Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 29


    'ఏం నాకు కొమ్ములున్నాయటే?'
    'ఉన్నాయి' చిలిపిగా అంది శాంత.
    ఇద్దరూ నవ్వుకున్నారు-
    'బావ యింకెప్పుడు వస్తాడే?' ఆ దుర్దాలో ఆస్పత్రి భవనంచుట్టూ ఉన్న పూలమొక్కలను చూస్తూ అంది శాంత.
    'మన ఆదుర్దాయేగాని, అసలు పేపరు ఈ బస్సులో వచ్చిందో రాలేదో? ఒకవేళ వస్తే మరెవరైనా తీసుకువెళ్ళారో ఏమో?' అనుమానపడుతూ అంది శారద.
    'అబ్బ; ఆదుర్దా మనుష్యులను ఎంత చీకాకు పెడుతుందే!'
    'ఆదుర్దా అంటున్నావేమిటి శాంతా?' అప్పుడే రోగులవద్ద తీరికచేసుకొని వీరిద్దరు కూర్చున్నవైపు వస్తూన్న సుందరం అడిగాడు.
    'ఈరోజు మా రిజల్ట్సు వస్తున్నాయి.'
    'అందుకా యింత ఆదుర్దా? ఇద్దరూ ఫస్ట్ క్లాసు స్టూడెంట్సే! తప్పకుండా ప్యాసౌతారు. మీరు ప్యాసు కాకపోతే పరీక్షకు కూర్చున్నవాళ్ళంతా తప్పవలసి వస్తుంది. చిరునవ్వుతో శాంతను చూస్తూ వారికీ కొద్దిదూరంలో పచ్చికపై కూర్చున్నాడు సుందరం.
    'ఏం సుందరం? ఎలా ఉంది ఈ వాతావరణం? విసుగు కలిగిస్తూ ఉందా? అప్పుడు రానని మొండికెత్తావుగద! మరి ప్పుడేమో ఉత్సాహంగానే కనుపిస్తున్నావు.' అతని ముఖకవళికలను జాగ్రత్తగా పరిశీలిస్తూ అంది శాంత.
    'ఏం ఉత్సాహం లెద్దూ! ఒక విధంగా జైలు జీవితాన్ని గడుపుతున్నట్లు ఉంది. ఇక్కడ సినిమాలా? క్లబ్బులా? అయినా అసలు తీరితే గద! మొత్తానికి నాతో నిముషం తీరిక లేకుండా పనిచేయిస్తున్నాడు రామం. ఏదో విధంగా కాలం గడిచిపోతూ ఉంది.' అన్నాడు సుందరం.
    వీరిలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి రామం వచ్చాడు. అతని ముఖ కవళికలు ఉత్సాహకరంగా లేకపోవడంతో శాంత, శారదలు అనుమానపడ్డారు.
    'ఏమన్నయ్యా? రిజల్స్టు ఎలా ఉన్నాయి.' అతని కళ్ళల్లోకి అనుమానంగా చూస్తూ అడిగింది శారద.
    'ఏం చెప్పమన్నావమ్మా?' ఆ మాటలని ఆగిపోయాడు రామం.
    'బావా?'
    'అన్నయ్యా!'
    ఇద్దరూ ఒకేసారి పుట్టి మునిగినట్లు అన్నారు-
    'ఇద్దరూ ఫేలయ్యారు.' ఇద్దరినీ జాగ్రత్తగా పరిశీలించి చూస్తూ అన్నాడు రామం.
    'అసంభవం!' అన్నాడు సుందరం.
    'నిజమే!' రెట్టించాడు రామం.
    'నిజమేనా అన్నయ్యా!' అతని మాటలు నమ్మలేక మరోసారి అడిగింది శారద.
    'ఔ'నని తల ఊపాడు రామం.
    ప్రపంచంలో గల విషాదాన్నంతా తన ముఖంలో నింపుకొని 'అన్నయ్యా యిలా జరుగుతుందని కలలో కూడా ఊహించ లేదు. ఎంతో జాగ్రత్తగా చదివాను. శాంతకూడా నాతోపాటు చదివేలా చూశాను. ఇద్దరమూ తృప్తిగా పేపర్సు వ్రాశామనుకున్నాము. ఈ విధంగా ఎందుకు జరిగిందో నా కర్ధంకావడం లేదు.' చివరిమాటలు అంటున్నప్పుడు ఆమెకళ్ళల్లోని కన్నీరు కనుకొనుకులనుండి క్రిందికి జారడానికి సిద్ధంగా ఉంది.
    ఆమెను ఆ స్థితిలో చూడలేక పోయాడు రామం. తను హాస్యానికి అన్నమాటలు శారదను ఎంతగా నొప్పించాయో అతనికి అర్ధమైంది.
    'బాధపడకమ్మా! నీవు ప్యాసయ్యావు. అదీ డిస్టిన్ క్షన్ లో. కాని మా మొద్దమ్మాయి శాంతమాత్రం ఫేలైంది.' శారదను చిలిపిగా చూస్తూ అన్నాడు రామం.
    'నిజమా అన్నయ్యా! నీవలా చెబుతూ ఉంటే మొదట్లో నమ్మలేదు. కాని నీవు చెబుతున్నావు కాబట్టి నిజంగానే నేను పరీక్షలో తప్పానేమోనని భయపడిపోయాను.' సంతోషంగా అని మరుక్షణంలోనే తన ముఖ కవళికలను మార్చుకుంటూ 'అయ్యో! శాంత తప్పిందా? అదెలా సాధ్యమబ్బా?' శాంత తప్పిందా? అదెలా సాధ్యమబ్బా?' శాంత తప్పిందన్న విషయాన్ని నమ్మలేక సందేహపడుతూ అడిగింది శారద.
    'నీవుండవే! బావ మనసు ఆట పట్టి స్తున్నాడు.' అని రామం తన వెనుకగా పట్టుకున్న పేపరును అతను ఊహించలేనంత చురుకుగా లాక్కుంది.
    'చూడవే నా నెంబరు! ఫస్టు క్లాసులో ప్యాసయ్యాను.' అని రామంవైపు తిరిగి 'అన్నీ కొంటెవేషాలు. అనవసరంగా శారదను ఏడిపించావు.' అతని కళ్ళల్లోకి కొంటెగా చూస్తూ అంది శాంత.
    రామం శాంతను చూస్తూ 'నీ పట్టుదల నెరవేరింది. గ్రాడ్యుయేటువయ్యావు. మన మిద్ధరమూ కలిసి ఇక మామయ్య మాటను మన్నించాలి.'    
    'ఫో బావా...!' సిగ్గుతో తల వంచుకుంటూ అంది శాంత.
    వీరిద్దరి అన్యోన్యతను చూస్తూ తన ముఖంలో రంగులు మార్చుకున్నాడు సుందరం. శాంత, రామం ఈ విషయాన్ని గమనించలేదు కాని శారద మాత్రం సుందరం ముఖంలోని మార్పును గుర్తించ గలిగింది.
    'అమ్మా శారదా! నీవు ఘనంగా ప్యాసయ్యావు. నాకు చాలా సంతోషంగా ఉంది. యం. ఏ. చదువుతావా?' ఆప్యాయంగా శారదను చూస్తూ అడిగాడు రామం.
    'లేదన్నయ్యా .... ఇంకేమీ చదవను. ఇప్పటికే మీ ఋణభారం భరించలేకుండా ఉన్నాను.' ఆనందాశ్రువులు రాలుస్తూ అంది శారద.
    'ఎందుకమ్మా కళ్ళల్లో ఆ కన్నీరు?'
    'కన్నీరు కాదన్నయ్యా! అని ఆనంద భాష్పాలు.'
    'చెల్లీ! నాకు తోబుట్టువులు లేని కొరత నీతో తీర్చుకుంటున్నానమ్మా!' ఆమె ముఖంలోని సంతోషాన్ని గమనిస్తూ అన్నాడు రామం.
    'అన్నయ్యా!' ఆ పిలుపులో ఎంతో ఆత్మీయత నిండి ఉన్నది.
    'ఇప్పుడు చెప్పమ్మా! నీకు యింకా చదవాలని ఉంటే తప్పకుండా చదివిస్తాను. అన్నయ్యవద్ద ఏ చెల్లెలైనా సంకోచపడుతుందా?'
    'సంకోచం కాదన్నయ్యా? ఇప్పటికే నాకెంతో సాయంచే...'
    'శారూ! ఇప్పుడవన్నీ ఎందుకే? బావ అడుగుతున్నాడు. నీకు చదువుకోవాలని ఉంటే చెప్పు చదివిస్తాడు.' శారద మాట లను మధ్యలోనే త్రుంచుతూ ఆమెను ప్రోత్సహిస్తూ అంది శాంత.
    'అన్నయ్యా....నాకు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్' బి. ఇడి. ట్రైనింగు పొందాలని ఉంది.'
    'వోహో! శారదమ్మగారు పంతులమ్మగా రవుతారన్నమాట!' నవ్వుతూ అంది శాంత.
    'అలాగే నమ్మా! ఆ యేర్పాట్లునే చూస్తాను.' అని సుందరంవైపు తిరిగి 'సుందరం ప్రక్క ఊరికి వెళ్ళి ఒక పేషెంటును చూసి రావాలి. పద వెడదాం. అవసరమైతే అతనిని మన ఆస్పత్రిలో చేర్చవలసివస్తుంది కూడా. ఇందాకే వచ్చి కాళ్ళా వేళ్ళాపడి బ్రతిమిలాడి వెళ్ళారు.' సుందరాన్ని స్నేహ పూర్వకంగా చూస్తూ అన్నాడు రామం.
    'అలాగే పద!' అన్నాడు సుందరం.
    ఇద్దరూ అక్కడినుండి వెళ్ళిపోయారు. శాంత, శారదలిద్దరూ యింటికి వెళ్ళడానికి లేచి నిలుచున్నారు.

                             *    *    *

    అవి వర్షాకాలపు ప్రారంభపురోజులు. యుద్ధంలో చెదిరిపోయిన సైనికుల సమీకరణలా మేఘాలు ఒక్కదగ్గరకు చేరుతున్నాయి. పడమటిదిక్కుకు పయనమైన సూర్యుని 'చాలించు నీ ప్రతాపం' అనేట్లుగా మేఘాలు కప్పివేస్తున్నాయి. అంత వరకూ దినబాంధవునే సూటిగా చూస్తున్న లక్ష్మయ్యగారి తోటలోని ప్రొద్దు తిరుగుడు పూలు అతను కనుమరుగవడంతో ప్రియుని కోల్పోయిన ప్రేయసిలా నిరుత్సాహంతో ముఖాలు వ్రేళ్ళాడవేస్తున్నాయి.
    సూర్యుడు మబ్బుల మాటున చేరడంతో అంతవరకు ఉన్న వేడి చల్లారిపోయి చల్లదనం నలుదిశల అలుముకుంది.
    అభిజ్ఞాన శాకుంతలంలోని దుష్యంత, శాకుంతలల గాంధర్వ వివాహఘట్టం ముగిసిన తర్వాత గల ప్రేమఘటాన్ని చదివి, ఆ గ్రంధ పఠనంవల్ల కలిగిన మానసికోద్వేగంతో పారిజాతపుష్పవృక్షానికి తల ఆనించి మత్తుగా కళ్ళు మూసుకొని ఆలోచనలోపడిన శాంతకు ప్రకృతిలో వచ్చిన మార్పు తెలియడంలేదు. ఆమె అలంకరణ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆమె కళ్ళల్లోని కాటుక అమావాస్య చీకటితో పోటీ పడుతూ ఉంది. సిగ్గుతో ఎరుపెక్కిన కపోలములు, భావోద్వేగంవల్ల వణుకుతూన్న ఆ పెదిమలు, సిగలో తెల్లగా మెరుస్తూ తమ సౌరభాన్ని ఆ ప్రదేశమంతా విరజిమ్ముతూన్న దొంతర మల్లెలు, తెల్లని చీరెలో, లేత నీలి రంగు బ్లౌజుతో దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది ఆమె.
    పాల పొంగులాంటి యౌవనం, ఆ మధుర కావ్య పఠనం ఆమెను ఏవో ఊహా లోకాలలో విహరింపచేస్తూ ఉన్నాయి.
    సన్నగా వాన చినుకులు ప్రారంభమై, మరుక్షణంలో ఆ చినుకులే పెద్ద వానగా మారాయి. ఆ తన్మయత్వం నుండి తేరుకొనే సరికి పూర్తిగా తడిసి పోయింది శాంత. ఆస్పత్రి భవనం వైపుగా పెద్ద పెద్ద అడుగులతో నడిచింది. అక్కడికి చేరుకునే సరికి ఒళ్ళంతా నీరు కారసాగింది.
    శాంతను ఆ స్థితిలో చూసిన సుందరం 'అరే! ఇదేమిటి శాంతా? అలా తడిసి పోయావేం?' ఆశ్చర్యం ప్రకటిస్తూ తన గది లోపలికి ఆహ్వానించాడు.
    ఆఫీసు గది కాకుండా సుందరానికి మరొక ప్రైవేటు గది ఏర్పాటు చేయబడింది. భోజనానికి మాత్రం తమ యింటికి వెళ్ళి వస్తూ ఉంటాడు. రాత్రి పూట కూడా ఆస్పత్రిలోనే పడుకుంటూ ఉంటాడు.
    తన గదిలోపలికి వచ్చిన శాంతను చూస్తూ 'ఇదిగో టవలు. పూర్తిగా తడిసి పోయావు. త్వరగా తుడుచుకోకపోతే జలుబు చేస్తుంది. వర్షం వచ్చే సూచనలు అంత స్పష్టంగా తెలుస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా సుందరం. తోటలో ఏం చేస్తున్నట్లు?' శాంత కళ్ళల్లోకి అదోరకంగా చూస్తూ ప్రశ్నించాడు సుందరం.
    '.................'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS