"పుస్తకాలు చదువుతోంది అవునా ?"
సావిత్రేం మాట్లాడలేదు.
"నేను ఎన్ని సార్లు చెప్పాను ?....ఎన్ని సార్లు చెప్పానంట?....ఆడది ఈ ఇంగ్లీషు చదువులు చదివితే ఎందుకే నా పని చేస్తుందీ ?.... ;లోకంలో చదువుకున్న ఆడపిల్లలు ఎలా ఉంటున్నారో ఎమౌతున్నారో నీకేమైనా తెలుసా ?...."
"అదేమిటండీ ? మీదంతా విడ్డూరం !"
"నోర్మూయ్!....ఇంట్లో నేను చెప్పినట్లు చెయ్యవలసిందే !...ఎదురు తిరిగితే సహించేది లేదు నేను ఒకసారి చదువు కోడానికి వీలు లేదు అన్నాక ఇంక వీలులేదు అంతే!"
సావిత్రేం మాట్లాడలేదు.
"మణి...మణి!" అని గట్టిగా పిలిచాడు శంకరం.
భయపడుతూ వచ్చి నిలబడింది మణి.
"ఇదిగో నీకిదే చెప్పడం -- జాగ్రత్తగా ఉండదలుచు కున్నావా ఉండు. ఈ చదువులూ వ్యవహారాలూ ఇంట్లో సాగిస్తుంటే సహించి ఊరుకునేది లేదు."
మణి తల వంచుకుని నిలబడి ఉంది, ఏం మాట్లాడలేదు.
'అలా నోరు మూసుకుని నిలబడతా వెం?....చెప్పింది వినబడుతోందా?"
మణి కళ్ళు ఎత్తి శంకరం వైపు చూసింది. నీళ్ళు నిండిన ఆ కళ్ళలో ఏదో అసంతృప్తి , భయం , మరేదో ఆవేదన.
"అయినా వేలం వెర్రి ఎక్కి పోతోంది లోకం, వీళ్ళు చదువు తున్నారని వాళ్ళూ, వాళ్ళు చదువుతున్నారని వీళ్ళూ , వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఆడపిల్లల స్కూళ్ళూ అంటూ ఒకటి !....ప్రభుత్వానికి కూడా మతి పోతోంది . హాయిగా ఇంట్లో పనిపాటలు చేసుకోక ఆడదానికి ఎందుకంట చదువు . కిందా మీదా మన్నకుండా పోవడానికి కాకయితే"
నాన్న ఇలా అంటాడేవిటి? లోకం అంతా స్త్రీ విద్య కావాలోయ్ కావాలోయ్ అంటూ ఘోషిస్తూ ఉంటె?....లోకం మాట అలా ఉంది బాబయ్య చెప్పలేదూ...........? రాజమండ్రి లో వీరేశలింగం గారని ఒకాయన ఉండేవారనీ, ఆడవాళ్ళు చదువుకోవడం కోసం అయన ఎన్నో అవకాశాలు కల్పించార నీను-- పోనీ రాజమండ్రి వెళ్లి బాబయ్య దగ్గర ఉండి చదువుకుంటే ....? అవును . అది బాగుంటుంది. తెలియనివి ఏవైనా ఉంటె బాబయ్య చెబుతూ ఉంటాడు. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేక అంతా కష్టపడి స్వంతంగానే చదువు కో వలసి వస్తోంది. ఆదైనా రహస్యం. నాన్నకి తెలియకుండా. ఇంతా నానా యాతనా పడి చదివితే అనక మెట్రిక్ కి కట్టే రోజుకి నాన్న ఒప్పుకుంటాడో ఒప్పుకోడో!....ఇంకేం ఒప్పుకోవడం ......? ఇలా అంటున్న వాడు తనని మెట్రిక్ కట్టనిస్తాడా ? మరేమిటి చెయ్యడం ?.....తనకా చదువుకోవాలనే తహతహ రోజురోజుకి ఎక్కువవుతోంది. కాని తగ్గడం లేదు. ఏవిటి చెయ్యడం ?..........వయస్సు వచ్చిన కొద్ది తనలో విపరీతంగా పెరిగిపోతున్న ఈ విద్యా దాహాన్ని తీర్చుకోవడం ఎలా ?....ఎలా?....ఎలా ?....
మణి ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉండడాన్ని చూసి ఏం ?...నేను చెప్పింది అర్ధం అయిందా ?....చదువు పిచ్చి వదిలి నట్లేనా ?......అన్నాడు శంకరం. అయిష్టంగా తల ఊపి అక్కడ నుంచి కదలి పోయింది మణి.
ఇది జరిగిన తర్వాత ఒకటి రెండు సార్లు శంకరం కోపంగా లేకుండా కొంచెం సౌమ్యంగా ఉన్న సమయం కనిపెట్టి అతణ్ణి సమీపించి తన చదువు సంగతి ఎత్తి, పోనీ బాబయ్య దగ్గరికి వెళ్లి చదువుకోడాని కెనా అతని అంగీకారాన్ని పొందాలని ప్రయత్నం చేసింది మణి. అందుకు సావిత్రి కూడా సహకరించింది . ఉహు....శంకరం అంగీకరించలేదు -- పైగా మండిపడుతూ తాడి ఎత్తున లేచాడు. "ఆ త్రాష్టుడు దగ్గరికి , ఆ కుల భ్రష్టుడు దగ్గరికి ఇక్కడ అన్నగారనే వాడొకడు బతికున్నాడనే సంగతిని మరిచి మసలుతూన్న దోయ్=దౌర్భాగ్యుడి దగ్గరికి వెళ్లి చదువు కుంటావా?.....నీకింకా ఆ చదువు పిచ్చి తగ్గలేదన్న మాట !.....ఒక వేళ తెలివి తక్కువ తనంగా వాడి దగ్గరికి వెళ్ళావో, సిగ పట్టుకుని బరబరా ఈడ్చు కోస్తాను జాగ్రత్త! మీకిద్దరికీ ఇదే చెప్పడం , మళ్ళీ ఈ చదువు సంగతి నా దగ్గర ఎత్తారో చంపేస్తా .......నాకసలే ఈ మధ్యన చిరాగ్గా ఉంటోంది. వెళ్ళండి వెఱ్ఱి వెఱ్రి వేషాలు వెయ్యక ఇంట్లో చచ్చినట్లు పడుండండి" అన్నాడు శంకరం.
"ఈ ఒక్క ఆశా కూడా పోయింది. నిజంగా అంత పని చెయ్యగలడు నాన్న-- ఒకవేళ తెగించి రాజమండ్రి వెళ్ళినా , ఎంత, ఒక గంటలో వెనకాలే వచ్చి లాక్కోస్తాడు ...లాభం లేదు....ఇంతకీ నాకు చదువు కొనే యోగం లేదు... పోనీ నా దగ్గర మావయ్య తిరగ్గోట్టేసిన ఆ రెండు వేలూ ఉన్నాయిగా ?....అవి తీసుకుని ఎవరికీ తెలియకుండా దూరంగా ఏ మద్రాసో బెంగుళూరో పోయి అక్కడ చదువు కుంటే ?....అమ్మ బాబోయ్౧ ...పారిపోవడమే ?......" ఆ రాత్రి అల్లా మణికి నిద్ర పట్టలేదు. రహస్యంగా తన పెట్టి అడుగున ఉన్న ఆ రెండు వేలూ తీసుకుని రాత్రికి రాత్రి కి వెళ్లి పడవెక్కి తెల్లారకుండా రాజమండ్రి వెళ్లి , అక్కడ బాబయ్య కి కూడా కనిపించకుండా రైలెక్కి మద్రాసు వెళ్ళినట్టూ, అక్కడ ఏదో మహిళా పాఠశాల లో ప్రీ మెట్రిక్ క్లాసులోచేరి రోజూ స్కూలికి వెళ్లి వస్తుంటే ..ఒకరోజున ఎవరో రౌడి తనని బెదిరించి పీక నొక్కి తన దగ్గరున్న కాస్త డబ్బూ ఎత్తుకు పోయినట్టూ కల వచ్చి -- కలవరింతలతో- కలత నిద్దరతో అరుస్తూ లేస్తూ పడుకుంటూ అస్థిమితంగా గడిపింది తెల్లారే దాకా మణి.

13
ఒక్క సంవత్సరం కూడా తప్పకుండా నాలుగేళ్ల చదువూ ఆ తర్వాత చెయ్యవలసిన హౌం సర్జనూ అన్నీ పూర్తీ చేసుకుని పల్లె చేరుకున్నాడు వాసు. ఈ నాలుగేళ్ల లోనూ ఊళ్ళో ఎంతో మార్పు వచ్చింది. కలకల్లాడుతూ కళ్యాణ ప్రదంగా ఉండే పల్లె కాస్తా కజ్జాలతో, కార్పణ్యాలతో కురుక్షేత్రం లా తయారయింది. ఊరంతా రెండు పార్టీలుగా చీలి పోయింది. ఊళ్ళో నాలుగు రాళ్ళూ, కాస్త భూపతి ఉన్న రైతాంగం అఅంతా ఒక పార్టీ. డానికి నాన్న నాయకుడు. నాన్నకి పక్కన నిలబడి వత్తాసు పలికే వాళ్ళు వీరాచారి, గ్రామ కరణ మూను. కూలీ నాలీ చేసుకునే అలాగా జనం అంతా మరో పార్టీ. -- వాళ్లకి పైకి కనిపించే నాయకుడు డాక్టర్ శంకరం -- అసలు నిజమైన నాయకుడు మునసబు. ఆ మునసబు పక్క నుండి తాళం వేసేవాడు పంతులు. అటు మేష్టరీ వల్ల, ఇటు ఊళ్ళో నోట్లూ, దస్తావేజు లూ రాయడం వల్లా , గడించిన పది రాళ్ళనీ బీద -బిక్కీ కి వడ్డీల కిచ్చి గుణించి పంతులు దాదాపు పది పదిహేను వేలు దాకా కూడబెట్టాడని ఊళ్ళో ప్రతీతి -- ఇలా ఆలోచించాడు వాసు నిజం కూడా అంతే. శంకరం ఊరికే ఇచ్చే మందులకీ , పంతులు ఇచ్చే అప్పులకి మునసబు చేసే చిన్న చిన్న సహాయాలకి క్రుతజ్ఞులై ఊళ్ళో ఉన్న సన్నకారు జనం అంతా వాళ్ళ పార్టీ లోనే చేరారు. మునసబు పార్టీకి మంద బలం అయితే ఉంది కాని అర్ధ బలం లేదు. వాళ్ళలో కాస్త ఉన్నవాడు పంతులు ఒక్కడే. డాక్టరు దగ్గర కూడా కొంత ఉండి ఉండునా కాని, ఆ మధ్యన కట్టిన ఇంటి కోసం చేసిన అప్పులు తీర్చేయడం వల్లా నాలుగేదేళ్ళ నుంచి శేషయ్య తో తగాదా పడి , పది రాళ్ళు వచ్చే పెద్ద ఇళ్ళల్లో స్థానం పోగొట్టు కోవడం వల్లా రోజూ గడవడమే గగనంగా ఉంది. శంకరం హాస్పిటల్లో జనానికి ఎప్పుడూ లోటు లేదు కాని ఆ వచ్చిన జనానికి మందులు సరఫరా చెయ్యడానికి అతని డ్రాయరు సొరుగు లో డబ్బుకే లోటుగా ఉంటోంది ఈ మధ్య. శ్రమ ఎక్కువై రాబడి తక్కువ రావడంతో శంకరం లో చిరాకూ, పరాకూ నానాటికీ ఎక్కువై పోతున్నాయనీ, అతని పద్దతి చూస్తె ఇన్నాళ్ళు అతణ్ణి దేవుడుగా కొలిచిన జనానికే అసహ్యం వేస్తోందనీ ఆ కూలి నాలి జనం అయినా మరో దిక్కులేక అతని హాస్పిటల్ కి వెళుతున్నారు కాని లేకపోతె ఏనాడో అతని కేకలకి చివాట్ల కి చీదరించుకుని మరో వ్యక్తీ దగ్గరికి వెళ్లి ఉండేవారనీ కరణం గారు నస్యం ముక్కులోకి దట్టంగా ఎక్కించి వేళ్ళు తాటిస్తూ శేషయ్య తో చెప్పడం నాలుగైదు సార్లు విన్నాడు వాసు.
అందుకే కాబోలు తనని బోర్టు కట్టి ఈ ఊళ్లోనే ప్రాక్టీసు పెట్టమని పదేపదే చెప్పసాగాడు నాన్న. అటు శంకరాన్ని దెబ్బ కొట్టి నట్టూ ఉంటుంది. ఇటు తన పార్టీ ని బలం చేసుకున్నట్టూ ఉంటుంది. ఉన్న ఒక్క కొడుకు తన దగ్గర ఉన్నట్టూ అవుతుంది. ఇన్ని మనస్సులో అలోచించి శేషయ్య చెబుతుంటే వాసుకి మాత్రం ఈ పల్లెలో ప్రాక్టీసు పెట్టడం సుతరామూ ఇష్టం లేకుండా ఉంది. ఇక్కడ ఏం సౌకర్యాలు ఉన్నాయనీ, ఆఖరికి ఎలక్ట్రిసిటీ కూడా లేదు. ఆపరేషన్ దియేటర్ లో హరికేన్ లైట్లు పెట్టుకొని కాలక్షేపం చెయ్యాలి. పైగా నలుగురు డాక్టర్లూ ఓ మంచీ చెడూ, సలహాలు , సంప్రదింపు లూ , సహాయాలు ఏం ఉండవు- తనకున్న జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇక్కడ ఈ పల్లెటూళ్ళో ఏం అవకాశాలుంటాయి?.....కొత్త విధానాలూ కొత్త కొత్త పద్దతులు ఏవి తెలియకుండా ఎన్నేళ్ళ యినా కూవస్థ మండూకం లా పడి ఉండాలి . డానికి తోడు ఊళ్ళో పార్టీలతో అసహ్యకరమైన వాతావరణం . ఈ కలుషిత పరిస్థితులు మరింత కలుషితం కాడానికి తను కూడా పరోక్షంగా ఉపయోగపడడం ....ఛీ ...ఛీ ......కల్మషం అయిన ఈ రొంపి లో ఏమైనా తను ప్రాక్టీసు పెట్టకూడదు.
కాని ఎలా ?...నాన్న అలా మరీ మరీ చెబుతూ ఉంటె తను కాదని ఎలాగ అనడం?.....నాన్న మాటని కాదనే పాటి ధైర్యం తనకి ఉందా? ...ఆ దైర్యమే తనకి ఉంటె, శంకరం గారూ, నాన్న తగువు లాడు కున్నారని తెలిసినప్పుడు, అందులో జోక్యం చేసుకుని ఇద్దరికీ ఏదో విధంగా సర్ది చెప్పి రాజీయే చేసి ఉండును. వాళ్ళు రాజీ పడితే బాగుండునే అని కోరికే కాని తాను ధైర్యం చేసి ఇటు నాన్నకి, కాని అటు ఆయనకి కాని నచ్చ చెప్పగలిగాడా?....పోరా! నిన్న మొన్నటి కుర్రాడివి నాకు చెప్ప వచ్చావా అని శంకరం గారు ఎక్కడ అంటారో -- "పెద్ద వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకుండా నీ చదువు ఏదో నువ్వు చదువుకో" అని నాన్న ఎక్కడ కసురు కుంటా డో అని భయమే ఆ యేను, ఇంకా అటువంటిది తనేం చేస్తాడు ?.......అప్పటి మాట అలా ఉంది ఇప్పుడు నేనీ ఊళ్ళో ప్రాక్టీసు పెట్టనని చెప్పగలుగుతున్నాడా తను? ఇంత వయస్సు వచ్చినా ఏమిటో తనకి ధైర్యం లేదు. తనకంటే ఆడపిల్ల "మణి" నయం, ధైర్యంగా చకసికీ అనేస్తుంది.
అన్నట్టు మణి ఎలా ఉందొ, ....తను వచ్చి వారం పది రోజులు కావస్తున్నా ఎప్పుడూ ఇటు రానే లేదు. ఈ మధ్యన ఇటు రావడం లేదేమో!...శేషయ్య గారి ఇంటికి వెళ్ళావంటే కొడతా నని శంకరం గారు అన్నారేమో! వాళ్ళ నాన్న అంటే భయపడి రావడం మానేసి ఉంటుంది. ఆ ...అలాంటి భయాలన్నీ తనకి కాని మణికి లేవు. ఎవర్ని లెక్క చేయదు. భలే ధైర్యం చిన్నప్పటి నుంచీ.
ఇప్పుడు ఎలా ఉందొ ?....నిరుడు శలవలకి వచ్చినప్పుడు కాబోలు కనిపించింది రెండు మూడు సార్లు. ఇప్పుడింకా బాగా ఎదిగి ఉంటుంది. మెట్రిక్ కి చదువు తున్నానంటూ రెండు మూడు పుస్తకాలు తన పాత పుస్తకాల దొంతరంతా వేదికించి పట్టి కెళ్ళింది. పరీక్ష కి కట్టిందో లేదో కనుక్కోవాలి. ఏమైనా మణి నోమాటు కలుసుకోవాలి. చూడాలని ఉంది. ఇటు వస్తే బాగుండును, లేదా నాన్నకి తెలియకుండా ఏదో వంక పెట్టుకుని తానె వెళ్ళాలి. మణితో పాటు అత్తయ్య ని కూడా చూడొచ్చు. ఆవిడని చూసీ మూడు నాలుగేళ్ళు కావస్తోంది. ఇంతకీ ఈ ప్రాక్టీసు గొడవేదో తేలితే బాగుండును. నాన్నని ఒప్పించి పట్నం పోతే హాయిగా ఉంటుంది.
ఈజీ చైరులో కూచుని ఈవిధంగా ఆలోచిస్తున్న వాసు , వీధి లోంచి నాన్న చేతి కర్ర చప్పుడు చేసుకుంటూ దూకుడుగా వస్తూన్న అలికిడి విని కంగారుగా లేచి నిలబడ్డాడు.
శేషయ్య వెనకాలే కరణం, వీరాచారీ. ఎడెనమండుగురు రైతులు కూడా వచ్చారు. అందరి ముఖాలు గంబీరంగా కోపంతో ఘూర్దిల్లుతున్నాయి. మెట్లెక్కి వీధి గుమ్మం చేరేదాకా శేషయ్య మౌనంగానే ఉన్నాడు. గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టబోతూ ఒక్కసారి హటాత్తుగా ఆగి వెనక్కి తిరిగాడు. అది చూచి వెనకాలే వస్తూన్న జనం అంతా మెట్ల మీదే ఆగిపోయారు.
"ఇంత అవమానం జరిగినా నోరు మూసుకొని మనం గాజులు తోడిగించుకుని కూచోడమేనా అని" అన్నాడు ప్రతి అక్షరం లోనూ, నిప్పు రవ్వల్ని దట్టిస్తూ కోపంగా, శేషయ్య మాటలకి ఎవ్వరూ ప్రత్యుత్తరం ఇయ్యలేదు.
"నాలుగేళ్ల క్రితం ఊరు ఉమ్మడి మీద తీర్మానం చేసినప్పుడు తనూ "సై" అన్నాడు కదా ?....ఇప్పుడు ఎలా నాలిక మడతేశాడో చూడండి మునసబు.
