'అయితే మనిషన్న ప్రతివాడిలోనూ కొవ్వొత్తి వేలుగుతుందేమో? కొందరిలోవేగం వెలిగి చాలాకాలం కాల్తుంది. మరి కొందరి లో ఆలస్యంగా వెలిగి చప్పున కాలిపోతుంది. దానికి కారణం యేమంటారు?'
'ప్రతివానిలో దేవుని ప్రతినిధి అంతరాత్మ వుండబట్టే యేమో?'
'అయితే మనిషి యింకో మనిషిని దూషించటం యెంత పొరపాటు. అలా చేసి తనను సృష్టించిన దేవునే దూషిస్తున్నా డన్న మాట!'
తరవాత కాస్సేపు శెట్టి గారి విషయాలే మాట్లాడుకుంటూ శ్రీనివాస్ అన్నాడు.
'మిమ్మల్ని కలుసుకున్న ప్రతివాడూ మీకో బాధ్యత అప్పచేప్టున్నట్లుంది. ఈ భారం భరించగలిగే త్యాగం మీలో వుంది కాబట్టి సరిపోయింది. మీకుశత్రువు లుండరు. ఉన్నా వారు మిమ్మల్ని ప్రేమించ కుండా గౌరవించకుండా వుండలేరు.'
సూర్యం యెవరి కోసం త్యాగం చెయ్యక పోయినా తన కుటుంబం విషయం లో చేసానని, అలా త్యాగం చేసి జన్మజన్మాల సమ్మందానికి దూరమయ్యానని అనుకున్నాడు. శ్రీనివాస్ తో గడిపిన క్షణాలు జీవితంలో మరుపురానివి. అతనికి దుఃఖం లో కూడా యెదుటి వాళ్ళను నవ్వించగలిగే చాకచక్యం మాటల తీరు వుంది. అతని యీ నేర్పు అందరి మీద పనిచేస్తోంది గానీ విశాలను అతను నవ్వించ లేకపోతున్నాడు. అతను ఆ ప్రయత్నం చేసేటట్లు కనపడదు. సూర్యం కు వాళ్ళ యిద్దరి పరిస్థితి చూస్తుంటే ఒకరి నొకరు ద్వేషిస్తున్నారా అన్న అనుమానం కూడా కలిగింది. శ్రీనివాస్ ఒకసారి వూరంతా, చుట్టుప్రక్కల చుట్టూ ముట్టి రావాలని వుందన్నాడు. సిఇర్యం టాక్సీ తీసుకు వచ్చాడు. వెనుక సీటులో మధ్యను శ్రీనివాస్, చెరో ప్రక్క విశాల, సూర్యం కూర్చున్నారు. నీరసంగా నున్న శ్రీనివాస్ తల పట్టుకుని సర్ది కూర్చో పెట్తుంటే విశాల శరీరానికి సూర్యం చెయ్యి తగిలింది. ఇద్దరి చూపులు ఒక్కసారి కలిసినాయ్. హృదయాలు స్పందించినాయ్. మనసులు కల్లోలమైనాయ్. సూర్యం మనసులో వుబికిన ప్రవాహాన్ని అపుకోటానికీ ప్రయత్నించాడు. ముందు సీటులో రామం కూర్చున్నాడు. శ్రీనివాస్ పెద్ద వీధుల గుండా పోయే కారు నించి మేడలూ, మిద్దెలు, మనుషుల వేపూ అంతా దీక్షగా చూస్తున్నాడు. అందం అంతా వలక బోసుకుని సీతాకోక చిలుకల్లా యౌవ్వనపు రెక్కలతో, నవ్వుల చక్కదనంతో పరుగులెత్తే అమ్మాయిల వేపు కూడా ఆత్రుత తో చూస్తున్నాడు. ఒక చోట కారు ఆగింది. బిడ్డకు చనుపాలు కుదుపుతూ ఒక బాలింతరాలు అడుక్కోడానికి కారు దగ్గరకు వచ్చింది. ఇంకోచోట ముదిమితో క్రుంగినా కడుపు కోసం రాళ్ళను మోసే మామ్మను చూసాడు. ఊరు శివార్ల కు కూడా కారు పరుగులెత్తింది. తోటల్లో పచ్చదనం పెళ్లి పందిరిలా వుండి, చెట్ల నిండా పూసిన పూలు, పూల తోరణాల్లా కనిపిస్తున్నాయ్. వివిధమైన రాగాలను ఆలాపించే పక్షుల స్వరాలు , ఎగిరే తెల్ల పావురాలు, వెలిగే ఆకాశం, కదిలే తెల్ల మేఘాలు చాటున పెళ్లి కూతురు తల వంచి కూర్చున్నట్లు యీ ప్రకృతి ఆవలి వేపున వున్న పురుషునకు కనిపిస్తుందేమో? అందుకే ప్రకృతి నిత్య నూతనంగా, యౌవ్వనంగా వుంటుందేమో?
'ఇంత అందంతో అశలను సృష్టించిన భూమి మీద మనం యింత బాధ్యతారహితంగా యెందుకు ప్రవర్తిస్తామో నాకు అర్ధం కాలేదు. మనిషికీ, మనిషీకి యిన్ని అడ్డు గోడలెందుకు? ఇంత పగ-- పగతో ఈ అందమైన ప్రకృతి ని నాశనం చెయ్యటానికి యిన్ని మారణాయుధాలెందుకు? మనిషి మెదడు లో చెద పురుగులు కూడా వున్నాయా? మనిషి గమ్యాన్ని మరచాడా? అందుకే యిలా బాధ్యతా రహితంగా సంచరిస్తూన్నాడా?' అన్నాడు శ్రీనివాస్.
'మనిషి గమ్యమేమిటో చెప్పారు కాదు?'
'మనం పుట్టేసరికి తల్లి రొమ్ములో పాలు పొంగుతుంది. అలాగే మన తరవాత తరం వారికి ఆ తల్లిని సస్యశ్యామల చేసి వుంచాలి గానీ ఆ తల్లి రొమ్మును గాయ పర్చకూడదు. మనదేశంలో మనలో మనం అర్ధం లేకుండా కులాలు, భాషలు , ప్రాంతీయ దురభిమానాలు పెట్టుకుని ముందుతరం వాళ్లకు యేమీ మిగలకుండా చేస్తున్నాం. ముందు తరం వాళ్ళు బలవంతులు కాకపొతే మీకు గర్వం రాదు, మిమ్మల్ని తలచే వాళ్ళూ వుండరు. మీ బాగోగుల్ని పరీక్షించి తీర్పు చెప్పే న్యాయ మూర్తు లూ వుండరు. మనిషై పుట్టి ముందు రాబోయే మనిషి కోసం బౌతికంగా, మానసికంగా , ఆధ్యాత్మికంగా ఏం విడిచి పెట్టామని ఆలోచించాలి. మనం చేసింది తలచుకుని తృప్తి పడగలిగితేమన గమ్యం చేరుకున్నట్లే లెక్క.'
ఇంత పెద్ద సమాధానం చెప్పించి అతనిని ఆయాస పెట్టాడు. సూర్యం ఇంక ప్రశ్నలు వెయ్యకుండా యింటికి తిరిగి వచ్చేసరికి సాయంత్ర మైంది. శ్రీనివాస్ మాంచి వుత్సాహంగా వున్నాడు. ఇంటికి వచ్చినా యింకా ప్రకృతి లో తాను చూసినది నెమరు వేసుకుంటూనే వున్నాడు. రాత్రి పది గంటలైనా నిద్దర పోలేదు. అప్పటికే, విశాల, రామం నిద్దర పోతున్నారు. సూర్యం అతని వుత్సహానికి అడ్డ్డు పడకుండా అతని పరుపు ప్రక్కనే కుర్చీ మీద కూర్చున్నాడు. శ్రీనివాస్ మాటల ధోరణి తగ్గించ లేదు. చప్పున కాస్సేపటికి మౌనం దాల్చాడు. సూర్యం అతని కళ్ళల్లోనికి చూసాడు. ఈ ఆనందం వెనుక నిస్పృహ సృష్టించిన దుఃఖం యెంత దాగి వుందో శ్రీనివాస్ కన్నీరే చెప్తోంది. సూర్యం మాట్లాడకుండా అతని కన్నీరు తుడుస్తుంటే శ్రీనివాస్ చప్పున అతని చెయ్యి పట్టుకుని-- 'ఈ మాటలు యెంత వేగం మీకు చెప్తే నేను అంత వేగిరం తృప్తితో చచ్చి పోవచ్చు.'
చెప్పండి అన్నట్లు సూర్యం కాస్త ముందుకు జరిగాడు. 'నా భార్య యెప్పుడూ యేమిటి ఆలోచిస్తుందో నాకు తెలీదు. ఇలా ఆలోచించే నా జీవితాన్ని భగ్నం చేసింది. ఆమె ఆత్మ తో కూడా యింకేవర్నో ప్రేమించి వుండాలి. ఆ విషయం ఆమెతో ప్రస్తావించి ఆమెను కలవర పెట్టడం సంస్కారం కాదని వూరుకున్నాను. పోనీ తెలుసుకుని అతనెవరో కలుసుకుంటే యీమెను చేరదీస్తాడా? మేం భార్యాభర్తలుగా నివశించ లేదంటే నమ్ముతాడా?దైవానికి ఆత్మ కొలిచినట్లు అతనిని యీమె కోలుస్తుందంటే నమ్ముతాడా? అలా కొలిచి వుంటే ఆమె యింకోకడ్ని యెందుకు పెళ్లి చేసుకుందంటాడు? తన కడుపు కోసమైనా ఆమె పెళ్లి చేసుకోవలసిన పరిస్థితిలో పెట్టారు. అది ఆమె తప్పు కాదు. అతనెవరో తెలుసుకుని యీమె జీవితం మళ్లీ చిగురించి , పూలు కాయలు, పళ్ళతో నిండేటట్లు చూసే బాధ్యత మీకు అప్ప చెప్తున్నాను. ఇంత పెద్ద భారం మీమీద వేస్తున్నందుకు క్షమించండి. జన్మ జన్మలకు మీకు ఋణపడి వుంటాను.'
సూర్యం నివ్వెర పోయి యీ మాటలు వింటున్నాడు. తనే శ్రీనివాస్ పరిస్థితిలో భార్య విషయంలో వుంటే ఆత్మహత్య చేసుకునేవాడు. అతని గుండె ధైర్యానికి అచ్చరు నందాడు. ఏదో పెద్ద బరువు దిగినట్లు శ్రీనివాస్ సూర్యం వేపు చూసాడు.
'మిమ్మల్ని హామీ యివ్వండని కోరలేను. అవతలి మనిషి నిరాకరిస్తే యీమెను ఒక డాక్టరైనా చెయ్యండి. డాక్టరై అనాధుల సేవ చెయ్యాలన్న కోర్కె యీమె వల్లనైనా తీరుతుంది. అయ్యో! నేనేం మిగిల్చాను...'
"మీరెంతో మిగిల్చారు.'
'లేదండి లేదు.'
'మిగిల్చిన డబ్బు ఖర్చు అయిపోతుంది. కానీ మీరు మిగిల్చి వదలిన వూహలు కలకాలం నిల్చి పోతాయి. మీకు నేనెంతో ఋణపడి వున్నాను' అన్నాడే గాని మీ బాధకు కారకుడ్ని నేనే' అని అందామని అనలేక పోయాడు.
'చాలా రాత్రయింది కదూ-- పడుకుందాం.'
దీపం అర్పి సూర్యం తన పరుపు మీదికి వచ్చాడు. ప్రయత్నించినా నిద్దర పట్టలేదు. విశాలను తల్చుకుంటే అప్పుడే పరుగెత్తి ఆమెను చేరదీసి ఆమె పై పడి క్షమించమని కన్నీటితో నివాళించుకోవాలనిపించింది. తనకోసం యిలాంటి భర్తను తృణీకరించిన స్త్రీని యిదివరకు కధల్లో విన్నాడు గానీ యిలా ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. కాస్సేపయ్యాక ఆమెను యీ పరిస్థితికి తెచ్చింది తనేనని ఆమెను మళ్లీ చిగుర్చే బాధ్యత తనలోనే వుందని అనుకున్నాడు. మరికొంత సేపయ్యాక తండ్రి చెప్పిన పలుకులు గింగురు మన్నాయ్. విశాల ఇదివరకు కులం తక్కువ పిల్ల -- ఇక వితంతువు కూడా! ఈ కలయికకు కుటుంబం లో యే ఒక్కరు ఒప్పుకుంటారు? ఆసాధ్యం సాధ్యమేలా ఔతుంది.
