'అదెందుకు?'
'నీ మీద అన్యాయంగా నేరారోపణ చేసుందుకు వీలు వుండదు. ఎందుకైనా మంచిది అలా వ్రాయించి వుంచుకుంటే.'
'నాకెందుకో యిష్టం లేదు చంద్ర మౌళి , పోనీ తనంతట తను పశ్చాత్తాపంతో తిరిగి రావచ్చును. అప్పుడు నేను వెళ్ళ గొట్ట గలనా.'
'తను వస్తుందనే అనుకుంటున్నావా.'
'నాకేవిటో నమ్మకం వుంది' శ్రీనివాస్ స్వరం లోనే కనిపోస్తోంది ఆ నమ్మకం.
'పోనీ నీఎదుటే నేను మళ్ళీ కనుక్కోనా.'
'అలాగే'
యింట్లో కి వచ్చి టేబిల్ కి కొంచెం దూరంలో వున్న కుర్చీ మీద చంద్రమౌళి కూర్చున్నాడు. శ్రీనివాస్ అతనికి దగ్గరగా చాప మీద కూర్చొని రాజేశ్వరి ని పిలిచాడు. భుజం మీదుగా కొంగు వేసుకుని చంద్రమౌళికి ఎదురుగా నిలబడింది.
చంద్రమౌళి గొంతు సవరించుకుని నెమ్మదిగా అన్నాడు! 'చూడమ్మా నీమీద మాకెవరికీ యెటువంటి ద్వేషం లేదు. నీకు నిజంగా యిష్టం లేదా శ్రీనివాస్ తో కాపురం చేయడం' రాజేశ్వరి కళ్ళు శ్రీనివాస్ వైపు మళ్ళాయి.
'శ్రీనివాస్ కాదమ్మా చెబుతా నాకు. నారాయణ బాబు అన్నారు నాతొ, నీకు యిష్టం లేదా,'
'ఆ సంగతి నారాయాణ బాబుతో చెప్పాను నేను.'
'అయితే తెగతెంపులు చేసుకోవాలనే వుందా.'
'అవును.' రాజేశ్వరి చిరాకుగా అంది.
'పిల్లడు ఏమైపోతాడో అలోచించలేవమ్మా నువ్వు' చంద్రమౌళి నెమ్మదిగా వోకటోకటే అడుగుతుంటే రాజేశ్వరి కి కోపం కట్టలు తెంచు కుంది. 'ఆ విషయాలన్నీ నేనూ ఆయనా వుండగానే నారాయణ బాబు అడిగారు.'
'నేను శ్రీనివాస్ కే కాదు నీకూ స్నేహితుడి లాంటి వాడినే. పిల్లాడి కోసం అయినా కాపురం నిలబెట్టు కోకూడదా'
'ప్లీజ్ మీరు యిదే చెప్పదలుచు కుంటే యింక నేను యిచ్చే సమాధానాలు యేవీ లేవు.'
'అయితే కోర్టు ద్వారా తెంపుకోవడం మంచిదేమో ఈ సంబంధం.'
'నాకు యిష్టమే.'
'నీకే యిష్టం లేదా లేక శ్రీనివాస్ కూడా యీ కాపురం చేయడానికి యిష్టపడడం లేదా?'
'అయన సంగతి నాకు తెలీదు. నాకైతే యిష్టం లేదు.'
'ఆ మాట కాగితం మీద రాసి యిస్తావా.'
'మీకు అవసరమా అది.'
'శ్రీనివాస్ నాకు స్నేహితుడు అతని కోసం నేను అడుగుతున్నాను. యిస్తావా రాజేశ్వరి. యిదేమీ బలవంతం కాదు, నీకు నచ్చితేనే అలా చేయి.'
'నేను రాసి యిస్తాను.'
శ్రీ చంద్ర మౌళి గారి
సమక్షమున రాజేశ్వరి వ్రాయి లేఖాస్త్రములు. నాకూ శ్రీ శ్రీనివాస్ గారికి ఆర్య సమాజం లో జరిగిన వివాహం లో కొన్ని కుటుంబ కలహాల కారణంగా నాకుగా నేను యీ సంబంధాన్ని త్రెంచు కోవడానికి యిష్టపడుతున్నాను. మాతృప్రేమ చంపుకోలేని నేను మధ్యవర్తి శ్రీ చంద్ర మౌళి గారి ద్వారా చిరంజీవి బాబు క్షేమ సమాచారాలు మాత్రము తెలుసుకోగోరుతున్నాను. కానీ శ్రీనివాస్ గారితో నాకు యెటువంటి సంబంధమూ వ్రాత పూర్వకముగా కానీ, ముఖాముఖి మాట్లాడుట గానీ యిష్టము లేని కారణమున యీ విధముగా చేయనైతిని.
ఇట్లు,
రాజేశ్వరి.
వుత్తరం చదివి చంద్రమౌళి అన్నాడు? 'మధ్యలో బాబు ప్రసక్తి దేనికి? నేను ఇవాళే యీ వూళ్ళో వుంటాను. రేపు మరో వూరు వెళ్ళ వచ్చును. నాకు శ్రీనివాస్ రాయడం నేను నీకు రాయడం యిది జీవితాంతం జరిగేంత తేలిక విషయం కాదు.'
'అయన పిల్లాడిని యివ్వ నంటున్నారు మరి.'
'న్యాయంగా తల్లితో పిల్లడు వుండడం రివాజు, కానీ శ్రీనివాస్ కి దూరంగా నీకు వాడిని తీసుకు పోవాలనే వుందా.'
రాజేశ్వరి ఆలోచనలో పడింది! తను మాతృప్రేమ కోసం బాబుని తీసుకు పోయి తనతో వుంచు కుంటే, మురిపించే రోజులకి తీసుకు వెళ్ళే దేవదాసు వొప్పు కోవద్డా. ఒకవేళ వొప్పుకున్నా తనకి మళ్ళీ సంతానం కలగదని నమ్మకం యేవిటి? అప్పుడు దేవదాసు తన పినతండ్రి రామదాసు ప్రభాకరం పట్ల చూపిన దాక్షిణ్యాన్ని చూపిస్తే..........
'లేదు పిల్లడిని నేను తీసుకు వెళ్ళను.' రాజేశ్వరి దృడంగా అంది.
'నువ్వు యెప్పుడు వేడుతున్నావు?' చంద్రమౌళి అడిగాడు.
'రెండు రోజుల్లో.'
'అయితే యింక మళ్ళీ కనిపించవు కాబోలు. ఈ వుత్తరం నేను నీ చేత బలవంతంగా రాయించానా?'
'అదేమీ లేదు. నా యిష్ట పూర్వకంగానే రాశాను.'
'దయచేసి యేవీ అనుకోకు రాజేశ్వరి ఆ విషయం కూడా యీ వుత్తరం లో చేరుస్తావా.'
'అలాగే'
చంద్రమౌళి ని సాగనంపి శ్రీనివాస్ బజార్లన్నీ పిచ్చివాడిలా తిరిగి తిరిగి యింటికి చేరుకున్నాడు. చంద్రమౌళి చెప్పిన లాయరు తో సంప్రదించి రాజేశ్వరి కి విడాకులు యేర్పాటు కూడా చేయించాడు.
రాజేశ్వరి బండి యెక్కడం ఆ బండి చక్రాలు శ్రీనివాస్ గుండెల మీంచి పోవడం త్రుటిలో జరిగాయి. శీనివాస్ చచ్చిపోలేదు. అతని అంతరాత్మే ఆ చక్రాల క్రింద చితికి పోయింది రాజేశ్వరి కోసం. రాజేశ్వరి మాటలు చెవిలో రింగు మంటూనే వున్నాయి. 'జరిగింది జరిగింది. విడాకుల కి త్వరగా ఏర్పాట్లు చేయించండి ' అని.
సంగతి పూర్తిగా విని చిన్నగా నవ్వి 'యిందులో మీ తప్పేమీ లేదు. యిది ఆవిడ రాసిన ఉత్తరమే కదూ' అన్నాడు లాయరు శ్యామసుందరం.
'అవునండి' శ్రీనివాస్ జవాబు చెప్పాడు.
నోటీసు ప్రిపేరు చేయించి వుంచాను . సంతకం చేస్తే పంపేయ వచ్చును.
శ్రీనివాస్ కళ్ళు నోటీసు ని పరికించాయి.
పి.శ్యామసుందరం
బి.ఎ.బి.యల్.
యిందు మూలమున తెలియ జేయునది ఏమనగా నా క్లయింట్ శ్రీ శ్రీనివాస్ కూ మీకు ఆర్య సమాజం లో శాస్త్గ్రోక్తంగా జరిగిన వివాహం చట్ట సమ్మత మైనదని తెలియనైది- నా క్లయింటు కూ మీకు జరిగిన కుటుంబ కలహాల్లో మీకై మీరు కోరగా విడాకులు యిచ్చుటకు నిర్ణయ మైనది. పిల్లవాడిని తండ్రితో వుంచుటకు మీకే సమ్మతము కనుక ఆ విధముగా జరుగ నైనది. మీరు వ్రాత మూలకముగా తెలిపిన విధముగా పిల్లవాని క్షేమ సమాచారములు మధ్యవర్తి ద్వారా తెలియ జేయుటకు ఎట్టి ఆక్షేపణయూ లేదు. మీరు మీ యిష్ట ప్రకారము చేయవచ్చును. తదుపరి విషయములు కోర్టు నిర్ణయించు ను.
క్లయింట్ లాయరు
శ్రీనివాస్ శ్యామసుందరం
సంతకం చేస్తుంటే టప్పున రాలి పడింది శ్రీనివాస్ కంటి నుంచి కన్నీటి బిందువు వొకటి. అతని ఆలోచనలు తెగిపోయాయి. రెండు మూడు వారాల తరువాత రెండు మూడు ప్రదేశాలు తిరిగి తిరిగి నోటీసు వాపసు వచ్చింది. ముకుందం వ్రాసిన ప్రకారం రాజేశ్వరి రాజమండ్రి పొలిమేరలు దాటలేదు. కానీ యెందుకో రకరకాల అడ్రసులు మార్చుకుని నోటీసు మళ్ళీ మొదటి స్థలానికే వచ్చింది? శ్రీనివాస్ కి అంతు పట్టలేదు. రెండోసారి పంపిన నోటీసు కూడా అలాగే తిరిగి వచ్చేసింది.
చంద్రమౌళి అన్నాడు 'ఆవిడ యింక యీ పేచీ ' పూచీల కి కూడా యిష్టపడడం లేదేమో. ఏం చేస్తాం. అసలు దీనికి కారణం సగానికి సగం ఆవిడ తల్లి పద్మావతే కనిపిస్తుంది. మిగిలిన భాగంలో సగం దేవదాసు అయితే మరో సగం రాజేశ్వరి పంచుకుంది. యింక నోటీసు లు కూడా అనవసరమే అనిపిస్తోంది . శ్యామసుందరం గారూ అదే మాట అన్నారు శ్రీనివాస్ కాలంతో పరుగులు పెట్టాడు. రెండు , మూడు నాలుగు నెలలు దొర్లిపోయాయి. నోటీసు పంపడం లో అధ్యాయం పూర్తీ అయిపొయింది అది వాపసు రాగానే. అటు తరువాత రాజేశ్వరి దగ్గర నుంచి యెటువంటి కబురూ రాలేదు. శ్రీనివాస్ బాబు కి తల్లీ తండ్రి అయ్యాడు.
'ఆవిడను అలా వదిలేయడం అంత న్యాయంగా అనిపించటం లేదు మాష్టారూ' కృష్ణ ప్రియ ధైర్యం చేసి అడిగింది. శ్రీనివాస్ రెప్ప వేయకుండా చూస్తూ అన్నాడు.
'ఒద్దని వెళ్ళిపోయాక తనని పిలిపించుకునే ఔదార్యం నాకు లేదు కృష్ణా అందరూ నేనే వదిలేశాననీ, త్రాగుడి కి తిరుగుళ్ళ కీ నేను చేసే ఖర్చులు సరిపోవడం లేదని అంటున్నారు, పైన భగవంతుడున్నాడు. తప్పేంత వరకూ నాదో నిర్ణయించేందుకు. అందరిలా నువ్వూ అనుకుంటున్నావా?'
'ఉహూ అదేం లేదు మాష్టారూ. పిల్లడు తల్లికి దూరం అయ్యాడు!.....'
'అది వాడి దురదృష్టం కాదు, నాది. పువ్వుల్లో పెట్టి పూజించాలను కున్నాను. దరిద్రం యిలా చేసింది.'
'పాపం ' కృష్ణ ప్రియ చూపులు బాబు మీదికి మళ్ళాయి. కళ్ళు తెరచినప్పటి నుంచీ చూస్తున్న ఆ పిల్ల మీద వాడికి ప్రత్యేకం మమత లేకపోలేదు రెండు చేతులూ చాపి ముందుకి వురుకుతుంటే బిక్క మొహం వేసిన శ్రీనివాస్ చూపులకి దూరంగా బాబుని లాక్కుపొయేది.
చంద్రమౌళి భార్యా అన్నారు చాలా సార్లే: 'నువ్వింక పెళ్లి చేసుకోవాలోయ్ శ్రీనివాస్. ఎన్నాళ్ళిల్లా వొంటరిగా బ్రతుకుతావు. పిల్లడు తల్లి లేని పోషణ లో మరో విధంగా తయారయే ప్రమాదం వుంది. నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి.
విరక్తిగా నవ్వాడు శ్రీనివాస్ : 'ఒద్దండి యింక యీ జీవితానికి ఆ ప్రసక్తి లేదు...'
'అదేవిటి నీకు యాభై యేళ్ళు దాటాయను కుంటున్నావా?' మందలింపు గా అన్నాడు చంద్రమౌళి.
'నాకు పిల్లని ఏవరిస్తారు?'
'టైమొస్తే నీ చుట్టూ ప్రదక్షణం చేస్తారు.'
చంద్రమౌళి అన్నమాటలు అబద్దం కాలేదు. అతనన్నట్లు గానే నెలరోజుల్లో నే ఐదారు సంబంధాలు వచ్చాయి. శ్రీనివాస్ వేటినీ లెక్కచేయలేదు. అతని మనసులో మాటిమాటికీ ప్రత్యక్షం అవుతోంది యీ మధ్య మరీ అపురూపంగా ఒకానొక ప్రతిబింబం . రెండు నెలలు గడిచాయి. శ్రీనివాస్ కంగారుగా రెండు బట్టలు సంచీ లో వేసుకుని రాజమండ్రి పొగలు క్రక్కే ఆవేదనతో పరుగులు పెట్టాడు. అతనికి టెలిగ్రాం వచ్చినప్పటి నుంచీ అతలాకుతలం అయిపోతూనే వున్నాడు.
