Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 32


    శ్రీనివాస్ పరుగున వెళ్ళాలనే మనసుని అదిమి పెట్టాడు. యిద్దరూ రిక్షా లో బయలు దేరారు. సందులు గొందులు దాటింది రిక్షా. సాయంత్రం ఆరుగంటలు, ఏడు ఎనిమిది దాటిపోయింది. యింటి లోపలికి వెళ్ళిన సూటూ వాలా బయటికి వచ్చాడు. అతను వెళ్ళిపోయిన పది నిమిషాలకు సుభద్ర తలుపు తెరుచుకుని వీధిలోకి వెళ్ళిపోయి చీకట్లో కలిసిపోయింది. శ్రీనివాస్ కళ్ళకి కాంతి మీద కనిపోస్తూనే వుంది. కొంచెం లైటు చూసి పోల్చుకో గల్గింది కానీ అదీ అస్పష్టం గానే.
    'కొత్తవారా?'
    శ్రీనివాస్ ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోలేదు. నెమ్మదిగా 'పిన్ని నేను శ్రీనివాస్ ని' అన్నాడు.
    నిశ్చేష్టురాలైంది సుభద్ర. అతను గమనిస్తూనే వున్నాడు.
    'నేను వచ్చాను పిన్నీ'
    'యిక్కడికి యెందుకు వచ్చావు? సుభద్ర కంఠం కంచులా మ్రోగుతోంది. శ్రీనివాస్ యిలాంటి యిళ్ళ వైపు వస్తున్నాడా? యీ అనుమానం కనిపిస్తోంది ఆ స్వరం లో.
    'దేనికి వచ్చావు?' మళ్ళీ అడిగింది.
    'మీకోసం.'
    'నాకోసమా?' సుభద్ర కనుబొమ్మలు ముడిపడి పోయాయి.
    క్రీనీడలో స్పష్టంగా కనిపిస్తోంది శ్రీనివాస్ కి.
    'అవును పిన్నీ మీ కోసమే. రండి మనింటికి.' ఆప్యాయంగా అన్నాడు శ్రీనివాస్. చివికి పోయిన అతని బ్రతుకులో జీవితం పొడుగునా ఎదురు చూసిన మనిషి కనిపించగానే అతనికి దుఃఖం ఆగింది కాదు.
    'మనం అలా వెళ్లి మాట్లాడుకుందాం రా' శ్రీనివాస్ చేయి పుచ్చుకుని కొద్దిగా దూరంలో మున్సిపల్ పార్కు వైపు తీసుకు వెళ్ళింది. అతనికి ఆవిడ మీద యెటువంటి చెడు భావమూ కనిపించలేదు. పైపెచ్చు తన తల్లి చిటికిన వేలు అందుకుని నడుస్తున్నట్లే అనిపించింది. పచ్చిక మీద చతికిల పడ్డాడు. అతని కళ్ళల్లో తిరిగే బిందువులు వెండిలా మెరుస్తున్నాయి పార్కులో దీపం కాంతి పడి.
    సుభద్ర ఒకోటోకటిగా జరిగిన విషయాలు యేవీ దాచకుండా చెప్పేసి యేడుస్తుండిపోయింది చాలాసేపు. జగదీశ్ తో బ్రతకాలని బ్రతుకుని నడి బజారు చేసుకుని అందరూ త్రొక్కుతుంటే ఓరిమి పట్టి చావలేక బ్రతుకుతూ ఏడుపు పంచుకునే వాళ్ళు లేక నవ్వుతూ గడుపుతోంది జీవితాన్ని. పూర్తిగా చెప్పేసి ! 'నువ్వింక వెళ్ళిపో శ్రీనివాస్. నాకోసం యింటి దగ్గర లేనని తలుపులు పగలగొట్టి నానా రభసా చేస్తారు స్నేహితులు.' అని నవ్వింది బలవంతంగా.
    శ్రీనివాస్ లేవలేదు.
    'వెళ్ళిపో శ్రీనివాస్. యిలాంటి యిళ్ళ చాయలకి రాకు. నామీద వొట్టేసి చెప్పు సుభద్ర ఏడుస్తూ అంది.
    'ఒట్టు పిన్నీ! నాకు యిటువంటి కోరికలు లేవు. మీకోసమే వచ్చాను' శ్రీనివాస్ జీవితంలో మొదటి నుంచీ జరిగిన అనుభవాలు చెప్పుకు వచ్చాడు. వొకరికి యిద్దరు ఆప్తులై ఆ క్షణాల్లో తల్లీ కొడుకులై వోదార్చు కున్నారు. దుఃఖాన్ని పంచుకున్నారు.
    'మీరు రండి పిన్నీ, మన యింట్లో పిన్ని తప్ప మరెవరూ లేరు' శ్రీనివాస్ సుభద్ర కాళ్ళ మీద చేయి వేశాడు.
    'లేదు. నేను రాలేను. నావల్ల నీ భవిష్యత్త్ పాడై పోతుంది. ఈ జీవితానికి అలవాటు పడిపోయాను. నన్ను తిట్టుకో! నేను రాలేదనే కోపంలో. ఈ మొహాన్ని నలుగురికీ చూపించాలేను. నేను చచ్చిపోయానని అనుకుంటే ప్రపంచం, అదృష్ట వంతురాలిని. నీతో వచ్చి నీకున్న పరువు- ప్రతిష్ట లు........'
    'అవేవీ నన్ను రక్షించవు. నాతొ రండి. మీకు నేనున్నాను. నాకూ యెవరూ లేరు అన్నపూర్ణ పిన్ని తప్ప.'
    'యెంత వెర్రి వాడివి నువ్వు. ఈ ప్రేమ నీలోనే వుంచుకో . పాపిష్టి పిన్ని చరిత్ర హీనురాలై పోయినా, నీ మాట కాదన్నదని నన్ను తిట్ట్టుకోకు. నాకు మళ్ళీ సంఘంలో ఘరానా గా బ్రతకాలని లేదు....'
    'ఈ జీవితాన్ని తప్పించుకోలేరా పిన్నీ. అమాయకంగా అన్నాడు శ్రీనివాస్.
    'ఈ వ్యామోహం లో పడి శలభం లా మాడిపోతున్నా తప్పించుకో లేరు. నన్ను బాధపెట్టకు. నీ పవిత్ర ప్రాంగణం లో అడుగు పెట్టాలన్నా నా మనసు వొప్పుకోవడం లేదు.'
    'పిన్నీ'
    'నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. పసివాడు కూడా వున్నాడంటున్నావు.'
    శ్రీనివాస్ నెమ్మదిగా అన్నాడు: 'నా దగ్గరికి కృష్ణ ప్రియ అనే పిల్ల వస్తుంది పిన్నీ. ఆ పిల్లకు యెవరూ లేరు. హాస్టల్లో వుండేది యిన్నాళ్ళూ. పరీక్ష లయ్యాక ట్యూషన్లు చెప్పుకుంటూ మనింటికి దూరంగా వుంటోంది. ఆ పిల్లని కనుక్కో వాలని వుంది.
    సుభద్ర కళ్ళు మెరిశాయి: 'పిల్ల యెలా వుంటుంది?'
    'చాలా అందంగా.'
    'ఆ అమ్మాయి కి యిష్టమేనా?'
    'నేనింకా కనుక్కోలేదు.'
    'వాళ్ళు యెవరూ?'
    'బ్రాహ్మణులు.'
    'వోప్పుకుంటారా?'
    'అదే తెలుసుకోవాలి.'
    'పోన్లే ఓ పని చెయ్యి. ఆడది బ్రతుకులో వొంటరిగా వుండలేదని నా సంగతి దాచకుండా చెప్పెయ్యి. నువ్వూ గొప్పవాడివి అయ్యావు. నీ సంగతి తెలిసే నిన్ను కాలదన్నుకుంటే అవివేకి అనుకోవాలి.'
    'కుల భావం చాలా వుంది ఆపిల్ల కి.'
    'చెప్పి చూడు. సిగ్గు పడకు నా విషయం చెప్పేందుకు. ఆలోచిస్తే తనకి కష్టం సుఖం అర్ధం అవుతాయి.'
    'మీరూ రండి పిన్నీ. 'శ్రీనివాస్ కి సుభద్ర ని అలా వదిలి పెట్టేయాలని లేదు.
    'కన్నవాళ్ళే ఛీ, పొమ్మంటే యింకా నాకోసం దేనికి ప్రాకులాడుతున్నావు......
    'మీయింటికి వెళ్ళారా?' ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనివాస్.
    ' మాయిల్లు  విరక్తిగా నవ్వింది సుభద్ర. 'నేను వెళ్లాను దేవదాసు దగ్గర నుంచి సింహాచలం తీసుకు వెళ్లక ముందు. వదినలు వీదిలోంచే తిట్లూ, శాపనార్ధాలు ప్రారంభించారు. అమ్మ వంట యింట్లోంచి బయటికి రాలేదు.'
    'అప్పుడు అమ్మమ్మ రమ్మన్నది కదా'
    'యెంత పిచ్చివాడివి? ఆరోజుల్లో నేను మీ నాన్నకి భార్యని. పైగా వితంతువు ని. నాకు యిక్కడ చాకిరి చేసేందుకు పని ఖాళీగా వుంది. అన్నయ్యలు అందుకే మరీ మరీ చెప్పి పంపారు. యేటా కాన్పులతో నీరసించిన శరీరాల్తో వదినలు యింటి పనేం చేయగలరు? భార్యల మధ్య నా విలువ గుర్తించారు. చాకిరి కోసం పిలిపించారు.'
    'పోనీ ఆ చాకిరీ యిప్పుడే చేస్తానని చెప్పలేక పోయారా?'
    'అన్నయ్యలకి యెదిగిన ఆడపిల్లలు వున్నారు. వాళ్లకి నేను అక్కడే వుంటే పెళ్ళిళ్ళు కావు. పైపెచ్చు అది వేశ్యా గృహం క్రింద చలామణి ఆయె అవకాశం వుందిట. పెద్దన్నయ్య యించుమించు కొట్టేందుకు సిద్దం అయేడు. చిన్నయ్యది మొదటి నుంచీ శాంత స్వభావమే......
    రెండు చేతులూ జోడించి నమస్కారం చేసి : 'పిల్లలున్న పేదవాళ్ళం. మమ్మల్ని మామానాన బ్రతకనివ్వు . వున్నదాంట్లో పిల్లల కేదో దారి చూపిస్తాం. నువ్వు యిక్కడే వుంటే వాళ్ళూ నీలా తయారవుతారు. నీకు కొంత డబ్బు యిస్తాను వెళ్ళిపో ,' అన్నాడు.
    'మీరు వచ్చేశారు.'
    సుభద్ర నవ్వింది: 'మెడ పట్టుకుని గెంటించుకోలేదు. అదృష్టవంతురాలిని అంతవరకూ. అమ్మ యేడవడం మాత్రం వినిపించింది. ఆ రాత్రి మాత్రం వున్నాను దేవదాసు యింట్లో.'
    'మొత్తానికి చాలా అపాయం అయిన  జీవితం.'
    'పోలీసులు యెప్పటి కప్పుడు అదిలిస్తూ కావలసింది పట్టుకు పోతుంటారు. పీకదాకా తాగి బాకీ పడ్డామని లేనిపోని నిందలు వేసి యిక్కడే వుండిపోయి నానా హింసా పెడతారు కొందరు. ఎందుకులే యివన్నీ. నువ్వూ నీ జీవితం బాగుండాలి.'
    'ఏం బాగో? చూస్తూ చూస్తూ మిమ్మల్నీ నరకం లో వదిలి వెళ్లాలని లేదు పిన్నీ.'
    'యింకా ఏవిటో నీకు లేనిపోని బంధాలు. ఆరోజు తోటే ఆ యింటికి నాకూ ఋణం తీరింది. అందుకే అనుభవిస్తున్నాను. యింకా చిత్రవధ అనుభవించాలి. అప్పుడు గానీ తృప్తి వుండదు.'
    'మీ మీద మీకు అంత కక్ష యేవిటి పిన్నీ '
    'అదంతే ! కొన్ని సరిహద్దులు దాటాక మనిషి తనను తాను చంపుకునే స్థితికి దిగజారి పోతాడు. అదిమాత్రం చేయలేకుండా వున్నాను నేను.'
    'పిన్నీ' బాధగా అన్నాడు శ్రీనివాస్.
    'దేనికి బాధపడతావు? యిప్పుడు ఈ శిధిలం అయిపోయిన శరీరాన్ని నీ యింటికి చేర్చమంతున్నావు. నాకు తెలుసు నేను యెక్కువ కాలం బ్రతకనని. నువ్వు వెళ్ళిపో శ్రీనివాస్.'
    శ్రీనివాస్ చటుక్కున ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా అన్నాడు : 'అప్పుడు యెవరో అన్నారు వొక ఆడపిల్ల వుండాలని.... చెల్లి యేది పిన్నీ?'
    సుభద్ర యేడుపు దిగమింగి అంది: 'డాన్ని నాకు కాకుండా చేశారు. సింహాచలం డాన్ని దేవదాసు దగ్గరే వుంచేశాడు.'
    'ఎందుకూ?'
    'అది పెద్దదైతే ఆటా పాటా నేర్పి ....'
    సర్వం అర్ధమయింది శ్రీనివాస్ ఝాము కోడి కూస్తుంటే లేచి నిల్చున్నాడు: మీకు నేను ద్రోహం చేసి వుంటాను నన్ను క్షమించండి. మీకంటూ యేదైనా చేయాలని పిస్తోంది. అది నాకూ ఆత్మ తృప్తి గానే వుంటుంది. దేవదాసు అడిగినంత డబ్బూ యిచ్చి రేపే పిల్లని తెచ్చుకుని నాదగ్గర వుంచు కుంటాను. దాని భవిష్యత్ బాగుండేటట్లు చూస్తాను. డానికి నేను వున్నాను. తండ్రి సంగతి అనవసరం. కానీ అది మీ ద్వారా నాకు చెల్లెలే అవుతుంది. మరి వస్తాను.' సుభద్ర రెండు చేతులూ జోడించింది : 'కన్నతల్లి ఎటువంటి దైనా ప్రేమలో భేదం వుండదు. డాన్ని కని పెంచిన ప్రేమని బానిసగా వదులు కున్నాను. నీకు నమస్కారం చేస్తున్నాను. నువ్వు సుఖంగా వుండు. పిల్లా పాపలతో......'సుభద్ర ఆశీర్వదించింది. శ్రీనివాస్ వొంగుని సుభద్ర పాదాలు తాకి చీకట్లో కలిసిపోయాడు. పార్కు, నిర్మానుష్యంగా వుంది. చుట్టూ పది గజాల దూరం వరకూ యిళ్ళ చాయలు గానీ, మనుష్యుల అలికిడి గానీ లేదు. సుభద్ర ఏడుపు శ్రీనివాస్ ని వెన్నంటి తరుముతూనే వుంది.

                       *    *    *    *
    రాజమండ్రి చేరుకున్నాక ఎకాయేకీ దేవదాసు యింటికే వచ్చాడు శ్రీనివాస్.
    'డబ్బు గడించావని రాజేశ్వరి ని తీసుకు వెళ్లాలని వచ్చావా?' కటువుగా అన్నాడు దేవదాసు.
    'నాకు ఆడురుద్దేశ్యం లేదు.'
    'మరి నీకు వున్న మంచి వుద్దేశ్యం తెలుసుకోవచ్చా?'
    'ఆ పిల్ల అంటే మా పిన్ని కూతుర్ని తీసుకు వెళ్ళాలని వచ్చాను.'
    'ఎవర్నీ? మాధవినా.'
    'అవును.'
    'డాన్ని సింహాచలం దగ్గర డబ్బు పోసి కొన్నాను.'
    'ఆ డబ్బు నేను యిస్తాను.'
    'ఆరోజుల్లో నేను ఐదు వందలకి కొన్నాను.' యిప్పుడు యిన్నాళ్ళు దాన్ని భరించి నందుకు.'
    'నీకు కావలసిన డబ్బు యిస్తాను. పిల్లని యిచ్చేయి దేవదాస్.
    రాజేశ్వరి బయటకు రాలేదు. తెరవెనుక ఆవిడ కంఠం స్పష్టంగా వింటుంటే శ్రీనివాస్ కి దుఃఖం ముంచుకు వచ్చింది. తనతో గడిపిన ఆక్షణాలు యెంత దూరం జరిపినా చుట్టూ పరిభ్రమిస్తూనే వున్నాయి. ఎందుకిలా చేశావు? అనుకుంటూనే వున్నాడు అతను పదేపదే. ఆడది, ఆవిడకే లేని ఈ ప్రేమా వ్యామోహాలు తనకి దేనికి? చివరికి సర్దుకున్నాడు. తనలో తనే. మళ్ళీ అతనిలో ఏదో భావం తళుక్కుమంది. తాళికట్టిన తన మీద గౌరవం కానీ, స్నేహభావం గానీ , అభిమానం కానీ లేని స్త్గ్రీలో కఠిన శిలని చూస్తె చిత్రం అనిపించింది.
    మాధవి ని భుజాన వేసుకుని వెయ్యి రూపాయలూ యిచ్చేసి హైదరాబాదు మళ్లాడు. యిప్పుడు మాధవి ఐదేళ్ళ పిల్ల ఆరోగ్యంగా జగదీశ్ నే ముంముర్తూలా పోలిన ఆ పిల్లని చూస్తుంటే శ్రీనివాస్ ప్రాణం చివుక్కు మన్నా అమాయకంగా ఆ పిల్ల చేతులు చాపుతుంటే 'నేను అన్నని' అన్నాడు జాగ్రత్తగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS