Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 31


    శుష్కించి, దీనాతిదీనంగా ఉన్న తండ్రి వదనం ఆ మూసి ఉన్న నేత్రాలకే కన్పించింది.
    విచలితయై కళ్ళు తెరిచింది.
    ఆనాటి దృశ్యం కళ్ళకు కట్టింది. 'అచ్చంగా వసంత కన్యలాగే ఉన్నావ్, శాంతీ.....'
    ఆ అనుభవం గుర్తుకువచ్చి శరీరం పులక రించింది.
    'హద్దు మీరి ప్రవర్తించనని మాట ఇవ్వండి, శాంతీ.' రాజా అభ్యర్ధన.
    'మనకు పట్టింపులు లేకపోయినా పెద్దవాళ్ళకుంటాయి. నీ అభిప్రాయం మార్చుకో, శాంతీ.' వదిన హితబోధ.
    'పెద్దవారు నీ కొచ్చిన స్వేచ్చా స్వాతంత్ర్యాలనూ, నీపై కురిపించే ప్రేమానురాగాలనూ మంకు పట్టుదలతో దుర్వినియోగం చేసుకుంటావా, శాంతీ?' మనోరమ మూర్తి ఎదురుగా నిలిచి ప్రశ్నిస్తూంది.
    'నువ్వు ప్రసాదించిన సుఖ శాంతులను నువ్వే తీసేసుకుంటావా అమ్మా, శాంతీ? త్యాగంలో ఎంత ఆనందమున్నదో గుర్తించు.' పెద్ధన్నయ్య హితబోధ చెవులలో రింగుమంతూంది. దీనమైన అతడి అభ్యర్ధనే మరీ మరీ గుండెలను పిండివేస్తూంది.
    'మనం ప్రేమలూ, మమకారాలూ చంపుకోలేక ప్రాకులాడతాం. వాళ్ళకుమాత్రం ఛాదస్తులుగా, ఆటంకంగా కన్పిస్తాం.' తల్లి నిష్ఠుర వచనాల వెనుకనున్న ఆవేదన తీరని అశాంతి కలిగిస్తూంది.
    'నువ్వు లేక మురళి సరిగా పలకడం లేదు, శాంతీ.' తిరిగి గోవిందరావు వచ్చి మనస్సును బంధించివేస్తున్నాడు.
    'భగవాన్! నీ ప్రేమకు కట్టుపడను? ఎవరిని మన్నించను? ఎవరిని కాదనను? నాకు నేను ముఖ్యమా? అందరూ ముఖ్యమా? వివాహం అనే పదంలో యింత మీమాంస నిండి ఉందా?'
    నిర్విరామంగా ఏడుస్తున్న హృదయానికి శాంతిని ప్రసాదించే ఆశతో మెల్లగా మేడదిగిపోయి తోటలో తిరగసాగింది శాంతి. పొగడ, చంపకం, మల్లి, మాలతీ, మన్మధ, కరవీర, పున్నాగ పుష్పాలు సౌరభాలు విరజిమ్ముతున్నాయి.
    మెల్లగా వెళ్ళి పొగడచెట్టు క్రింద కూర్చున్న శాంతి "ఎవరు?" అనే మాటకు ఉలిక్కిపడింది. తత్తరపాటుతో ఆ శబ్దం వచ్చిన దిక్కుగా చూస్తూన్న ఆమె పున్నాగవృక్షం క్రింద తిన్నెపై వెల్లకిలా పరున్న మానవాకారం మెల్లగా లేవడం చూచింది. ఆ నడకనుబట్టి గుర్తించగలిగింది. రాజా!
    "నేను శాంతిని" అంది శాంతి మెల్లగా.
    "ఆఁ. గుర్తించగలిగాను" అంటూ తలక్రింద అంతవరకూ చుట్టచుట్టి ఎత్తుగా ఉంచుకున్న తువ్వాలు దులిపి భుజంపై వేసుకుంటూ చకచకా నడిచిపోసాగాడు.
    "వెళ్ళిపోతున్నారా? ఒక్క మాట." వెనుక నుంచి శాంతి పిలుపు విని ఒక్కక్షణం ఆగాడు. మరుక్షణంలోనే మారుమాట్లాడకుండా గబ గబా నడిచిపోయి తనకిచ్చిన గదిలోకి వెళ్ళిపోయాడు. శాంతి ఆశ్చర్యపోయింది. 'ఎప్పుడూ తను మాట్లాడితేనే మహా సంతోషంగా చెంతకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడే రాజా అలాగైపోయాడేమిటి? బహుశః కోపం వచ్చింది కాబోలు. గోవిందరావు సంగతి మొన్న చెప్పాక మళ్ళీ తనతో మాట్లాడలేదు. ప్రొద్దున్న రెండుసార్లు ఎదురుపడికూడా తలవంచుకుపోయాడు. అన్నయ్య తిడతాడని నేను మాట్లాడటంలేదు కాని అతడికేం? అవును, తప్పకుండా ద్వేషమే. అసూయ. ఇంతకాలమూ బహుశః తన మనస్సు మారగలదని ఎదురు చూచాడు కాబోలు. ఎంతటివాడు!"
    అలా ఆలోచిస్తూ మెల్లగా మేను వాల్చింది, ఒత్తుగా పరుపులా రాలిన పొగడపువ్వుల మీద.
    'భగవాన్! ఏ అశాంతీ ఎరగనిదాన్ని హఠాత్తుగా యిలా నడిసంద్రంలో కలిపివేశావేమిటి? ఏ చీకూ చింతా లేకుండా తిని తిరుగుతూ, బొమ్మలు గీసుకుంటూ హాయిగా యిరవై యేళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడేమిటీ విషమ సమస్య? ప్రతి విషయంలోనూ ప్రేమకో, భయానికో, అభిమానానికో కట్టుబడి పోయేంత అస్వతంత్రులుగా మానవుల్ని సృష్టించి వినోదిస్తున్నావా?'
    కన్నీటితో చెక్కిళ్ళు తడిసిపోయాయి. ఆలోచనలతో మెదడు వేడెక్కిపోయింది. విషాదంతో హృదయం భారమైపోయింది. అయో మయావస్థలో ద్వైదీభావాలతో మనస్సు కొట్టుకోసాగింది. ఎక్కడా కంటిమీదికి నిద్రరావడంలేదు. ఆలోచనలు ఒక దరికి రావడం లేదు. ఝాము ఝాముకూ కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి.
    వేకువఝాము కోడి కూయగానే తోటనూతి దగ్గర అలికిడి వినిపించింది శాంతికి. 'అబ్బ! ఆలోచనలతోనే తెల్లవారిపోతోంది. అప్పుడే ఎవరో లేచారు. పాలేళ్ళు కాబోలు' అనుకొంటూ పడుకొన్న చోటనుంచి లేచింది. ఇంటివేపు నడుస్తూ ఒక్కసారి నూతివేపు దృష్టి సారించింది. మనిషైతే వివరం తెలియడం లేదు కాని, మెల్లగా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వల్లెవేస్తున్న ఆ కంఠాన్ని గుర్తుపట్టగలిగింది, శాంతి. తండ్రి! బలరామయ్య! మందస్వరంతో దైవసంకీర్తన చేసుకొంటూ మొక్కలకు నీళ్ళు తోడిపోస్తున్నాడు! 'ఏడు గంటలకుగాని నిదురలేచే అలవాటులేని తండ్రి అప్పుడే నిద్ర లేవడమేమిటి? అందరు పాలేళ్ళుండగా మొక్కలకు నీళ్ళు ఆయన తోడకోవటమేమిటి? బహుశః బాధలతో, ఆలోచనలతో నిద్రపట్టక తనలాగే అలా వచ్చి ఏదో పని కల్పించుకున్నారేమో! రాజా చూస్తే అలాగ. నేను చూస్తే యిలాగ. నాన్నగారు ఆ విధంగా బహుశః అమ్మా, పెద్దన్నయ్యా కూడ నిద్రపోయి ఉండరు. భగవాన్! ఒక్క సారిగా ఈ శాంతినిలయా న్నిలా అశాంతి స్థావరాన్ని చేశావేమయ్యా?'
    మెల్లగా నూతి దగ్గరకు నడిచి "ఏం జేస్తున్నారు, నాన్నా?" అనడిగింది, శాంతి.
    "ఎవరూ? శాంతీ! ఏం, తల్లీ? ఏమి టప్పుడే లేచావ్? ఈ చీకట్లో పురుగూ పుట్రా ఉంటాయి. ఒక్కతెవూ తిరుగు తున్నావేం? ఎవర్రా అక్కడ? దీపం పట్టుకు రండి" అంటూ పాలేళ్ళనుద్దేశించి ఒక్క కేక పెట్టాడు.
    "అక్కర్లేదు, నాన్నా. అయినా నాకేగాని మీకు లేదేమిటి చీకటి భయం?"
    గంభీరంగా నవ్వాడు బలరామయ్య. "పిచ్చి తల్లీ! ప్రొద్దు పడమటికి వాలక యిక నాకేం భయం?"
    పాలేరు రామన్న వచ్చి లాంతరు ఉంచి వెళ్ళాడు. "ఇంత తొందరగా లేచావేం, చిన్నమ్మా?" అన్నాడు ఆశ్చర్యపోతూ.    
    మాట్లాడలేకపోయింది శాంతి. ఆ దీపపు వెలుగులో తండ్రి శుష్కవదనంపై ఆరిపోయిన కన్నీటి చారికలు గుర్తించిన ఆమె అంతరంగం హాలాహలమైపోయింది. అప్రయత్నం గానే నేత్రాలు అశ్రుపూరితాలైనాయి.
    "అలాగున్నారేం, నాన్నా?" అంది బలవంతంగా ఉద్వేగాన్నణుచుకుంటూ.
    "రోజూ యిలాగే ఉంటున్నానమ్మా. ఆరోగ్యం బాగుండటం లేదు. పెద్దవాడినైపోతున్నాను." కంఠం గాద్గదికమైంది.    
    "మరి అనారోగ్యంగా ఉండి యింత వేకువ లేచి యిదేం పని, నాన్నా? నౌకర్లకేం కరువు వచ్చిందా? నూతిలో నీళ్ళు తోడటం, చెట్లకు పోయటం ఎంత అలసట?"
    కూతురు దగ్గరగావచ్చి తల నిమిరాడు బలరామయ్య. "నా శాంతిని పెంచుకోవటానికి నాకు అలసటా, తల్లీ? నీకు తెలియదు. నువ్వొక్కత్తివే కాదు నా కూతురివి. ఇదుగో, ఈ శిరీషం, ఈ నారికేళ వృక్షం, నువ్వూ కవలలు, నాకు ముగ్గురు కుమార్తెలు. ఒక కూతురు శాంతినికేతనం వెళ్ళిపోయిన దగ్గర్నుంచీ ఈ యిద్దరు కూతుళ్ళేగా నాకు శాంతి నిస్తున్నారు! ప్రతి పారిజాత పుష్పంలో కనిపించే నీ వదనం చూచుకొని, కొబ్బరి ఆకు ప్రతి కదలికలోనూ నిన్ను చూచుకొని మురుస్తున్నాను, తల్లీ. నా శాంతులను నేనే సంరక్షణ చేసుకోవాలి కాని నౌకర్లకు వదలగలవా? ఇదెప్పుడూ నా దినచర్యేనమ్మా. ఈ శాంతిఇలయానికి నువ్వూ, నీ చెల్లెళ్ళే ఆయువుపట్లు. మీరు ముగ్గురూ సుఖంగా సంతోషంగా ఉంటేనే ఈ శాంతి నిలయంలోని మనుషులు శోక విచారాలకు దూరమై మనగలరు. మీరు కళకళలాదితేనే ఈ శాంతినిలయం కళావంతమౌతుంది. అదే నా తాపత్రయం."
    తండ్రి మాటలు వింటూన్న శాంతి నేత్రాలు ధారావాహికంగా వర్షింపసాగాయి. "నాన్నా!" తండ్రి గుండెలమీద వాలిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. 'ఎంత అభిమానం, నాన్నా, మీకు? మీ మనస్సంతా ప్రేమమయం. ఆ ప్రేమను పంచుకోలేక, తిరిగి యివ్వలేక మిమ్మల్ని బాదిస్తున్నాం. నిజంగా శాంతినిలయానికీ, నాకూ ఏదో అవినాభావ సంబంధముంది. అది ఈ సుప్రభాత వేళ, నిర్మలమైన మీ అంతరంగం నుండి వెలువడిన ప్రతి ఒక్క మాటనుండీ గ్రహించాను. శాంతినిలయంక్సోఅమే ఈ శాంతి పుట్టింది. అవును. నేను నా విషయం ఆలోచించుకోను. నాకు కోరికలు వద్దు. నాన్నా, మీ సంతోషమే నా సంతోషం. మీ ఆనందమే నా ఆనందం!' ఈ విధంగా ఆమె హృదయంలో రేగుతున్న భావాలు ఏ భాషారూపమూ అవసరం లేకుండానే ఆ తండ్రి హృదయం గ్రహించగలిగింది. హృదయ సంకేతాలముండు శబ్దస్వరూపాలు అనవసర మౌతాయి!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS