
తండ్రి రాకను గమనించని ఆమె "ఏమమ్మా, అలా ఉన్నావు?' అనే సుయోధన్ ప్రశ్న వినగానే లేచింది.
"నాన్నా! ఒక్క కోరిక తీరుస్తారా?"
కన్నీళ్ళ తో అర్ధిస్తున్న ఆమెను అక్కున చేర్చుకుంటూ, "అడుగు తల్లీ. నా చిట్టి తల్లి కోరిక కంటేనా? కాని, చూడూ, ధర్మారావు మీద దయ తలచమని మాత్రం అడగకేం?' అన్నాడు.
"అది కాదు."
"ఓ! ఇంకేదైనా సరే. అడుగు."
"నేనీ ఉద్యోగం చేయలేను, నాన్న. నాకు విముక్తి కలిగించు." దీనంగా అన్నది.
"అంతేనా? అదొక్కటేనా?" తేలికగా ప్రశ్నించాడు సుయోధన్.
"అంతే, నాన్నా. అదొక్కటే.' ఆశగా తండ్రిని చూస్తూ అంది.
"అల్ రైట్. అలాగే."
తన చెవులను తానె నమ్మలేక పోయింది సత్య. "నాన్నా! నిజమా? నిజంగా నాకు విముక్తి లభించిందా?"
"అవును" అంతలో సుయోధన్ గంబీరంగా మారిపోయాడు. "లభిస్తుంది. కాని, ఇప్పుడు కాదు."
"ఆ."
"అవును. ఆ ధర్మారావు కేసు పూర్తీ కావాలి. అప్పుడు. అంతవరకూ మాట్లాడకు."
క్రుంగి పోయింది సత్య.
"ఈ చిన్న ఉద్యిగం నీకు తగినది కాదని నాకూ తెలుసు. హైకోర్టు జడ్జిగా నిన్ను చూచుకోవడం నా ముఖ్యమైన కోరిక. ఈ ధర్మారావు గాడి వంటి వాళ్ళని ఎందరిని ఉరి తీయించాలో నువ్వు?"
పిడుగుల వాన కురుస్తున్న భ్రమ కలిగింది సత్యకు.
"చూడు, ఇంకా నా తల్లిని ఎంతెంత ఉన్నత స్తానా అధినసింపజేస్తానో !" కుమార్తె ముఖ కవళికలు గమనించ కుండానే నిష్క్రమించాడు సుయోధన్.
భోజనానికి రమ్మని సుమిత్ర సత్యను ఎంత బతిమాలినా లాభం లేకపోయింది.
షికారు నుంచి తిరిగి వచ్చిన మిత్రా అర్ధం చేసుకో గలిగాడు, సత్య మనో గత స్థితిని. నేరుగా ఆమె గదిలోకి వెళ్ళాడు.
టేబిల్ పై తల వాల్చి కళ్ళు మూసుకుని ఉన్న సత్య, ప్రేమ పూరిత హస్త స్పర్శకు మెల్లగా కండ్లెత్తి చూచింది.
మిత్రాను చూడగానే ఆమె దుఃఖం పెల్లుబికి పోగా, "బాబాయ్!" అని కన్నీరు కారుస్తూ అతనికి చుట్టుకు పోయింది.
మిత్రా మనస్సు ద్రవించి పోయింది. "ఏమిటమ్మా ,. ఈ అధైర్యం?' అని లాలించ ప్రయత్నించాడు.
"నేనీ ఉద్యోగం చేయలేను, బాబాయ్." అంటూ తన బేలతన మంతా ప్రదర్శించింది.
"ఏమమ్మా? ధర్మారావు కు వ్యతిరేకమనేనా?"
సత్య మాట్లాడలేదు.
"చూడు. సత్యా ." ఎదట గోడ మీద ఉన్న బుద్దుని తైల వర్ణ చిత్రం పై చూపులు నిగిడ్చి గంబీరంగా అన్నాడు మిత్రా: "మనం విపత్కర పరిస్థితులలో విమర్శనా జ్ఞానాన్ని కోల్పోరాదు. న్యాయం, ధర్మం అంటే ఏమిటి? అవి ఒక్క మనిషివేనా? కాదు.....కాదు, సత్యా, ప్రపంచం లోని మానవులందరికీ సంబంధించినవి. లోకమంతటి నీ నడుపుతున్న చక్రాలు ఆ రెండూ. అవి విరిగిపోతే లోకమే లేదు. అవి గాడిలో పడితే, కూరుకు పొతే మరి ప్రపంచమే నడవదు. వాటిని సక్రమంగా నడిపించే చుక్కాని చట్టం. ఈ చట్టం సేవకు ఎప్పుడైతే ఒకసారి తల ఒగ్గామో, అప్పుడే వ్యక్తిగత ప్రేమానుబంధాలను త్యజించాలి, సత్యా!"
భయంకర రాక్షసిని చూచినట్టు భయ విప్పరిత నేత్రాలతో చూస్తూ, "వద్దు, బాబాయ్, వద్దు" అని ఆవేశంగా బిగ్గరగా అరిచింది సత్య." ఈ చట్టమూ, లోకమూ ఏమీ వద్దు నాకు. నా దారిన నన్ను పోనివ్వు. ఏ ఏకాంత ప్రదేశం లోనో ఈ విషమ సమస్య లకూ, కుత్సిత ప్రపంచానికీ దూరంగా గడిపేస్తాను. నీలాగా నేను ఈ పరిస్థితులను తట్టుకోలేను. జరుగుతున్నవీ, జరగబోయేవి వినలేను; కనలేను; సహించలేను, బాబాయ్ , సహించలేను." అంత కంతకు ఆమె దుఃఖ స్వరం తారాస్థాయి ని చేరుకొంటుంది.
మిత్రా ఆమెను అనునయంగా దగ్గరకు తీసుకుని వెన్ను సవరిస్తూ అటూ ఇటూ చూచి చెప్పాడు రహస్యంగా: "చూడమ్మా, ధర్మారావు నిజమైన నేరస్తుడు కాదని నా అభిప్రాయం. కేవలం అభిప్రాయం మాత్రమే!"
దుఃఖించడం మాని ఆశగా, ఆశ్చర్యంగా చూడసాగింది సత్య.
"వ్యక్తిగతంగా నాకూ అతడి విషయం లో చాలా బాధగా ఉంది సత్యా. నాకు ఉద్యోగ రీత్యాయే కాని, ప్రత్యేకంగా అతడి పై విరోధం లేదని తెలుసుకో. ఈ కేసు విషయం పూర్తిగా తెలిసిన నువ్వు చదువు కొని వారిలాగా, తెలియని వారిలాగా గాలి వార్తలను ఆధారం చేసుకొని బాధ పడడ మేమిటి?"
"నన్ను మరిపించుదామను కొంటున్నారా? మరణ శిక్ష పడగలదని ఇందాక మీరే స్వయంగా అన్నారుగా?"
నవ్వేశాడు మిత్రా. "ఎంత నేర్చినా, ఎంత చూచినా ఆడపిల్ల ఆడపిల్లే! ఇంకా మీ ఉభయ పక్ష వాదనలూ, ఫైనల్ హియరింగ్ కు రాక ముందే నేను ఏమి నిర్ణయించు కుంటానే వెర్రి దానా? తీర్పు ఎలా తయారు చేస్తాను. ఇప్పుడే?"
కొత్త విషయం ఏదో వింటున్నట్లు అనిపించింది సత్యకు.
"ఒక్కటి ఆలోచించు, సత్యా. ఆ గౌతమ్ ధర్మారావు కు ఎంతగా ప్రేమించక పొతే, ఇంత కాలం తాను జైలు లో ఉండీ అతడి సంరక్షణ కూ, భవితవ్యానికీ అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉంటాడు?"
"నిజమే. అయితే?"
"అందుకే ఏదో పెద్ద కీలకమే ఉన్నదను కొంటున్నాను నేను. అతనెక్కడ ఉన్నా ఇక్కడి విషయాలు తెలుసుకుంటూనే ఉంటాడనేది నిస్సందేహం. కుమారునికి ఉరి పడుతుందనే ఈ ప్రచారం అతడి చెవి వరకూ పోక పోదు. వెంటనే అతడు ఎక్కడున్నా వచ్చి తీరుతాడు; పోలీసులకు లొంగి పోతాడు. అందుకే నేనీ పధకం వేశాను, బాగా అలోచించి."
మూడురాలులా చూస్తున్న ఆమెను ఒక్క క్షణం తిలకించి స్పష్టంగా చెప్పి వేశాడు మిత్రా. 'అర్ధం కాలేదూ? గౌతమ్ వచ్చిన తర్వాత కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. చూస్తూ ఉండు."
అప్పటి మట్టుకు తేలికగా నిట్టూర్చింది సత్య.
35
జైలులో ఉన్న తనను చూడవచ్చిన సత్యను తలెత్తి చూడలేక పోయాడు ధర్మారావు. తన ఉద్యోగ విషయికంగా అది కూడని పనే అయినా సాహసించి వెళ్ళింది సత్య.
"ఎందు కొచ్చావు సత్యా? ఇక ఈ విషచక్రం నుంచి నాకు విముక్తి లేదు. నావంటి వాడితో మాట్లాడితే ఇక నీకూ అమర్యాదే."
"జరిగిన వన్నీ చాలక ఎందుకింకా నన్నిలా వేధిస్తావు మాటలతో?"
"క్షమించు , సత్యా. వేధించుదామని కాదు. నామీద అభిమానం కొద్దీ నువ్వు యదార్దాన్ని మరిచి పోతున్నావు. ఇలా నన్ను చూడవస్తే ఇది నీకూ, నీ ఉద్యోగానికి అపఖ్యాతి కాదా? అయినా అది అటుంచు. నేను ప్రస్తుతం పదుగురి దృష్టి లో దోషి గానే జమ. యదార్ధం తో నిమిత్తం లేదు."
"ఎవరేమను కొన్నా నేను లెక్క చేయను. ఇక ఉద్యోగ మంటారా? రాజీనామా ఇచ్చి ఆ అడ్డంకి తొలగించుకో దలుచు కున్నాను. ఈ ఉద్యోగం ఉంటె మీకు వ్యతిరేకంగా కోర్టులో వాదించాలి."
ధర్మారావు కనులు కృతజ్ఞతా సంతోషాలతో మెరిశాయి. "నీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుడిని. సత్యా. కాని, ఇక్కడ వ్యక్తీ ప్రసక్తి వద్దు. నీ ఉద్యోగ ధర్మం నీవు నిర్వర్తించు. బాధ వద్దు. రాజీనామా ఇవ్వద్దు."
"హు! ఎంత తేలికగా అనేశారు! నేను అనునిత్యం ఎంత ద్రిగ్గుళ్ళీపోతున్నానో మీకు గ్రహింపు లేదన్న మాట? అటు నాన్నగారు, ఇటు మీరు! భగవాన్, ఇటువంటి అగ్నిపరీక్ష పగవానికి కూడా వద్దు. మా నాన్నగారి తోనే ఈ గౌతమ్ కేసు అల్లుకు పోయి ఉన్నది!"
