"ప్లీజ్! ఆ విషయం గురించి ఏమీ మాట్లాడకు, సత్యా. ఏమిటో, ఏ కధలలోనో చదివి నట్లుగా, చిత్రమైన కధలో కధ గా అల్లుకు పోయింది నా జీవితం. జరిగినదని తెలిసింది ఒకటైతే -- విన్నది మరొకటి; చూస్తున్నది వేరొకటి; అనుభవిస్తున్నది ఇంకొకటి. ఎటూ ఏమీ నిర్ధారించుకోలేని మతి మాలిన స్థితిలో ఉన్నాను."
"నా పరిస్థితి అలాగే ఉంది. దిక్కు తోచడం లేదు అన్నట్టు, మీ అమ్మగారు కూడా ఎటో వెళ్ళిపోయారట?"
సిగ్గుతో అరుణ వర్ణం పులుముకుంది ధర్మారావు వదనం. "ప్లీజ్. ఆ విషయాలేవీ మాట్లాడవద్దు. వెళ్ళు." ఆవేశంగా అని, కటకటాల కు దూరంగా పోయి వెనుతిరిగి నిల్చున్నాడతాడు. సిగ్గుతో, అవమానంతో, అభిమానంతో కుంగి పోతున్నాడని గ్రహించిన సత్య చేసేది లేక నిట్టుర్చుతూ వెనుదిరిగి పోయింది.
వెళ్ళిపోతున్న ఆమెకు అర్జున్ ఎదురు పడ్డాడు. విచార వదనాలతో ఉన్న ఇద్దరూ ఒకరిని చూచి ఒకరు లేని చిరునవ్వు తెచ్చి పెట్టుకున్నారు.
"ధర్మారావు ను చూచి వస్తున్నారా? ఏమంటాడు?' అన్నాడు అర్జున్.
"అసలు మనస్సు విప్పి మాట్లాడడం లేదు" అండి నిరాశగా.
"వచ్చిన చిక్కంతా అక్కడే. అసలు పెదవి కదిపి పలకడం లేదు; కన్నెత్తి చూడడం లేదు!"
"ఏం చేస్తాము? మనిద్దరం కూడా నిస్సహాయులం. వారికి సహాయం చేయగల స్థితిలో లేము" అంటుండగానే సత్య కళ్ళలో నీళ్ళు నిండిపోయాయి.
"సరి! మీరట్లా నిస్సహాయ పడిపోతే ఇక ఉపాయమేం తోస్తుంది?"
"ఉపాయాలూ, అసలు ఉంటె కదా, తోచేది? నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ని . ధర్మారావు గారికి వ్యతిరేకంగా పని చేయాలి. రాజీనామా ఇచ్చి అయన తరపున చేద్దామని మొదట అనుకున్నాను కాని, నాన్నగారు సుతరామూ అంగీకరించడం లేదు. మీరు సరే సరి పోలీసాఫీసర్ ! ముందే ఆయనకు వ్యతిరేకం."
"ఆగండి, ఆగండి." ఉత్సాహంగా లేచి నిల్చున్నాడు అర్జున్. "సజ్జన సాంగత్యం లో ........" అంటారిందుకే . మీ మాటలలో నాకు కర్తవ్య మార్గం లభించింది."
"ఏమిటది?"
"నేనూ లా పాసయ్యాను. అడ్వొకేట్ గా రెండు సంవత్సరాలు అనుభవం ఉన్నది."
"అయితే?"
"ఈ ఉద్యోగానికి ఇప్పుడే రాజీనామా ఇచ్చేసి, ధర్మారావు కోసం పాటు పడతాను. బై, బై."
"థాంక్యూ." సత్య నేత్రాలలో వేయి కోట్ల జ్యోత్న్సలు వేలుగొందాయి.
ఆ వార్తను పినతల్లికి చెబుదామని అతి ఉత్సాహంగా వచ్చిన ఆమెకు సుమిత్ర చాలా విసుగుగా ఉండడం కనిపించింది. కారు డ్రైవరూ, పని పిల్లా నేరస్తుల మాదిరి గా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. వారి పక్కనే ఒక వ్రుద్దురాలూ, మరో నడి వయసు కుంటి వాడూ నిలబడి ఉన్నారు.
"ఏమిటి, పిన్నీ, కేకలేస్తున్నావు?' అన్నది సత్య.
"చూడమ్మా. వీళ్ళిద్దరూ ఒక్కసారిగా పోతారట పనిలో నుంచి. అదెలా వీలుపడుతుంది?"
"మా బదులు మనుషుల్ని పెట్టె వెళ్ళుతూన్నాము అమ్మాయి గారూ. ఒక్క పదిరోజులు సెలవు ఇప్పించ మంటే అమ్మగారు ఒప్పడం లేదు, చూడండి?" ఫిర్యాదు చేసింది పనిపిల్లా.
"పెట్టావులే మనుషుల్ని. ఈ ముసలిదీ, ఆ కుంటాడూ ఏం చేస్తారూ?' ఈసడించింది సుమిత్ర.
సత్య నవ్వుకుంది. వాళ్ళిద్దరి పైనా పినతల్లికి కోపమెందు కో ఆమెకు తెలుసు. ఇద్దరూ చక్కగా పని చేస్తారని చాలా ఇష్టపడి బాగానే చూస్తుంది. కాని కాస్త తీరిక దొరికితే వాళ్ళిద్దరూ అట పాటలతో, సరసాలతో , కబుర్ల తో కాలం గడుపు తుండడం మాత్రం సుమిత్రా దేవికి బొత్తిగా నచ్చక, కోప పడుతుంటుంది. కుర్రకారు బొత్తిగా ఇలా పాడై పోవడానికి కారణం సినీమా లేనని కూడా ఆమె వ్యాఖ్యానిస్తుంటుంది.
"అయితే, ఇప్పుడు మీకు సెలవెందు కురా?" అని అడిగింది సత్య.
"తిరుపతి పోయి, ఏడుకొండల స్వామి దగ్గర పెళ్లి చేసుకుందామని , తల్లీ."
"వెరీ గుడ్. అయితే ఇచ్చెసెయ్యి పిన్నీ. ఇటువంటి వాటికి అభ్యంతరాలు పెట్టకూడదు."
"చాల్లేవే, చెప్పొచ్చావు! వాళ్ళంతట వాళ్ళే, పోయి పెళ్లి చేసేసు కోవడమే?"
"శ్రీరామ చంద్రా!" తల పట్టుకుంది సత్య. "మరి వాళ్ళ కిక పెద్దవాళ్ళు లేరే?"
"లేకపోవడ మేమిటి? నేను లేనూ? నీ పెళ్లి చేసి, వధూవరు లిద్దరినీ తిరుపతి తీసుకొచ్చి మొక్కు తీర్చు కుంటానని దణ్ణం పెట్టుకున్నాను. ఈ వేసవి లో నీ పెళ్లి ఎలాగూ చేయదలుచు కున్నాను. అప్పుడు మనతో పాటే వాళ్ళనూ తీసుకెళ్ళి అక్కడ ముడి వేయించేస్తాను."
సత్య వస్తున్న నవ్వును అపుకొంటూ పని పిల్ల వైపూ చూచింది. దాని ముఖం లో స్పష్టంగా కోపం కనిపించింది. "ఏంటండమ్మ గారూ, మీదంతా యిడ్డూరం కూత ఊసులాడుకుంటుంటే, పెళ్ళికి ముందు మాటలే కూడదంటారు. పెళ్లి సేసుకుంటా మంటే అది కుదరదంటారు. ఎలాగ? ఇంకా ఏడెనిమిది నెలలు నేను గమ్మునుండలేను. మీరు సెలవు యిచ్చే తీరాల." ఖండితంగా చెప్పేసింది.
సత్య నవ్వుతూ అంది "ఇస్తారు లేవే. గంతులేయ్యకు. చూడు, అమ్మగారెంత మంచివారో! సెలవే కాదు; ఇప్పుడు నీ పెళ్ళికో వంద రూపాయలు బహుమానం కూడా ఇస్తారు" అంటూ "ఇయ్యి, పిన్నీ, పాపం చిన్నప్పటి నుంచీ మన ఇల్లు కనిపెట్టుకొని ఉన్నవాళ్ళే గా?' అంటూ తన హేండ్ బాగ్ లో నుంచి ఓ వంద రూపాయల నోటు తీసి పినతల్లి చేతిలో ఉంచింది.
"అయ్యో, అంత డబ్బే!" అనబోయిన సుమిత్ర డబ్బు తనది కానందు వల్లా, ముఖ్యంగా సత్య ఆ బాధ్యత ను తన మీద పెట్టి తన పెద్దరికాన్ని నిలుపుతున్నందు వల్లా అమితంగా మురిసిపోయి, అసలు అభ్యంతరాన్ని మరిచిపోయి ఆ డబ్బు వాళ్ళ చేతిలో ఉంచుతూ, "లక్షణంగా పెళ్లి చేసుకుని త్వరగా రండి" అని దీవించింది.
పడిపడి దణ్ణాలు పెడుతూ, సత్యకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకొంటూ వెళ్ళిపోయారు, ఆ కాబోతున్న దంపతు లిద్దరూ.
"ఏమేవ్, పెళ్లి చేసుకుని అంతా మరిచిపోక. త్వరగా వచ్చెయ్యి" అని హాస్యంగా హెచ్చరించింది.
"ఎందుకు---ఈ కుంటోడు, ముసిల్దీ ని? వీళ్ళెం చేస్తారు? తీసుకు పొండి. ఓ పది రోజుల పాటేలాగో తంటాలు పడతాను" అంది సుమిత్ర.
"ఒక్కసారి నా చేతి వంట రుచి చూడండమ్మాగారూ. ఆ పైన నేను పోతానన్నా మీరు పోనివ్వరు" అంది ఆ ముసలమ్మ సమ్రంగా.
కుంటి మనిషి ఈసారి ఊరుకోలేదు. గయ్యి మన్నాడు . 'అమ్మగారూ! నేను ముసిలోడిని , కుంటోడి ని అని హేళన చేస్తున్నారా? మరి ఇక చూసుకుందురు గాని, నా తడాఖా. ఎక్కడైనా తప్పుగా కనిపించిందా, దొంగోళ్ళు, అట్లాంటోళ్ళు, ఇట్లాంటోళ్ళు గానీ వచ్చారా కైమా కైమా చేసేయనూ?"
"ఆ ఆ చేసేటట్టె ఉన్నావు!" సుమిత్రా దేవి ఎగతాళి."
"ఏంటండమ్మ గారూ, అంత సిరాకు? ఇప్పుడంటే ఇలా ఉన్నాను గానీ , ఓ! ఎట్టా ఎట్టా జడిపించేసేవోడిని, అందరినీ! నాకు కారు డ్రైవింగు వచ్చు. ఈత వచ్చు, చదువు వచ్చు , పాట వచ్చు, అట వచ్చు" అంటూ కుంటి కాలితో ఎగిరెగిరి తైతక్క లాడుతుంటే సత్య మరి మిన్నకుండలేకపోయింది.
'అబ్బబ్బబ్బ! అపు చెయ్యి. ఎందుకు, నాకు నీ క్వాలిఫి కేషన్సన్నీ? పోయి ఆ కారు షెడ్ లో ఊడ్చి శుభ్రం చెయ్యి." తాళాలు గిరవాటేసి తన గది వైపు దారి తీసింది.
"చిత్తం, చిత్తం . అమ్మాయిగారెందుకో శానా కోపంగా ఉన్నారు .' కుంటూ కుంటూ నిష్క్రమిస్తున్న అతడిని చూచి నవ్వుకుంది సత్య-- పాపం, మంచివాడు!' అని.
తన గదిలో ఒంటరిగా కూర్చుని ధర్మారావు విషయం ఆలోచిస్తుండగా కాఫీ తో కుంటి కన్ణా ప్రవేశించాడు.
"అక్కడ పెట్టి వెళ్ళు" అంది సత్య.
"ఊహు, ' అంగీకరించ లేదు కన్ణా. "మీరు పెద్ద ఉద్యోగస్తులు. ఆలోచనలతో తాగడం మరిచిపోతే."
"భలేవాడివే." నవ్వుతూ కప్పు చేతికి తీసుకుంది సత్య.
"అద్గదీ. మీరు తీసుకుంటుంటే నేనిక్కడ బొమ్మలు చూసుకుంటూ కూర్చుంటాను." ఏదో బొమ్మల పుస్తకం తిరగవేస్తూ కూర్చున్న అతడిని పరీక్షగా చూచింది సత్య. ఏమిటో, అదివరలో ఎక్కడో చూచినట్టే అనిపించింది. ఆకారణం గానే అపరిమితమైన అభిమానం ఏర్పడగా, "ఇదివర కెక్కడ పని చేశావు?' అని అడిగింది.
"మిలిటరీ లో పని చేశానమ్మాయి గారూ, మిలటరీ !" సగర్వంగా చెప్పుకున్నాడు కన్ణా.
"నువ్వా?"
"అవునండమ్మాయి గారూ." అంతలో దీనంగా మారిపోయాడు కన్ణా. "ఇప్పుడు కాదు శానాకాలం కిందట. నా ఖర్మం కొద్ది కాలు విరిగిపోయింది. అక్కడక్కడ అందరి దయా ధర్మాలతో బతికాను. ఇక ఇప్పుడు ఇలా ఏదో పని చేసుకు బరుకుదామని బయలు దేరాను."
"పాపం"! సానుభూతి చూపింది సత్య . "నీ కెవ్వరూ లేరా?"
"లేరు. తల్లీ. ఒక్క ఆడపిల్ల ఉండేది. ఉంటె మీ మాదిరి గానే ఉండును. మిమ్మల్ని చూడగానే ఆ బాధ అంతా పోయింది. ఎప్పుడూ నన్ను పొమ్మని అనకండి . తల్లీ."
సత్య మనస్సంతా జాలితో నిండి పోయింది. రవీంద్ర నాద్ ఠాగూర్ కాబూలీ వాలా' మెదిలింది. "అనను. ఎప్పుడూ దగ్గరే ఉందు గానిలే."
అంతలో సుయోధన్ ప్రశ్నించాడు -- "ఎవరది?' అంటూ.
"కొత్త నౌఖరు , నాన్నా. పాత వాళ్ళిద్దరూ పది రోజులు సెలవు తీసుకున్నారు."
"బాగానే ఉంది. కానీ బొత్తిగా ఇటువంటి ఏమాత్రమూ "కేరాఫ్" లేని వాళ్ళను నమ్మి, ఇంటి పనికి పెట్టేసు కుంటే ఎలా?"
"నీదంతా వట్టి అనుమానం, నాన్నా ." తేలికగా నవ్వేసింది సత్య.
"బాబూ! మీకే తెలుస్తాది గా ముందు ముందు, నేనవరినో?' అంటూ వంగి వంగి సలాములు చేసి నిష్క్రమించాడు కన్ణా.
తండ్రి కూతుళ్ళు సావకాశంగా కూర్చున్నారు.
"ఏమమ్మా, కేసు విషయం అంతా చదివావా?' ప్రశ్నించాడు కుమార్తె ను.
".........."
"ఒంట్లో బాగా లేదా, అమ్మా?"
"బాగానే ఉంది, నాన్నా.' నిట్టూర్చింది . "కాని నాకు విముక్తి కావాలని చెప్పాను కదా?" రేపే ఈ ఉద్యోగం వదిలెయ దలుచు కున్నాను."
నవ్వేశాడు సుయోధన్. "అది తర్వాత. ఇప్పుడు నీమీద నేనొక పెద్ద బాధ్యత ఉంచుతున్నాను."
సత్య మాట్లాడలేదు.
"చూడు, సత్యా. "కుమార్తె తల నిమురుతూ అనునయంగా అన్నాడు సుయోధన్. "నా గతం అంతాఈ గౌతమ్ కేసుతోనే అల్లుకు పోయి ఉన్నదమ్మా."
"అవును. అయితే , అదంతా గతించి పోయింది కదా, నాన్నా?"
"లేదమ్మా. ఇటువంటి వాటిలో ఎప్పటి కప్పుడే నిత్య నూతనమైన మెలకువలతో మెలగాలి. ఆ గౌతమ్ పాము-- తాచు పాము! ఎప్పటి కప్పుడు తన నేరాన్ని నా మీద రుద్దాలనే చూచాడు. ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాడు."
"ఆ!"
"ఆవును.... నువ్వు రికార్డంతా చదివావు కదా?"
"చదివాను. కాని ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చు నని నా అనుమానం. ఆ గౌతమ్ ను చూస్తె......"
నవ్వేశాడు సుయోధన్. 'అవునమ్మా. ఆ గౌతమ్ ను చూస్తె -- నీకే కాదు, ఎవరికైనా అటువంటి సదభిప్రాయమే కలుగుతుంది."
".........."
"చూడు, సత్యా. ఇన్ని మాటలెందుకు? తండ్రిగా నా మీద నీకు గౌరవం , నమ్మకం ఉన్నాయి కదూ?"
అదిరిపడింది సత్య. "అదేమిటి , నాన్నా?"
"అంతే మరి. ఇక్కడి నుండి పారిపోయాక గౌతమ్ మద్రాసు వెళ్ళాడట. అక్కడ అర్ధరాత్రి మన ఇంట్లో ప్రవేశించి , దేనికోసమో వెతుకుతుండగా పట్టుబడి పోయాడట."
"ఏమిటీ?' యెగిరి పడింది సత్య. 'అయితే గౌతమ్ దొరికి పోయాడా? ఇప్పుడెక్కడున్నాడు?"
"హు! అంత తేలికగా దొరికి పోతాడా! పట్టుకోవటానికి ప్రయత్నించిన గూర్ఖా ను పడదోసి , గాయపరిచి పారిపోయాడట."
"ఆశ్చర్యంగా ఉందే!"
"ఆ! అదే మరి! అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. నీ శాయశక్తులా వాదించి, ఈ ధర్మారావు కు పెద్ద శిక్ష , సాధ్యమైనంత పెద్ద శిక్ష పడేటట్లు చేస్తే, ఆ గౌతమ్ ఎక్కడ ఉన్నా వచ్చి తీరుతాడు. లేదా, గౌతమ్ బతికి ఉంటె, ఎక్కడా ఉన్నా, ఎప్పటి కైనా నాకు ప్రమాదమే.
ఒక్కసారిగా గౌతమ్ పట్ల క్రోదాసహ్యాలు నిండిపోయాయి సత్య మనసులో. "వయో ముఖ విష కుంభం! ఇంతటి వాడిని అనుకోలేదే ఎన్నడూ?" అప్రయత్నం గానే అనేసింది సత్య. "ఇటువంటి దేశద్రోహి ని మట్టు పెట్టడానికి అందరం శాయశక్తు లా ప్రయత్నించ వలసిందే."
తృప్తిగా నవ్వుకుంటూ నిష్క్రమించాడు సుయోధన్.
