"అందరూ అలా భయపడిలొంగిపోతారనుకోకు! నీలాంటి వాళ్ళను ఇక్కడ చాలామందిని పశ్చాత్తాపపడేట్లు చేశాను"
"అన్నట్లు నువ్ పోలీసుల నుంచి తప్పించుకాగానే ఓ పనిచేయాలి ప్రహ్లాద్"
"ఏమిటది?"
"ఏదయినా పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేసి ఎయిర్ కాజిల్ హోటల్లో బాంబ్ పెట్టారనీ, అది ఇంకో అరగంటలో పేలబోతుందనీ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్పు"
"ఎందుకలా చెప్పటం?"
"మాకిద్దరికీ తప్పించుకోవడానికదిమంచి అవకాశం గనుక. హోటల్లో ఉన్న అతిధులందరూ కట్టుబట్టల్లో రోడ్ మీదకు పరుగెడతారుకాబట్టి ఆ సందడిలో మేమూ వాళ్ళతో కలసి రోడ్ న పడ్డానికి వీలుంటుంది. పోలీసులు కూడా బాంబు గొడవలో మమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉండదు"
"మంచి అయిడియా" వప్పుకున్నాడతను.
అతను బయటికొచ్చాడు. గది బయట గార్డ్స్ అతనిని పట్టించుకోలేదు. ఇద్దరూ బెంచీమీద కూర్చుని ఏదో వారపత్రిక చదువుతున్నారు. లిఫ్ట్ లో కిందకుదిగాడు. విజిటర్స్ లాంజ్ లో ఇద్దరు ఇన్ స్పెక్ట్రర్లు మఫ్టీలో కూర్చుని ఉన్నారు. వాళ్ళు తననే చూస్తున్నట్లు తెలిసిపోతోంది. బహుశా తను బయటి కెళ్తే అరెస్ట్ చేస్తారేమో!
తను ఓపెన్ గా వెళ్ళటం రిస్క్. ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ లోకి నడిచాడతను.
వాళ్ళు అద్దాల్లోంచి తననే చూస్తున్నారు. ఎలా తప్పించుకోవటం?
ప్రహ్లాద్ కి చెమటలు పడుతున్నయ్.
ఇదివరకు ఏ మర్డరో, లేకపోతే స్మగ్లింగో చేశాక దొరికిపోయేవాడు.
ఇప్పుడు ఏమీ చేయకుండానే దొరికిపోతాడా?
అతనికి కోపం వస్తోంది. కోపం వస్తే నిస్సహాయస్థితిలో పడిపోతాడు. నిస్సహాయ స్థితి తన విషయంలో చాలా ప్రమాదకరం. రాక్షసుడయిపోతాడు! రాక్షసత్వం ఆవహించినప్పుడు ఏం చేస్తాడో తనకే తెలీదు. అలాచాలాసార్లు జరిగింది.
రెస్టారెంట్ కిచెన్ డోర్ వేపు చూశాడతను.
అట్నుంచి వెళ్తే హోటల్ వెనుకవున్న ఆవరణలో కెళ్తాడు. అక్కడ సామాన్లు అన్ లోడ్ చేస్తున్న రెండు టెంపోలు కనబడుతున్నాయ్.
బేరర్ వచ్చాడతని దగ్గరకు.
"ఏం కావాలి సార్?"
"నేను పోలీస్ ఇన్ స్పెక్టర్ని! వెనుక ఆ టెంపోల్లోనుంచి దించుతున్న బస్తాలు ఏమిటి?"
"గోధుమ పిండి సార్!"
"అందులో డ్రగ్స్ సప్లయ్ అవుతున్నట్లు ఇన్ ఫర్మేషన్ వచ్చింది మాకు. నేను వెళ్ళిచూసి వస్తాను. ఈ విషయం ఎవరికీ చెప్పకు"
"అలాగే సర్"
"ఏదీ దారి చూపించు"
అతని వెంబడి కిచెన్ లోకి నడిచాడతను.
ఆవరణలో కొచ్చేసరికి ఒక టెంపో ఖాళీఅయిపోయింది. రెండోది మొదలెడుతున్నారు. డ్రైవర్ దూరంగా చెట్లకిందగా గార్డెన్ రెస్టారెంట్ లో కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు.
"ఈ టెంపోలో ఒకసారి చెక్ చేస్తాను" అంటూ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు ప్రహ్లాద్. డ్రైవర్ లేచి రాబోతూంటే బేరర్ అతనికి ప్రహ్లాద్ గురించి చెప్తున్నాడు.
హఠాత్తుగా టెంపోస్టార్ట్ చేశాడు ప్రహ్లాద్. స్టార్ట్ అవటంతోనే టాప్ గేర్ వేసేశాడు చకచకా అది వేగంగా అవుట్ గేట్ దగ్గరకొచ్చేసింది. ఒక్క క్షణంపాటు వెనక్కు తిరిగి చూశాడు ప్రహ్లాద్! డ్రైవర్ పరుగుతో వస్తున్నాడు.
తనింక ఆలస్యం చేయడానికి వీల్లేదు. వేగం పెంచాడతను. రోడ్ మీద కొచ్చేసిందది. పోలీసులు రోడ్ కి రెండు వైపులా నిలబడ్డారు. టెంపో ఖాళీగా కనబడడంతో వాళ్ళూ మిగతా విషయాలు పట్టించుకోలేదు.
తనకు తెలుసు. దాని డ్రైవర్ గొడవచేస్తాడనీ, నగరమంతా ఆ టెంపో కోసం పోలీసులు వెతకడం మొదలుపెడతారనీ!
అందుకే నెక్స్ట్ జంక్షన్ సమీపంలో టెంపో ఆపి దిగిజనంతో కలసిపోయి వడివడిగా నడుస్తూ కొద్ది దూరం వెళ్ళి బస్ స్టాప్ లో నిలబడ్డాడు.
ఇలాంటి సమయాల్లో సిటీబస్ లో ప్రయాణం చేయడం చాలా అవసరం! తననింక పట్టుకోవడం ఎవరివల్లా కాదు.
బస్ వచ్చి ఆగింది. అందరినీ తోసుకుంటూ బస్ ఎక్కాడతను. సనత్ నగర్ ఏరియాకొచ్చాక బస్ దిగాడు. రోడ్లు బాగా జనసమ్మర్ధంగా ఉన్నాయ్. ఆ పక్కనే ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గరకు నడిచాడతను. కంట్రోల్ రూమ్ కి వెంటనే కనెక్షన్ దొరికింది.
"హలో నేను పీపుల్స్ వార్ గ్రూప్ మెంబర్ మాట్లాడుతున్నాను. మా వాళ్ళు ఇప్పుడే హోటల్ ఎయిర్ కాజిల్లో బాంబ్ పెట్టారు. ఇంకాసేపట్లో అది పేలబోతూంది. ఆ హోటల్లో వున్న పొలిటికల్ లీడర్లంతా స్మాష్ అవాలని ఆ బాంబ్ పెట్టారు." చెప్పేసి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడతను.
ఆ తరువాత చీఫ్ సెక్రటరీ పి.ఏ. కి ఫోన్ చేశాడు.
అక్కడ కూడా ఇదే ఇన్ ఫర్మేషన్ ఇచ్చాడు.
ఇంక ఢోకాలేదు! పోలీసులంతా ఆ హోటల్ ని చుట్టుముట్టేస్తారు. ఆ హడావుడి, ఆ సందోహం, ఆ కేకలతో నూతన్, మయూరి ఖచ్చితంగా తప్పించుకుంటారు.
మయూరి గుర్తుకి రాగానే అతని రక్తం వేడెక్కింది.
ఎంత అందగత్తె! అంత అందంలోనూ ఎంత సెక్సీ? అచ్చం అలాంటిదేకావాలి తనకు! అలాంటిది దొరుకుతే తన లైఫ్ సెటిలయిపోతుంది. ఇంకోసారి క్రైమ్ జోలికీ, మరో ఆడదానిజోలికీ వెళ్ళకుండా మిగతా జీవితంగడిపేస్తాడు.
మరో బస్ ఎక్కి మళ్ళీ ప్రయాణం సాగించాడతను.
బస్ నాంపల్లి వేపువెళ్ళసాగింది.
"హమ్మయ్య! ఇంక ప్రమాదం తప్పిపోయినట్లే......"
నూతన్ మయూరి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హోటల్లో చెలరేగే అలజడి కోసం!
అప్పుడే ఫోన్ మోగింది.
"హలో మయూరిహియర్" అంది మయూరి.
"నేను రంగారావ్ ని మాట్లాడుతున్నాను. మేము నలుగురం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలం అర్జంటుగా మీతో మాట్లాడాలనుకుంటున్నాం!"
"ఒకేసారి నలుగురికీ పర్మిషన్ లేదు. ఇద్దరు రావచ్చు."
"సరే ఇద్దరమే వస్తున్నాం"
నూతన్ చిరాకుపడ్డాడు.
"ఓ పక్క మనం పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే ఈ ఇంటర్ వ్యూలేమిటి?"
"వాళ్ళతో మనకి పని వుంది నూతన్!" నవ్వుతూ అందామె.
"ఏం పని?"
"వాళ్ళ డ్రస్ లోనే మనం బయటకు వెళ్ళబోతున్నాం. లేకపోతే మనగాది వద్ద నిలబడ్డగన్ మేన్ ని తప్పించుకోవటం కష్టం"
నూతన్ కి అర్ధమైంది. తన బాగ్ లో నుండి స్టీల్ రాడ్ బయటకు తీశాడతను. ఇద్దరు ఎమ్మెల్యేలు లోపలికొచ్చారు. రాగానే ఒకవేపు నుంచి ఒకడిని బలంగా మొఖంమీద పిడికిలి బిగించికొట్టాడు నూతన్.
"అబ్బా" అంటూ నేలకూలుతూండగానే రెండో అతనిని రెండో వేపునుంచీ స్టీల్ రాడ్ తో నెత్తిమీద కొట్టింది మయూరి.
