Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 30

 

                                         37

    ప్రతి ఒక్కరి మనస్సులోనూ మార్దవం ఉంటుంది. కాని అది పొంగి ప్రవహించి నిరర్ధకమౌతుంటుంది ఒక్కోచోట. మరొకచో మారుమూల మణగి పడి ఉంటుంది - దాన్ని మథించి నేర్పుతో పైకి తీసుకురాగల వారు ఉండాలి. అతి సున్నితమైన ఆ మమత సున్నితంగా స్ప్రుశించబడినప్పుడే ఫలితం రమ్యంగా ఉంటుంది. కాని మోటుగా, బలవంతం ప్రయోగం చేస్తే నామరూపాలు లేకుండా మాసిపోయి ఆ స్థానాన్ని కర్కశత్వం ఆవరించు కొంటుంది. పుట్టినదాదిగా ప్రేమాదరణలను పొందడమేగాని ఇవ్వని శాంతి విషయంలో ఈ విషయమే నిజమైంది. డబ్బు ప్రవాహంగా వచ్చి పడినా, పైతృక సంపద పాతరలు పడి ఉన్నా దాని విలువ తెలియదు, నీళ్ళప్రాయంగా ఖర్చుపెట్టగలరు. కాని స్వయం సంపాదన విషయంలో, అది ఎంత కష్టప్రయాసల ఫలితమో తెలిసి విలువ దానంతటదే గ్రాహ్యమౌతుంది. ఆ విధంగానే అంతవరకూ అందరినుండీ ప్రేమాదరణలు పొందడమేకాని యివ్వని శాంతి, అప్పుడప్పుడే ప్రేమ ప్రభావం తెలుసుకొంటున్న శాంతి ప్రపంచంలోని బహుముఖ వ్యాప్తమైన ప్రేమ స్వరూపాన్నీ, తన్మూలాన్నీ ఆలోచించసాగింది.

                           
    ఆలోచనాస్రవంతి బహుముఖం కాసాగిన కొలదీ ప్రేమ ఎంత సున్నితమైనదో, ఎంత తీవ్రమైనదో అర్ధం కాసాగింది. ఆలోచనల తోనే భోజనానికి వెళ్ళింది. అందరూ కూర్చున్నారు. లక్ష్మీదేవి వడ్డిస్తూంది. బలరామయ్య అనారోగ్యంవల్ల పెందలకడనే భుజిస్తున్నారీమధ్య. అయినా అటూ యిటూ తిరుగుతూనే ఉంటారు. కాని ఆవేళ ఎక్కడ జాడ లేదు. బావగారు ఉండడంవల్ల క్రొత్త కోడలైన శ్యామలకూడా అక్కడ లేదు.
    శ్రీహరి అన్నాడు: "పద్మా, అమ్మాయిని కూడా పిలువు. నారాయణ ప్రక్కన మరో కంచం పెట్టు. నాకు చాటు దేనికీ?"
    "క్రొత్త పిల్ల కదా? సిగ్గుపడుతోంది" అంది పద్మ చిరుహాసంతో.
    "చదువుకున్న పిల్ల కూడా. ఆ పట్టింపేమిటి? రమ్మను. పాపం అలా చాటు చాటుగా ఎన్నాళ్ళు తిరుగుతుంది?"
    "వస్తుందిలే" అన్నాడు నారాయణ ముక్తసరిగా.
    శ్రీహరి ఆశ్చర్యం పైకి కన్పించనీయలేదు. ఒక్కసారి తమ్ముడి ముఖం చూచి భోజనానికి ఉపక్రమించాడు. శాంతి అయోమయంగా చూచింది. వాతావరణమంతా అగోచర నీలి మేఘాచ్చాదితమైనట్లు తోచింది.
    "నాన్నగారి జాడ లేదేం?" అన్నాడు కాస్సేపటికి శ్రీహరి.
    "పడుకున్నారు" అంది లక్ష్మీదేవి.
    "అప్పుడే పడుకోవడమేం?" అంటూ అటు చూచిన శ్రీహరికి తల్లి ముఖం శోకపూరితమై ఉండడం కన్పించింది. అయోమయంగా పద్మ దెస చూచాడు. పద్మ ముఖం బరువుగా వాల్చింది. ఆమె నేత్రాలు ఏదో భాష మాట్లాడుతున్నాయి. మరి మాట్లాడకుండా భోజనం చేయసాగాడు. నారాయణ త్వరత్వరగా భోజనం ముగించి వెళ్ళిపోయాడు. శాంతీ, శ్రీహరీ ఆశ్చర్యపోతూ ముఖ ముఖాలు చూచుకున్నారు.
    "ఏమిటిది, పద్మా?" విస్మయంతో ప్రశ్నించాడు శ్రీహరి.
    పద్మ మాట్లాడలేదు. లక్ష్మీదేవి చెప్పింది: "ఏముంది, నాయనా? మనం ప్రేమలూ, మమకారాలూ చంపుకోలేక ప్రాకులాడతాం. వాళ్లకేమో మనం ఛాదస్తులుగా, వాళ్ళ జీవితానికి అవరోధాలుగా కన్పిస్తాం" అంటూ కళ్ళు తుడుచుకుంది.
    శ్రీహరికి ఏమీ అర్ధం కాలేదు. పద్మ చెప్పింది: "హనీమూన్ కు ఎటైనా వెళ్తామన్నారు. ఎక్కడికో వెళ్ళిపోవటం దేనికి? ఇక్కడ ఉంటే నాలుగు రోజులపాటు యింట్లో సందడిగా ఉంటుందన్నారు మామగారూ, అత్తగారూ. దానితో యిద్దరికీ కోపం వచ్చింది. మాకు మీ సలహా లక్కర్లేదు, ఈ ముసలి ముక్కల సరదా తీర్చుకోవటానికా మాకు క్రొత్తగా పెళ్ళి చేయడమని మీ తమ్ముడూ, ఈ వెధవ తోటలో పల్లెటూల్లో బైరాగిదానిలా పడి ఉండలేనని శ్యామలా - యింకా యింకా చాలా అన్నారు లెండి."
    వింటూనే నీళ్ళు కారిపోయాడు శ్రీహరి. "వాడిదెప్పుడూ దురుసు స్వభావమే. శ్యామల కూడా అలా అందా? క్రొత్త పిల్ల!"
    "క్రొత్తా పాతా సంకోచాలేం ఉన్నట్టు లేవు. చాలా దురుసు" అంది పద్మ.
    "ఆవిడ అటువంటిదేలే, అన్నయ్యా. ఆశ్చర్యపడక్కర్లేదు" అంది శాంతి.
    శ్రీహరి భోజనం పూర్తికాకుండానే చెయ్యి కడిగేసుకున్నాడు. తల్లి దగ్గరగా వెళ్ళి, "ఎందుకమ్మా విచారం? ఒక్కొక్క క్రొత్తమనిషి, మార్పూ కుటుంబంలో ఒక్కో క్రొత్త దనాన్ని సృష్టిస్తాయి. ఒక్కో సంతోషంతోపాటు ఒక్కో విచారం కూడా అనుభవించాలి మరి. అయినా మనుష్యుల స్వభావాలు తెలియకుండా నువ్వెందుకా ప్రాధేయపడటం?" అన్నాడు.
    లక్ష్మి కళ్ళు తుడుచుకుంది. "మేము ఒంటరిగా ఉంటామనే కదా నువ్వు యిక్కడి కొచ్చావు? బంగారు కొండవు, నాయనా. నీలా ఎవరూ ఉండరు."
    "అది నా బాధ్యతమ్మా. అందులో ఘనతేమీ లేదు. కాని, అందరి విషయంలో అలా కోరుకొని బాధపడకు. సంతానానికి జన్మనిచ్చి, సాకి, వృద్ధిలోకి తేవడంవరకూ అనేక బాధలు. ఎవరికీ వారికి రెక్కలిచ్చి ప్రపంచంలో వదిలేస్తారు. తిరిగి వారి ప్రవర్తన విషయంలో క్రొత్త బాధలు. కడకు పూర్వంలాగే ఒక్కరూ మిగులుతారు. అందుకే అన్నారు అనుభవజ్ఞులు- వివాహం, జీవితం, సంసారం మాయా, మిథ్యా అని. ఆమాత్రం గ్రహించితే మరి బాధలకు నీ మనస్సులో తావుండదు. నేనుమాత్రం మిమ్మల్నెప్పుడూ వదిలిపెట్టనని మాట యిస్తున్నానమ్మా. అంతతో తృప్తి పడు" అంటూ తిరిగి తండ్రిని ఓదార్చడానికి వెళ్ళిపోయాడు, శ్రీహరి.
    శాంతి మనస్సు మహాసాగరమై పోయింది. తన చేతులతో నాటి పెంచబడిన మొక్కలే మహావృక్షాలై ఆకాశాని కెదిగిపోయి మురిపించుతూ తమవైపు చూడనుకూడా వద్దని విదిలించికొడితే తోటమాలి ఎంతటి ఆవ్యక్తమెయిన్ బాధ ననుభవిస్తాడో, అలా ఉంది తల్లి తండ్రుల పరిస్థితి.
    శాంతి కా రాత్రి కాళరాత్రిగా కన్పట్టింది. క్షణక్షణమూ గోవిందరావు రూపం కంటిపాపలలో నృత్యం చేయసాగింది. అతడి కంఠస్వరమే చెవులలో రింగుమని హోరెత్తజొచ్చింది.
    "ఏం చూచి ప్రేమించావ్? ఏమిటతడిలో ప్రత్యేకంగా నిన్నాకర్షించిన గుణం?' అంటాడు అన్నయ్య. ఆ క్షణంలో అన్నయ్యకు సమాధానం చెప్పలేకపోయింది. కాని, ఇప్పుడు తన అంతరాత్మ తనను వేసే ప్రశ్నకు కూడా సమాధనం చెప్పలేకపోతూంది. ఎందువల్లనో అతడికి మానసికంగా సన్నిహితురాలైంది. అంతకు ముందు, ఆ తర్వాతకూడా అన్నయ్య స్నేహితులతో, సహవిద్యార్దులతో అనేకులతో స్నేహ  పూర్వకంగా మాట్లాడటం సంభవించింది. కాని, ఎవరూ తనకంత సన్నిహితంగా రాలేదు. ఎవరి విషయంలోనూ తనకటువంటి కోర్కెలు కలుగలేదు. ఏమాకర్షణ ఉందో మరి ఆ గోవిందరావులో, తనకే తెలియదు, 'నువ్వు లేనిదే నాకు శాంతి లేదు, శాంతీ' అంటూన్న గోవిందరావు కళ్ళెదుట నిలబడ్డాడు.
    'నువ్వు ప్రసాదించిన శాంతి సౌఖ్యాలను తిరిగి నువ్వే తీసేసుకుంటావా అమ్మా?' శ్రీహరి అనునయ వాక్యాలు చెవులలో రింగుమన్నాయి. గట్టిగా కళ్ళు మూసుకుంది. మైమరపించి మత్తెక్కించే శ్రావ్య మురళీగానం చెవులకు విన్పించసాగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS