36
సత్య కు ఆలోచించిన కొలదీ తల తిరిగి పోసాగింది. "ఛ, ఏమిటి , ఈ ధర్మారావు చరిత్ర? తల్లీ, తండ్రీ , తనూ అందరూ వంచకులే దేశ ద్రోహులే! గౌతమ్ కారాగారం లో ఉంటె ఆ తల్లి నారాయణ స్వామితో చేరి ధర్మారావు ను పెంచి ప్రయోజకుడు గా చేసిందా? పైగా గౌతమ్ ఉన్న జైలు కే సూపరింటెండెంట్ గా తెచ్చిందా? ఎంతటి ఆడది! పలనాటి నాగమ్మ, అలనాటి యుగంధరుడూ కూడా ఈమె వద్ద తీసి కట్టేనా? ఎంతటి దేశ ద్రోహం! ఛీ. వ్యక్తిగత మమకారాలు ఉంటె ఉండు గాక! అయినా ఇటువంటి నీచుల పై ఇక మమకారమేమిటి? తేలియక అమాయకంగా ప్రేమించాను. న్యాయ, ధర్మ నిర్వహణ లో వ్యక్తిగత ప్రేమలకు తావు ఉండరాదు......అయినా ఇంకా అతడి పైన ప్రేమేమిటి?"
మొత్తం మీద ధర్మారావు కూడా చాలా దుర్మార్గుడు , వంచకుడూ అని సత్య నిర్ణయించింది.
కాని అమెది స్త్రీ మనస్సు. ఆమె అనమతి తో నిమిత్తం లేకుండానే మనసులో పూర్వాపర సంఘటనల మీమాంస , తర్క వితర్కాలు జరిగి పోతున్నాయి.
"సత్యా, నేను అనాధ శరణాలయం లో పెరిగిన వాడిని. హీనుడిని. నాతొ నీకు స్నేహం తగదు" అని ఎంత గౌరవంగా చెప్పాడు! తానెంత కవ్వించినా, ఎంత దూరంగా ఉండేవాడు! కారాగారం లో మగ్గిపోతున్న నిర్భాగ్య జీవుల కోసం ఎంతగా పరితపించే వాడు! ఎటువంటి ఉత్తమ హృదయుడిగా , ఉన్నత పురుషుడి గా భావించి అతడితో స్నేహం చేసింది తను! అతడి అసలు స్వభావ మేమిటో ఎలా తెలుస్తుంది? 'భగవాన్! విషమ పరిస్థితులలో ఇరుక్కో బెట్టి ఎందుకిలా వినోదిస్తావు? మనుష్యులు మట్టి బొమ్మలు కాదయ్యా. సున్నితమై, దెబ్బ తగలగానే సోట్టలు పడే మృదు హృదయాన్ని కూడా అతికించావు కదా మరి?'
తాత్కాలిక బాధోపశమనానికి విహరమేగిన సత్యాదేవి నది ఒడ్డున అర్జున్ తటస్థ పడ్డాడు. సత్య పలకరించక పోయినా అతడే వచ్చి, పలకరించి చెంత కూర్చున్నాడు.

"ఏమండోయ్! మీరు ఓడిపోతారని చెప్పడానికి చాలా చింతిస్తున్నాను" అన్నాడు పరిహాసంగా. అంతలోనే గంబీరంగా మారిపోతూ ":ధర్మారావు గురించిన కొన్ని రహస్యాలు చెబుతున్నాను, వినండి. అసలు చెప్పకూడదు కాని, ఎదురెదురు ప్లీడర్ల మైన మనకు ఇద్దరికీ అతడి పై సమాన గౌరభిమానాలు ఉన్నాయి గనక చెబుతున్నాను. ధర్మారావు తప్పక నెగ్గి, విడుదలవుతాడు చూడండి."
నది అలలను తిలకిస్తున్న సత్య వదనం లో ఏ భావమూ ద్యోతకం కాలేదు.
"ఏమండీ, మాట్లాడరు?' తనను ఆమె అభినందించగలదని ఆశించిన అతడు, ఆశాభంగం కాగా, చిన్నబోయిన వదనం తో నీళ్ళు గారి పోతూ ప్రశ్నించాడు.
"మీ మాటకు అదివరలో అయితే చాలా సంతోషించే దాన్ని కాని, ఇప్పుడు కాదు."
"అదేమిటి?' షాక్ తిన్నట్లు అడిగాడు అర్జున్.
"అవును. అతడు ఒకప్పుడు స్నేహితుడే. కాదు. స్నేహితుడని భ్రమ పడ్డాను. ఇప్పుడు దేశ ద్రోహి గా గుర్తించాను. కలనైనా అతడికి మేలు తలపరాదు." సత్య ముఖ కవళికలలో ఒలవైపున వ్యక్తిగత ప్రేమ, మరొక వైపున దేశాభిమానం పోటీ పడుతూ విషాదం లో ముంచడం స్పష్టంగా కనిపించిందతడికి.
"అయితే అతడు దేశ ద్రోహి నని మీరు నిర్ణయించారా?" నివ్వెరపోతూ , తన చెవులను తానె నమ్మలేనట్లు గా తగ్గు స్వరం లో ప్రశ్నించాడు. "హు! ఏం? ఇంకా అనుమానమా?"
"తొందర పడకండి. సత్యాదేవీ. నిదానించండి."
నెమ్మదిగా, స్పష్టంగా అన్నది సత్యాదేవి. "నిదానించి ఆలోచించే ఇప్పటికి నిర్ణయించాను. లేకుంటే నలుగురి తో పాటు ఏనాడో నిశ్చయించేసి ఉండును."
"లేదు, సత్యాదేవీ. ఈ విషయం లో నేను మీకు పూర్తిగా వ్యతిరేకం. "స్థిరంగా , నమ్మికతో అన్నాడు అర్జున్. "వెయ్యి మాట లెందుకు? ఈ ఒక్క విషయం చూడండి. అతడి పై కత్తి విసిరిన వాళ్ళు ఎవరో స్పష్టంగా తెలిసినప్పటి కి కించితపకారం చేయని మహా సాత్వికుడు ధర్మారావు. ఆనాటి నుండే నేను పూర్తిగా అతడిని ప్రేమించడం మొదలు పెట్టాను. నిశ్చయంగా అతడు ఉత్తముడు, ఏ పాపం ఎరగడు. అయితే, ఏదో విష వలయం , పాపం, అతడి జీవితాన్ని చుట్టి వేసింది. దాని నుండి విముక్తి కలిగించి. అతడి ఉన్నతాదర్శాలతో తిరిగి ప్రజలను బాగు చేయగల అవకాశం నేను కల్పిస్తాను. సత్యాదేవీ. ఇందుకు నేను బద్దకంకుణుడిని."
నిర్లక్ష్యంగా నవ్వింది సత్య. "సరే, అయితే ఇక మనిద్దరం ఎదురెదురన్నమాట! చూచుకుందాం బలాబలాలు."
అర్జున్ కూడా నిర్లక్ష్యంగా నవ్వాడు. "బెదిరిస్తున్నారా? నాకేం భయం లేదు."
"బెదిరింపు లేదు కాని, స్నేహన హెచ్చరిస్తున్నాను. ఈ కేసు విషయం లో ముఖ్యంగా మా నాన్నగారి ప్రమేయం ఉంటుంది. అయన మాజీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు........"
"ప్రస్తుతం ప్రభుత్వం చే సగౌరవంగా ఆహ్వానించబడిన మిలటరీ ఉద్యోగి!" అర్జున్ పూర్తి చేశాడు సత్య మాటలను. అలా అంటూనే తేలికగా నవ్వేశాడు. "తెలుసు, సత్యాదేవి, అన్నీ తెలుసు. నాకు ఇంకా చాలా -- మీకూ, మీలాంటి వారెవరికీ తెలియని అనేక విషయాలు -- తెలుస్తున్నాయి. అవన్నీ ఇవ్వాలనీ , సలహా అడుగుదామనీ, సలహా ఇవ్వాలనీ కూడా అత్ర పడ్డాను. కాని...........కాని సత్యాదేవి!' భారంగా నిట్టూర్చాడు అర్జున్. "మీరింత కఠినత్మకంగా , ఇలా మారిపోతారని ఊహించ నైనా ఊహించ కుండా వచ్చాను. మీ తీరు చూచాక అవన్నీ చెప్పకపోవడమే మంచిదని పిస్తున్నది . సెలవు."
"అయితే ఈసారి నన్ను మీరు బెదిరిస్తున్నారా?' ఓరగా అతడిని చూస్తూ అడిగింది సత్య.
అర్జున్ ఆమెను పరీక్షగా చూస్తూ అడిగాడు: 'అయితే, మీరెందు కింతగా , ఇలా మారిపోయారు , సత్యాదేవీ? నేను తెలుసుకోవచ్చా?"
ఒక్క తడవు ఆగి, అన్నది సత్య; "చాలా ఆధారాలు కనిపించాయి ----ప్రత్యక్షం గానూ, పరోక్షం గానూ . అవన్నీ కోర్టు లోనే తెలుస్తాయి. మీరన్నట్టు మనం వ్యతిరేకం కనక, ఇంతకూ మించి చెప్పుకోకపోవడమే మంచిది."
సత్య దీర్ఘంగా నిట్టూర్చడం , ఆమె కను కొలకులలో నీరు నిలవడం గమనించిన అర్జున్ , పోబోతూ మళ్ళీ వెనుతిరిగి అన్నాడు ఆత్మీయ స్వరంతో: "సత్యాదేవీ! ధర్మారావు కూ, మీకూ ఉన్న స్నేహం నాకు తెలుసమ్మా. ప్రస్తుతం మీ మనస్సులోని బాధనూ, సంఘర్షణ నూ నేనర్ధం చేసుకోగలను. అలాగే అగ్నిపరీక్ష లేదురవుతాయి తట్టుకోవాలి. మీ నమ్మిక సరయిందని మీ భావం. నా అభిప్రాయం పై నాకు విశ్వాసం కాని, ఇద్దరమూ ధర్మ పధాన్నీ నమ్మాము. ఫలితమే మన అనుమానాన్ని నివృత్తి చేయాలి. మనమేమీ చేయలేము , ప్రస్తుతం."
"థాంక్స్, నీరస స్వరంతో అన్నది సత్య.
"మరొక్క మాట ఫలితాలెలా ఉన్నా మన వ్యక్తిగత స్నేహానికి ఆటంకం ఉండదని మాట ఇస్తున్నాను. ఉండరాదని మిమ్మల్ని కోరుతున్నాను."
"అలాగే."
అర్జున్ నిష్క్రమణా నంతరం సత్య శోకం చూసిన కఠిన శిలలు సైతం కన్నీరు కార్చాయి.
37
కోర్టులో కేసు మంచి పట్టు లో సాగుతుంది. అధికార, అనధికార, సామాన్య , ఉన్నత వర్గాల వారందరినీ ఈ సంఘటన ఆకర్షించింది. ప్రతి రోజూ కోర్టు జనంతో కిక్కిరిసి పోతుంది.
అడిగిన విషయాలకు ముక్తసరిగా జవాబు చెబుతూ, బోనులో బొమ్మలా నిల్చుంటున్నాడు ధర్మారావు, దృష్టి ఎటూ తిప్పకుండా. న్యాయమిత్ర కేవలం తన విధ్యుక్త ధర్మ నిర్వహణ కోసం న్యాయ పీఠాన్ని అలంకరిస్తున్నాడు. కేవలం పాషాణం లాగా, యంత్రం లాగా ప్రభుత్వం తరపున వాదిస్తున్నది సత్యాదేవి. ధర్మారావు దేశ ద్రోహి అని నిరూపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నది.
"యువరానర్! ఈ ధర్మారావు కేసు విచారణకు పూర్వం ఇతడి పుట్టుపూర్వోత్తరాలను పూర్తిగా తెలుసుకొనడం ఆవశ్యకం.
"ఈ ధర్మారావు ఒక అనాధశ్రమం లో పెరిగి పెద్దవాడైన వ్యక్తీ. ఆ అనాధ శ్రమ నిర్వహకులెవరు/ నారయణస్వామి."
అర్జున్ లేచి అభ్యంతరం తెలిపాడు. "ధర్మారావు అధీనం లో ఉన్న ఖైదీ పారిపోవడాని కీ , ఈ చరిత్ర కూ ఏమీ సంబంధం లేదు."
"అభ్యంతరం తోసి వేస్తున్నాను." న్యాయాధికారి మిత్రా అన్నాడు.
అర్జున్ తప్పనిసరిగా కూర్చోవ వలసి వచ్చింది.
సత్య వాదం కొనసాగించింది. "ధర్మారావు పూర్వ చరిత్రకూ, ప్రస్తుతం పారిపోయిన ఖైదీ కి సంబంధం ఉన్నది గనకనే వాదన అటు తిప్పవలసి వచ్చింది." అంటూ గర్వంగా ఒక్కసారి అర్జున్ వైపు చూచి, తిరిగి ప్రారంభించింది సత్య. 'ఆ ఆశ్రమ నిర్వాహకుడు నారాయణ స్వామి, ప్రస్తుతం పారిపోయిన ఖైదీ గౌతమ్ ఒకనాటి మిత్రులనే విషయాన్ని కోర్టువారు గమనించాలి. గౌతమ్ భార్య రాజ్యలక్ష్మీ దయామయి అనే పేరుతొ ఆ ఆశ్రమం లోనే ఆయాగా ఉండేది. ఈ దయామయి గౌతమ్ ల పుత్రుడే అయిన ధర్మారావు ను ఆ ఆశ్రమం లో రహస్యంగా పెంచారు. వారిని చూచుకోవడానికే గౌతమ్ అప్పుడప్పుడు జైలు నుంచీ పారిపోతుండేవాడు."
