళ్ళ మీద ప్డుతూన్న ముంగురుల్ని వెనక్కి తోసుకుంటూ చక్కని సూటు లో అందంగా ఇమిడి నుంచున్న వాసుని రెప్ప వేయకుండా ఆశ్చర్యంగా చూస్తూ ఉండి పోయింది. "ఎంత ఎదిగాడు వాసు!" అనుకుంటూ ఆమె, "ఎంత అందంగా ఉంది మణి !" అనుకుంటూ అతనూ ఒకరి వైపు ఒకరు చూస్తూ ఒక్క క్షణం మౌనంగా ఉండి పోయారు.
తర్వాత వాసు నవ్వుతూ "ఏం అమ్మాయి గారు కనిపించడమే మానేశారు వారం రోజులయి వచ్చినా?' అన్నాడు . వేలు నోటికి అడ్డం పెట్టి "ఉష్!...నాన్నఉన్నాడు ఇంట్లో" అంది మణి కంగారుతో కూడిన భయంతో.
"ఉండనీ? అసలు ఆయన్ని కలుసుకోడం కోసమేగా వచ్చింది " అన్నాడు వాసు అమాయకంగా.
మణి చిరుకోపం నటిస్తూ "ఓహో అలాగా?....ఇంకా నాకోసం అనుకున్నాను. అవును అన్నట్టు...,మీరిప్పుడు పూర్వం తాయిలారు కాదుగా ?...పెద్ద డాక్టరు !....రండి ...హల్లో కూర్చోండి నాన్నగారిని పిలుస్తాను" అంటూ ఒక్క పరుగు లో లోపలికి వెళ్ళిపోయింది.
మణికి ఎలా సమాధానం చెప్పాలో అర్ధం కాక, నున్నగా దువ్వుకున్న క్రాపు చెరగకుండా సుతారంగా ఒక్క వేలితో తల గోక్కుని , చిన్నగా నవ్వి హాల్లోకి అడుగు పెట్టాడు వాసు కుర్చీలో కూర్చుంటూ తలుపు దగ్గర అయిన చప్పుడుకి తలఎత్తి అటు చూశాడు. తలుపు వెనకగా తప్పుకో బోతున్న సావిత్రి అతణ్ణి చూసి వెంటనే గడప ఇవతలకి అడుగు బెడుతూ 'నువ్వటోయ్ !...పెద్ద డాక్టరు గారు అంటే ఇంకా ఎవరో అనుకున్నాను , చిలిపి పిల్ల " అంది నవ్వుతూ.
వాసు కుర్చీలోంచి లేచి సావిత్రి కి నమస్కారం చేశాడు....
"ఊ!... ఏవిటి బాబూ.....ఆరోగ్యంగా ఉన్నావా? చదువు పూర్తీ అయిందా? అంది. వాసు సమాధానం చెప్పేలోపు గానే ఇంతలో "ఎవరే వస్తా?" అంటూ పొడి బట్ట చుట్ట బెట్టుకొని తల ఇంకా ఓ మూల తుడుచుకుంటూనే శంకరం హాలులోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తూనే సూటులో కనిపించిన వాసుని చూసి తెల్లబోయాడు. ఒక్క క్షణం అతని ముఖంలో ఏదో అసంతృప్తి తో కూడిన నల్లని కెరటం ఒకటి వచ్చి మాయం అయింది.
కొంతసేపటి దాకా ఎవ్వరూ మాట్లాడలేదు.
పిమ్మట శంకరమే తప్పదన్నట్లు "ఊ....ఏమిటి విశేషాలు ?' అంటూ పలకరించాడు.
"ఎల్లుండి సేవాసదనం ప్రారంభోత్సవం ."
'ఊ."
