Previous Page Next Page 
అర్పణ పేజి 30

                                  
    చాలాసేపు ఏదో ఆలోచించిన తర్వాత చెప్పనారంభించింది పార్వతి.
    "మా అక్క వితంతువు. దానికి పునర్వివాహం  చెయ్యాలని నా ఆకాంక్ష." అంది.
    "మీ అక్కగారా?' రాధాకృష్ణ ఆశ్చర్యంగా అడిగాడు అంతవరకూ తెలియక.
    "అవును. మా అక్క చాలా అందగత్తె. అందుకే దాని స్థితి చూసినప్పుడు ణా మనసుని నిలవరించు కోలేను. దాని భర్త అంత రూపసి కాడు. అక్క వట్టి అమాయకురాలు. అతగాడి పాదాలైనా సరిగ్గా చూసిందో లేదో -- తర్వాత మూడు నెలలకే అయన ఇహలోక యాత్ర చాలించాడు. అక్కడి కది అయిందా! ఇప్పుడు దానికి తిరిగి వివాహం చెయ్యడానికి మా నాన్న గారు తటస్థంగా ఉన్నారు. నేనడిగితే ఇష్టమే నని చెప్పారు. అక్కని ఒప్పించడం కష్టం కాదు. ఇప్పటికి చాలావరకు ఒప్పుకున్నట్లే! ఇంక ణా అన్వేషణ అంతా మీవంటి ఆదర్శ పురుషుల జాడనే ఉంది" అన్నది నిట్టూర్చి పార్వతి.
    "మీ అక్కయ్య కేన్నెళ్ళు?" అడిగాడు రాధాకృష్ణ. కాగితాల్లో ఏదో వ్రాస్తూ.
    "ఇరవై ఏడు అనుకుంటా."
    "మీ అక్కయ్య నడగండి -- ఆమె కిష్టమైతే నేను చేసుకుంటాను." పేపరు మీద ఒక గీత గీశాడు అతను.
    విభ్రాంతి తో పార్వతి స్తంభించింది. 'ఇతనొక మోసగాడు కాడు కదా?' అనిపించింది క్షణం లో. భార్య పిల్లలు ఉన్నారేమో ఇతడికి? ఎంత తేలికగా , మామూలుగా చెప్పేశాడు!"
    ఆకస్మికంగా తనలో కలిగిన అనుమానానికి ఆశ్చర్యపోయింది వేను వెంటనే. తన ఎదురుగా ఉన్నవాడు పవిత్ర ఆదర్శాల  బాటలో నడవాలని ప్రయత్నించే వ్యక్తీ.
    నవ్వినట్లు నటించి, "అబ్బే! అదెలా ఔతుందండీ? మీరు బ్రాహ్మణులు; మేం కాము. అల్లాటప్పుడు...." అన్నది సంకోచిస్తూ.
    "ఎలాగూ వితంతువు ని వివాహం చేసుకోవటానికి పూనుకున్న వాణ్ణి -- జాత్యం తరానికి జడిసి పోతానని ఎలా అనుకున్నారు, పార్వతి గారూ?" ఒక్క మాటతో పార్వతి నోరు కట్టుబడి పోయింది.
    పార్వతి ఆశ్చర్యపోతున్నది. లీలగా తనలో ఏదైనా విపరీత భావం ఉన్నదేమో కానీ, రాధాకృష్ణ ఇల్లా తానై అంగీకరించప్రయత్నిస్తాడని గట్టిగా ఊహించ లేక పోయింది. 'బొత్తిగా ఇంత రాగద్వేషరహితుడైన మనిషి తో అక్క సుఖపడుతుందా? చిత్రం ! ఇదీ ఒక సమస్తే నా? అది అదృష్టవంతురాలు.'
    "నన్ను మావాళ్ళెవరూ అడ్డు పెట్టలేరు. నా కధ మీరు ఇందాకే విన్నారు" అన్నాడు రాధాకృష్ణ కాగితాలు కట్టకట్టి అరలో పెట్టి లేచి.
    "మీరు చేసుకుంటే అక్క ధన్యురాలు!" అంది పార్వతి నమ్రతతో.
    రాధాకృష్ణ నవ్వాడు మెల్లగా.
    పార్వతి ఆనందంగా ఇంటికి వచ్చింది. ఏదో పెద్ద బరువు తల నుండి దింపినట్లయింది ఆ రోజు.
    ఆ సంభాషణ అంతా వేసవి సెలవులకు ముందే జరిగినా సరస్వతి దగ్గర ఆ ప్రస్తావన తేవడానికి ఆశక్తురాలైంది పార్వతి. ఆమె ఏమని తీసిపారేస్తుందో అన్న భయం చేత చెప్పలేకపోయింది అదీకాక ఉత్తరం లో వివరించి వ్రాసినంత సులభంగా ఆ అమ్మాయి ఎదట చెప్పలేకనూ పోవచ్చు.
    అవన్నీ అలోచించి , తిరిగి వచ్చిన రెండు నెలలకు ప్రారంభించింది, అక్కకు ఉత్తరం వ్రాయడం. రాధాకృష్ణ ను గురించి కాస్త వ్రాయగాలిగింది కానీ, అసలు విషయాన్ని వ్యక్తం చెయ్యడం సాధ్యం కాలేదు. సరస్వతి నవ్వుతుండేమో.
    అరగంట గింజుకుని , తనను తాను తిట్టుకుని, "ఉహు! ఇప్పుడే వ్రాయకూడదు' అనుకుంది స్వగతం గా. 'రాధాకృష్ణ తో మరొకసారి మాట్లాడి అక్కకు సూటిగా వ్రాయాలి."
    ఆ నిశ్చయంతో కాగితం మడిచి కవర్లో పెట్టింది.
    "లచ్చీ! లచ్చీ! ఇలా రా!" పనిమనిషిని కేకవేసింది.
    "అమ్మా! అమ్మాయి గారూ! కాఫీ నీళ్ళన్నీ పొయ్యి లో తగలబడి పోతున్నాయి " అంది లచ్చి గాబరాగా వచ్చి.
    "ఫరవాలేదు లే! చూస్తాను -- పోస్టు చేసిరా దీన్ని ముందు."
    "నాకేం? ఇలా ఎన్నిసార్లో అయింది. ధనవంతు లైతే మాత్రం! ప్రతి వస్తువూ ప్రియంగా ఉన్న రోజులని చెప్తుంటిని గాని........"
    లచ్చి వయ్యారం చూస్తూ పార్వతి విసుక్కుంది. "అబ్బబ్బ! నీ వాగుడు కట్టి పెడుదూ! ఇది కాస్త పోస్టు డబ్బాలో పడేసిరా!"
    "ఏమిటీ? ఉత్తరమా ? నా వల్ల గాదమ్మో! నీ ఉత్తరం ముక్క పట్టుకుని అంతదూరం నే వెళ్ళలేను. నాలుగు వీధుల పనుంది -- సిద్దప్ప వీధి కెళ్ళాలా......ఇంకా బజారు వీధి క్కూడా వెళ్ళాలి. అల్లదిగో హాస్పిటలు కాడ......."
    ఓపిక నశించింది. "బంగారు తల్లివి కదూ! చచ్చి నీ కడుపున పుడతాను-- విసిగించక వెళ్ళు" అంది పార్వతి.
    "మొగుడోదిలీసెడు కదా , ఎలా పుడతావ్, పిల్లా?' లచ్చి బుంగమూతి పెట్టింది. అదొక ఎవరికీ తెలియని వేదాంతి ని. దానికి ముప్పయ్యేళ్ళు ఉంటాయి.
    "పోనీ, వచ్చే జన్మలో." నవ్వు వచ్చింది పార్వతికి.
    "వచ్చీ జన్మలో కూడా మొగుడోదిలీస్తే?"
    "అబ్బ! ఎలాగో పుడతాను లేవే! ఇప్పుడు నువ్వు వెళ్తావా, వెళ్ళవా? అది చెప్పు. కాదంటే నేనే వెళ్తాను చచ్చినట్టు. ణా మాట మీద కొంచెమన్నా గౌరవం ఉంటె కదూ!"
    "అలా అనకండమ్మో! మీరు నాకు గురువులు."
    "మరైతే నేను చెప్పిన పని చేసి పెట్టు."
    "మీరు ణా కడుపున పుట్టక్కర్లేదు గానీ, నాకో పాత చీర తీసివ్వండి , బుల్లెమ్మా! బొత్తిగా లేవు కట్టుకుందుకు."
    "నాకే లేవు. నీకేమిస్తానే? ఉన్న నాలుగూ సిల్కువెను." గొణుక్కుంది పార్వతి.
    "పెళ్ళైన కొత్తలో నాకూ సిలుకు చీరగట్టే అలవాటుండేది. ఎదవ సచ్చినోడెక్కడ కులుకుతున్నాడో -- అగుడ్ల గూబ దొరికిందాడికి -- " సిగ్గుగా, కోపంగా తిట్టింది లచ్చీ.
    "వాడేలా ఉంటాడు?' అంది కుతూహలంగా పార్వతి.
    "ఎవడూ? మావోడా! వాడి మొహం! కోతి లాగుంటాడు. వాడి కర్మానికి నన్నొదిలీసేడు అదృష్టం లేక, పాపిష్ట్దోడు."
    "సరి! నీకు సిల్కుచీర అచ్చి రాలేదన్న మాట?' అనాలోచితంగా వెనక్కు వాలుతూ అనేసింది పార్వతి.
    "నాకేం పట్టింది? నాకాడ ఉండటానికి వాడికే అదృష్టం లేదు. నాకొకటి తెలిసింది లెండి! మీకు సిల్కు చీర అచ్చోచ్చిందన్న మాట!" అమాయకంగా, కొంటెగా చూస్తూ అడిగింది లచ్చి.
    పార్వతి గతుక్కుమంది. ముందుకు లేచి, "టైము దాటుతుంది. కదలవెం?' అంది కోపం నటిస్తూ.
    "ఇదిగో వెళ్తాను. రేపు నాకు కప్పు కాఫీ ఇస్తారా?' అంది లచ్చి రెండడుగులు వేసి.
    "అలాగే! నీకు వెయ్యి దణ్ణాలు . వెళ్ళు ముందర!"
    లచ్చి వెళ్ళిన తర్వాత రెండు క్షణాలు కళ్ళు మూసుకుని వెనక్కు వాలింది. అటు తర్వాత ఏవో పిచ్చి ఆలోచనల్లోనే కాఫీ తయారు చేసింది. గోపాలుడు రాలేదు. సాహసం చెయ్యక తప్పలేదు. మంచం మీద ఇష్టానుసారం పడుకుని ఉన్నాడు రాజు.
    కప్పు బల్ల మీద పెట్టి అతని వైపు చూచింది పార్వతి. నిద్రపోతున్నాడు . వర్ణనాతీతమైన అందం ఉన్నదతనిలో. ఆ భంగిమ లో నిద్ర పోతున్నప్పటి నైర్మల్యం లో విశేషమైన అందం అగుపిస్తున్నదనుకుంది. ఒక్క అడుగు ముందుకు వేసింది. ఏ ప్రేరేపణలో -- కళ్ళు చలించకుండా  చూడాలని ప్రయత్నిస్తున్నాయి. తను సౌందర్యోపాసకురాలైందో , లేదో గానీ, ఇప్పుడు తనకు తటస్థ పడి తన చుట్టూ ఉంటున్న మగవాళ్ళ లో చాలామంది అందగాళ్ళే. తాత్కాలికంగా చైతన్యం కలిగిస్తుంటారు. రాధాకృష్ణ అందానికి అర్ధం అతనిలోని తేజస్సూ ఆకర్షణా. శేఖరం అందం ఎటువంటిదో చెప్పడానికి అనువైనది కాదు. అది వేరు కానీ, రాజు? అందగాడు-- అంటే దానికి సరైన అర్ధం ఇతని రూపంలో ఉన్నదని పిస్తుంది. వ్యక్తీ లోని అందం అనేక విధాలు. ఒక్కొక్కరి కళ్ళల్లో ఒక్కొక్కరి సౌందర్యం నిలిచిపోయి అరాధించ బడుతుందంటారు. అదేంత నిజమో తనకు తరిచి చూడవలసిన అవసరమేం వచ్చింది? ఏదో రోజులు వెళ్ళగొట్టడమే చాలు, చాలు!
    రాజు కళ్ళు విప్పాడు. ఎదురుగా పార్వతి ఉన్నది. అతనేమీ అనలేదు. ఒకసారి ఆమెకేసి చూసి, తిరిగి కాఫీ కప్పును చూశాడు.
    ఐనా పార్వతి హడిలి పోయింది. అతనేమైనా అనేస్తే? ఒక్క క్షణం చాలును!
    తడబడుతూ అతని ముందు కాఫీ ఉంచి, ఇవతలకు వచ్చేసింది గబగబా. అతనేమీ అనకపోవడం వల్ల కాళ్ళు మరింత వణుకుతున్నాయి.
    పార్వతి ఆ స్థితిలో ఉండగా శేఖరం ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు. గదిలోకి  "హల్లో " అంటూ చొరవగా వచ్చేశాడు.
    "ఇదేమిటి? చండికలా కూర్చున్నావు? వాగ్దానం మాట మరిచి పోయుంటా వనుకున్నానులే! సినిమాకి రెడీగా లేవా?"
    "క్షమించు శేఖర్! రేపు తప్పకుండా వస్తాను. ఇవాళ్టి కి వదిలెయ్యి!" పార్వతి ప్రాదేయంగా అడిగినా శేఖరం ఒప్పుకోలేదు. ఆమెను అప్పటి కప్పుడు కంగారుపెట్టి ఈడ్చుకు వెళ్ళినంత పని చేశాడు.
    రాజు ఇంట్లో ఉన్నాడు. అతని ఎదురుగా శేఖర్ మాట కాదంటే తనే లోకువేమో! ఇష్టం లేకపోయినా వెళ్ళింది పార్వతి.
    తెర మీద బొమ్మలు పాటలు పాడుతున్నప్పుడూ , శేఖరం చెయ్యి అప్పుడప్పుడు తన అరి చేతి మీద పడుతున్నప్పుడూ పార్వతి మెదడు అవిరామంగా అర్ధం కాని వాటిని అలోచించి వేసారింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS