Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 31


                                  15
    వాకిట్లో చుట్టపక్కాల మధ్య అవధాని శవం నిండుగా దర్జాగా పడుకుని వుంది. అన్నపూర్ణ ముఖాన కాంతి రేఖలు కడుక్కు పోయాయి. శ్రీనివాస్ ని చూస్తూనే భోరున యేడ్చింది. అయిన వాళ్ళు యెవరూ లేని అవధాని గారి దహన సంస్కారాల విషయం యింకా తర్కం లోనే వుండిపోయింది.
    లాయరు నెమ్మదిగా అన్నాడు. 'మీరేనా శ్రీనివాస్' అని.
    శ్రీనివాస్ బుర్ర వూపాడు.
    'మీరు యీ కాగితాలు హేండోవర్ చేయాల్సిన బాధ్యత నామీద వుంది. అవధాని గారి లాయర్ని నేను.'
    'ఆ కాగితాలు యేవిటి సార్' శ్రీనివాస్ అడిగాడు.
    'అందులో మీకో వుత్తరం వుంది!'
    శ్రీనివాస్ కళ్ళు అక్షరాల మీద పరుగులు పెట్టాయి.
    'బాబూ.'
    అవధాని గారి పిలుపు అది. పలకరింపుగా కాగితం మీద పరచుకుంది.
    'నా' అనే వాళ్ళు నాకూ మీ పిన్నీకి కూడా లేరు. ముప్పై యేకరాలు చూసి యిప్పుడు కొత్తగా చుట్టాలు రావచ్చును. రాబందు ల్లాంటి యీ చుట్టాలంటే నాకు అసహ్యం. మనం చూసుకున్న ముహూర్త బలం యెటువంటిదో? నాకు యీ ఆస్తి నీకే రాయాలని వుంది. నువ్వు యెటువంటి వాడివో నాకు తెలుసు. నీ మీద పెద్ద బాధ్యతలుంచుతున్నాను. మీ పిన్నిని కనిపెట్టుకుని వుండు. ఆవిడ పేర ఐదు ఎకరాలు విడిగా రాశాను. దాని తదనంతరం ఆ ఆస్తి ని శ్రీవెంకటేశ్వర స్వామికి డబ్బు చేసి పంపేయి. డాన్ని జీవితాంతం నీ యింట్లో నే వుంచుకో. నా తలకి కొరివి పెట్టి నాకు కొడుకుని కమ్మని , నాకు ఆ నరకం తప్పించమని ముప్పై ఎకరాల భూమి అమ్మి కోరుకుంటున్నానని అనుకోకు. యేడాది లో ఓసారి నిన్నే కన్నకొడుకు అనుకున్న నాకు పిండ ప్రదానం చేయి!
                                                                                  ప్రేమతో
                                                                                  బాబాయ్.
    'బాబాయ్' శ్రీనివాస్ యేడ్చాడు. మామూలుగా కాదు గుండెలు పగిలేటట్టు అన్నపూర్ణ వొళ్ళో తల దాచుకుని యేడ్చాడు. అతని కేవీ యెబ్బెట్టుగా అనిపించలేదు. జన్మజన్మలకీ ఋణ పడాల్సిన బాధ్యత తను ఎప్పటికీ మరచి పోలేదు. అవధాని గారిని శాస్త్రోక్తంగా నలుగురి పెద్దల సమక్షంలో మంత్రోచ్చారణతో స్మశానానికి సాగనంపి తల వెంట్రుకలు తీయించుకుని గోదావరి లో స్నానం చేసి యింటి దారి పట్టాడు శ్రీనివాస్.
    అన్నపూర్ణ కడుపు చేరువై పోయింది. మాటకు కట్టుబడ్డ శ్రీనివాస్ ని ఆ రూపులో చూసి గుండెలు అవిసి పోయేలా దుఃఖ పడింది . యింక యెక్కువ రోజులు వుంచలేదు. శ్రీనివాస్ తనతో బాటే ఆవిడనీ హైదరాబాదు తీసుకు వెళ్ళాడు. అన్నపూర్ణ సంరక్షణ భారం అంతా శ్రీనివాసే చూసుకుంటున్నాడు. అయాచితంగా వచ్చిన ఆస్తిని చూసి మురిసి పోలేదు అతను. అతని అంతరంగం లో రాజేశ్వరి జ్ఞాపకాలు కదులుతూనే వున్నాయి.
    తను తొందర పడ్డాడెమో . రాజేశ్వరి ని సంతోష పెట్టి వుండ వలసింది.
    'ఛ! మీకెప్పుడూ ముక్కు మీదే కోపం. యిలా బ్రతుకంతా కోపగించు కుంటూ నన్ను మాటలంటూ వుంటే నేను భరించలేను. ఏదో వొక రోజున మాయం అయిపోతాను.' శ్రీనివాస్ నవ్వేసి 'యెక్కడికి మాయం కావు ఈ గుప్పిట్లో వున్నావు. ఆ గుప్పిళ్ళ తాళాలు గుండెల్లో వున్నాయి.' అంటాడు . 'లేదు వూరికే అన్నాను. మిమ్మల్ని విడిచి యెక్కడికి వెళ్ళను. నేను లేకపోతె మీరు పిచ్చివారై పోతారు. అప్పుడు ఎర్రగడ్డ లో చోటు లేక పొతే సికింద్రాబాద్, హైద్రాబాద్ ల మధ్య మజ్నూలా తిరుగుతుంటే......బాబోయ్ నేను చూడలేను.'
    'చాల్లే, నేనేం నీకోసం అంత కలవరించడం లేదు.'
    'అయితే నన్ను పొమ్మంటారా.'
    'ఓ యస్.'
    రాజేశ్వరి కి క్షణం లో రోషం వచ్చేస్తుంది. అతనన్న మాటల్లో యదార్ధం గ్రహించదు... ఆరోజంతా యేడుస్తూనే వుంటుంది... శ్రీనివాస్ కళ్ళ ముందు గతం దొర్లి మాయమైంది.... అన్నట్లుగానే రాజేశ్వరి తనని వదిలి నిర్దయగా వెళ్ళిపోయింది. రాజేశ్వరి తను లాయరు చేత పంపిన నోటీసు అందుకోనైనా అందుకోకుండా తప్పు అడ్రసు తో తిప్పి పంపింది. దేవదాసు ని పెళ్లి చేసుకున్నట్లు ఆ మధ్య ముకుందం రాస్తూ తనని యింక ఆ వెర్రి వ్యామోహం వదిలి మరో మనిషిని చేసుకోమని సలహా యిచ్చాడు. ఈ కౌగిట్లో కరిగిపోయిన రాజేశ్వరి, తను అందించిన ముద్దుల్లో ముడుచుకుపోయి, తన సమక్షం లో స్వర్గం అనుభవిస్తున్నానన్న రాజేశ్వరి బ్రతుకులో మరో అవతారం ప్రారంభం అయింది కాబోలు. ఆ దేవదాసు చేతుల్లో, అతని పెదవుల్లో....ఛ! తలుచుకుందుకి తనకే యింత బాధగా వుండే అనుభవించే రాజేశ్వరి కి ఏ బాధా లేదా?

                                   
    'పిచ్చి శ్రీనివాస్! కొందరు ఆడవాళ్ళు అంతేనోయ్. స్త్రీ కి హక్కులు వచ్చాయని విడాకుల తరువాత మళ్ళీ ఫ్రెష్ కాండిటేట్ గా చలామణి అవుతుందని అప్పుడు తను పెళ్లి చేసుకున్నా మొగవాడు రెండుసార్లు చేసుకుంటే యెంతో తనూ అంతే అనుకుని తృప్తి పడుతుందనే విషయం నీకు తెలీదూ?' శ్రీనివాస్ తో యెవరో మనిషి అంటుంటే అతని మనసు విలవిల తన్నుకుంది.
    "ఇది యిప్పుడు కాదు-- కొన్ని యుగాల నుంచీ వాడుకలో వస్తున్న ఆచారం. మగవాడు పవిత్రుడు. అతడెం చేసినా భారతదేశం లో పుట్టిన ఆడది అలా భర్త బ్రతికి వుండగా చేసేందుకు వీలులేదు. పటితలు అలా చేస్తారు.'
    'నాన్సెన్స్ . ఆ రూల్స్, రెగ్యులేషన్స్ పోయి చాలాకాలం అయిపొయింది. నీ సిద్దాంతాల ను ఆచరణలో పెట్టేందుకు యిది కలికాలం రా నాన్నా' మనసు అతన్ని అవహేళన చేస్తూ అడిమేస్తోంది.
    'కాబోను' నిస్పృహగా అనుకున్నాడు శ్రీనివాస్. కాళ్ళీడ్చుకుంటూ యింట్లోకి  రాగానే అన్నపూర్ణ అంది: 'నీకోసం అమ్మాయి వచ్చిందిరా శ్రీనివాస్!' అని. ఆవిడ వొళ్ళో బాబు ఆడుకుంటున్నాడు.
    'ఎంత సేపైంది పిన్నీ?'
    'అరగంట దాటింది.'
    'ఏమని చెప్పింది?'
    'ఏవో అర్ధం కాని పాఠాలు మిగిలి పోయాయిట.'
    "మళ్ళీ వస్తానందా?'
    'ఆ'
    అన్నపూర్ణ భోజనం వడ్డించి కొంచెం దూరంగా కూర్చొని అంది : 'పసి పిల్లాడు ఆ పిల్లను చూడగానే యెగిరి గంతులు వేస్తాడు. ఎన్నాళ్ళు యిలా ఉంటావు నువ్వు దాని దారి అది చూసుకుంది. అలాంటి వాళ్లకి నీడా, బాధా? వాళ్లకి పాపం పుణ్యం వుండదు. ఆ పిల్లకి 'నా' అనేవాళ్ళు యెవరూ లేరుట. మనకి మాత్రం యేవరున్నారు? నువ్వు ఆ పిల్లని చేసుకుంటే ఏం?'
    ముద్దని నోటికి అందించబోయే వాడల్లా ఆగిపోయాడు. 'అదేమిటి పిన్నీ మనకి యిష్టం అయితే ఆ పిల్లకి యిష్టం కావద్దూ.'
    'నీకేం తక్కువని యిష్టం కాదురా? తనకి రెక్కాడితే గాని డొక్కాడదు. దయ తలచి పెడితే తింటుంది. లేకపోతె అలా వుండి పోవలసిందే కద. పరీక్షలు యెప్పుడు కావాలి? ప్యాసైతే కదా వుద్యోగం?'
    '...........'
    'పోనీ నీ అభిప్రాయం చెప్పరా.'
    'నాకు యిష్టమే పిన్నీ,' రాజేశ్వరి వెళ్ళిపోయాక అతను ద్వైదీభావనలో కొట్టుకు పోయాడు. ఆవిడ కోసం పరితపించిన మాట వాస్తవమే కానీ అతనేవీ ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబించాలని గానీ భీష్ముడి లా వుండి పోవాలని గానీ పంతం పట్టలేదు.
    'నేను కనుక్కుంటాను.'
    ఖంగారుగా అన్నాడు శ్రీనివాస్: 'తొందర పడవద్దు పిన్నీ. పరీక్షలు కానివ్వు. ఆ పిల్ల మనల్ని అపార్ధం చేసుకుంటే పరీక్షలు రాయను కూడా రాయదు. ట్యూషన్ కి కూడా రాదు. బాబు బెంగటిల్లిపోతాడు.'
    'అలాగే లేరా,' అన్నపూర్ణ మనసులో క్రిష్ట ప్రియని కోడలుగానే చేసుకోవాలని వుంది. ఎలాగైనా భగవంతుడు ఈ విషయం లో మేలు చేస్తే బాగుండి పోను' అనుకుంది ఒక్కటికి రెండు సార్లు.
    
                            *    *    *    *
    'రాజేశ్వరి నువ్వే వెళ్ళిపోయావు నన్ను కాదని. నీ కొడుకు కోసం వస్తే నన్ను వదులు కోవు అనే భ్రమ లో యిన్నాళ్ళు యెదురు చూశాను. నువ్వు రాలేదు. బాబు మస్తిష్కం లో అసలు నువ్వు పూర్తిగా తుడుచుకు పోయావు. వాడు 'అమ్మా' అని పెదాలు  కలిపినపుడు ఆ ఆనందం కృష్ణ ప్రియ అనుభవించింది. నువ్వు అనవసరంగా అనుమానపడి నారాయణ బాబుతో చెప్పావు. బాబు అందుకు రుజువు చేస్తూ 'అమ్మా' అని కృష్ణ ని పిలుస్తుంటే భయపడి పోయాను. నీకు నేనేవీ అన్యాయం చేయలేదోయ్. కృష్ణ లేకపోతె పసివాడు బ్రతకడు. వాడు లేనిదే నేనూ వుండను.'
    'నేనేవీ ప్రవరాఖ్యుడిని కాను. జీవితంలో కొన్ని రుచులు చూసిన నేను యీ బ్రతుకుని యిలాగే గడిపేయ లేను. నాకూ జీవితం కావాలి. నా భార్య, నా తోడూ నన్నంటుకుని బ్రతుకంతా వెన్నాడాలి. ఆ మనిషి నాకు కావాలి. కృష్ణ ప్రియే సరిపోతుంది. నువ్వు యేమను కుంటావు? మనం సుఖంగా వున్నప్పుడే అనుమానించావు. నీ అనుమానం నిజం అయిందనీ ఆ కృష్ణ కోసమే నేను యిలా చేశాననీ.....సరే నీ యిష్టం యేమైనా అనుక్కో. భగవంతుడి ని మాత్రం నేను మోసగించ లేను. అంతవరకూ నిజం. పిన్ని కూడా యిప్పుడు నాకు పెద్ద దిక్కై అదే చెబుతోంది. యిదివరకు ఎవరి మాట వినలేదు పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల. ఈసారి నా జీవితం అశుభం తో సమాప్తి కాదు. అదేదో నమ్మకం పిన్ని మాటల్లో. నేను నీ పట్ల ద్రోహం చేస్తే క్షమించు,' శ్రీనివాస్ స్వగతం లో  మూసీ వంతెన దాటి హైకోర్టు వైపు పాదాలు త్రిప్పాడు. అతని కేవీ తోచడం లేదు. కాళ్ళు పీక్కు పోతుంటే వెడుతున్నాడు అర్ధం పర్ధం లేకుండా. పరధ్యానంగా నడుస్తున్న అతని మనసులో అయినా, యెదలో యినుప గుండు విసిరినట్ల యింది. ఎదురుగా వున్న బట్టల షాపు లోంచి మంచి సూటులో వున్న అతని ప్రక్కన సుభద్ర....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS