Next Page 
చదరంగం  పేజి 1

               
                            చదరంగం
                                                        ----- కుమారి గంటి వెంకటరమణ

                              
    
    గంట గణగణా మోగించి హారతి ఇచ్చి ముఖాన కొంచెం ఎర్రకుంకం పెట్టుకొని  ఎదురుగా ప్రసాదం కోసం నిలబడ్డ భర్త ముఖాన కాస్త పెట్టి ప్రసాదాన్ని నోట్లో వేసింది భారతి, భర్త మొహంలోకి తదేకంగా చూస్తూ నిమిషంపాటు కళ్ళు మూసుకొని భక్తిగా నమస్కరించాడు వేణుగోపాల్.
    "ఏం భక్తి!" భారతి నవ్వింది.
    "దేని కోసం?" రెట్టించాడు వేణుగోపాల్ చిలిపిగా.
    "పోండి!" నవ్వుతూ కదిలి వెళ్ళిపోయింది.
    
                             *    *    *

    "నువ్వు బాధ పడకు, భారతీ! నీకేం లోటు? నేను నీకు అండగా ఇలాగే ఎప్పటికీ ఉండిపోతాను. మనకేం తక్కువ, చెప్పు?" మంచంమీద బోర్లా పడుకొని శూన్యంలోకి విషాదంగా చూస్తూ సర్వం మరిచి పోయిన భారతికి దగ్గరగా వచ్చి మంచంమీద కూర్చుని తలమీద చేయి వేశాడు వేణుగోపాల్.
    భారతి మాట్లాడలేదు.
    "నీ బాధ నాకు అర్ధం కాదు. నిన్ను నేను ఎలా ఓదార్చాలో కూడా తెలియడంలేదు. 'పురాకృత కర్మ ఫలం' ఎంతటి వారైనా అనుభవించక అప్పదంటారు. మనం చేయగలిగినన్ని చేశాం. ఇంకేం చేస్తాం, బారతీ? నువ్వు విచారించకు." వేణుగోపాల్ కళ్ళు మెరుస్తున్నాయి,కిటికీలోంచి పడే సూర్యకిరణాలు అతని కన్నీటిని సూటిగా భారతికి చూపిస్తూ. చటుక్కున లేచి కూర్చుంది. "ఏమండీ! నా కిక పిల్లలు పుట్టరా? నే నిలాగే..." భారతి ఆవేదన మంటలా ఆకాశాన్ని అంటుకుంటూంది. వేణుగోపాల్ భుజంమీద తల వాల్చి వెక్కివెక్కి ఏడవసాగింది.
    "మాతృప్రేమ అంతటిదా, భారతీ!" వేణుగోపాల్ గొంతులో ఘనీభవించిన దుఃఖాన్ని మింగుతూ మధ్య మధ్య తడబడుతూ భార్య వీపుమీద చేయి వేసి అనురాగంతో నిమరసాగాడు. భర్త ముందు బాధను వెళ్ళగక్కి నిశ్శబ్దంగా ఉండిపోయింది భారతి. మనసంతా మొద్దుబారిపోయింది.

                              *    *    *

    కారు గారేజీలో పెట్టి మెట్లమీద బూట్లను టకటక లాడిస్తూ ఈల వేసుకొంటూ వచ్చిన వేణు గోపాల్ ఉత్సాహం ఒక్కసారి చచ్చిపోయింది. గుండెలు పిండే ఆవేదన క్షణంలో అంకురార్పణ చేసి మనసంతా ఆవరించుకొంది. పొద్దున్న తనే భార్యను లాలించి కోర్టుకు బయలుదేరాడు. అప్పటినుంచీ భారతి మంచంమీద అలాగే పడుకొని ఉంది. నుదుట కుంకం కాస్త పక్కకు జరిగింది. జుట్టు పూర్తిగా చెల్లా చెదురైపోయింది. కళ్ళు దేనికోసమో వెతుకుతున్నట్టు లోతుకు పోయాయి. భర్త గుమ్మంలో అడుగుపెట్టగానే ఒకసారి అటువైపు చూసింది.
    అమాయికంగా తప్పు చేసినదానిలా బాధ పడుతూ నాకు తల తిప్పుతూ పరుగున వచ్చి భర్త కాళ్ళను పట్టు కొంది. "క్షమించండి! ఇక ఎప్పుడూ దేని కోసమూ ఏడవను. మీరు నాకు ఉండగా ఇంకేం లోటు? పొరబాటై పోయింది. నన్ను క్షమించరూ!" వెక్కి వెక్కి ఏడుస్తూ భర్త కాళ్ళను చుట్టేసిన భారతిని చూసి అయోమయంగా నవ్వుకున్నాడు వేణుగోపాల్. "లే, భారతీ! ఎందుకూ? ఫరవాలేదు. నీ బాధ నా దగ్గిర కాకపోతే  ఇంకెవరి దగ్గిర చెప్పుకుంటావు? అన్నట్లు మంచి నాటకం వచ్చింది. వెడదామా?" భారతిని లేవదీసి ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. మౌనంగా వంటఇంటి వైపు నడిచి వెళ్ళింది భారతి.
    
                              *    *    *

    "నాటకం ఎలా ఉంది. భారతీ?" రాత్రి అడిగాడు పక్కమీద పడుకుంటూ.
    "చాలా బావుంది." మంచం పక్కన కుర్చీలో కూర్చుని భర్తకు తమలపాకు చికాల లందిస్తూంది భారతి.
    బయట వెన్నెల కిటికీలోంచి భారతి మొహంమీద పడుతూంది. కోలమొహంలో, అమాయికత్వాన్ని గూడు కట్టుకున్న అందమైన కళ్ళలో బాధల గాథలు పుటల్లా దొర్లుతూ బారతి మొహానికి మరింత కళ తెచ్చి పెడుతున్నాయి.
    "చూశావా, భారతీ? నేను అదృష్టవంతుణ్ణి అంటే నువ్వు నమ్మవు."
    "ఎందుకో ఆ అదృష్టం?" నవ్వుతూ కొంటెగా చూసింది.
    "నీ అందాన్నీ, నీ అమాయికత్వాన్నీ చూస్తూంటే నాకు చిన్నపిల్లలు జ్ఞాపకం వస్తూ ఉంటారు. నువ్వే ఈ ఇంటికి చిన్నపిల్లవైపోయావు. ఇక వేరే చిన్నపిల్లలు దేనికి?"
    "బాగుంది వరస! ఈవేళ ఏమిటి విశేషం?"
    మంచం మీంచి లేచి పడక కుర్చీ వెనక నిలబడి భారతి భుజం మీదుగా ముందుకు చేతులు వేసి నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
    "మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. మీరు ఎంత అమాయికులో భగవంతుడికి తెలుసు!" చేతికి చుట్టిన చిలకనువెనక్కువాలి భర్త నోటికి అందించింది.
    "చాలు, భారతీ. ఈ జీవితకాలం నీతో ఇలా గడిపేస్తే అంతే చాలు. ప్రేమ వివాహాలు అంటే నాకు అతం శ్రద్ధ లేదు. వివాహం తరవాత ప్రేమలో చూడు, ఎంత తీసో?"
    "ఇవాళ మీ కేదో కవిత్వం పిచ్చి పట్టుకొంది. కాక పొతే ఎవరైనా ఆవహించారేమో? నలుగురూ వింటే నవ్విపోతారు. ముప్పై ఏళ్ళు మీదపడ్డా ఇంకా ఏమిటీ సరసాలు అర్ధం లేకుండా!" భారతి కోపగించుకొంది.
    "ముప్పై ఏళ్లకే ముసలివాళ్ళం కాలేదు, భారతీ. ఇంకా మనం చిన్నవాళ్ళలో జమే."
    "చాల్లెండి." భారతి కోపం ఎగిరిపోయింది.
    
                              *    *    *

    "వెళ్ళకపోతే ఎలా? ఎంత ప్రమాదంగా ఉన్నదో, ఏమో? బయలుదేరి వెడదాం పద, భారతీ." తను ఖంగారు పడుతూ భార్యను ఖంగారు పెట్టసాగాడు వేణుగోపాల్.
    "ఫరవాలేదులెండి. రెండు రోజుల్లో అదే తగ్గిపోతుంది." భారతి ఉదాసీనంగా అన్నది. కానీ వేణుగోపాల్ వినిపించుకోలేదు. "నువ్వు వెళ్ళి తీరాలి. నీతో బాటే నేనూ వస్తాను." హడావిడిగా పెట్టె సర్దేసి భారతిని బలవంతంగా ప్రయాణం చేయించాడు.
    భారతి అక్క రాజ్యలక్ష్మికి జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వచ్చినప్పటినుంచీ వేణుగోపాల్ మనసు అతలాకుతలమై పోతూంది. భారతి వేదనకు అంతులేదు. 'ఈ సమయంలో భగవంతుడు అన్యాయం చేస్తే? అక్క.....అప్రయత్నంగా భారతి మనసు ఆలోచించడం మానేసి ఎదురు తిరిగింది.
    అక్కడ ఏమైనా అయితే నేను భరించలేదు. నేనా సుడిగుండాన్ని చూడలేను. అందులో నేనూ చిక్కుకు పోయి సర్వనా..." భారతి నోటిని చేత్తో మెల్లగా మూసేశాడు. "భారతీ! నీ అక్క....నీ రక్తం పంచుకొని పుట్టిన అక్క కోసం ఎలాంటి భాధనైనా భరించక తప్పదు." వేణుగోపాల్ కు ఎదురు చెప్పి నిలిచే సాహసం గత పది సంవత్సరాలుగా భారతికి లేదు.

                                 *    *    *
    రాజమండ్రిలో దిగి గోదావరి దాటి బస్సు ఎక్కి వెడితే వస్తుంది భారతి అక్క రాజ్యలక్ష్మి ఊరు.
    మరునాడు సాయంత్రం అసుర సంధ్యవేళ గుమ్మంలో జట్కా దిగి ముందు తనూ, వెనక భర్తా లోపలికి దారి తీశారు. ఈ ఇల్లు వదిలి సుమారు పది సంవత్సరాలు దాటిపోయాయి. పెళ్ళి అవడం, వేణుగోపాల్ తో మద్రాసు చేరుకోవడం జరిగింది. అడపా తడపా బావ అవధానిగారు రమ్మన్నా వీలులేదనో, ఇప్పుడు కాదనో సర్ది వ్రాసేసేది. కాని, ఇప్పుడు మాత్రం కాదనో సర్ది వ్రాసేసేది. కాని, ఇప్పుడు మాత్రం తప్పించుకోలేకపోయింది. అలాగని అక్కమీద మమకారం చంపుకోవడం సాధ్యం కాదు. "పిల్లలకు ఉంచండి" అంటూ అప్పుడప్పుడు భర్తకు తెలియకుండా పంపించేది ఉన్నంతలో కొంత డబ్బు. ఇప్పుడు చిన్న కారు, పెద్ద బంగళా, ఎస్టేటుకు అధికారిణి అయిపోయినా భారతిలో అడవి మంటలా ఏదో బాధ పైకి వస్తూనే ఉంటుంది. దానికి తోడు ఈ ప్రయాణం మరీ తప్పించుకోలేనిదిగా తయారైంది.
    వేణుగోపాల్ వంటి మనుషులూ ఉంటారో లేదో తెలియదు కానీ భార్య చేసే ప్రతి పనినీ అతడు సగర్వంగా ఆమోదిస్తాడు. వేణుగోపాల్ ముందు అవధాని గారు పై కండువాతో ఎన్నోసార్లు కళ్ళనీళ్ళు మరుగు పరచాలని ప్రయత్నించాడు.
    "లేదు, అన్నగాడూ! మీకే భయం లేదు. మానవుడు చపలచిత్తుడు. భగవంతుడిపట్ల నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. అటువంటిది జరగకూడదనే ఇలా అప్పుడప్పుడు మేలుకొలుపు పాడుతూ ఉంటాడు." వేణుగోపాల్ అనునయంగా ఓదార్చాడు అవధాని గారిని.
    "నాకు తెలుసు, తమ్ముడూ, కాలం ఎలాటి ముద్ర వేస్తుందో? రాజ్యం గురించి నాకు చింతలేదు. చావు పుట్టుకలు అందరికీ సామాన్యమే. కానీ, పిల్లల విషయమే..." అవధానిగారు పైపంచతో కన్నీళ్ళు తుడుచుకొంటూ ఆగిపోయారు.
    "వదినగారి కేమీ భయంలేదు. ఆవిడ క్రమంగా కోలుకొంటారు. పిల్ల విషయం మీరు ఆలోచించకంది." వేణుగోపాల్ ఆలోచనలతో కొట్టుకొంటున్నాడు.
    పక్క గదిలో రాజ్యలక్ష్మి ఆయాసంతో ఊపిరిపీలుస్తూంది. చిక్కి శల్యమై మంచానికి అంటుకు పోయిన రాజ్యలక్ష్మిని చూసి ఘొల్లుమంది భారతి, "అక్కా!" అంటూ.
    "భారతీ! పిల్లలు!" రాజ్యలక్ష్మికి ఎక్కువగా మాట్లాడే శక్తి లేదు.
    భారతి చుట్టూ చూసింది. రెండు కళ్ళలా, దీపాల్లా వెలిగిపోతూ మంచానికి దగ్గరగా వచ్చి అయోమయంగా దిక్కులు చూస్తున్నారు పిల్లలిద్దరూ ఒకే ఎత్తులో పోతపోసినట్లు ఉన్నారు. భారతి హృదయం ఎగిసిపడుతూంది. అణువణువునా రక్తం పొంగుతూంది. భారతి కళ్ళలో వేదన అంతకంతకు మరో రూపంలో విజ్రుంభించి చిందులు తొక్కుతూ మాతృప్రేమను రెచ్చగొట్టుతూంది.
    మంచానికి దగ్గరగా ఉన్న పిల్లలిద్దరి మీదా చేతులు వేసి రాజ్యలక్ష్మి కన్నీరు కార్చింది. "చూడు, చెల్లీ! పదేళ్ళు పెంచాను. నా బిడ్డలు నాకు బరువు కాదని గర్వించిపోయాను. నా అదృష్టం పండి కలలు వరించి భగవంతుడు చూపిన దయకు కృతజ్ఞతగా చిరకాలం నా గుండెల్లో దాచుకొందామని ఆశపడ్డాను. కానీ భగవంతుడు నన్ను పిలుస్తున్నాడు. నా బిడ్డల్ని దిక్కులేని వాళ్ళను చేసి పోతున్నాను...
    "భారతీ! అమ్మ మొహం తెలియని నువ్వు 'అమ్మ'లు పడే బాధ పదేళ్ళుగా గ్రహించే ఉంటావు. నిన్ను నేను కోరేది ఒక్కటే."
    భారతి కళ్ళు అగ్నిగోళాల్లా ఉడికి పోతున్నాయి. శిలాప్రతిమలా కూర్చుని కన్నీరు కారుస్తూనే ఉంది.
    "నా బిడ్డ్లల్ని తల్లిలేని వాళ్ళను చెయ్యకు. పుణ్యం ఫలించి నా బిడ్డలు నీ నట్టింట కాలు పెట్టిన ముహూర్తాన నీ ఇంట్లో పాప 'కెవ్వు' మనవచ్చు. మాట్లాడవేం, భారతీ?"
    భారతి దృష్టి పిల్లలమీద పడ్డది. అమాయికంగా ఉన్న కళ్ళలో ప్రతీకారం కనిపిస్తూంది. అందంగా దువ్విన క్రాఫు గాలిలో ధూళితో ఏకమై బిరుసుగా పైకి లేచింది. లేత గుండెల చాటున కరుకుతనం స్పష్టంగా కనిపిస్తూంది. సున్నితంగా వేళ్ళాడుతున్న చేతులు అనేక రూపాలు ధరిస్తున్నాయి. ప్రపంచంలో చికాకులుగా బతికే ప్రజల్లో ఎంతమంది దౌర్జన్యాన్ని లేవదీసి గుండెలు తీసిన బంట్లు కావడంలేదు? భారతి హృదయం నవనీతంలా కరిగిపోయింది. తన బిడ్డలు అలా కాకూడదు. తన బిడ్డలకు దిక్కు తానే ఉంది. ప్రపంచంలో వాళ్ళను తీర్చిదిద్దే బాధ్యత తల్లిని మించిన తల్లిగా తనకు ఉంది. దృఢ నిశ్చయానికి వచ్చేస్తూ, "నీకేమీ భయం లేదక్కా! నీ పిల్ల లెన్నడూ దిక్కులేని వాళ్ళు కారు. నవ్వు లేచి తిరిగి మామూలు మనిషివి అవుతావు" అంది.
    నీరసంగా నవ్వింది రాజ్యలక్ష్మి. "అవి వట్టి మాటలు, భారతీ! నా కిక బతికే యోగం లేదు. నా పిల్లలు..." రాజ్యలక్ష్మి కళ్ళనిండా నీళ్ళు కమ్ముకున్నాయి.
    భారతి హృదయం బాధతో మెలికలు తిరగసాగింది. "నిజమే, అక్కా! మన జీవితాలు షేక్స్ పియర్ అన్నట్లు వట్టి నాటకరంగాలు. ఎప్పుడో ఒకనాడు ఈ రంగంనుంచి అన్ని పాత్రలూ నిష్క్రమిస్తాయి, ముందూ వెనకగా." భారతి బాధ అర్ధం చేసుకోగలిగే శక్తి పక్కగదిలో సంభాషణ వింటున్న తోడల్లుళ్ళు ఇద్దరిలో అవధానిగారికే బాగా ఉంది.
    రాజ్యలక్ష్మి మెల్లగా అంది: "ఇందులో నాటకాలేమీ లేవు. నా బిడ్డలకి తల్లివై తల్లిలా పెంచు." ఎంత మెల్లగా అన్న అంత దృఢంగా, ఆజ్ఞాపించి నట్లు కనిపిస్తూంది.
    భారతి ఇంకా ఏడుస్తూనే ఉంది. మెల్లగా పిల్లల వైపు చూసింది.
    "పిన్ని ఏడుస్తూంది. వద్దని చెప్పండి, బాబూ..." తల్లి మాట విని పెద్దవాడు వచ్చి భారతి ఒళ్ళో కూర్చున్నాడు. చిన్నవాడు భారతి మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళలోంచి కారుతున్న కన్నీటిని చిన్నచిన్న చేతులతో తుడుస్తూ ఆరిందాలా ఊరడిస్తున్నాడు.
    రాజ్యలక్ష్మి ఓపికతో అంది: "కవలలు కదూ! నీకు గుర్తు తెలీదు, భారతీ! ఇద్దరూ ఒకేలా ఉన్నారు. పెద్దవాడు రాము. రెండోవాడు రవి."
    అంతకంతకు రాజ్యలక్ష్మి అలిసిపోతూంది. "నాయనా, రామూ! వెళ్ళిపోతున్నాను. రవీ! ఇకనుంచి పిన్నీ మీకు అమ్మ." రాజ్యలక్ష్మికి అంతలోనే మైకం కమ్మేసింది.

                            *    *    *

    కారుచీకటి దట్టంగా అలుముకొంది. ఉండి ఉండి చినుకులు లెక్కగా పడుతున్నాయి. ఉరుములు గుండెల్లో గరగర లాడిస్తూ దొర్లి పోతున్నాయి. కళ్ళను చీలుస్తూ మెరుపులు ఒకటే మెరుస్తున్నాయి. పశ్చిమంగా కాటుక కొండలు దట్టంగా అలుముకొని శాశ్వతంగా నిలిచిపోయాయి. వాయుదేవుడు స్తంభించిపోయాడు.   


Next Page 

WRITERS
PUBLICATIONS