Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 30


    'అవును-- నాకు తెలుసు ...' అతని ముఖం లో ఒక లిప్త పాటు చిరునగవు మెరసింది.
    'నన్నెప్పుడు విడిచి పెట్తారు?'
    అప్పటికి సూర్యం మాట్లాడలేదు. శ్రీనివాస్ అతనిని కుదుపుతూ "ఎందుకలా బాధపడతారు?' ముఖం ప్రక్కకు త్రిప్పి నిర్మలా కాశం వేపు చూస్తూ 'దేవుడు కొత్తబట్టలిస్తున్నప్పుడు యెలా కాదనగలను. ఆ కంపు బట్టలను వదల నివ్వండి!'
    సూర్యం యింక దుఃఖం ఆపుకోలేక పోయాడు. కన్నీరు చెక్కిళ్ళ పై రాల జోచ్చినాయ్. శ్రీనివాస్ అతని పరిస్థితి చూసి చెయ్యి పట్టుకుని 'నాకు రాని యేడుపు మీకెందుకు రావాలి?'
    'నేనేమీ చెయ్యలేక పోయాను.
    'మీరు నాకోసం చెయ్య వలసింది చాలా వుంది. నా అత్మీయులనే వాళ్ళు మీరు తప్పించి యింకెవ్వరూ లేరు.'
    సూర్యం బలం లేక కూర్చుండి పోయాడు. శ్రీనివాస్ మెల్లగా 'చావో రేవో ' తెలిపోయినందుకు సంతోషంగా వుంది.'
    'మాయింటికి వచ్చేయండి.'
    'ఆది చిన్న బాధ్యత, మీకు పెద్ద బాధ్యత యివ్వక విధి లేదు, ఇప్పుడున్న అద్దె యింట్లోనే వుంటాం. వీలైనన్నిసార్లు వచ్చి చూడండి. నాకు పెదిమల పై నవ్వు తోనే పోవాలని వుంది. అంతిమ ఘడియల్లో నా ప్రక్కన మీరుండాలి. మీ కన్నీరు నామీద పడాలి. శెట్టి గారు పొతే యెందరో యేడు స్తారు. ఆ కన్నీరు కంటిలో నించి వచ్చింది. నాకోసం మీరు కార్చిన కన్నీరు హృదయం లోనించి వస్తుంది.' శ్రీనివాస్ ఆవేశంతో అంటుంటే తల వంచుకుని సూర్యం మౌనంగా వింటున్నాడు. ఈ క్షణం లో కాదు యిది వరకేప్పుడో తను చావు వూహించి , విచారించి విధి లేదని యెంత ధైర్యంగా చచ్చి పోవాలో అంత ధైర్యంగా మాటాడాలని వూహించి అన్న పలుకులివి. ఒక సైనికుడు ముందుగా రాసుకున్న వీలునామా లా వుంది.
    ఆ సాయంత్రం విశాల వస్తే ఆమె ముఖం చూడలేనని ముందుగానే ఒక స్నేహితుని యింకో వార్డు లో చూడాలని సూర్యం వెళ్ళిపోయాడు. విశాల వచ్చింది. మౌనంగా నున్న ఆమె వెళ్ళిపోయేటప్పుడు
    'రేపటి నుంచి మరి ఆసుపత్రికి వచ్చే అవసరం వుండదు.'
    'ఏం?'
    'జబ్బేమీ లేదట ఇంట్లో వుండి బాగా తినమన్నారు.'
    'మంచిది.'
    'రేపు వుదయం నేనే యింటికి వచ్చేస్తాను.'
    సూర్యం దూరంగా వుండి ఆమె తల వంచుకుని తిరిగి వెళ్ళిపోవటం చూసాడు. అక్కడే కాస్సేపు కూర్చుండి పోయాడు. తను ప్రియాతి ప్రియమను కున్నవన్నీ బాధలతో తనకు దూరమై పోతున్నాయ్. గౌరీ ముఖం చూడలేకపోతే తీసుక వెళ్ళటానికి అమ్మ, నాన్న వచ్చారు. కానీ యీమె ముఖం యెలా చూడటం? ఈమెను తీసుక వెళ్ళటానికి యెవరూ రారు. తన జీవితం ఓక నాటకం గా మారబోతోంది. ఈ బరువైన పాత్రను తను సమర్ధంగా నటించగలడో లేడో? ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి అని లోలోన ప్రార్ధించు కున్నాడు. తన చిన్ననాటి జీవితం, తను యింకా యెంతో సాధించడానికీ , చెయ్యడానికి పుట్టానాన్న ఊహ, ఉదయమే నర్సు మెల్లగా తాకి మెరుపు చూపులతో చల్లగా అభిమానాన్ని ఒలకబోసిన దృశ్యం -- ఎన్నెన్నో తలచుకోగానే ధైర్యం కలిగి మెల్లగా తిరిగి వచ్చాడు.
    ఆ మరుసటి రోజు శ్రీనివాస్ డిశ్చార్జి చేసారు. సూర్యం వెళ్లి రిక్షా తీసుకు వచ్చాడు. శ్రీనివాస్ వెళ్ళిపోయే ముందు వార్డు చుట్టూ చూసాడు. ఒక నమస్కారం ఆ మంచం కు చేసాడు. శెట్టి గారికి నమస్కరించాడు. శెట్టి గారి కళ్ళల్లో నీరు తిరిగి మాట్లాడలేక పోయాడు. మళ్ళీ యెప్పుడు కలవటమో యెక్కడ కలవటమో చెప్పలేం అన్నట్లు యిద్దరూ మూగ మనసులతో ప్రశ్నించు కున్నారు. అ ప్రశ్నలకు సమాధానాలు మనసులోనే తిరిగాయ్. అకారాల్లేని ఆత్మలు వేరుగా వున్నా ఒకే వెలుగు తాలూకూ భాగాలు, ఆ భాగాలు అతుక్కుంటాయ్ . విడివడవు. మనసు వెలుగు కాదు కాబట్టే శాశ్వతం కాదు. మనసులు కలుసుకోకపోయినా ఆత్మలు కలుసు కుంతాయ్. రెండు మనసులు కలుసుకుంటే ఆత్మీయత యేర్పడుతుంది. వెలుగు వుత్పత్తి అవుతుంది. ఆ వెలుగు సుఖ శాంతులను కలుగ జేస్తుంది. మనసు కలిసిన సూర్యం దగ్గర వుండటం వలన యింత విచారం లోనూ శ్రీనివాస్ వెలుగు చూసి త్రోవను తెలుసుకున్నాడు.
    త్రోవలో తన భుజం మీద తలపెట్టి నిస్త్రాణగా శ్రీనివాస్ రిక్షాలో కూర్చున్నాడు. అతని గుండె కల్లోలం తో కొట్టుకోవటం సూర్యం కు వినిపిస్తోంది. అలా తలపెట్టే కనిపించే మనుషులను, వస్తువులను , పచ్చని మొక్కలను , రంగు రంగుల పూలను చూస్తున్నాడు. అతనిని చూడగానే గోవిందరావు ను ఆసుపత్రికి తీసుకు వెళ్ళిన దృశ్యం తలపుకు వచ్చింది. అతనిని ఆసుపత్రికి తీసుక వెళ్ళాడు. అప్పుడు అతని చావు ఊహే లేదు. ఇతనిని ఆసుపత్రి నించి తీసుక వస్తున్నాడు. మనసులో చావు వూహ తప్పించి యింకొకటి లేదు. త్రోవలో ఒక దగ్గర శ్రీనివాస్ రిక్షా ఆపించి, 'మందు కొనండి' అన్నాడు.
    'ఏం మందు?'
    'చౌకగా నున్న మాత్రలు -- పోనీ విటమిన్ మాత్రలు తీసుకోండి.'
    సూర్యం సంశయిస్తుంటే 'నటించాలి కదా? మందు వేసుకోకపోతే మన అబద్దం బయట పడ్తుంది.'
    సూర్యం మౌనంగా వెళ్లి మల్టీ విటమిన్ మాత్రల సీసా ఒకటి కొని తెచ్చాడు. విశాలకు యితని చావు చప్పున చెప్పే బాధ్యత కూడా తనకే వచ్చినందుకు నొచ్చుకున్నాడు. ఇంటికి వెళ్లేసరికి పది గంటలైంది. సూర్యం కాస్సేపు వుండి తిరిగి ఆసుపత్రికి వచ్చాడు. శెట్టి గారు దిగులుతో నున్నారు. అతనికి మళ్లీ భయం బాగా ఆవరించి నట్లుంది. శ్రీనివాస్ గురించే మాటిమాటికి చెప్తున్నాడు. అంత చక్కని భార్య అదృష్టమైనా శ్రీనివాస్ ని రక్షించనందుకు విచారించాడు.
    సూర్యం రెండు రోజులు రోజూ సాయంత్రం శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి వచ్చేవాడు. అప్పుడే మృత్యుదేవత మత్తు మందు చల్లినట్లు యింట్లో నిశ్శబ్దం ఆవరించింది. విశాల ఒక మూగ పిల్ల అయిపోయింది. ఆమె నోట ,మాట ఒక్కటైనా వినలేదు. ఆమె రాబోయే ప్రళయాన్ని పసి కట్టినట్లుంది. మాట్లాడేవాడు సూర్యం ఒక్కడే. భార్యభార్తాలు ఏదో పెద్ద తగవు లాడి విధి లేక ఒక యింట్లో వున్నట్లు వున్నారు. శ్రీనివాస్ పరిస్థితి చూసి అతను బయటకు వెళ్ళగక్కలేని కోరికేదో వూహించు కున్నాడు. తను యితనితో పాటు యిక్కడ వుండి అన్ని బాగోగులు చూసుకోవలసిన పరిస్థితి. అంచేత ఆ మరుసటి రోజు డాక్టరు ను అడిగి ఆసుపత్రి నుంచి బయటపడ్డాడు. ఆసుపత్రికి వచ్చే ముందు తల్లీ తండ్రికి తెలియ పర్చలేదు. రిజల్డ్స్ రానే వచ్చింది. అంచేత కొన్ని మాత్రలు, యింజక్షన్లు తీసుకోమని రాసి యిచ్చారు. ఆహారం విషయం లో తీసుకో వలసిన జాగర్తలేవో చెప్పారు. శెట్టి గారు సూర్యం కదలి పోతుంటే కళ్ళల్లో నీరు తెచ్చుకున్నారు. అప్పటికి మిగతా రెండు మంచాలలో కొత్త రోగులు వచ్చి వున్నారు. తను ఖాళీ చేసిన మంచానికి యెవరో వెయిటింగ్ లిస్టు లో వున్నారట. అంచేత శెట్టి గారికి ఏకాంతంగా వుండే అవసతం లేదని తను రోజూ వచ్చి చూసి పోతుంటానని చెప్పాడు. శెట్టి గారు సూర్యం కూ తనకూ వున్న ఆత్మీయత తన బిడ్డలతో కూడా లేదని తను దగ్గర వుండగా కళ్ళు మూస్తానని కాంక్షించానని చెప్పాడు.
    సూర్యం తన బంగాళ కి వెళ్ళలేదు. సరాసరి శ్రీనివాస్ యింటికే వెళ్ళాడు. ఇంటి పెద్దరికం తనే తీసుకున్నాడు. రకరకాల పళ్ళు, కూరలు, సిగరెట్లు, తిను బండారాలు రోజూ తెచ్చేవాడు. శ్రీనివాస్ తెచ్చిన వన్నీ అనుభవించి
    'మనుష్యులు యెంత అదృష్టం చేసుకున్నారు? దేముడు యీ చిన్న మెదడు యిచ్చి -- యెన్ని అనుభూతులు సృష్టించాడు, యెన్ని రుచులు సృష్టించుకున్నారు. ఎంత అందం? అందుకే ఎవరో అన్నారు. ఎన్నో నోములు నోచిన గానీ యీ నర జన్మము దొరకదురా అని. అనుభవించే వాడే అదృష్ట వంతుడు.'
    సూర్యం మౌనంగా వినేవాడు. విశాల తను అతని దగ్గర వుండగా వచ్చి కూర్చోలేదు. ఇది సూర్యం కు కష్టం కలిగించి తనే శ్రీనివాస్ కి వినిపించ కుండా చెప్పాడు. ఆమె తలెత్తకుండా విన్నది. ఆ మరుక్షణం నించి అప్పుడప్పుడు భర్త దగ్గరకు వచ్చేది. ఆపిలు పండు, కోస్తున్నట్లు, పాలులో పంచదార కలిపి యిచ్చినట్లు యిలా రాను రాను అతని దగ్గర వుండటానికి ప్రయత్నిస్తోంది. సూర్యం యింకా శలవు లోనే వున్నాడు. రోజూ సాయంత్రం ఆసుపత్రికి వెళ్తున్నాడు. ఒకరోజు రామం కు తనతో తీసుకు వచ్చి శ్రీనివాస్ యిల్లు చూపించాడు. ఆరోజు నించి ఏదో ఒక టైము చూసుకుని రామం శ్రీనివాస్ యింటికి వస్తున్నాడు. విశాలను అప్పుడే అక్కా అని పిలుస్తున్నాడు. బజారు నించి కోరి అడిగి యేమైనా కావాలంటే తెస్తున్నాడు.
    ఒకరోజు తెల్లారే సరికి ప్రత్యక్ష మయ్యాడు. సూర్యం ని ప్రక్కకు పిలిచి చెప్పే ఆలోచన వాడికి తట్టినందుకు ఆ కుర్రవాని తెలివికి మెచ్చుకున్నాడు.
    'ఇప్పుడే ఆసుపత్రి కి వెళ్లి వస్తాను!'
    'శెట్టి గారికి యేమైంది?'
    'రాత్రి మంచం మీద నుంచి జారిపడ్డారట! హెర్నియా కదలి ఆ రాత్రి మీద ఎమర్జన్సీ ఆపరేషను చెయ్యవలసి వచ్చిందట.'
    'సరే వెళ్ళండి.'
    సూర్యం వెళ్లేసరికి శెట్టి గారికి చైతన్యం లేదు. డాక్టర్లు వార్డులో నిండిపోయి వున్నారు. ఆపరేషను చేశాక బ్లడ్ ప్రజరు పడిపోవటం మొదలు పెట్టిందట. ఆ బ్లడ్ ప్రజరు సరి చెయ్యటానికి నానా తాపత్రయ పడ్తున్నారు. వయసు మించి పోవటం వలన శరీరం లో పటుత్వం లేదు. చేసే సాదానలను అందుకుని యిముడ్చుకునే స్థితిలో శరీరం లేదు. అసలు జబ్బు కాకుండా అప్పటికే రెండు ముఖ్యమైన రోగాలతో పీడింప బడుతున్న శరీరం డాక్టర్లు చెప్పినట్లు వినలేదు. మిట్టామధ్యహ్నం అయేసరికి శెట్టి గారు గతించారు.
    సూర్యం శ్రీనివాస్ దగ్గరకు వచ్చేసరికి సాయంత్రమైంది. తనతో పాటు రామాన్ని కూడా తీసుకు వచ్చాడు. ముక్తసరిగా ' అనుకున్నట్లే అయ్యింది.' అని చెప్పాడు.
    'పాపం! భయంతోనే పుట్టాడు, దానితోనే పెరిగాడు, దానితోనే చచ్చిపోయాడు!'
    'అతనిని అలా భయపెట్టిందేది?'
    'లోభం -- అలా ముద్దలా వుండి పోయింది. కొవ్వొత్తి కాలేదు. వెలగలేదు.'
    'మీకు తెలీదు అతని జీవితం! అతను వోత్తిని వెలిగించు కున్నాడు. ఈ రామం అతనికి ఒక పరాయి స్త్రీ వలన సంక్రమించిన బిడ్డడు. అది నాకు తప్పించి యింకేవరికి చెప్పలేదు. వీడిని  బయటకు తెచ్చే బాధ్యత నాకు అప్పచెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS